ఫ్లైదుబయ్ విమాన దాడి: ఆ 17 నిమిషాల్లో ఏం జరిగింది?

బుధవారం దుబయ్ నుంచి ఇజ్రాయెల్ బయల్దేరిన ఫ్లైదుబయ్ విమానం మధ్యలోనే దారి మార్చి సౌదీ అరేబియాలో ల్యాండ్ అయింది
ఫొటో క్యాప్షన్, బుధవారం దుబయ్ నుంచి ఇజ్రాయెల్ బయల్దేరిన ఫ్లైదుబయ్ విమానం మధ్యలోనే దారి మార్చి సౌదీ అరేబియాలో ల్యాండ్ అయింది
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

దుబయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి సెప్టెంబర్ 30 (బుధవారం)న ఒక విమానం బయల్దేరింది.

తన గమ్యస్థానమైన టెల్ అవీవ్‌కు ప్రయాణిస్తోంది.

ఆకాశంలో ఎగురుతున్న ఆ విమానం ఎత్తు ఒక్కసారిగా కిందకు పడిపోయింది. కేవలం కొన్ని సెకన్లలోనే దాని ఎత్తు దాదాపు సగానికి పడిపోయింది.

ఇది ఎలా జరిగింది? దీని వెనుక అసలేం జరిగిందో చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎఫ్‌జెడ్1073 విమానంలో ఒక పైలట్ అకస్మాత్తుగా మరొక పైలట్‌పై దాడి చేశారు. భారత్‌కు చెందిన పైలట్ స్మిత్ మచ్ఛర్‌పై ఈ దాడి జరిగింది.

తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్, కాక్‌పిట్ తలుపు తెరిచి తోటి ప్రయాణికులు, మరో పొజిషనింగ్ పైలట్ సహాయంతో ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. సరిగ్గా చెప్పాలంటే, ఆయన చూపిన తెగువ వల్లే 174 మంది ప్రాణాలు దక్కాయి.

ఈ నేపథ్యంలో కెప్టెన్ స్మిత్‌ ధైర్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కొనియాడారు.

అయితే ఈ సంఘటనలో కీలకమైన ఆ 17 నిమిషాల్లో ఏం జరిగిందో తెలుసుకోవడం ముఖ్యం.

భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ (ఫైల్ ఫోటో)
ఫొటో క్యాప్షన్, భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ (ఫైల్ ఫోటో)

టైమ్‌ లైన్

భారత కాలమానం ప్రకారం ఉదయం సుమారు 8:30 గంటలకు ఎఫ్‌జెడ్1073 విమానం, దుబయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయల్దేరింది. ఫ్లైట్‌రాడార్ డేటా ప్రకారం, మొదటి రెండు గంటల పాటు విమాన ప్రయాణం సజావుగా సాగింది.

ఆ తర్వాత, 10:51 గంటలకు విమానం వేగంగా కిందికి రావడం మొదలైంది.

కేవలం 90 సెకన్లలోనే విమానం ఎత్తు 17 వేల అడుగులకు దిగిపోయింది. అంటే, అప్పటివరకు ఆ విమానం ఎగురుతున్న ఎత్తులో దాదాపు సగానికి పడిపోయింది.

సరిగ్గా 9 నిమిషాల తర్వాత, అంటే 11:00 గంటల సమయంలో విమానం నుంచి ఒక ఎమర్జెన్సీ అలెర్ట్ అయిన కోడ్ 7700 వెలువడింది. విమానంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఈ కోడ్‌ను ఉపయోగిస్తారు.

ఇది జరిగిన సరిగ్గా 7 నిమిషాల తర్వాత, అంటే 11:07 గంటల సమయంలో ఫ్లైట్ ట్రాఫిక్ ప్లాట్‌ఫామ్ అయిన 'ఫ్లైట్‌రాడార్ 24'కు ఆ విమానం నుంచి మరో కొత్త కోడ్ అందింది.

ఆ కొత్త కోడ్ '7500'. విమానంలో ఏదైనా అనధికార జోక్యం లేదా హైజాక్ జరిగినప్పుడు ఈ కోడ్‌ను జారీ చేస్తారు.

ఈ కోడ్ కారణంగానే భారత మీడియాలో తొలుత విమానం హైజాక్ అయిందనే రిపోర్టులు వచ్చాయి.

ఫ్లైదుబయ్ విమానం నుంచి కోడ్ 7500, కోడ్ 7700 అనే అలర్ట్‌లు రావడం.. పైగా విమానం ఎత్తు ఒక్కసారికి కిందికి పడిపోవడం వంటి సంఘటనలు.. ఆ విమానంపై కంట్రోల్ చేజిక్కించుకోవడానికి చేసిన తీవ్రమైన ప్రయత్నాలను చూపిస్తున్నాయని బీబీసీ వెరిఫైతో ఒక విమానరంగ నిపుణుడు చెప్పారు.

ఈ పరిణామాలన్నీ ఉదయం 10:51 నుంచి 11:07 గంటల మధ్య జరిగాయి.

ఈ సమయంలో విమానం లోపల ఏం జరిగిందనే దానిపై ప్రత్యక్ష సాక్షులు తమ అనుభవాలను పంచుకున్నారు.

ఒక పైలట్ మరో పైలట్‌పై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పైలట్ స్మిత్ మచ్చర్ తాను స్పృహ కోల్పోయే ముందు కాక్‌పిట్ తలుపు తెరిచారు. దీంతో ప్రయాణికులు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ సమయంలో మరో 'పొజిషనింగ్ పైలట్', ఆ విమానాన్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

పొజిషనింగ్ పైలట్ అంటే వేరే విమానాశ్రయం నుంచి విమానం నడపడానికి ప్రయాణం చేస్తున్న ఇతర పైలట్లు.

ఇదంతా విమానం లోపల జరిగిన పరిణామాలు.

ఫ్లైట్‌రాడార్ డేటాను పరిశీలిస్తే.. విమానం పూర్తిగా యూ-టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫొటో క్యాప్షన్, ఫ్లైట్‌రాడార్ డేటాను పరిశీలిస్తే.. విమానం పూర్తిగా యూ-టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది

రాడార్‌ ద్వారా ఏం తెలిసింది?

ఇప్పుడు రాడార్ ద్వారా ఏం సమాచారం తెలిసిందో చూద్దాం.

ఫ్లైట్‌రాడార్ డేటాను పరిశీలిస్తే.. విమానం పూర్తిగా యూ-టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ విమానం సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో, అంటే తబుక్ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ముందు ఫ్లైట్‌రాడార్‌లో ఈ డేటా కనిపించింది.

దీని తర్వాత, ఫ్లైట్‌రాడార్ 24 లో ట్రాకింగ్ డేటా కనిపించడం ఆగిపోయింది.

ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు ఫ్లైదుబయ్ సంస్థ వెల్లడించింది.

అసలు ఆ ఇద్దరు పైలట్ల మధ్య ఏం గొడవ జరిగింది? అనే వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

విమాన ప్రయాణ సమయంలో ఒక పైలట్‌పై పదునైన వస్తువుతో దాడి జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.

బీబీసీ వెరిఫై విశ్లేషించిన ఫుటేజ్‌లో, నేలపై పైలట్ యూనిఫామ్‌లో ఉన్న ఒక వ్యక్తి రక్తం మరకలతో కనిపిస్తున్నారు.

ప్రస్తుతం ఇద్దరు పైలట్లకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ చూపిన అసాధారణ ధైర్యం గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)