‘ఎప్పటిలా డబ్బులు అడిగాడు.. ఇవ్వగానే మింగేయడం చూశాను.. ఆసుపత్రికి తీసుకెళ్తే కడుపులో కాయిన్లు, నెయిల్ కట్టర్, మేకులు ఉన్నాయని చెప్పారు’

- రచయిత, మాయకృష్ణన్ కన్నన్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా అయ్యంపాలయం గ్రామానికి చెందిన 16 ఏళ్ల పృథిక్ రోషన్ కడుపులో మేకులు, నెయిల్ కట్టర్, హెయిర్ పిన్, చైన్, 23 నాణేలతో సహా 40 వస్తువులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కుమారుడికి తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు కావడంతో తల్లి వనిత ఆగస్ట్ 22న అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
బాలుడిని పరీక్షించిన వైద్యులు, కడుపులో వివిధ వస్తువులు ఉన్నట్లు గుర్తించారు.
ఆ తర్వాత అదే రోజు రాత్రి బాలుడికి చికిత్స చేసి, వాటిని కడుపులో నుంచి తొలగించారు.
అయితే ఆ వస్తువులు బాలుడి కడుపులోకి ఎలా వెళ్లాయి? అసలేం జరిగింది?

'డబ్బులు అడిగేవాడు'
"డబ్బులు తీసుకోకుండా చికిత్స చేసిన వైద్యుడు సుందరపాండియన్కు మేం రుణపడి ఉంటాం" అని బాలుడి తల్లి వనిత బీబీసీ తమిళ్‌తో చెప్పారు.
తాను, తన భర్త మహాలింగం కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్లు ఆమె తెలిపారు.
"మాకు ముగ్గురు ఆడపిల్లలు కూడా ఉన్నారు. రోజూ కూలి పనికి వెళితేనే మాకు ఆదాయం. దాంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాం" అని వనిత చెప్పారు.
గత నెల ఆగస్టు 22న తన కొడుకు పృథిక్ రోషన్ కడుపునొప్పితో విలవిలలాడాడని, వాంతులు కూడా చేసుకున్నాడని ఆమె అన్నారు.
"నాకు అప్పుడేం అర్థం కాలేదు. కొన్ని రోజులుగా నా దగ్గర డబ్బులు అడిగేవాడు. నేను కూడా అప్పుడప్పుడు ఇచ్చేదాన్ని. తరచూ అడుగుతుండటంతో అనుమానం వచ్చింది. ఆ రోజు కూడా అలాగే నా దగ్గర డబ్బులు తీసుకొని, కొన్ని క్షణాల్లోనే నోట్లో వేసుకుని మింగేశాడు. అప్పుడే తెలిసింది రోజూ డబ్బులు మింగుతున్నాడని. కొన్నిక్షణాలకే వాంతులు చేసుకున్నాడు" అని వనిత చెప్పారు.
"నాకేం చేయాలో పాలుపోలేదు. వెంటనే బాబుని తీసుకుని మా అయ్యంపాలయం గ్రామం నుంచి తిరువణ్ణామలైలోని ఒక ఆసుపత్రికి వెళ్లాను. అక్కడి వైద్యుడు సుందరపాండియన్ బాబు కడుపును పరీక్షించి చూశారు. మరిన్ని పరీక్షలు చేసి కడుపులో పదునైన లోహపు వస్తువులు ఉన్నట్లు తెలిపారు" అన్నారు.
"వైద్యులు నన్ను అడిగినప్పుడు, ఇంట్లో తరచూ నెయిల్ కట్టర్, చైన్ తదితర వస్తువులు కనపడకుండా పోయేవని, కొన్నిరోజులుగా నా దగ్గర రోజూ డబ్బులు తీసుకున్నాడని కూడా చెప్పాను. మేం పేదలమని తెలుసుకున్న వైద్యులు ఇంకేమీ మాట్లాడలేదు, కచ్చితంగా తన వంతు సాయం చేస్తానని ఆయన చెప్పారు" అని వనిత అన్నారు.

'మాట్లాడటం మానేశాడు'
తన కొడుకు పృథిక్ రోషన్ తొమ్మిదో తరగతి వరకు బాగానే చదివేవాడని, కబడ్డీ బాగా ఇష్టమైన ఆట కావడంతో తరచూ ఆడేవాడని వనిత చెప్పారు.
"తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు కబడ్డీ ఆడుతూ కింద పడిపోయాడు. అప్పుడు దవడ భాగానికి గట్టిగా దెబ్బ తగిలింది" అని ఆమె వివరించారు.
"ఆ రోజు నుంచి ఎక్కువగా మాట్లాడటం మానేశాడు. పైకప్పు చూస్తూ అలాగే కూర్చునేవాడు. నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు టీచర్స్ నన్ను పిలిచి.. 'మీ అబ్బాయి మునుపటిలా సరిగ్గా చదవడం లేదు, తనలో తాను ఏదో మాట్లాడుకుంటున్నాడు' అని చెప్పారు" అన్నారు.
"నాకేమీ అర్థం కాలేదు. వెంటనే కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, వేలూరు తదితర ప్రాంతాల్లోని న్యూరాలజిస్టులకు చూపించాను. అయినా నయం కాలేదు. చివరగా బెంగళూరు తీసుకెళ్లి చూపించాను. అక్కడ పరీక్షించి మాత్రలు ఇచ్చారు. అవి వాడుతున్నప్పుడు కాస్త మెరుగ్గానే ఉండేది, కానీ ఎక్కువ సమయం నిద్రపోయేవాడు. సరే, కచ్చితంగా నయమవుతుందనే నమ్మకంతోనే ఉన్నాను. 15 రోజుల తర్వాత వాళ్లు మమ్మల్ని మళ్లీ రమ్మన్నారు" అని వనిత చెప్పారు.
కానీ, కుటుంబ పరిస్థితుల కారణంగా చేతిలో డబ్బులు లేకపోవడంతో బెంగళూరులో చికిత్స ఇప్పించలేకపోయానని ఆమె అన్నారు.

వైద్యులు ఏం చెప్పారు?
"పృథిక్ రోషన్‌ను వాళ్ల అమ్మ తీసుకొచ్చినప్పుడు, వెంటనే ఎక్స్‌రే తీసి చూశాం. కొన్ని పదునైన వస్తువులు బాలుడి కడుపులో ఉన్నట్లు తెలిసింది" అని బాలుడికి శస్త్రచికిత్స చేసిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడు సుందరపాండియన్ బీబీసీ తమిళ్‌తో చెప్పారు.
అదేరోజు అర్ధరాత్రి వెంటనే మత్తుమందు నిపుణుడిని పిలిపించి శస్త్రచికిత్స చేసినట్లు చెప్పిన సుందరపాండియన్.. "బాలుడి జీర్ణాశయం నుంచి 23 నాణేలు, తాయత్తు, నెయిల్ కట్టర్, హెయిర్ పిన్, చైన్, మేకు లాంటి వస్తువులను తొలగించాం" అన్నారు.
"వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించాం. ఇపుడు వారానికోసారి పరీక్ష కోసం వస్తున్నాడు" అని వైద్యుడు సుందరపాండియన్ పేర్కొన్నారు.
"పదునైన వస్తువుల వల్ల జీర్ణకోశ మార్గంలో గాయం లేదా రంధ్రం ఏర్పడే ప్రమాదం ఉన్నందున, వెంటనే శస్త్రచికిత్స చేయడం అత్యవసరమైంది. శస్త్రచికిత్స తర్వాత, ఆ బాలుడిని నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉంచాం. ప్రస్తుతం వాడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది, బాగా కోలుకుంటున్నాడు" అన్నారు.
"మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటున్న పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. మానసిక సమస్యలు ఉన్నవారిని చూసుకోవడం, వాళ్లు క్రమం తప్పకుండా మాత్రలు వేసుకుంటున్నారో లేదో గమనించడం తల్లిదండ్రుల బాధ్యత" అని సుందరపాండియన్ సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























