భారత్‌పై అమెరికా 100 శాతం సుంకాలు విధిస్తే ఏం జరుగుతుంది, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపుతుందా?

US President Donald Trump

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సుంకాలను ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను కొత్త చట్టం ట్రంప్‌కు కల్పించింది.
ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

అమెరికా కాంగ్రెస్ సెప్టెంబర్ 16న లిండ్సే ఓ. గ్రాహం రష్యా- ఇరాన్ ఆంక్షల చట్టాన్ని ఆమోదించింది. మరోపక్క ఆగస్టు 7నే ఈ బిల్లును భారీ మెజార్టీతో సెనేట్ ఆమోదించింది.

ఇక తాజాగా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో అది చట్టంగా మారింది.

ఇప్పుడు భారత్‌పై 100 శాతం సుంకాలు విధించే అధికారం ట్రంప్‌కు దక్కింది.

'భారత్, చైనా తమ వైఖరి మార్చు కోవాలి. ఇతరుల నుంచి చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేయాలి' అని ఆంక్షల చట్టం ఆమోదం పొందిన తరువాత డెమొక్రటిక్ ఎంపీ రిచర్డ్ బ్లూమెంథాల్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

ఈ సుంకాలను ఎప్పుడు, ఎలా విధించాలో నిర్ణయించే విస్తృతాధికారం ఈ చట్టం ద్వారా ట్రంప్‌కు లభించింది. అయితే అమెరికా దిగుమతి చేసుకుంటున్న భారతీయ వస్తువులపై సుంకాలు విధిస్తారో లేదో ఇప్పటికైతే స్పష్టత లేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌పై ఒత్తిడి

భారత్‌కు ఈ చట్టం ఒక బెదిరింపుగా పరిణమించే అవకాశం ఉంది. ముఖ్యంగా రష్యాతో వాణిజ్య ఒప్పందాల అవకాశాలను ట్రంప్ ప్రభుత్వం కూడా అన్వేషిస్తున్న తరుణంలో ఈ చట్టం ఇండియాలాంటి దేశాలపై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్‌కు ఓ ఆయుధంలా మారొచ్చు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలలో 2026 ఆగస్టు వరకు చైనా తరువాత భారత్ రెండో స్థానంలో ఉంది. దీంతో అమెరికా సుంకాలకు ఈ రెండు ఆసియా దేశాలు ఎక్కువగా ప్రభావితం కావచ్చు.

డిసెంబర్ 2022 - ఆగస్టు 2026 మధ్య రష్యా ముడి చమురు మొత్తం కొనుగోళ్లలో చైనా వాటా 50 శాతం, భారత్ వాటా 37 శాతంగా ఉంది.

Russia, China and India

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే రెండు ప్రధాన దేశాలు చైనా, భారత్‌

భారత్‌పై సుంకాల దెబ్బ

అమెరికాలో సుంకాల బిల్లు ఆమోదం పొందిన తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ద్వైపాక్షిక సంబంధాలపైనే కాకుండా అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పైనే ఈ బిల్లు ప్రభావం చూపుతుందనే విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్ళామని అందులో పేర్కొంది.

జూలై 2026 గణాంకాల ప్రకారం భారత్ ముడి చమురు దిగుమతుల్లో 51 శాతం రష్యా నుంచి వస్తున్నవే. హార్ముజ్ జలసంధి నుంచి రాకపోకలకు అంతరాయం ఏర్పడిన వేళ రష్యాపై ఆధారపడటాన్ని నెల రోజుల్లోనే తగ్గించుకోవడం భారత్‌కు కష్టమే.

ఒకవేళ రష్యా నుంచి ఎప్పటిలాగానే భారత్ చమురు దిగుమతులు కొనసాగిస్తే ట్రంప్ సుంకాల భారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోనీ సుంకాల నుంచి బయటపడేందుకు రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకుంటే అమెరికా ఒత్తిడికి తలొగ్గిందనే అభిప్రాయం వ్యక్తమయ్యే అవకాశం ఉంది.

హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడటం, ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్లకు మించి ఉన్న ఈ పరిస్థితుల్లో కొత్త సరఫరాదారులను వెతకడం భారత్‌కు ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతుంది.

భారత్‌ ఎగుమతులపై అమెరికా 100 శాతం సుంకాలు వేస్తే అది మరో పెద్ద దెబ్బ అవుతుంది. ఇప్పుడు ఎగుమతవుతున్న వస్తువుల ధరలు అమెరికాలో రెట్టింపవుతాయి. దీంతో చాలా ఉత్పత్తులు వాణిజ్యపరమైన పోటీని తట్టుకోలేవు.

ఇదే జరిగితే తక్షణ ప్రభావం భారతీయ ఎగుమతిదారులు, ఉద్యోగులపై పడుతుంది. అలాగే అమెరికాలో దిగుమతిదారులు, చిల్లర వర్తకులు, వినియోగదారులు కూడా ఎక్కువ ధరలు, పరిమిత ప్రత్యామ్నాయాలను ఎదుర్కోవాల్సి రావచ్చు.

ఒకవేళ అమెరికా సుంకాలు పెంచితే, దాని భారాన్ని అమెరికా దిగుమతిదారుల నుంచే వసూలు చేస్తారు. కానీ అది నేరుగా భారత ఎగుమతులపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే భారత్ వాణిజ్య లోటుతో ఇబ్బంది పడుతోంది.

ఒకవేళ ఎవరైనా అమెరికన్ దిగుమతిదారు భారత్ నుంచి 20 డాలర్ల విలువైన దుస్తులను కొనుగోలు చేస్తే, 100 శాతం టారిఫ్ కారణంగా సరిహద్దు వద్దే అదనంగా మరో 20 డాలర్ల రుసుము పడవచ్చు.

ఆ తర్వాత వాటికి దేశీయ రవాణా, రిటైల్ మార్జిన్స్, ఇతర పన్నులు కలుస్తాయి. అప్పుడు తక్కువ సుంకం ఉన్న దేశం దిగుమతి చేసే అదే వస్తువుతో భారత్ పోటీ పడాలి. తక్కువ ధరకు మరో దేశం నుంచి వస్తువులు లభిస్తున్నప్పుడు, ఖరీదైన భారతీయ వస్తువులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు.

India, America

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాతో సంబంధాల విషయంలో భారత్‌లో అనుమానాలు

భారత్ ఏం చేయాలి ?

అసమానమైన ద్వైపాక్షిక ఒప్పందంలో మార్పులకు, రష్యా చమురు కొనుగోలు విషయంలో మినహాయింపుల కోసం భారత్ డిమాండ్ చేయవచ్చని దిల్లీకి చెందిన గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జిటిఆర్ఐ) డైరెక్టర్ అజయ్ శ్రీవాస్తవ అన్నారు.

'తాత్కాలిక సుంకాల ఉపశమనం కోసం భారత్ వెనక్కి తగ్గకూడదు, ఇంధన భద్రత విషయంలో రాజీ పడకూడదు. వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడమో, లేదా రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించడమో ఏదీ చేయకూడదు. యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణకొరియా వంటి కీలక భాగస్వాములతో వాణిజ్య ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా అమెరికా సుంకాలు విధించింది. ఇంధన విధానాన్ని నిర్దేశించేలా అమెరికా దిగే సుంకాల బెదిరింపులకు భారత్ తలొగ్గకూడదని’’ అని అజయ్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.

తక్కువ ధరకు లభించిన రష్యా ముడి చమురు భారత్ చమురు దిగుమతి ఖర్చు తగ్గించడానికి, ఇంధన భద్రత బలోపేతానికి, ద్రవ్యోల్బణ నియంత్రణకు సహాయపడింది. అందువల్ల రష్యా చమురు వాణిజ్యపరంగా లాభదాయకంగా ఉన్నన్ని రోజులు దానిని కొనుగులు చేయాలి. ఎలాంటి ఏకపక్ష వాణిజ్య రాయితీలు ఇవ్వకుండా పటిష్ఠంగా చర్చలు జరపాలి అని అజయ్ శ్రీవాస్తవ చెప్పారు.

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. అధికారిక గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ 7.8 శాతంగా నమోదైంది.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉంచాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ లక్ష్యం సాధించాలంటే రాబోయే రెండు దశాబ్దాల పాటు 7.8 శాతం వార్షిక ఆర్థిక వృద్ధిని భారత్ సాధించాల్సి ఉంటుందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ట్రంప్ విధానాలు భారత ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపవచ్చు.

20 శాతం ఎగుమతులు అమెరికాకే

అమెరికా సంయుక్త రాష్ట్రాలు భారత్‌కు అతి పెద్ద ఎగుమతి మార్కెట్. అధికారిక గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో భారత్ 87 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అమెరికాకు ఎగుమతి చేసింది. అంటే భారత్ చేస్తున్న 438 బిలియన్ డాలర్ల ఎగుమతుల్లో ఇది 20 శాతానికి సమానం.

అతి పెద్ద దేశీయ మార్కెట్, దిగుమతులపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్‌కు మిగతా ఆసియా దేశాలతో పోలిస్తే సుంకాల ప్రభావం తక్కువగా ఉండవచ్చనే వాదన ఉంది.

ట్రంప్ సుంకాలు, పాకిస్తాన్‌తో పెరుగుతున్న సాన్నిహిత్యం వల్ల వ్యూహాత్మక భాగస్వామిగా అమెరికాపై భారత్‌‌కు నమ్మకం సన్నగిల్లుతోంది.

భారత్ తన ముడి చమురు అవసరాల్లో 90 శాతానికిపైగా దిగుమతిపైనే ఆధారపడుతుంది. ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో అంతరాయం రావడంతో రష్యాపై మరింతగా ఆధారపడాల్సి వచ్చింది.

ప్రపంచ సముద్రయాన డేటా సంస్థ క్లెప్లర్ ప్రకారం, ఈ వేసవిలో భారత్ చేసుకున్న మొత్తం ముడిచమురు దిగుమతుల్లో దాదాపు సగం రష్యా ముడిచమురు నుంచే వచ్చింది.

రష్యా చమురును భారత్‌ కంటే చైనా ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. ఆ దేశం కూడా ఈ కొత్త చట్టం పరిధిలోకి వస్తుంది. మరి భారత్‌పై ఒత్తిడి తెచ్చినట్టే చైనాపై అదే తరహా ఒత్తిడి తెస్తుందా?

ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది.

చైనా ప్రభావాన్ని తట్టుకోవడానికి గడిచిన కొన్నేళ్లుగా భారత్ అమెరికాతో తన సంబంధాలను బలోపేతం చేసుకుంది.

Keir Starmer, Narendra Modi

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కీర్ స్టార్మర్ యూకే ప్రధానిగా ఉన్నప్పుడు భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది.

అమెరికాకు ప్రత్యామ్నాయం ఉందా?

వాణిజ్యపరంగా అమెరికాపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించుకోవడానికి యత్నిస్తోంది. దీనికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలే మార్గం. అయితే అవి రాత్రికి రాత్రే అమెరికా మార్కెట్‌కు ప్రత్యామ్నాయంగా మారలేవు.

భారత్- యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం జూలై 15, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం భారత్ ఎగుమతుల్లో 99 శాతం ఎలాంటి సుంకాలు లేకుండానే యూకేలోకి ప్రవేశిస్తాయి.

భారత్-ఒమన్ వాణిజ్య ఒప్పందం కూడా అమల్లోకి వచ్చింది. 98.08 శాతం ఎగుమతులకు సుంకాలు లేకుండానే ప్రవేశం ఒమన్ కల్పించింది.

భారత్- న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 20 నుంచి అమల్లోకి రానుంది. దీంతో భారత ఎగుమతులకు ఎలాంటి సుంకాలు లేకుండానే అనుమతి మంజూరు చేయనుంది. మరోవైపు జనవరిలో భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిగాయి. దీని ప్రకారం భారత్ ఎగుమతుల్లో 99.5 శాతాన్ని సుంకాలు లేకుండా అనుమతి ఇస్తుంది.

ఈ ఒప్పందాలు అమెరికా మార్కెట్‌కు ప్రత్యామ్నాయాలు కాలేవు. కానీ ఇతర ప్రధాన మార్కెట్‌లోకి ప్రవేశించే ఖర్చును తగ్గించగలవు.

సుంకాల మినహాయింపు మాత్రమే ఈ మార్కెట్‌లోకి ప్రవేశాన్ని కల్పించలేవు. భారత్ ఎగుమతిదారులు రవాణా, సరఫరా వ్యవస్థపై పెట్టుబడులు పెట్టాలి. సాంకేతిక, ఉత్పత్తి ప్రమాణాలను పాటించాలి. తమ డిజైన్‌లను సవరించుకోవాలి. పంపిణీ నెట్‌ వర్క్‌ను నిర్మించుకోవాలి. ఈ సామర్థ్యాలే అమెరికా మార్కెట్‌లో వారికి తమకంటూ ఒక స్థానాన్ని సాధించుకోవడానికి సాయపడతాయి.

'ఎగుమతి మార్కెట్ విస్తరణకు ఒక పరిమితి ఉంటుంది. ఒక సంస్థ అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి 60 శాతం ఎగుమతిని అక్కడ తగ్గించి యూరప్‌లో 60 శాతం పెంచిందని అనుకుంటే, ఇక్కడ భౌగోళికంగా విస్తరించినట్టు అవుతుందే కానీ, వ్యూహాత్మకంగా చేసినట్టు కాదు. మార్కెట్‌లను విస్తరించాలంటే వినియోగదారుల సంఖ్యను పెంచుకోవాలి.' అని అజయ్ శ్రీవాస్తవ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)