ట్రిప్‌కు వెళ్లొచ్చాక కొందరు వేషభాషలు మార్చేస్తారెందుకు?

ఫొటో సోర్స్, Alamy
- రచయిత, డేవిడ్ ఫార్లే
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
విహార యాత్రకు వెళ్లొచ్చినప్పుడు కొందరు అక్కడి నుంచి సావనీర్లు తీసుకురావడానికి బదులు పూర్తిగా భిన్నమైన వేషభాషలు, మేనరిజమ్‌తో తిరిగొస్తారు. ఇలా ఎందుకు చేస్తారు?
నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు నా జీవితంలో ఏం చేయాలనే విషయంలో నాకు ఎలాంటి స్పష్టత లేదు.
ప్రయాణాలంటే ఇష్టం ఉండటంతో చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లో స్థిరపడ్డాను. మూడేళ్లు అక్కడ గడిపి, వందల లీటర్ల 'చెక్ పిల్జ్‌నర్' బీర్ తాగిన తర్వాత నేను తిరిగి అమెరికాకు వచ్చాను.
కానీ నేను ఊహించని కొత్త మార్పు నాతో పాటు వచ్చింది. అది నా రూపం, యాస. అప్పటివరకు ఉన్న నా పొడవైన జుట్టు, సాధారణ జీన్స్-టీషర్ట్ స్టైల్ మారిపోయాయి.
వాటి స్థానంలో చిన్నగా కత్తిరించిన బ్లీచ్డ్ జుట్టు, స్త్రీ-పురుష భేదం లేని 'ఆండ్రోజినస్' ఫ్యాషన్, సెంట్రల్ బొహేమియా యాసకు దగ్గరగా ఉండే ఒక కొత్త శైలి నా మాటల్లో చేరాయి.

నా కుటుంబ సభ్యులకు ఈ కొత్త మార్పు అస్సలు నచ్చలేదు.
ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పటి నా రూపం నాకే నచ్చడం లేదేమో అనిపిస్తుంది.
సెలవులకు ఎక్కడికైనా వెళ్లి తిరిగొచ్చిన వారిలో అనేకమంది తాము వెళ్లిన ప్రాంతం తమను ఎంతగా మార్చిందో చెప్పడానికి స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఫొటోలు చూపిస్తారు.
అయితే ఇందులో మరో రకం ప్రయాణికులు ఉన్నారు. వీరు తాము వెళ్లిన ప్రాంతాల యాస, దుస్తులు లేదా ఆచారాలను అలవర్చుకుని భౌతికంగా మారిపోతారు. వాటిని తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటారు.

ఫొటో సోర్స్, Alamy
ప్రముఖ పాప్ సింగర్ మడోనా ఇంగ్లండ్‌లో ఉన్నప్పుడు ఆమె మాట్లాడిన బ్రిటిష్ యాసపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే.
అయితే ఆమెతో పాటు మిగతా ప్రయాణికులు కూడా కావాలని అలా చేయరని అది వారి నియంత్రణలో ఉండదని నిపుణులు చెబుతున్నారు.
బెర్లిన్‌లో మూడు రోజులుండి వచ్చాక పూర్తిగా నల్లటి దుస్తులు ధరిస్తూ, సిగరెట్లు తాగేవాళ్లు.. లండన్ వెళ్లిన మొదటి రోజే అక్కడి స్థానిక పదాలను వాడే వారిని, పారిస్‌లో 5రోజులు ఉండి రాగానే 'ఎయిర్ బీఎన్‌బీ'ని ఫ్రెంచ్ శైలిలో పలికే వారిని నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు.
బలవంతంగా అలవర్చుకున్నట్లుగా కనిపించే ఇలాంటి 'పరిమిత కాలపు విదేశీ అలవాట్ల'ను ఎగతాళి చేయడం సులభమే.
కానీ కొంత మందిలో ఇలాంటి మార్పులు ఎందుకు వస్తాయో తెలుసుకోవాలని నాకు ఆసక్తి కలిగింది.

ఫొటో సోర్స్, Alamy
అనుకోకుండా జరుగుతుందా?
నిజానికి ఒక కొత్త యాసను అలవర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మనం ఒక ప్రాంతంలో ఎక్కువ కాలం గడిపినప్పుడు ఇది సహజంగానే జరుగుతుంది.
మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు ఎదుటివారి శైలికి అనుగుణంగా తమను తాము మార్చుకుంటారని, కొన్నిసార్లు తెలియకుండానే వారి యాసను అనుకరిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి.
కొత్త ప్రాంతాల్లో తిరిగినప్పుడు ఈ అలవాటు మరింత బయటకు వస్తుంది.
చాలా మందికి ప్రయాణాలు చేయడం ఒక అలవాటుగా ఉండొచ్చు. ఇతర సంస్కృతుల గురించి తెలుసుకోవడం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎలా జీవిస్తున్నారో ప్రత్యక్షంగా చూడటం వల్ల అది మనపై లోతైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.
విదేశాల్లో కొన్ని రోజులు గడిపిన తర్వాత ఈ అనుభవాలు త్వరగానే వ్యక్తిగత అలవాట్లుగా మారిపోతాయని క్లినికల్ సైకాలజిస్ట్, 'ది ట్రావెల్ సైకాలజిస్ట్' వ్యవస్థాపకురాలు డాక్టర్ షార్లెట్ రసెల్ అంటున్నారు.
"కొందరు విదేశీ ఆచారాలను లేదా భాషను అలవర్చుకోవడానికి కారణం వాళ్లు ఆ ప్రాంతంతో మానసికంగా కనెక్ట్ అవ్వడమే. ఆ అనుభూతిని, ఆ బంధాన్ని అలాగే తమతో ఉంచుకోవాలని వాళ్లు కోరుకుంటారు" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Anadolu Agency via Getty Images
రసెల్ తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా పంచుకున్నారు. ఆమెకు గ్రీక్ పదం 'పారకలో' అంటే చాలా ఇష్టం.
తెలుగులో దీని అర్థం 'దయచేసి' అని. అయితే గ్రీక్ భాషలో ఈ పదానికి చాలా లోతైన అర్థం ఉంది.
"ఆ పదం పలికే తీరు అలాగే ఇతరుల పట్ల మర్యాదను చూపించడానికి దాన్ని ఉపయోగించే విధానం నాకు నచ్చుతుంది. మనం 'మీరు ముందుగా వెళ్లండి' లేదా 'నేను మీకు ఎలా సహాయం చేయగలను?' వంటివి చెప్పినట్లుగా" అని ఆమె అన్నారు.
"అయితే, నేను గ్రీకు సంస్కృతికి కనెక్ట్ అయినప్పటికీ, ఆ పదం తెలియని అపరిచితుల ముందు నేను దానిని వాడను. నేను గ్రీస్‌లో ఉన్నప్పుడు లేదా నా గ్రీకు స్నేహితులతో ఉన్నప్పుడు మాత్రమే ఆ పదాన్ని ఉపయోగిస్తాను. ఇది ఆ సంస్కృతితో నాకు ఉన్న బంధానికి గుర్తు" అని రసెల్ వివరించారు.
కొందరు టూరిస్టులు తమ ప్రయాణాల నుంచి మరీ స్పష్టమైన మార్పులను మోసుకొస్తుంటారు.
భూటాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా తన ఈమెయిళ్ల చివరలో "నమస్తే" అని రాయడం ప్రారంభించిన ఒక అమెరికన్ మహిళ నాకు తెలుసు.
ఇటలీలో కొన్నాళ్లు ఉన్న నా స్నేహితుడు, ఇప్పుడు ఏ చిన్న గందరగోళం వచ్చినా ఇటాలియన్ల లాగా చేతి వేళ్లను దగ్గరకు చేర్చి పైకీ కిందకీ ఊపుతుంటాడు. కోస్టారికాకు వెళ్లొచ్చిన ప్రతి ఒక్కరూ 'పుర విదా' ( సింపుల్‌గా జీవిద్దాం) అని చెబుతూనే చెబుతూనే విచిత్రంగా హవాయి 'షాకా' (బొటన వేలు, చిటికెన వేలు తెరిచి మిగిలిన మూడు వేళ్లు మడిచి పిడికిలి బిగించి చూపించడం) సంకేతాన్ని చూపిస్తారు.
"ఇలా ప్రదర్శించడానికి రెండో కారణం కూడా ఉంది. ఇది కేవలం ఆ ప్రాంతంతో ఉన్న బంధం మాత్రమే కాదు.. తాము ప్రపంచాన్ని చుట్టేసామని, ఇతరుల కంటే తాము కాస్త గొప్పవాళ్లమని సమాజానికి చూపించుకునే ప్రయత్నం కూడా కావచ్చు" అని రసెల్ అన్నారు.

ఫొటో సోర్స్, Alamy
'లోకల్ ఫీలింగ్' కోసం ఇలా చేస్తారా?
కొంతమంది ప్రయాణికులు స్థానిక సంస్కృతిపై ఉన్న గౌరవంతో విదేశీ అలవాట్లు, ఆచారాలను అలవర్చుకుంటారని వాషింగ్టన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పుగెట్ సౌండ్ ఆంత్రోపాలజీ, సోషియాలజీ ప్రొఫెసర్ గారెత్ బార్కిన్ చెబుతున్నారు.
ఫ్రెంచ్ తత్వవేత్త రెనే గిరార్డ్ ప్రతిపాదించిన 'మిమెటిక్ డిజైర్' సిద్ధాంతాన్ని బార్కిన్ ప్రస్తావించారు. మనం ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు కేవలం అక్కడి ఆహారం, అందమైన ప్రాంతాలను ఆస్వాదించడమే కాకుండా అక్కడి ఆతిథ్య సంస్కృతిని అలవాటు చేసుకోవాలని కోరుకుంటామని ఈ సిద్ధాంతం చెబుతోంది.
"అది ఫ్రాన్స్ లేదా జపాన్ లాంటి ఆధునిక దేశాలైనప్పటికీ.. మన విచ్ఛిన్నమైన ఆధునిక జీవితాల కంటే వారి సంస్కృతే మరింత 'ప్రామాణికమైన, సంప్రదాయబద్దమైనది'గా మనం భావిస్తాం. ఆంత్రోపాలజిస్ట్ మైఖేల్ టౌసిగ్ చెప్పినట్లు వారి యాస లేదా హావభావాలను అనుకరించడం ద్వారా మనం 'మరొకరిగా మారడానికి' ప్రయత్నిస్తాం. వారిలోని ఆ అసలైన జీవన శైలి మనకూ అబ్బుతుందని ఆశిస్తాం" అని బార్కిన్ వివరించారు.
అయితే ప్రతి పర్యటక ప్రాంతం పట్ల టూరిస్టులకు ఇలాంటి కోరిక కలగదని బార్కిన్ పేర్కొన్నారు. ఒక సంస్కృతి మనల్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది 'ప్రెస్టీజ్ బయాస్' పై ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఏ ప్రాంతాన్ని లేదా సమాజాన్ని ఉన్నతమైనదిగా భావిస్తామో, వారి అలవాట్లను ఎక్కువగా అనుకరిస్తాం.
"ఎక్కువగా పాశ్చాత్య సంస్కృతికి మూలమైన యూకే, ఫ్రాన్స్, ఇటలీ లేదా గ్రీస్ వంటి దేశాల అలవాట్లను అమెరికన్లు ఎక్కువగా అనుకరిస్తుంటారు. ఒక అమెరికన్ టూరిస్ట్ లండన్‌లో బ్రిటిష్ యాసలో మాట్లాడినా, రోమ్‌లో స్థానిక చేతి సైగలను చేసినా అది వారు ఆ ప్రాంత సామాజిక హోదాను పొందేందుకు ఎంచుకున్న మార్గం. తాము కూడా ఆ ప్రాంతానికి చెందినవారమే అని స్థానికులకు చెప్పడమే వారి ఉద్దేశం" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Alamy
పర్యటకం పెరగడం వల్లే ఇలా జరుగుతోందా?
ప్రయాణికులు కొత్త యాస లేదా విదేశీ పదాలను అనుకరించడానికి 'ఓవర్ టూరిజం' కూడా ఒక కారణం కావచ్చు. సామూహిక పర్యాటకం విపరీతంగా పెరిగిపోవడంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతోంది. సోషల్ మీడియా కారణంగా స్థానికుల్లో నమ్మకం పెంచుకునేందుకు వారి భాష ఉపయోగించడం పెరుగుతోందని బార్కిన్ చెప్పారు.
"పాశ్చాత్య దేశాలకు చెందిన మధ్యతరగతి పర్యటకులు గ్రామీణ, గిరిజన లేదా వెనుకబడిన ప్రాంతాల సంస్కృతులను గొప్పగా చూపిస్తారు. తాము సాధారణ టూరిస్టుల కంటే భిన్నమైనవాళ్లమని నిరూపించుకోవాలని చూస్తారు. తాము కేవలం ప్రసిద్ధ ప్రదేశాలు చూసే టూరిస్టులం కాదని, సంస్కృతిని లోతుగా అధ్యయనం చేసేవాళ్లమని సమాజానికి సంకేతాలు పంపుతారు" అని బార్కిన్ పేర్కొన్నారు.
ఇలాంటి వారిని మనం తరచూ చూస్తుంటాం. గ్వాటెమాలా గ్రామీణ ప్రాంతంలో నెల రోజులు స్పానిష్ నేర్చుకుని కేవలం 'మాసా టోర్టిలాలు' మాత్రమే తినే విదేశీయుడు, లావోస్ నుంచి రాగానే చిన్న వస్తువు చేతికిచ్చినా చేతులు జోడించి నమస్కరించే కెనడియన్, ఇండియాలో బ్యాక్‌ప్యాక్ టూరిజం చేస్తూ చీరలు, ధోవతులు కట్టే యూరోపియన్లు ఇందులో భాగమే.
విదేశీ సంస్కృతులను ఇలా ప్రదర్శించడం అనేది 'తామే అందరికంటే గొప్ప' అని నిరూపించుకునే ప్రయత్నం లాంటిది. మచు పిచు వద్ద సూర్యోదయ సమయంలో యోగా పోజ్ ఇస్తూ దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేవాళ్లను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అదే సమయంలో పెరూ దేశపు సాంప్రదాయ పానీయం 'పిస్కో సోర్' 'సివిచ్' వంటకాలను టిక్‌టాక్‌లో స్పష్టమైన ఉచ్చారణతో ఎలా చేయాలో చూపిస్తూ తాము ఇతరుల కంటే ప్రత్యేకమైన వాళ్లమని నిరూపించుకునే వారు కూడా ఉంటారు.
ప్రేగ్ నుంచి అమెరికాకు తిరిగి వచ్చినప్పుడు నేను కూడా ఇదే చేస్తున్నానని అనుకుంటాను.
నా కొత్త రూపం, మాట్లాడే తీరుతో నేను తెలియకుండానే పాత స్నేహితులకు నన్ను మళ్లీ పరిచయం చేసుకుంటూ, నా సొంత సంస్కృతికి భిన్నమైన సంస్కృతి ఒకటి నన్ను మార్చిందని చూపించే ప్రయత్నం చేశాను.
ఇప్పుడు ఆలోచిస్తే, ఆ మార్పు ఇతరుల కంటే నాకే ఎక్కువ ఉపయోగపడిందనిపిస్తుంది. నేను ఎంతలా మారిపోయానో నాకు నేను నిరూపించుకోవడానికి అది పనికొచ్చింది. మిగతా అందరూ బహుశా నేను ఆడంబరంగా ప్రవర్తించే మూర్ఖుడినని అనుకుని ఉంటారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























