హిట్లర్ రాకెట్‌ను కూరగాయలు, గడ్డిమోపుల చాటున దాచి, లండన్ తరలించడానికి ముందు ఏం జరిగిందంటే..

ఫొటో సోర్స్, AFP/Getty Images
- రచయిత, ఫియోనా మెక్‌డోనాల్డ్
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
జర్మనీ పాలకుడు అడాల్ఫ్ హిట్లర్‌కు తెలియకుండా ఆయన 'వండర్ వెపన్' భాగాలను ఒక జర్మన్ అధికారి ఇంట్లోనే దాచిపెట్టి మరీ మిత్రదేశాల ఏజెంట్లు పట్టుకుపోయిన ఘటన 1944లో జరిగింది.
సోవియట్ యూనియన్ రెడ్ ఆర్మీ 1944 ఆగస్టు 6న పోలండ్‌లోని బ్లిజ్నా గ్రామానికి చేరుకొని, దాన్ని నాజీల పాలన నుంచి విడిపించింది.
పొలాలు, దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ పల్లెటూరు చూసేందుకు.. పెద్దగా సైనిక ప్రాముఖ్యత లేని ప్రదేశంగా కనిపిస్తుంది.
కానీ, అక్కడి అడవుల్లో నేలపై ఉన్న పెద్ద పెద్ద గుంతలు, లోహ వ్యర్థాలు, నకిలీ ఇళ్లు.. ఆ గ్రామాన్ని నాజీలు ఒక రహస్య స్థావరంగా వాడుకున్నారని చెప్పడానికి సంకేతంగా నిలిచాయి.
నాజీలు వెనక్కి తగ్గడానికి కొన్నిరోజుల ముందు వరకు బ్లిజ్నా గ్రామం, ఒక కొత్త ఆయుధం పరీక్షకు ప్రయోగ కేంద్రంగా ఉండేది. ఈ కొత్త ఆయుధాన్ని వాడి యుద్ధాన్ని తమవైపుకు తిప్పుకోవచ్చని హిట్లర్ భావించారు.


ఫొటో సోర్స్, Getty Images
జర్మన్లు ఈ ఆయుధాన్ని 'ఫెర్గెటుంగ్స్‌వాఫె-2 (పగ తీర్చుకునే ఆయుధం)' అని పిలిచేవారు. దీనినే V2 రాకెట్ అని కూడా అనేవారు.
ప్రపంచంలోనే మొట్టమొదటి ఆధునిక బాలిస్టిక్ వెపన్ ఈ వీ2 రాకెట్.
ఇంజినీర్ వెర్నర్ వోన్ బ్రాన్ దీన్ని తయారు చేశారు. సూపర్‌సోనిక్ స్పీడ్‌తో, అత్యధిక ఎత్తులో ప్రయాణిస్తూ, ఒక టన్ను వార్‌హెడ్‌ను తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న ఈ రాకెట్‌ను అప్పట్లో హిట్లర్ 'వండర్ వెపన్' అని వర్ణించేవారు.
దాదాపు 170 మైళ్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఎలాంటి హెచ్చరిక లేకుండా పేల్చేయగల సామర్థ్యం దీని సొంతం.
కానీ, 1944లో ఈ వీ2 రాకెట్ భాగాలను పోలండ్ నుంచి బ్రిటన్‌కు రహస్యంగా తరలించారు. ఈ తరలింపు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అత్యంత సాహసోపేత రహస్య ఆపరేషన్లలో ఒకటిగా నిలిచింది.
నాజీలు V2 రాకెట్ తయారీని 1936లోనే ప్రారంభించారు. అయితే, 1943 ప్రారంభం వరకు ఈ రాకెట్ తయారీ గురించి బ్రిటీష్ నిఘా వర్గాలకు తెలియదని 'ద సీక్రెట్ వార్' పేరుతో 1977లో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీలో నిపుణులు చెప్పారు.
"జర్మన్లు దీర్ఘ శ్రేణి రాకెట్లను అభివృద్ధి చేస్తుండొచ్చని 1939 కంటే ముందే కొంత వినికిడి ఉంది. ఆ తర్వాత 1942 వరకు దాని ఊసే ఎక్కడా వినిపించలేదు. తర్వాత ఒక డానిష్ కెమికల్ ఇంజినీర్ ద్వారా మాకు కొంత సమాచారం అందింది. బాల్టిక్ తీరంలో ఒక కొత్త ఆయుధాన్ని పరీక్షిస్తున్నట్లు బెర్లిన్‌లో ఇద్దరు ఇంజినీర్లు మాట్లాడుకోవడం తాను విన్నట్లు డానిష్ కెమికల్ ఇంజినీర్ మాకు చెప్పారు'' అని సైంటిఫిక్ ఎయిర్ ఇంటెలిజెన్స్ చీఫ్ డాక్టర్ ఆర్‌వీ జోన్స్ తెలిపారు.
1943లో ఒక కీలక ఘటన జరిగింది. అదేంటంటే.. ఇద్దరు జర్మన్ జనరల్స్ విడివిడిగా పట్టుబడ్డారు. విచారించడం కోసం వారిని బ్రిటన్‌కు తీసుకొచ్చారు. తమను ఉంచిన గదిలో మైకులు అమర్చి రహస్యంగా వింటున్నారనే సంగతి తెలియక ఆ ఇద్దరు జనరళ్లు ఒకరితోఒకరు మాట్లాడుకున్నారు. రాకెట్లను ఇప్పటిదాకా ఎందుకు వాడలేదని చర్చించుకున్నారు. కొద్దినెలల్లోనే రాకెట్లు సిద్ధమవుతాయని ఏడాది కిందటే చెప్పారని, ఇంకా వాడలేదంటే ఏదో తేడా జరిగి ఉంటుందని వాళ్లిద్దరూ అనుకున్నారు.
'మనం లండన్ దగ్గరలో ఉన్నాం కదా. మనకు ఎలాంటి పేలుడు శబ్ధాలు వినిపించలేదంటే ఇంకా ఏమీ జరగలేదన్నమాట' అని ఆ ఇద్దరిలో ఒకరు అన్నట్లుగా జోన్స్ చెప్పారు.
జోన్స్ 1977లో జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటూ అప్పుడేం జరిగిందో వివరించారు.
''ఇంటెలిజెన్స్ అనలిస్ట్ చార్లెస్ ఫ్రాంక్ నా ముందే కూర్చున్నారు. ఆ విచారణ రిపోర్ట్ చదువుతూ ఒక్కసారిగా నా వైపు చూసి, వాళ్లు మాట్లాడుకున్న ఆ రాకెట్ల వ్యవహారాన్ని మనం కాస్త సీరియస్‌గా తీసుకోవాల్సిందే అన్నారు'' అని జోన్స్ గుర్తు చేసుకున్నారు.
బాల్టిక్ తీరానికి దగ్గర్లోని పీనెముండే ద్వీపం దగ్గర V2 కోసం నాజీల రహస్య పరిశోధనా కేంద్రం ఉందని బ్రిటిష్ వాళ్లు కనుగొన్నారు. 1943 ఆగస్టులో దానిపై బాంబుల వర్షం కురిపించారు. ఆ వైమానిక దాడి తర్వాత, నాజీలు V2 రాకెట్ పరీక్ష, శిక్షణ, ప్రయోగ కేంద్రాన్ని జర్మనీ నుంచి దూరంగా తరలించారు.
వార్సాకు దాదాపు 240 కిలోమీటర్ల దూరంలో, దట్టమైన అడవులున్న పోలండ్ భూభాగాన్ని వారు ఎంచుకున్నారు. అదే బ్లిజ్నా గ్రామం. ఈ బ్లిజ్నా గ్రామం నాజీల సైనిక వ్యూహాల్లో కీలకపాత్ర పోషించింది. అందుకే తర్వాతి రోజుల్లో హిట్లర్, హోలోకాస్ట్ సూత్రధారి హెన్రిచ్ హిమ్లర్ స్వయంగా ఈ స్థావరాన్ని సందర్శించారు.
అయితే, V2 టెస్ట్ వెపన్స్‌లో తలెత్తిన ఒక సాంకేతిక లోపం వల్ల వాటిని వాడటం దాదాపు ఏడాది పాటు ఆలస్యమైంది. ప్రయోగించిన వాటిలో చాలావరకు తమ లక్ష్యానికి దాదాపు కొద్ది దూరంలో తూర్పు పోలండ్‌లోని బగ్ నదికి సమీపంలో గాల్లోనే పేలిపోయేవి. నేలకూలిన రాకెట్ ముక్కలను సేకరించడం కోసం జర్మనీ అక్కడ ఒక ప్రత్యేక సైనిక బృందాన్ని మోహరించింది.

ఫొటో సోర్స్, Chris Ware/Keystone/Hulton Archive/Getty Images
కూరగాయల కింద దాచి...
''ఆకాశం నుంచి జర్మన్ రహస్య ఆయుధాల శకలాలు తమపై పడుతుండటంతో తూర్పు పోలండ్ ప్రాంత ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అందుకే, జర్మన్ సైనికులు ఆ ప్రదేశానికి చేరుకోవడాని కంటే ముందే పడిపోయిన రాకెట్ ముక్కలను స్వాధీనం చేసుకోవాలని పోలిష్ తిరుగుబాటు దళాలు, స్థానికులను కోరాయి'' అని 1977 నాటి ది సీక్రెట్ వార్ డాక్యుమెంటరీ వ్యాఖ్యాత విలియమ్ వోలార్డ్ గుర్తు చేసుకున్నారు.
1944 మే నెలలో ఒక V2 రాకెట్ పేలకుండా సరిగ్గా 'బగ్' నది ఒడ్డున బురదలో పడింది. స్థానికులు, వెంటనే దాన్ని గడ్డితో కప్పి, పోలిష్ రెసిస్టెన్స్ నాయకుడు లెఫ్టినెంట్ టాడేస్ జాకోబ్‌స్కీకి సమాచారం ఇచ్చారు.
ఈ ఘటన జరిగిన 33 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే ప్రదేశంలో నిలబడి ఆయన బీబీసీతో మాట్లాడారు.
''ఆ రాకెట్ దెబ్బతినకుండా కింద పడిపోయింది ఇక్కడే. జర్మన్లు ఎంత వెదికినా దొరక్కపోవడంతో కొద్దిరోజులకే వెతకడం ఆపేశారు. ఆ తర్వాత మేం ఆ రాకెట్‌ను ఒడ్డుకు లాగాం. వార్సా నుంచి నిపుణులు వచ్చి దాని భాగాలను విడదీశారు'' అని ఆప్రాంతం నుంచి టాడేస్ చెప్పారు.
ఆ విడిభాగాలను బస్తాల్లో నింపి, కూరగాయల కింద దాచారు. సాయుధులైన తిరుగుబాటుదారుల కాపలా కాయగా అడవుల గుండా, ఎవరూ ఎక్కువగా తిరగని గ్రామీణ రహదారుల్లో ఎడ్లబండ్లపై వాటిని వార్సా నగరానికి తరలించారు.
రాజధాని వార్సాలో నాజీల భద్రతా తనిఖీలు తీవ్రంగా ఉన్నప్పటికీ, రాకెట్ ముక్కలను సురక్షితంగా నగరంలోకి తీసుకెళ్లారు.
రాకెట్ ఎలక్ట్రానిక్ భాగాలను పరిశోధించే బాధ్యత భౌతిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ జానూజ్ గ్రోస్జ్‌కోవ్స్కీతో పాటు కొందరు నిపుణులకు అప్పగించారు.
యూనివర్సిటీలోని తన ల్యాబ్‌పై నాజీ రహస్య పోలీసులు (గెస్టాపో) దాడి చేస్తారనే భయంతో, జర్మన్ సైనికాధికారికి చెందిన ఒక ప్రైవేట్ ఇంట్లోనే ఈ పరిశోధన చేయడం మేలని రెసిస్టెన్స్ భావించింది. ఆ ఇంటి యజమాని అయిన జర్మన్ అధికారికి ఈ విషయం తెలియదు.
ఆ ఎలక్ట్రానిక్ విడి భాగాలను రాత్రిపూట ఆ అధికారి ఇంట్లోని ఒక పెట్టెలోనే దాచేవారు.
"నేను పరిశోధన చేయడానికి వెళ్లేముందే, ఆ సూట్‌కేస్‌ను ఆ అధికారి గది నుంచి తీసి పరిశోధన కోసం సిద్ధం చేసిన మరో చిన్న గదిలోకి తెచ్చేవారు" అని బీబీసీతో గ్రోస్జ్‌కోవ్స్కీ చెప్పారు.

ఫొటో సోర్స్, Photo 12/Universal Images Group via Getty Images
ఆ అధికారి ఎప్పుడు హఠాత్తుగా వస్తాడో అనే భయం వెంటాడుతూనే ఉన్నప్పటికీ, ఆయన ఆ గదిలోనే గంటల తరబడి పనిచేసేవారు.
అయితే తాను అక్కడ ఉన్న సమయంలో ఆయనెప్పుడూ హఠాత్తుగా రాలేదని గ్రోస్జ్‌కోవ్స్కీ చెప్పారు. రెసిస్టెన్స్ ఏజెంట్లు ఆ జర్మన్ అధికారిపై నిరంతరం నిఘా ఉంచేవారని అన్నారు.
"ఆ అధికారి విమానాశ్రయంలోని ఆయన ఆఫీసులోనే ఉన్నాడని నిర్ధరించుకోవడానికి... రాత్రి భోజనానికి ఏం కావాలో పనిమనిషి ఫోన్ చేసి అడిగేది. ఒకవేళ ఆయన త్వరగా వస్తున్నట్లు చెబితే, నేను వెంటనే అక్కడ నుంచి పరారయ్యేవాడిని'' అని ఆయన గుర్తు చేసుకున్నారు.
వార్సాలో ఈ రహస్య పరిశోధన పూర్తయ్యాక, ఆ రాకెట్ భాగాలను బ్రిటన్‌కు చేరవేయడానికి 'వైల్డ్‌హార్న్ III' (ఆపరేషన్ మోస్ట్ III) అనే అత్యంత రహస్య ఆపరేషన్ చేపట్టారు.
18 గంటల పాటు ప్రయాణించేలా అదనపు ఇంధన ట్యాంకులు అమర్చిన 'ఆర్‌ఏఎఫ్ డకోటా' విమానం పోలాండ్‌లోని వాళ్-రుడా గ్రామం సమీపంలోని ఒక పాడైపోయిన విమానాశ్రయంలో జులై 18న దిగింది.
ఆ ప్రాంతం చుట్టూ జర్మన్ దళాలు మోహరించి ఉన్నాయి. ఆ విమానంలోకి V2 రాకెట్ కీలక విడిభాగాలు, టెక్నాలజీ బ్లూప్రింట్లు, రీసర్చ్ రిపోర్టులు ఉన్న 19 సూట్‌కేస్‌లను ఎక్కించాల్సి ఉంది.
బీబీసీ రేడియో ద్వారా ప్రసారమైన రహస్య కోడ్‌ల సహాయంతో తిరుగుబాటుదారులు ఈ ఆపరేషన్ సమాచారాన్ని అందుకున్నారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత విమానం ల్యాండ్ కాగానే అడవుల నుంచి బయటకు వచ్చి సామానంతా విమానంలోకి ఎక్కించారు.
కానీ, దాని చక్రాలు బురదలో దిగబడిపోవడంతో విమానం టేకాఫ్ కాలేకపోయింది. దాంతో రెండుసార్లు సామగ్రిని కిందకు దించి, చక్రాల కింద ఎండుగడ్డి, చెక్క పలకలు వేసి విమానాన్ని ముందుకు కదిలించేందుకు ప్రయత్నించారు.
కొంతమంది తిరుగుబాటుదారులు ఒట్టి చేతులతోనే చక్రాల చుట్టూ ఉన్న బురదను తోడేశారు.
ఒక దశలో, లోపల ఉన్న ప్రయాణికులను దించేసి విమానాన్ని తగలబెట్టాలని కూడా అనుకున్నారు. చివరికి విమానం చక్రాలపై పెట్రోల్ కూడా చల్లారు. కానీ అదృష్టవశాత్తూ విమానం గాల్లోకి లేచింది.

ఫొటో సోర్స్, Getty Images
రాకెట్‌ను ఆపాలంటే అదొక్కటే మార్గం
సాహసంతో కూడిన ఈ వైమానిక ఆపరేషన్ ఫలితంగా.. నాజీల ఆక్రమణలో ఉన్న యూరప్ నుంచి, జర్మన్ సైన్యం కళ్లముందే హిట్లర్‌కు చెందిన అత్యంత భయంకరమైన ఆయుధాల్లో ఒకటి బయటపడింది.
V2 రాకెట్ విడి భాగాలు 1944 జులై 28న సురక్షితంగా లండన్ చేరాయి.
హిట్లర్ వండర్ వెపన్‌గా పిలిచే ఈ ఆయుధాన్ని బ్రిటిష్ నిఘా వర్గాలు విశ్లేషించడం ప్రారంభించాయి. ఈ రాకెట్ గురించి 'స్టీలింగ్ హిట్లర్స్ రాకెట్' పుస్తక రచయిత, చరిత్రకారుడు గై వాల్టర్స్, బీబీసీకి వివరించారు.
''మొత్తం రాకెట్‌ను తరలించాల్సిన అవసరం లేదు. అది అసాధ్యం కూడా. ఎందుకంటే V2 రాకెట్ బరువు దాదాపు 12.5 టన్నులు, పొడవు 14 మీటర్లు ఉంటుంది. కానీ, పోలిష్ నిపుణులు దాన్ని చాలా జాగ్రత్తగా విడదీశారు. చాలా కీలక భాగాలను బ్రిటన్‌కు వెళ్లే విమానంలోకి వెళ్లేలా చేశారు. ఈ విడిభాగాలు బ్రిటిష్ శాస్త్రవేత్తలకు చాలా కీలకం. ఎందుకంటే కాస్త కూడా దెబ్బతినకుండా ఆయుధ విడిభాగాలు వాళ్లకు దొరకడం అదే మొదటిసారి'' అని గై వాల్టర్స్ తెలిపారు.
''ఆ రాకెట్‌ను నియంత్రించడానికి అందులో ఏమైనా గైడెన్స్ సిస్టమ్ ఉందా లేదా అనేది బ్రిటీష్ వారికి అప్పటివరకు తెలియదు. ఒకవేళ దానికి గైడెన్స్ సిస్టమ్ ఉంటే, దాన్ని రిమోట్ ద్వారా జామ్ చేసి రాకెట్లు దారి తప్పేలా చేయవచ్చని బ్రిటిష్ వారు భావించారు. కానీ, పోలాండ్ నుంచి తెచ్చిన రాకెట్ ముక్కలను పరిశీలించాక, దానికి ఎలాంటి గైడెన్స్ సిస్టమ్ లేదని బ్రిటీష్ శాస్త్రవేత్తలకు అర్థమైంది. దీనివల్ల జామింగ్ వ్యవస్థలను తయారుచేసే పని తప్పి వాళ్లకు చాలా సమయం కలిసొచ్చింది. దాంతో V2 రాకెట్‌ను ఆపాలంటే ఉన్న ఒకే ఒక్క దారి ఆ యుద్ధంలో జర్మనీని ఓడించడమేనని తేలిపోయింది'' అని గై వాల్టర్స్ పేర్కొన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























