‘‘ఆమె కోసం కోట్లు ఖర్చు పెట్టాను, తిరిగి ఇప్పించండి’’ ప్రియురాలి నుంచి విడిపోయిన తరువాత కోర్టుకెక్కిన వ్యక్తి

ప్రేమ, సింగపూర్, కోర్టు, నష్టపరిహారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, కెల్లీ యెంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

సింగపూర్‌కు చెందిన ఓ వ్యక్తి తన ప్రియురాలితో విడిపోక ముందు ఆమె కోసం ఖర్చు చేసిన కోట్లాది రూపాయలను తిరిగి పొందడానికి వేసిన కేసులో ఓడిపోయారు.

తన గర్ల్‌ఫ్రెండ్ ఫెలీషియా‌ లీ నుంచి తాను విడిపోక ముందు ఆమె కోసం ఖర్చు చేసిన 4,68,000సింగపూర్ డాలర్ల మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరుతూ చాండర్ అగర్వాల్ కోర్టును ఆశ్రయించారు.

అయితే ఆ డబ్బును అగర్వాల్ లీ కోసం స్వచ్చందంగా ఖర్చు చేశారని సింగపూర్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

వాళ్లిద్దరి మధ్య బంధం ఏర్పడకముందునుంచే లీకి ఖరీదైన బహుమతులు ఇవ్వడం ద్వారా అగర్వాల్ ఆమెపై తన అభిమానాన్ని చూపించేవారని సీనియర్ జడ్జి లీ సీయు కిన్ తెలిపారు.

వాటన్నింటినీ ఆమె తిరిగివ్వాలని భావించడం లేదని కూడా అగర్వాల్ ఆమెకు చెప్పేవారని కోర్టు పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బీటలు వారిన బంధం

లాజిస్టిక్స్ కంపెనీ సీఈవో అయిన అగర్వాల్ 2019లో ఓ విమాన ప్రయాణంలో మాజీ ఫ్లైట్ అటెండెంట్ అయిన ఫెలీషియా లీని కలిశారు. 2022 సెప్టెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు వారిద్దరూ ప్రేమబంధంలో ఉన్నారు.

లీ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నారని అగర్వాల్‌కు అనుమానం కలగడంతో వారిద్దరూ విడిపోయారు.

తమ సంబంధం కొనసాగిన సమయంలో వడ్డీ లేకుండా అనేక రుణాలను లీ తనను అడిగారని 2024 మార్చిలో వేసిన కేసులో అగర్వాల్ ఆరోపించారు.

ప్రేమ, సింగపూర్, కోర్టు, నష్టపరిహారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సింగపూర్‌లో లాజిస్టిక్స్ కంపెనీ సీఈవో అగర్వాల్ తన ప్రియురాలి నుంచి విడిపోక ముందు ఆమె కోసం చేసిన ఖర్చును తిరిగి ఇప్పించాంటూ కోర్టుకెక్కారు

‘ అప్పు కాదు...ప్రేమతో పెట్టిన ఖర్చు’

తాను ఆమె కోసం 2,06,000 సింగపూర్ డాలర్ల (దాదాపు కోటి 50 లక్షల రూపాయలకు పైగా) క్రెడిట్ కార్డు ఖర్చులు, 1,29,000 సింగపూర్ డాలర్లు (రూ.96 లక్షలకుపైగా) విదేశీ ప్రయాణాల ఖర్చులు, ఆమె అపార్ట్‌మెంట్ కోసం ఫెంగ్‌షూయి నిపుణుడిని నియమించేందుకు 17,000 సింగపూర్ డాలర్లు (రూ.12లక్షలకు పైగా), ఆమె జీవితబీమా ప్రీమియంకోసం 20 వేల సింగపూర్ డాలర్లు (రూ.14లక్షలకుపైగా) ఖర్చుచేశానని అగర్వాల్ తెలిపారు.

అయితే ‘‘అవి రుణాలు కాదు, ప్రేమ అభిమానంతో ఇచ్చిన బహుమతులు’’ అని లీ వాదించారు.

లీ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. అగర్వాల్ కేసులో తగిన ఆధారాలు లేవని గుర్తించినట్టు చెప్పారు. ఉదాహరణకు లీ తనను రుణం అడిగారని చెబుతున్నప్పటికీ ఆ డబ్బు ఆమె తీసుకున్నట్టు అంగీకరించిన ఎలాంటి ఆధారాలను అగర్వాల్ కోర్టుకు సమర్పించలేకపోయారని జడ్జీ వ్యాఖ్యానించారు.

''వారి బంధం కొనసాగుతున్న సమయంలో ఆమెకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం ద్వారా అగర్వాల్ ప్రేమ చూపించారని నా ముందున్న ఆధారాలు స్పష్టంగా చూపుతున్నాయి’’ అని న్యాయమూర్తి చెప్పారు.

‘‘దురదృష్టవశాత్తూ వారు విడిపోవడంతో మనస్తాపానికి గురైన అగర్వాల్ ఆమె నుంచి ఆ ఖర్చులు రాబట్టాలని నిర్ణయించుకున్నారు’’

‘‘అగర్వాల్‌ విలాసవంతమైన జీవితం గడపడానికి ఇష్టపడే వ్యక్తి. అందుకు తగిన ఆర్థిక స్థోమత ఆయనకు ఉంది. కానీ లీకి ఆ స్థాయి ఆర్థికస్థోమత లేదని గుర్తించినట్టు’’ న్యాయమూర్తి పేర్కొన్నారు.

‘‘ఖరీదైన బహుమతులు ఇస్తానని అగర్వాల్ అన్నప్పుడు అనేక టెక్స్ట్ మెసేజ్‌ల్లో లీ ఆశ్చర్యం వ్యక్తం చేశారని, కొన్ని సందర్భాల్లో వాటిని తీసుకోవడానికి వెనకాడారని కూడా గుర్తించాం'' అని న్యాయమూర్తి తెలిపారు.

ప్రేమ, సింగపూర్, కోర్టు, నష్టపరిహారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ ద్వేషంగా మారితే...

తన తీర్పు చివర్లో ఇంగ్లీష్ నాటక రచయిత విలియం కాంగ్రీవ్ రాసిన ద మౌర్నింగ్ బ్రైడ్ అనే విషాద వ్యంగ్య నాటకంలోని ఓ వాక్యాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. ప్రేమ ద్వేషంగా మారినప్పుడు కలిగే కోపం ఎంత తీవ్రంగా ఉంటుందో తిరస్కరణకు గురైన వ్యక్తిలో కలిగే ఆగ్రహం కూడా అంతే తీవ్రంగా ఉంటుందనేది దాని భావం.

ఇలాంటి భావోద్వేగం ఏ ఒక్కరికో పరిమితం కాదని ఈ కేసు చూపిస్తోందని ఆయన అన్నారు.

అయితే సింగపూర్‌లో ఇలాంటి కేసులు గతంలోనూ దాఖలయ్యాయి.

సింగపూర్‌కు చెందిన మరో వ్యక్తి 2023 ప్రారంభంలో తన ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిన ఓ మహిళపై మూడు మిలియన్ సింగపూర్ డాలర్ల నష్టపరిహారం కోరుతూ రెండు కేసులు వేశారు.

నోరా టన్ తన ప్రేమను తిరస్కరించడం వల్ల తనకు మానసికంగా తీవ్ర నష్టం జరిగిందని, తన ప్రతిష్ట కూడా దెబ్బతిందని కే కవ్‌షిగన్ అనే వ్యక్తి ఆరోపించారు. కానీ, సింగపూర్ కోర్టులు ఆ కేసులను కొట్టివేశాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)