ఏపీలో సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు డబ్బులిస్తామంటున్న ప్రభుత్వం.. ఎవరు అర్హులు, ఎందుకీ కొత్త విధానం

ఫొటో సోర్స్, Nara Chandrababu Naidu/facebook.com
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ల పాలసీకి సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
పభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు పారితోషికం చెల్లించేలా 'సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పాలసీ' జీవోను సెప్టెంబర్ 29వ తేదీన విడుదల చేసింది.
ఈమేరకు సాధారణ పరిపాలన (పీఆర్) శాఖ జీవోఎంఎస్ నం.197 జారీ చేసినట్టు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీసీఎల్) స్పెషల్ ఆఫీసర్ గల్లా శేషు బీబీసీకి వెల్లడించారు.
ఈ విధానాన్ని ఏపీడీసీఎల్‌తో పాటు సాధారణ పరిపాలనాశాఖ (సమాచార పౌర సంబంధాల శాఖ) ద్వారా అమలు చేయనున్నట్టు ఆ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బీబీసీకి తెలిపారు.
విశ్వసనీయత, కంటెంట్ నాణ్యత, ప్రజల్లో ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల(ఎస్‌ఎంఐ)ను గుర్తించి ఎంప్యానెల్ చేయనున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది.

ఈ జీవో విడుదలకు ముందు.. ఇదే నెల సెప్టెంబర్ 23వ తేదీవ సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో 'సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల ఎంప్యానెల్‌మెంట్ పాలసీ'కి కేబినెట్ ఆమోదం లభించింది.
ఈ పాలసీ ప్రకారం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమ వేదికల్లో ప్రభావం ఉన్న క్రియేటర్లను ఎంప్యానెల్ చేసి ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంలో భాగస్వాములను చేయనున్నారు. తొలుత ఏడాది కాలానికి ఒప్పందం కుదుర్చుకుని, పనితీరు సంతప్తికరంగా ఉంటే మరో రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం కల్పించారు.
గోవా, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేసిన తర్వాత ఈ పాలసీని రూపొందించినట్లు రాష్ట్ర పౌరసంబంధాల శాఖ మంత్రి పార్థసారథి బీబీసీతో మాట్లాడుతూ వెల్లడించారు.

ఫొటో సోర్స్, Kolusu Parthasarathy
ఫాలోవర్ల ఆధారంగా నాలుగు కేటగిరీలు
సామాజిక మాధ్యమ క్రియేటర్లను ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు.
లక్ష మందికి పైగా ఫాలోవర్లు ఉన్నవారిని కేటగిరీ–ఏ,
50 వేల నుంచి 99,999 మంది వరకు ఉన్నవారిని కేటగిరీ–బీ,
25 వేల నుంచి 49,999 మంది వరకు ఉన్నవారిని కేటగిరీ–సీ,
10 వేల నుంచి 24,999 మంది వరకు ఉన్నవారిని కేటగిరీ–డీగా పరిగణిస్తారు.
ఏదైనా ఒక సామాజిక మాధ్యమ వేదికలో కనీసం 10 వేల మంది ఫాలోవర్లు ఉంటేనే దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది
పారితోషికం వివరాలిలా..
ప్రభుత్వం ఇచ్చే గ్రాఫిక్స్ పోస్ట్ చేస్తే: కేటగిరీల వారీగా రూ. 500 నుండి గరిష్ఠంగా రూ. 1,500 వరకు...
ప్రభుత్వం ఇచ్చే వీడియోలు పోస్ట్ చేస్తే: కేటగిరీల వారీగా రూ. 750 నుండి గరిష్ఠంగా రూ. 2,000 వరకు.
క్రియేటర్ స్వయంగా కంటెంట్ తయారు చేసి పోస్ట్ చేస్తే (అధికారుల ఆమోదం తర్వాత )..
కేటగిరీ ఎ కింద. రూ. 15,000 వరకు, కేటగిరీ బి కింద.. రూ. 7,500 వరకు, సీ కింద: రూ. 5,000 వరకు.. డి కింద రూ. 2,500 వరకు చెల్లిస్తారు.
కనీసంగా 60 పోస్టులు పరిశీలించిన తర్వాతే
అశ్లీల, హింసాత్మక, దేశ వ్యతిరేక లేదా పరువు నష్టం కలిగించే కంటెంట్ ఉండకూడదు.
దరఖాస్తుదారుడి గత 60 పోస్టులను అధికారులు తనిఖీ చేస్తారు.
అకౌంట్‌లోని కనీసం 2 పోస్టులు/వీడియోలకు దరఖాస్తుదారుడి మొత్తం ఫాలోవర్ల సంఖ్య కంటే ఎక్కువ వ్యూస్ వచ్చి ఉండాలి.
వారానికి కనీసం 2 పోస్టులు చేస్తూ ఉండాలి గత 6 నెలల్లో కనీసం 48 పోస్టులు ఉండాలి.
అకౌంట్ పబ్లిక్‌గా ఉండాలి.. ప్రైవేట్ అకౌంట్స్ పనికిరావు.
వ్యక్తిగత ఛానెల్స్ మాత్రమే
కేవలం పర్సనల్ ప్రొఫైల్స్ లేదా వ్యక్తిగత యూట్యూబ్ ఛానెల్స్‌కు మాత్రమే అర్హత ఉంటుంది.
కంపెనీలు లేదా సంస్థల పేరిట ఉన్న ఖాతాలకు అనుమతి లేదు.
దరఖాస్తు చేసేనాటికి ఇన్‌ఫ్లూయెన్సర్ వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
దరఖాస్తు ఎలా అంటే
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు నకిలీ వార్తలు తిప్పికొట్టాలి
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: ఏపీడీసీఎల్ పోర్టల్ ద్వారా దరఖాస్తును సబ్మిట్ చేయాలి. ముందుగా గత 60 పోస్టుల కంటెంట్, గత 20 పోస్టుల ప్రమాణాలను అధికారులు పరిశీలిస్తారు. ఫాలోవర్ల సంఖ్య, వ్యూస్.. వారానికి 2 పోస్టులు చేస్తున్నారా లేదా అని తనిఖీ చేస్తారు. కనీసం అయిదుగురు సభ్యులతో కూడిన స్క్రూటినీ కమిటీ దరఖాస్తును పరిశీలించి ఆమోదం లేదా తిరస్కరణ తెలుపుతుంది. ఎంపికైన వారికి ఒక సంవత్సరం వ్యాలిడిటీతో అఫీషియల్ ఎంపానెల్‌మెంట్ కార్డ్ ఇస్తారు.
దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే
ఇన్‌ఫ్లుయెన్సర్ల నమోదు కోసం ప్రత్యేకమైన అధికారిక వెబ్‌సైట్ ప్రస్తుతం తయారీ దశలో ఉంది.
ఈ పోర్టల్ పూర్తిగా సిద్ధమై, లైవ్‌లోకి వచ్చిన తర్వాతే దరఖాస్తులను స్వీకరిస్తారు.
వెబ్‌సైట్‌తో పాటు యాప్ కూడా తయారు చేస్తున్నామని, వారంలోగా ఈ రెండూ అందుబాటులోకి వస్తాయని రెండింటి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీడీసీ స్పెషల్ ఆఫీసర్ గల్లా శేషు బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, ugc
ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలసీల్లో ఏముందంటే
సామాజిక మాధ్యమ క్రియేటర్లకు పారితోషికం చెల్లించే విధానం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అమలవుతోంది.
అయితే అక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్లకు డబ్బులు చెల్లించడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలు చేపట్టేవారిని నియంత్రించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయా పాలసీల్లో పేర్కొన్నారు.
ఉత్తర ప్రదేశ్‌లో ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు చెల్లిస్తోంది. ఈ మేరకు యూపీ ప్రభుత్వం 2024 ఆగస్టు 28న ఉత్తరప్రదేశ్ డిజిటల్ మీడియా పాలసీ 2024ని ఆమోదించింది.
ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంతో పాటు ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించడానికి. ఉపయోగించుకోవడానికి ఆ బిల్లును ప్రవేశపెట్టినట్టు అప్పట్లో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రకటించారు.
ఆ బిల్లు ప్రకారం యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్లు తమ ఫాలోవర్ల సంఖ్య, సబ్‌స్క్రైబర్ల సంఖ్య , వీడియో వీక్షణల ఆధారంగా నెలకు రూ.8 లక్షల వరకు చెల్లింపులు పొందవచ్చు.
అలాగే అక్కడ ఎక్స్‌కు రూ.5 లక్షలు, ఫేస్‌బుక్‌కు రూ.4 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌కు రూ.3 లక్షలు, యూట్యూబ్ వీడియో కంటెంట్‌కు రూ.8 లక్షల వరకు నెలకు చెల్లింపులు చేస్తున్నారు.
అలానే హిమాచల్‌ప్రదేశ్‌లో వార్తా ఛానెళ్లు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను నియంత్రించడం, వర్గీకరించడం లక్ష్యంగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా డిజిటల్ మీడియా పాలసీ 2024ను విడుదల చేసింది.
అక్కడ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కేటగిరీల వారీగా నెలకు రూ.2 లక్షలు, రూ.1 లక్ష, రూ.50 వేలు, రూ.10 వేల వరకు చెల్లిస్తున్నారు.
డిజిటల్ యుగంలో వార్తల వినియోగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, హిమాచల్ ప్రదేశ్‌లో నియంత్రిత, బాధ్యతాయుతమైన డిజిటల్ మీడియా వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ఈ విధానం రూపొందించినట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
రాజస్థాన్, గోవాల్లోనూ ఇదే విధమైన పాలసీలు అమల్లో ఉన్నాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారి..
దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఇదే తొలిసారని, ఏపీలోనే మొదటిగా ఈ విధానం అమలు చేస్తున్నామని మంత్రి పార్థసారథి బీబీసీతో అన్నారు.
ఈ కొత్త విధానం ద్వారా తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేస్తూ, మంచి కంటెంట్ అందిస్తూ ప్రజాదరణ ఉన్న క్రియేటర్ల ద్వారా ప్రభుత్వ అభివృద్ధి పనులను నేరుగా ప్రజల్లోకి చేర్చాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. వాస్తవానికి పాజిటివిటీ కంటే నెగటివ్ ప్రచారమే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తోందని, మన వద్ద కూడా అలా నెగటివ్ ప్రచారం చేసే వాళ్లే ఎక్కువయ్యారని అన్నారు.
అందుకే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు వాస్తవాలను ప్రజల కళ్ల ముందుంచే ప్రయత్నంలో భాగంగానే ఈ పాలసీ అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఎన్నో రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా అధ్యయనం చేసిన తర్వాతే ఈ పాలసీని పగడ్బందీగా రూపొందించామని ఆయన చెప్పారు.
సొంత బాకా ఊదడానికి ప్రభుత్వ డబ్బులా: వైసీపీ విమర్శ
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ' పై రాష్ట్రంలో విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ప్రజా ధనాన్ని సొంత ప్రచారానికి వాడుకోవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను, అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రభుత్వమే పారితోషకాలు ఇవ్వడం దారుణమని ఆ పార్టీ అధికార ప్రతినిధి పుట్టా శివశంకర్ బీబీసీతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో అమరావతి నిర్మాణంలో జాప్యం, రాయలసీమ కరువు పరిస్థితులు, రైతులు, నిరుద్యోగుల సమస్యలు., 'సూపర్ సిక్స్' హామీల కింద మహిళలకు ఇవ్వాల్సిన రూ1,500 అలవెన్సుల వంటి ఎన్నో తీవ్రమైన సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని వీటన్నింటికీ నిధులు కేటాయించకుండా, కేవలం ప్రచారం కోసం ప్రజా ధనాన్ని మళ్లించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
ఒకవైపు తమకు అనుకూలంగా ఉండే ఇన్‌ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఇస్తూ, మరోవైపు ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తున్న వైసిపి అధికారిక సోషల్ మీడియా అకౌంట్లను, పార్టీ మద్దతుదారుల అకౌంట్లను నిలిపివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.
దేశంలో దాదాపుగా 15 రాష్ట్రాలకు పైగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు చెల్లిస్తున్నాయని అదే మాదిరిగా తాము కూడా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి కె ఎస్ విశ్వనాథన్ బిబిసితో అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఐ అండ్ పి ఆర్ ద్వారా ప్రకటనలు జారీ చేయడం ఆనవాయితీగా ఉందని ఇప్పుడు అదే క్రమంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లకి కూడా డబ్బులు చెల్లిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకోసం కొత్తగా ప్రభుత్వ నిబంధనలు ఏమీ మారలేదని ఆయన తెలిపారు.
‘డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పౌర సమాజానికి గొంతుకలా ఉండాలి’
‘‘ఇప్పటికే ప్రధాన స్రవంతి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలు వివిధ పార్టీల ప్రభావంతో నడుస్తున్నాయి.. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రజలకు బాసటగా ప్రజల గొంతుకను వినిపిస్తూ వస్తున్నారు.
ఇప్పుడు అలాంటి ఇన్ఫ్లుయెన్సర్లను కూడా డబ్బులు ఇస్తాం తమ ప్రభుత్వానికి బాకా ఊదమని చెప్పడం దారుణం.
అలా బాగా ఊదని వారిని లేదంటే నిజమైన సమస్యలు చెప్పేవారిని ప్రభుత్వ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించే పరిస్థితులు ఇకపై నెలకొంటాయని చెప్పవచ్చు.
ఇప్పుడు కూటమి పార్టీలనే కాదు గతంలో విపక్ష వైసిపి కూడా నేరుగా ఇలా ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు చెల్లించలేదు కానీ ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాలకు వివిధ రూపాల్లో డబ్బులు చెల్లించడం లేదంటే ప్రభుత్వ పదవులు ఇవ్వడం వంటివి చేసింది.
ఏదేమైనా ప్రజాస్వామ్యయుతంగా ఉండాల్సిన డిజిటల్ ప్లాట్ఫామ్ లపై కూడా ప్రభుత్వ ప్రభావం అవాంఛనీయ పరిణామమే’’ అని సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు గాలి నాగరాజు వ్యాఖ్యానించారు
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























