తిరుమల: ఏడుకొండల వెంకన్న దర్శనానికి 11 దారులు ... మరి ఇన్ని మార్గాలున్నా ఇబ్బందులు ఎందుకు?

ఫొటో సోర్స్, TTD
- రచయిత, శ్రీనివాస్ నిమ్మగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 9 నిమిషాలు
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ 60 నుంచి 80వేల మందిదాకా వస్తుంటారు. తిరుమల అంటేనే నిత్యకల్యాణం, పచ్చతోరణమనే నానుడి ఉంది.
శ్రీవారికి ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంతసేవ దాకా ఎన్నో సేవలు జరుగుతాయి.
ఇటీవల కాలంలో ప్రతిరోజూ '65వేల నుంచి 80వేలకుపైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని' టీటీడీ పత్రికా ప్రకటనలు చెబుతున్నాయి.
సెలవురోజులు, వారాంతాలలో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది.
మరి ఇంతమంది భక్తుల రద్దీకి అనుగుణంగా స్వామివారి దర్శనం కల్పించడానికి టీటీడీ దగ్గర ఉన్న మార్గాలు ఏమిటి? అసలు కొండపైన ఎన్నిరకాల దర్శనాలు ఉన్నాయి? అయినా భక్తులు ఎందుకు ఇబ్బంది పడుతుంటారు? విమర్శలేంటి?


తిరుమలకు వెళ్లే భక్తులలో ఎక్కువమందికి తెలిసిన దర్శన విధానం సర్వదర్శనం. సర్వదర్శనం అంటే అందరికీ దర్శనమని అర్ధం. భారీగా తరలివచ్చే భక్తులకు తేలికగా దర్శనం కల్పించేందుకు సమర్థవంతమైన పద్దతులు అవలంబిస్తున్నట్టు టీటీడీ చెబుతోంది.
ఈ సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీనివాసం, విష్ణునివాసంలోనూ, అలిపిరికి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లోనూ 24 గంటల ముందుగా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల పేరుతో అందిస్తారు. సర్వదర్శనం పూర్తిగా ఉచితం. డబ్బు చెల్లించక్కరలేదు. సర్వదర్శనం టోకెన్‌పై ముద్రించిన సమయానికి అనుగుణంగా భక్తులు తిరుమలలోని రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోవాలి.
ప్రధాన ఆలయానికి అనుసంధానమైన ఆ కాంప్లెక్స్‌లోకి వెళ్లాక భక్తులు అక్కడి గదులలో తమ సమయం వచ్చే వరకు వేచి ఉండాలి. ఒక్కోసారి ఈ వెయిటింగ్ టైమ్ 24 గంటలపాటు ఉండే సందర్భాలు కూడా ఉంటాయి. సాధారణ రోజులలో సర్వదర్శనానికి 18గంటలు కేటాయిస్తున్నట్టు టీటీడీ చెబుతోంది. రద్దీ రోజులలో సర్వదర్శనం కల్పించే సమయాన్ని 20 గంటలకు పెంచుతోంది.

ఫొటో సోర్స్, https://ttdevasthanams.ap.gov.in/slot-booking?

ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనాన్నే శీఘ్రదర్శనం అంటారు. సెప్టెంబర్ 21, 2009న ప్రవేశపెట్టిన ఈ దర్శనం భక్తులకు త్వరగా దర్శనం కల్పించడానికి రూపొందించారు.
తరువాత దీనిని ఆన్‌లైన్ పద్ధతిలోకి మార్చారు. ఆగస్టు 27, 2014 నుంచి ఈ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్ మోడల్‌లో టీటీడీ భక్తులకు అందిస్తోంది.
ఈ టిక్కెట్ ధర 300 రూపాయలు. ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్ చేసుకునే యాత్రికులు ఏ ఒరిజినల్ ఫోటో ఐడీతో టిక్కెట్ బుక్ చేసుకున్నారో దర్శనానికి వెళ్లేముందు అదే ఒరిజినల్ ఫోటో ఐడీని చూపాల్సి ఉంటుంది.
12 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కోసం వయస్సు నిర్థరణ పత్రాలు చూపాల్సి ఉంటుంది.
ఒకసారి టిక్కెట్ బుక్ చేసుకుంటే వాయిదావేసుకోవడం లేదా ముందుగా రావాలనుకోవడం, రీఫండ్ కుదరదని టీటీడీ నియమాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, TTD

కొండకు నడిచి వెళ్లే భక్తులకు టీటీడీ తగిన ఉపశమనం కల్పించడానికి ప్రవేశపెట్టిన దర్శన విధానమే దివ్య దర్శనం.
వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని చేరుకోవడానికి వాహనాలలో వెళ్లే ఘాట్ మార్గాలు కాకుండా, నేరుగా భక్తులు వెళ్లగలిగే మార్గాలు మాత్రం రెండే.
వాటిల్లో ఒకటి అలిపిరి కాలిబాట కాగా, రెండోది శ్రీనివాసమంగాపురంలోని శ్రీవారిమెట్టు.
దివ్యదర్శనం టోకెన్లు శ్రీవారి మెట్టు మీదుగా కాలినడకన వెళ్లే భక్తులకు మాత్రమే అందిస్తారు.

ఫొటో సోర్స్, TTD
శ్రీవారిమెట్టు శ్రీనివాసమంగాపురం సమీపంలో ఉంటుంది. తిరుమలకు నడిచి వెళ్లడానికి అత్యంత దగ్గరి దారి. కాకపోతే తిరుపతి నుంచి శ్రీవారిమెట్టు సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
తిరుపతి బస్టాండ్ నుంచి శ్రీవారిమెట్టుకు బస్సులు ఉంటాయి. ధర్మరథాల పేరుతో టీటీడీనే వీటిని నడుపుతోంది.
ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 6గంటల మధ్యన ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు చొప్పన మొత్తం 18 ట్రిప్పులు నడుపుతారు.
చివరి బస్సు శ్రీవారి మెట్టు నుంచి సాయంత్రం 7గంటల 15 నిమిషాలకు మొదలవుతుంది.
ఇక సాయంత్రం 6గంటల తరువాత శ్రీవారి మెట్టుపైకి భక్తులను అనుమతించరు.
తిరిగి ఉదయం 6 గంటలకు ఈ మార్గాన్ని తెలుస్తారు.
ఈ మార్గంలో వెళ్లే యాత్రికులకు 4 నుంచి 5వేల దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ సీనియర్ అధికారి ఒకరు వివరించారు.

ప్రముఖులకు, ప్రోటోకాల్ ఉన్నవారికి కల్పించే దర్శనం వీఐపీ దర్శనం. దీంతోపాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సిఫార్సు లేఖలపై కూడా ఈ దర్శనం కల్పిస్తారు.
అలాగే టీటీడీ ట్రస్టులకు విరాళాలు అందించే దాతలకు కూడా వారు అందించిన విరాళాన్ని బట్టి వీఐపీ బ్రేక్ దర్శనం, శీఘ్రదర్శన సౌకర్యం కల్పిస్తారు.
శ్రీవాణీ దర్శనం
ఇదో విరాళసేవ. భక్తులు స్వామిరికి 10వేల రూపాయలు విరాళంగా ఇచ్చి, 500 రూపాయలు పెట్టి బ్రేక్ దర్శనం టిక్కెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం రూ.10,500 చెల్లించాలి.
ఈ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఏరోజుకా రోజు లభిస్తాయి. గతంలో ఉదయం పూట ఉండే ఈ దర్శనాన్ని ఇటీవల సాయంత్రానికి మార్చారు. సాయంత్రం 4గంటలకు శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు.

ఫొటో సోర్స్, Screentshot/TTD

వయో వృద్ధులకు, వికలాంగులకు టీటీడీ ప్రత్యేకంగా దర్శనం కల్పిస్తోంది. వయోవృద్ధులు తమ వయో గుర్తింపు పత్రంగా ఆధార్ కార్డును తీసుకురావాల్సి ఉంటుంది. వికలాంగులు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు జారీచేసిన ధృవపత్రాలను తీసుకురావాలి. ఈ స్పెషల్ దర్శనంలో వీరితోపాటు జీవిత భాగస్వామిని కూడా దర్శనానికి అనుమతిస్తారు.
సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3గంటలకు ప్రతిరోజూ వెయ్యిమందికి ఈ స్పెషల్ దర్శనం కల్పిస్తారు.
స్పెషల్ దర్శనం కూడా ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ 750మందిని అనుమతిస్తున్నట్టు టీటీడీ అధికారి ఒకరు చెప్పారు.

ఏడాదిలోపు చంటిబిడ్డలున్న తల్లిదండ్రులు క్యూలైన్లలో గంటలతరబడి వేచి ఉండాల్సిన పనిలేకుండా త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పిస్తోంది టీటీడీ.
ఏడాదిలోపున్నచంటిబిడ్డలున్న తల్లిదండ్రులను దక్షిణమాడ వీధికి ఆనుకుని ఉండే సుపథం ద్వారా ఆలయంలోకి పంపుతారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6గంటలలోపు దర్శనభాగ్యం ఎంతమంది వస్తే అంతమందికీ దర్శనం కల్పిస్తారు.
ఇందులో కేవలం శిశువు తల్లిని, తండ్రిని మాత్రమే అనుమతిస్తారు.
ఒకవేళ ఆ తల్లిదండ్రులకు మరో బిడ్డ ఉంటే, ఆ బిడ్డకు 12 ఏళ్లలోపు వయసు ఉంటే వారిని కూడా అనుమతిస్తారు.
సుపథం ప్రవేశ ద్వారం వద్ద ఎలాంటి ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ లేదా టికెట్ అవసరం లేదు, కానీ బిడ్డ బర్త్ సర్టిఫికెట్, లేదా ఆసుపత్రికి సంబంధించిన డిశ్చార్జ్ సమ్మరీ తల్లిదండ్రుల ఇద్దరి ఆధార్ కార్డులు చూపాలి.
ఈ దర్శనం పూర్తిగా ఉచితం. తల్లిదండ్రులు సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, TTD

తిరుమలలో శ్రీవారికి నిత్యం పలు ఆర్జితసేవలు జరుగుతుంటాయి. వీటిల్లో సుప్రభాతం, అర్చన, తోమాల, ఏకాంత సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ లాంటివి ఉంటాయి.
ఈ సేవలకు టిక్కెట్లు పొందిన భక్తులకు కూడా శ్రీవారి దర్శనం ఉంటుంది.
ఈ నిత్యసేవలతోపాటు వారపుసేవలు ప్రత్యేకంగా ఉంటాయి.
మంగళవారం అష్టదళ పాదపద్మారాధనసేవ, గురువారం తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేక, వస్త్రాలంకరణ సేవ ఉంటాయి.
ఈ సేవల్లో కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం లాంటి సేవలు మూలమూర్తికి కాకుండా ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామికి చేస్తారు.
వీటిని ఆలయప్రాంగణంలో నిర్వహిస్తారు.
అయితే ఈ సేవలు బుక్ చేసుకున్న భక్తులకు కూడా గర్భాలయంలోని మూలమూర్తి దర్శనం కల్పిస్తారు.
ఈసేవలన్నింటికి సంబంధించిన టిక్కెట్లు టీటీడీ ఆన్‌లైన్‌లో ముందుగానే విడుదల చేస్తుంటుంది.

తిరుమలలో పెళ్లి చేసుకుంటామని మొక్కుకోవడం తెలుగురాష్ట్రాల్లో సర్వసాధారణం. అందుకే కొండపైన ఇందుకోసం టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది.
ఇక కొండపైన పెళ్లి చేసుకున్ననూతన వధూవరులకు టీటీడీ శ్రీవారి దర్శనం కల్పిస్తోంది.
కొత్త దంపతులతోపాటు ఇరువైపుల తల్లిదండ్రులకు మొత్తం 6గురికి దర్శనం కల్పిస్తోంది.

ఫొటో సోర్స్, TTD

శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ హోమం పేరుతో కూడా టీటీడీ శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో వెయ్యిరూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ సేవను తిరుపతిలోని అలిపిరి పాదాలవద్ద గోశాలలో నిర్వహిస్తారు. భక్తులు కచ్చితంగా ఈ సేవలో పాల్గొన్న తరువాతే కొండకు వెళ్లాల్సి ఉంటుంది.
ఈ హోమం టిక్కెట్ కొనుగోలుచేసిన భక్తులకు మధ్యాహ్నం 3గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు.

తిరుమల తిరుపతి దేవస్థానములు తన ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు విరాళాలు స్వీకరించి, భక్తులకు వీఐపీ బ్రేక్ నుంచి శీఘ్రదర్శనం వరకు దర్శన వసతి కల్పిస్తోంది.
దీంతోపాటు అనేక సౌలభ్యాలు కూడా దాతలకు అందిస్తోంది. టీటీడీ ముఖ్యంగా శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు, శ్రీ బాలాజీ ఆరోగ్యవరప్రసాదిని స్కీమ్, బర్డ్ ట్రస్ట్, శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్ట్, ప్రాణదానం ట్రస్ట్, గోసంరక్షణ ట్రస్ట్, విద్యాదాన ట్రస్ట్, వేదపరిరక్షణ ట్రస్ట్, స్విమ్స్, శ్రీ వేంకటేశ్వర ఆలయాల నిర్మాణ ట్రస్ట్ (శ్రీవాణీ) తదితర ట్రస్టులకు విరాళాలు అందించే దాతలకు దర్శనం, ఇతర వసతులు కల్పిస్తోంది. దర్శన భాగ్యం కల్పించే మొత్తం లక్ష రూపాయల విరాళం నుంచి మొదలవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images

వీరితోపాటు భారత సైన్యంలో పనిచేసేవారికి నేరుగా రూ.300 టిక్కెట్లను అందిస్తోంది.
అలాగే ప్రవాస భారతీయులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తోంది. భారత్ నుంచి తిరుగుప్రయాణం నెలలోపు ఉన్నవారు, పాసుపోర్టులో ఆ తేదీ, ఇమ్మిగ్రేషన్ స్టాంపును చూపించాల్సి ఉంటుంది.
వీరికి కూడా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తున్నారు.
దర్శనాలపై వివాదాలు, విమర్శలు
తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుసరిస్తున్న విధానాలపై అనేక విమర్శలు వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా రోజురోజుకు దర్శనాల సంఖ్య పెంచుతున్నామని చెప్పడం సరికాదన్నారు తిరుపతికి చెందిన సీనియర్ పాత్రికేయుడు పి.వి. రవికుమార్.
‘‘టీటీడీ 80, 90వేలమందికి దర్శనాలు కల్పిస్తున్నామని చెప్పడం సరికాదు. నిజానికి అక్కడ గరిష్ఠసంఖ్యను మించి దర్శనం కల్పిస్తున్నామని చెబుతున్నారంటే భక్తులను తోసేస్తున్నట్టే లెక్క. కొండపైన గరిష్ఠంగా 70వేలకు మించి దర్శనం కల్పించలేని పరిస్థితులు ఉన్నాయి’’ అన్నారు.
దీనిపై తన పేరు వెల్లడించవద్దంటూ ఓ సీనియర్ అధికారి బీబీసీతో మాట్లాడారు. ‘‘గరిష్ఠంగా దర్శనం కల్పిస్తున్నామంటే తోసేస్తున్నామని కాదు. భక్తులకు దర్శనం గురించి మీడియాలో తప్ప, భక్తుల నుంచి విమర్శలు రావడం లేదు. భక్తుల దర్శనానికి టీటీడీ కచ్చితమైన విధానాలు పాటిస్తోంది. ఇందుకు కృత్రిమ మేథ సాయం తీసుకుంటోంది. భక్తులు కొండపైన ఎంతమంది దర్శనం కోసం వేచిచూస్తున్నారనే లెక్క మా కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఉంటుంది. ప్రతి భక్తుడికి దర్శనం కల్పించాలన్నదే టీటీడీ లక్ష్యం’’ అని ఆయన చెప్పారు.
‘‘భక్తుల రాకను టీటీడీ నియంత్రించలేదు. కానీ ఎంతమందికి దర్శనం కల్పించగలమన్నది టీటీడీ చేతిలోనే ఉంది. ఆ మేరకు గరిష్ఠ సంఖ్యను నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా కచ్చితమైన చర్యలు తీసుకోవాలి. లేదంటే టీటీడీ దర్శనాల విషయంలో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటుంది’’ అని చెప్పారు రవికుమార్.
‘‘టీటీడీ దగ్గర డేటా ఉంది. ఏ రోజు ఎంతమంది దర్శనం చేసుకుంటారనే లెక్కలు ఉన్నాయి. వీటి ఆధారంగానే ఎంతమందికి దర్శనం కల్పించగలమో అందరికీ దర్శనం కల్పిస్తున్నాం.’’ అని చెప్పారు ఆ సీనియర్ అధికారి.
‘‘దేవుడి ముందు అందరూ సమానమే అని చెబుతూ మధ్యలో ఈ వీఐపీ సంస్కృతి ఏమిటి?’’ అని ప్రశ్నించారు హైకోర్టు న్యాయవాది ఆమంచర్ల సతీష్‌బాబు ‘‘వీఐపి దర్శనాలను నిర్దిష్టంగా ప్రోటోకాల్ వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయాలి’’ అన్నారు ఆయన.
‘‘వీఐపీ అయినా, శ్రీవాణి టిక్కెట్లు అయినా సామాన్యుల దర్శనాలకు కేటాయిస్తున్న సమయంతో పోల్చుకుంటే చాలా తక్కువ’’ అన్నారు ఆ అధికారి.
‘‘భక్తులలో రకరకాలు ఉంటారు. రాగానే దర్శనం అయిపోవాలనుకునేవారు కొందరు. డబ్బు పెడితే దర్శనం దొరుకుతుందని కొందరు...టీటీడీ ఇలాంటివారికి అనుగుణంగా మారడం కాకుండా, భక్తులందరికీ తానే ఓ మార్గదర్శిగా నిలవాలి. తిరుపతి స్థానికులకు మూడునెలలకోసారి ఆధార్ బేస్డ్ తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. అంటే ఒకసారి తన ఆధార్ కార్డుపై దర్శనం చేసుకున్న భక్తుడు మరో మూడు నెలలపాటు దర్శనం చేసుకునే అవకాశం ఉండదు. అదే విధానాన్ని టీటీడీ అన్ని దర్శనాలకూ అమలు చేస్తే కొండపైన దర్శనాలన్నీ సాఫీగా సాగిపోతాయి. అలా కాకుండా ప్రభుత్వ ఒత్తిళ్లు, పాత్రికేయుల ఒత్తిళ్లు, రాజకీయనాయకుల ఒత్తిళ్లకు గురైతే ఇది అవస్థేకానీ, వ్యవస్థ కాదు’’ అని తిరుపతికి చెందిన సీనియర్ పాత్రికేయుడు దినేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
గమనిక: ఈ కథనంలో వివరించిన దర్శనాలు, వాటి సమయాలను బ్రహ్మోత్సవాలు, ఇతర ముఖ్యమైన పర్వదినాలు, భక్తులు రద్దీకి తగిన విధంగా టీటీడీ మార్పులు చేర్పులు చేయవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























