వాహనాల మీద కులం పేరు రాయడంపై నిషేధం, గుజరాత్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
వాహనాలపై కులాలను సూచించేలా పేర్లు, చిహ్నాలపై నిషేధం విధిస్తూ గుజరాత్ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది.
గుజరాత్ మోటార్ వెహికల్ రూల్స్‌లో కొత్త నిబంధనను చేరుస్తూ 'గుజరాత్ మోటార్ వాహనాల (మూడో సవరణ) నియమావళి 2026' ను జారీ చేసింది.
ప్రైవేట్ వాహనాలపై కులాన్ని సూచించే పదాలు రాయడం లేదా చిహ్నాలను ప్రదర్శించడం ద్వారా కుల అస్తిత్వాన్ని చాటుకునే ధోరణిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, కార్లు, బస్సులు లేదా ట్రక్కులతో సహా అన్ని ప్రైవేట్ వాహనాలపై కులాన్ని సూచించే పదాలు, గుర్తులు, బొమ్మలు లేదా రాతలను ప్రదర్శించడానికి వీల్లేదు.
ఇందుకోసం గుజరాత్ ప్రభుత్వం 'గుజరాత్ మోటార్ వెహికల్ రూల్స్ 1989'ని సవరిస్తూ స్పష్టమైన నిబంధనలను రూపొందించింది.

గుజరాత్ మోటార్ వాహన నిబంధనలలోని ఈ కొత్త సవరణను అమలు చేయాలని రవాణా కమిషనర్ రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ప్రాంతీయ రవాణా అధికారులతో (ఆర్టీఓ) పాటు పోలీస్ కమిషనర్లు, సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
వాహనాలపై ఎలాంటి రాతలు ఉండకూడదు?
రాష్ట్ర ప్రభుత్వ 'ఓడరేవులు, రవాణా శాఖ' 2026న నవంబర్ 17న 'గుజరాత్ మోటార్ వాహనాల (మూడో సవరణ) నిబంధనలు 2026'ను జారీ చేసింది.
ఈ సవరణ ప్రకారం రూల్ 125లోని ఉప-నిబంధన (1)లో 'ప్రకటనలు, బొమ్మలు ఉండకూడదు' అనే పదాలకు బదులుగా "ప్రకటనలు, కుల సూచిక బోర్డులు, బొమ్మలు ఉండకూడదు" అనే పదాలను చేర్చారు.
అంటే వాహనాలపై ప్రకటనల బోర్డులు, బొమ్మలకు సంబంధించిన నిబంధనలో ఇప్పుడు కులాన్ని సూచించే గుర్తులను కూడా స్పష్టంగా చేర్చారు.
అంతేకాకుండా, నిబంధన 138లోని ఉప-నిబంధన (2) తర్వాత కొత్తగా ఉప-నిబంధన (3)ను చేర్చారు.
ఈ కొత్త నిబంధన ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం సాధారణ లేదా ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా అనుమతించినవి తప్ప, ఏ ప్రైవేట్ వాహనంపైనా ఎలాంటి ప్రకటనల పరికరం, కుల చిహ్నం, బొమ్మ లేదా మరే ఇతర రాతలను ప్రదర్శించకూడదు.
దీంతో వాహనాలపై కులపరమైన పదాలు రాయడం, కులాన్ని సూచించే గుర్తులు లేదా రాతలు ఉంచే అంశం ఇప్పుడు చట్టపరిధిలోకి వచ్చింది.
దీనివల్ల వాహనాలపై వేటిని ప్రదర్శించవచ్చు, వేటిని ప్రదర్శించకూడదు అనే విషయంపై మరింత స్పష్టత వచ్చినట్లయింది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం సాధారణ లేదా ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా అవసరమైన మినహాయింపులను ఇవ్వవచ్చు.
ఈ సవరణలకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను 2026 జూన్ 11న గుజరాత్ ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించామని దీనిపై ప్రజల నుంచి 30 రోజుల్లోగా అభ్యంతరాలు లేదా సూచనలను ఆహ్వానించామని గుజరాత్ ప్రభుత్వం పత్రిక ప్రకటనలో తెలిపింది.
నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేదా సూచనలు రాకపోవడంతో ఇప్పుడు తుది నియమావళి ప్రకటించారు.
"కుల ఆధారిత గుర్తులపై మార్గదర్శకాలు, నిబంధనలను నోటిఫై చేయాలని భారత ప్రభుత్వం ఒక అడ్వైజరీ జారీ చేసింది. అందుకే గుజరాత్ ఓడరేవులు, రవాణా శాఖ ఇప్పుడు దీనిని జారీ చేసింది" అని గుజరాత్ రవాణా కమిషనర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
చట్టంలో ఏముంది?
గుజరాత్ 'మోటార్ వాహన నిబంధనల'లో ప్రవేశపెట్టిన ఈ కొత్త నిబంధన ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం సాధారణ లేదా ప్రత్యేక ఉత్తర్వు ద్వారా మినహాయింపు ఇస్తే తప్ప, ఏ ప్రైవేట్ వాహనంపైనా ఎలాంటి "కుల సూచిక సైన్‌బోర్డు"ను ప్రదర్శించడం చట్టవిరుద్ధం అవుతుంది.
2025 సెప్టెంబర్ 16న అలహాబాద్ హైకోర్టు కూడా ఈ విషయంలో ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది.
వాహనాలపై కులాన్ని సూచించే గుర్తులు, పేర్లు లేదా నినాదాలు సామాజిక వివక్షను ప్రోత్సహిస్తాయని అవి రాజ్యాంగంలోని సమానత్వం, సౌభ్రాతృత్వ సూత్రాలకు విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది.
కుల సూచిక గుర్తులు ఉన్న వాహనాలకు చలాన్లు విధించాలని మోటార్ వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి సవరణనే తీసుకొచ్చింది.
ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వ ఓడరేవులు, రవాణా శాఖ కూడా మోటార్ వాహన నిబంధనలను సవరించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































