ఆంథ్రోపిక్ ఏఐ చాట్‌బాట్‌తో రీమాన్ హైపోథీసిస్‌ నిరూపణ, గణిత శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

ఆంథ్రోపిక్, ఏఐ, అమెరికా, లెక్కలు
ఫొటో క్యాప్షన్, ఆంథ్రోపిక్ ఈ వారంలోనే అమెరికా స్టాక్‌మార్కెట్‌లోకి ప్రవేశించింది.
    • రచయిత, కాలీ హైస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఆంథ్రోపిక్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి, గణిత శాస్త్రవేత్త లెవెంట్ అల్పోగే ఆ సంస్థకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్‌బాట్‌ను ఉపయోగించి ప్రసిద్ధ రీమాన్ హైపోథీసిస్‌ను నిరూపించినట్టు చెబుతున్నారు.

ఆంథ్రోపిక్ అమెరికా స్టాక్ మార్కెట్లో ప్రవేశించిన మరుసటి రోజైన శుక్రవారం(నవంబర్ 19) ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

సుమారు ఆరు వారాల పాటు క్లాడ్ చాట్‌బాట్‌ను ఉపయోగించి ఈ గణిత సమస్యకు సంబంధించిన వివరణాత్మక నిరూపణను రూపొందించినట్టు తెలిపారు.

ఈ నిరూపణ సరైనదని తేలితే గణిత శాస్త్ర చరిత్రలోనే అత్యంత కీలకమైన నిరూపణల్లో ఒకటిగా నిలుస్తుంది.

"శాస్త్ర ప్రపంచంలో మరింత గొప్ప విషయానికి నాంది పలికే ఒక ఉదయం"గా దీనిని ఆయన అభివర్ణించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గత కొన్ని నెలల్లో ఓపెన్‌ఏఐ వంటి ఏఐ సంస్థలు దశాబ్దాలుగా గణిత శాస్త్రవేత్తలకు అంతుచిక్కని అనేక క్లిష్టమైన ఉన్నత స్థాయి గణిత సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నట్టు ప్రకటిస్తున్న నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది.

శుక్రవారం ప్రకటించిన రీమాన్ హైపోథీసిస్ నిరూపణను ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ ప్రత్యేక వెర్షన్ ఉపయోగించి కనుగొన్నారు.

ఇది ప్రజలకు అందుబాటులో లేదు.

ఆంథ్రోపిక్, ఏఐ, అమెరికా, లెక్కలు
ఫొటో క్యాప్షన్, రీమాన్ హైపోథీసిస్‌ ప్రధాన సంఖ్యలకు సంబంధించిన గణిత సమస్య

ఈ సమయంలో ప్రకటించడం వెనక ఎలాంటి ఉద్దేశం లేదు

ఇది దాదాపు 170 ఏళ్ల నాటి గణిత సమస్య.

ఇది ప్రధాన సంఖ్యలకు సంబంధించినది. గణిత శాస్త్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన సమస్యగా దీనిని పరిగణిస్తారు. దీనికి ప్రధాన కారణం ఇందులోని తీవ్ర సంక్లిష్టత.

గణిత శాస్త్రవేత్త బెర్న్‌హార్డ్ రీమాన్ పేరు మీద ఈ హైపోథీసిస్‌కు ఆ పేరు వచ్చింది. సంఖ్యా రేఖపై ప్రధాన సంఖ్యలు ఒక నిర్దుష్ట క్రమాన్ని అనుసరిస్తాయని ఈ హైపోథీసిస్ ప్రతిపాదిస్తుంది.

ఉన్నత స్థాయి గణిత శాస్త్రానికి ప్రధాన సంఖ్యలు పునాది వంటివి. అందువల్ల వాటికి సంబంధించిన ఏదైనా కీలక ఆవిష్కరణ విస్తృత ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

ఈ ఆవిష్కరణను ఎలా ప్రకటించాలనేదానిపై ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడీకి నేరుగా మెసేజ్ చేశానని అల్పోగే చెప్పారు.

ఆంథ్రోపిక్ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన సమయాన్ని ప్రస్తావిస్తూ.. "దీనిని ప్రకటించడానికి ఇది సరైన సమయం కాదని నాకు తెలుసు. వీలైతే ఈ పనిని చాలా ముందుగానే పూర్తి చేసేవాడిని" అని అల్పోగే అన్నారు.

"ఇంకా ఆలస్యం చేస్తే నేను తట్టుకోలేనని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను. బాధ్యత పూర్తిగా నాదే. ఈ సమయంలో ప్రకటన చేయడం వెనుక ఏదైనా స్వార్థపూరిత ఉద్దేశం ఉందని కొందరు అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు" అని ఆయన తెలిపారు.

ఆంథ్రోపిక్, ఏఐ, అమెరికా, లెక్కలు
ఫొటో క్యాప్షన్, క్లాడ్ ప్రత్యేక వెర్షన్ ఉపయోగించి రీమాన్ హైపోథీసిస్‌ను నిరూపించినట్టు ఆంథ్రోపిక్ ఉద్యోగి, గణిత శాస్త్రవేత్త తెలిపారు.

‘రూపొందించిన వ్యక్తితో నేరుగా మట్లాడే అవకాశం’

గణిత నిరూపణలను ధ్రువీకరించడానికి ఉపయోగించే లీన్ అనే కంప్యూటర్ భాషలో దీన్ని రాశారు. ఈ నిరూపణ మొత్తం 2లక్షల50వేల పేజీలకు పైగా ఉంది.

ఈ నిరూపణను ధ్రువీకరించడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందని ప్రముఖ గణిత శాస్త్రవేత్త టెరెన్స్ టావో అన్నారు.

"ఈ నిరూపణను పూర్తిగా పరిశీలించి అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని భావిస్తున్నాను. ఈ సందర్భంలో కనీసం ఈ నిరూపణను రూపొందించిన వ్యక్తి మనకు అందుబాటులో ఉన్నారు. ఈ పనిలో సహాయం కోసం ఆయనతో నేరుగా మాట్లాడవచ్చు" అని టావో అన్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో ఏఐ సాయంతో రూపొందించిన ఇతర ప్రధాన గణిత నిరూపణల్లో ఇలాంటి మానవ రచయిత భాగస్వామిగా లేరు.

బహిరంగంగా అందుబాటులో లేని వెర్షన్‌ను ఉపయోగించిన తమ ఉద్యోగులు అత్యంత క్లిష్టమైన ఒక గణిత సమస్యలో కొంత భాగాన్ని కేవలం 88 గంటల్లో పరిష్కరించగలిగారని సెప్టెంబరులో ఓపెన్‌ఏఐ ప్రకటించింది.

ఆ సమస్య నేవియర్-స్టోక్స్ సమీకరణాలకు సంబంధించినది. ద్రవాలు ఎలా కదులుతాయో ఈ సమీకరణాలు వివరిస్తాయి.

ఏఐ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఈ సమస్యను పరిష్కరించడానికి 10 వేలకు పైగా ఏఐ ఏజెంట్లను ఉపయోగించారు. అంటే కొంతవరకు స్వతంత్రంగా పనిచేసేలా ప్రోగ్రామ్ చేసిన కంప్యూటర్ బాట్‌లను ఈ పనిలో భాగస్వామ్యం చేశారు.

నేవియర్-స్టోక్స్ సమస్యపై ఓపెన్‌ఏఐ విడుదల చేసిన నిరూపణ సరైనదా కాదా అనేది ఇంకా ధ్రువీకరించలేదు. ఏఐని ఉపయోగించి గణిత సమస్యలను పరిష్కరించడంపై విద్యా, ఉన్నత గణిత శాస్త్ర వర్గాలు, సంస్థల్లో విమర్శలు వెల్లువెత్తాయి.

ఆంథ్రోపిక్, ఏఐ, అమెరికా, లెక్కలు
ఫొటో క్యాప్షన్, గణిత సమస్యల పరిష్కారాలపై ఏఐ సంస్థలు గొప్పలు చెప్పుకుంటున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు.

‘అసలు లక్ష్యానికి, ఫలితాలకు మధ్య పొంతన ఉండడం లేదు’

గణిత శాస్త్రం, భౌతిక శాస్త్ర రంగాల్లోనూ తాము పురోగతి సాధించినట్టు ఆంథ్రోపిక్ ప్రకటించింది.

తమ వాణిజ్య ఉత్పత్తుల సామర్థ్యాన్ని చూపించడానికి ఏఐ సంస్థలు గణిత సమస్యల పరిష్కారాలపై గొప్పలు చెప్పుకోవడం గణిత శాస్త్ర విజ్ఞానానికి హానికరమని గణిత శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.

"మేధోపరమైన పనికి ముప్పు ఏర్పడటాన్ని మనం చూస్తున్నాం. ఏఐని ఉపయోగించడానికి మొదట నిర్దేశించుకున్న లక్ష్యానికి, దాని వినియోగం వల్ల వచ్చే ఫలితాలకు మధ్య పొంతన ఉండటం లేదు" అని ఆ గణిత శాస్త్రవేత్తలు తమ ఉమ్మడి లేఖలో పేర్కొన్నారు.

ఆ తర్వాత నెల రోజులకు మరో 372 పరిష్కారం కాని ఉన్నత స్థాయి గణిత సమస్యల్లో పరిష్కారాలు, నిరూపణలు లేదా కీలక పురోగతి సాధించినట్టు ఓపెన్‌ఏఐ ప్రకటించింది.

అయితే ఈ వాదనలు నిజమో కాదో నిర్ధరించడానికి నిపుణులు వాటిని సమీక్షించాల్సి ఉంటుంది. ఇందుకు నెలల సమయం లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టొచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)