ఒకే సమాధిలో 572 అస్థిపంజరాలు, శ్రీలంకలో దొరికిన మానవ అవశేషాలు ఎవరివి?

జయరూబీ జయబాలన్‌

ఫొటో సోర్స్, Ranjan Arun Prasadh, BBC

ఫొటో క్యాప్షన్, జయరూబీ బాలన్ తండ్రి కందయ్య జయబాలన్ అదృశ్యమయ్యారు. ఇంతవరకు ఆచూకీ లభించలేదు.
    • రచయిత, అన్బరసన్ ఎతిరాజన్
    • హోదా, గ్లోబల్ ఎఫైర్స్‌ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

గత ఫిబ్రవరిలో ఉత్తర శ్రీలంకలో సామూహిక సమాధి ఒకటి బయటపడింది.

జాఫ్నా ప్రాంతంలోని చెమ్మణిలో శ్మశానవాటిక విస్తరణ పనులు చేస్తుండగా కార్మికులకు పెద్ద సంఖ్యలో మానవ అవశేషాలు కనిపించాయి. ఈ ఘటన ఇక్కడ ఇన్ని మానవ అవశేషాలు ఎందుకు ఉన్నాయి అన్నదానిపై విచారణకు దారి తీసింది.

ఆ ప్రాంతంలో ఆగస్టు నాటికి మూడో దశ తవ్వకాలను ఆర్కియాలజీ విభాగం పూర్తి చేసింది. ఇంత వరకు అక్కడ 572 అస్థి పంజరాలను గుర్తించారు. వీటిలో చిన్నారులు, పసికందుల అవశేషాలు కూడా ఉన్నాయి.

మానవ అవశేషాలతోపాటు గాజులు, ఒక స్కూల్ బ్యాగ్, పిల్లలకు పాలు పట్టించే సీసా వంటి వస్తువులు కూడా లభించాయి.

శ్రీలంకలో ఇప్పటి వరకు బయటపడ్డ అతి పెద్ద సామూహిక సమాధి ఇదేనని భావిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ సామూహిక సమాధి గురించి ఇప్పటికే చాలా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాంతంలో వందలమందిని హతమార్చి పూడ్చి పెట్టిన విషయం అనూహ్యంగా బయటకు వచ్చింది. అంతర్యుద్ధ సమయంలో యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారనే ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్న ఒక సైనికుడు దీనిని బయటపెట్టినట్లు ప్రచారం జరిగింది. ఈ అవశేషాలు ఒకప్పుడు ఈ ప్రాంతంలో అదృశ్యమైన పౌరులవేనని మానవహక్కుల సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

అయితే ఆ వాదనను నిర్థరించే స్పష్టమైన ఆధారాలు నేటి వరకు లభించలేదు.

ఇప్పుడు బయటపడిన అవశేషాలు జయరూబీ జయబాలన్ వంటి కుటుంబాలకు కొత్త ఆశను కలిగిస్తున్నాయి. దశాబ్దాల కిందట జరిగిన అంతర్యుద్ధం సమయంలో అదృశ్యమైన వేలమందిలో జయరూబీ తండ్రి కూడా ఉన్నారు. ఇప్పుడు అవశేషాల ఆధారంగా తమవారికి ఏం జరిగిందో తెలుసుకునేందుకు అవకాశం లభిస్తుందని జయబాలన్ సహా బాధిత కుటుంబాలు భావిస్తున్నాయి. దీనిపై లోతుగా దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని జయబాలన్ డిమాండ్ చేస్తున్నారు.

కానీ చెమ్మణిలో తవ్వకాలు మాత్రం చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. తమ వారి కోసం ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఇక్కడ జరుగుతున్న ఆలస్యం అసహనం కలిగిస్తోంది.

వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలనే చిత్తశుద్ధి లోపించడంతో చెమ్మణి అంశం కాలక్రమేణా మరుగునపడిపోతుందని కొందరు భావిస్తున్నారు.

అందుకే ఆ సమాధి, శ్రీలంక ఉత్తర ప్రాంతంలో జరుగుతున్న నిరసనలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

పాలసీసా

ఫొటో సోర్స్, Kumanan Kanapathippillai, BBC

ఫొటో క్యాప్షన్, సమాధి ప్రదేశంలో బయటపడిన వస్తువులలో పాలసీసా కూడా ఉంది.

సమాధానాల కోసం ఎదురు చూపులు

తమిళులు అధికంగా నివసించే ఉత్తర, తూర్పు శ్రీలంక దశాబ్దాలపాటు ఘర్షణలతో అల్లకల్లోలంగా ఉండేది. 1983లో ప్రారంభమైన అంతర్యుద్ధం 2009 వరకు కొనసాగి, దేశాన్ని జాతిప్రాతిపదికన విభజించింది. సింహళీయుల ఆధిపత్య ప్రభుత్వం తమపై వివక్ష చూపుతోందనే వాదనతో, తమిళ టైగర్స్ తిరుగుబాటుదారులు స్వతంత్ర తమిళ రాజ్యం స్థాపన కోసం ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో సాయుధ పోరాటం చేపట్టారు.

26 ఏళ్లు సాగిన అంతర్యుద్ధంలో సుమారు లక్షమంది మరణించారు. దాదాపు 23వేల మంది ఆచూకీ లేకుండా పోయింది. అలా కనిపించకుండా పోయిన వారిలో ఎక్కువ మంది తమిళులే. అయితే , ఈ పరిస్థితి కారణం మీరంటే మీరంటూ శ్రీలంక సైన్యం, తమిళ్ టైగర్స్ పరస్పరం నిందించుకున్నాయి.

తీవ్ర పోరాటం తర్వాత 1995లో శ్రీలంక సైన్యం జాఫ్నా ద్వీపకల్పాన్ని ఎల్టీటీఈ ఆధీనం నుంచి స్వాధీనం చేసుకుంది. చివరకు 2009లో తమిళ టైగర్స్ పరాజయంతో 26 ఏళ్ల అంతర్యుద్ధం ముగిసింది.

జాఫ్నా ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్న తర్వాత చెమ్మణి ప్రాంతాన్ని హైసెక్యూరిటీ జోన్‌గా ప్రకటించింది లంక ప్రభుత్వం. అక్కడ భారీగా సైనిక శిబిరాలను ఏర్పాటు చేసింది. అడుగడుగునా తనిఖీలు, సెక్యూరిటీ పోస్టులను పెట్టారు. ఇప్పుడు అవశేషాలు బయటపడిన శ్మశానం పక్కనే ఆర్మీ క్యాంప్ ఉండేది.

ఆ కాలంలో జాఫ్నాను ' బహిరంగ జైలు'గా కొందరు అభివర్ణించేవారు. వేల మంది పౌరులు అదృశ్యం వెనుక సైన్యం ఉందని ఆరోపణలు రాగా, శ్రీలంక ప్రభుత్వం వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది.

‘‘అప్పుడు నాకు 12 ఏళ్లు. 1996 సెప్టెంబరులో చెమ్మణికి సమీపంలోని తనిఖీ కేంద్రం నుంచి మా నాన్నను సైనికులు తీసుకెళ్లారు. ఆయన ఏమయ్యారో నేటికీ మాకు తెలియదు’’ అని జయరూబీ జయబాలన్ బీబీసీతో అన్నారు.

ఆయన అదృశ్యమైన విషయం తెలిసిన తర్వాత కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైందని జయబాలన్ చెప్పారు. ఆయన గురించి తెలుసుకునేందుకు సైనిక శిబిరాలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగామని, అయినా సమాచారం దొరకలేదని, అప్పటి నుంచి నేటి వరకు ఆయన జాడ తెలియలేదని వాపోయారు.

ఆమె తండ్రి కందయ్య జయబాలన్ ప్రభుత్వ ఉద్యోగి. చెమ్మణి సమీపంలోనే కేఫ్‌ను కూడా నడిపేవారు.

‘‘నా తండ్రికి సంబంధించిన ఏదైనా సమాచారం దొరక్కపోతుందా అని కొందరు బాధితులతో కలిసి నేను చెమ్మణి వెళ్లాను. కానీ నాకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అందుకే ఇప్పుడు దొరికిన అవశేషాలపై సమగ్రమైన ఫోరెన్సిక్ విశ్లేషణ జరగాలని కోరుకుంటున్నాం' అని జయరూబి డిమాండ్ చేస్తున్నారు.

కందయ్య జయబాలన్ కనిపించకుండా పోవడానికి రెండు వారాల ముందే అదే ప్రాంతంలో 18 ఏళ్ల తమిళ విద్యార్థిని క్రిశాంతి కుమారస్వామి అదృశ్యమయ్యారు.

కొందరు ఆ యువతిపై అత్యాచారం చేసి, ఆమెతోపాటు కుటుంబ సభ్యులు ముగ్గురిని హత్య చేసినట్టు తేలింది. వారి మృతదేహాలను చెమ్మణి ప్రాంతంలోనే పూడ్చిపెట్టారు. ఈ కేసులో ఐదుగురు సైనికులకు కొలంబో కోర్టు 1998లో మరణ శిక్ష వేసింది. అప్పట్లో ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయ్యింది.

క్రిశాంతి కుమారస్వామి, వాళ్ల కుటుంబ సభ్యుల మృతదేహాలు పూడ్చి పెట్టిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోనే ఇప్పుడు అవశేషాలు లభించిన స్పాట్ ఉంది.

ఈ కేసులో శిక్ష పడిన సైనికుడు సోమరత్నే రాజపక్సే కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం చర్చనీయాంశమైంది. 1990ల్లో హతమైన 300 నుంచి 400 మంది మృతదేహాలను చెమ్మణి ప్రాంతంలో పూడ్చి పెట్టారని ఆయన వెల్లడించారు.

సోమరత్నే రాజపక్సే చేసిన ఆరోపణలతో ఏడాది తర్వాత చెమ్మణిలో మొదటిసారి తవ్వకాలు జరిపారు. ఆ సమయంలో 10 మందికిపైగా వ్యక్తుల అస్థి పంజరాలు బయటపడ్డాయి. ఇవి అంతర్యుద్ధ సమయంలో అదృశ్యమైన వాళ్లవేనని మానవహక్కుల సంఘాలు పేర్కొన్నప్పటికీ, ఈ కేసులో న్యాయపరమైన దర్యాప్తు ముందుకు సాగకపోవడం విమర్శలకు దారితీసింది. యుద్ధం తీవ్రంగా సాగుతున్నందున నాటి ప్రభుత్వం ఈ కేసును లోతైన దర్యాప్తు చేయలేదని మానవహక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు మరోసారి అదే ప్రాంతంలో మానవ అవశేషాలు బయటకు రావడంతో దర్యాప్తు పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

‘‘ఇది సాధారణ అంత్యక్రియల శ్మశానవాటిక కాదు, అక్కడ కనిపించిన ఖననం హిందూ సంప్రదాయాల ప్రకారం చేసినట్టు లేదని ప్రాథమిక పరిశీలనలో తేలింది’’ అని శ్రీలంక మానవ హక్కుల సంఘం కమిషనర్ గేహాన్ గుణతిలకే పేర్కొన్నారు. ఈ చెమ్మణి ప్రాంతాన్ని ఆయన గతేడాది పరిశీలించారు.

ఇక్కడ లభించిన మానవ అవశేషాలు చూస్తే పదుల సంఖ్యలో మృతదేహాలు సంప్రదాయబద్ధంగా పూడ్చి పెట్టినట్టే కనిపిస్తున్నాయి. కానీ మృతదేహాలు మాత్రం భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి.

కొన్ని మానవ అవశేషాలు దుస్తుల్లేకుండా ఉంటే, మరికొన్ని పక్కపక్కన పడేసినట్టు కనిపిస్తున్నాయి. ఇంకొన్ని ఒకదానిపై ఒకటి కుప్పగా పడేసినట్టు ఉన్నాయి. ఒకట్రెండు మీటర్లు మాత్రమే తవ్వి భూమిలో వీటిని పూడ్చిపెట్టినట్టు వెల్లడైంది.

‘‘అన్యాయంగా, చట్టవిరుద్ధంగా జరిగిన హత్యలు కావడం వల్లే ఈ మృతదేహాలను ఇలా పూడ్చిపెట్టినట్టు అర్థమవుతోంది’’ అని శ్రీలంక మానవ హక్కుల సంఘం గతేడాది తన రిపోర్టులో పేర్కొంది.

సుశీలా

ఫొటో సోర్స్, Kumanan Kanapathippillai, BBC

ఫొటో క్యాప్షన్, బంధువుల కోసం ఎదురు చూస్తున్న వారిలో 65 ఏళ్ల సుశీల ఒకరు. ఆమె తన కుమారుడు జ్ఞానశీలన్ రవి కోసం పోరాడుతున్నారు.

గత దర్యాప్తు ఎందుకు ముందుకు సాగలేదు

చెమ్మణి సామూహిక అవశేషాలు వెలుగు చూసిన తర్వాత అంతర్యుద్ధ సమయంలో అదృశ్యమైన వారి కుటుంబాలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. న్యాయం చేయాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాయి.

బంధువుల కోసం ఎదురు చూస్తున్న వారిలో 65 ఏళ్ల సుశీల ఒకరు. ఆమె తన కొడుకు జ్ఞానశీలన్ రవి కోసం పోరాడుతున్నారు. 2007లో రవిని సైన్యం తీసుకెళ్లింది. అప్పటికి ఆయన వయసు 24 ఏళ్లు.

‘‘రవి నా ఒక్కగానొక్క కుమారుడు. వాడిని గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నాను. వాడు లేకపోతే నాకు జీవితమే శూన్యం’’ అని ఆమె బీబీసీతో చెప్పుకున్నారు.

కుమారుడికి చెందిన దుస్తులు, ఆభరణాలు ఏమైనా లభిస్తాయేమోనని సుశీల చెమ్మణి వెళ్లారు. కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. మరోవైపు లభించిన అవశేషాలకు డీఎన్ఏ పరీక్షలు ప్రారంభంకాలేదు.

చెమ్మణి ప్రాంతంలో వెలికి తీసిన మానవ అవశేషాలను కోర్టు ఆదేశాల మేరకు జాఫ్నా యూనివర్శిటీ క్యాంపస్‌లో భద్రపరిచారు.

'దీనిపై మధ్యంతర నివేదికను సిద్ధం చేస్తున్నాం. సెప్టెంబర్ చివరి నాటికి కోర్టుకు సమర్పిస్తాం' అని బీబీసీతో పురావస్తు శాస్త్రవేత్త ప్రొఫెసర్ రాజ్ సోమదేవ చెప్పారు. ఆయన ఈ తవ్వకాలకు నాయకత్వం వహిస్తున్నారు.

దశాబ్ద కాలంలో శ్రీలంకలో దాదాపు 20కిపైగా సామూహిక సమాధులు బయటపడ్డాయి. అయితే ఇందులో ఒక్కటి కూడా అంతర్యుద్ధ కాలంలో జరిగిన హత్యలకు సంబంధించినదిగా తేలలేదు. ఒక్కదాని మీద కూడా న్యాయ విచారణ జరగలేదు.

ఇప్పటి వరకు బయటపడిన కేసుల దర్యాప్తు సరిగా సాగకపోవడం, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుత విచారణపై తమిళ ప్రజలకు అనుమానాలు నెలకొన్నాయి. 2018నాటి ఘటనను వారు గుర్తు చేస్తున్నారు. అప్పటి తవ్వకాల్లో 350కిపైగా అస్థి పంజరాలు గుర్తించారు. ఆ దర్యాప్తు కూడా ముందుకు సాగకపోవడంతో చాలా కుటుంబాలు నిరాశకు గురయ్యాయి.

అందుకే దీన్ని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు అప్పగించాలని బాధితులంతా కోరుతున్నారు.

అయితే, దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తున్నామని అనుర కుమార దిశానాయకే నాయకత్వంలోని శ్రీలంక ప్రభుత్వం చెబుతోంది.

రెండు వర్గాల మధ్య సయోధ్య కోసం పని చేస్తానని 2024 సెప్టెంబరులో అధ్యక్ష పదవిని చేపట్టిన అనుర కుమార దిశానాయకే ప్రకటించారు. కానీ అంతర్యుద్ధ కాలంలో జరిగినట్టు ఆరోపణలు ఉన్న యుద్ధ నేరాలపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరపాలన్న డిమాండ్లను ఆయన ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది తమిళ వర్గాలను నిరాశకు గురి చేస్తోంది.

గత జూన్‌లో చెమ్మణిలో పర్యటించిన శ్రీలంక న్యాయశాఖ మంత్రి హర్షన నానాయక్కర, ఈ విషయంలో నిజానిజాలు వెలుగులోకి తీసుకొచ్చే వరకు దర్యాప్తు సాగుతుందని హామీ ఇచ్చారు. ‘‘మేం చెమ్మణి వద్ద తవ్వకాలు కొనసాగిస్తున్నాం, వారంతా ఎలా చనిపోయారనే విషయాన్ని తెలుసుకునేందుకు దొరికిన అస్థిపంజరాలను విశ్లేషిస్తున్నాం, ఇప్పుడు డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి ఉంది’’ అని బీబీసీకి చెప్పారు హర్షన నానాయక్కర.

సైన్యమే పౌరులను ఊచకోత కోసి ఇలా పూడ్చి పెట్టిందని వస్తున్న ఆరోపణలను ఆర్మీ ప్రతినిధి, బ్రిగేడియర్ వరుణ గమగే తోసిపుచ్చారు. ‘‘ఎలాంటి ఆరోపణలైనా కోర్టులో రుజువుకావాలి’’ అని ఆయన బీబీసీతో అన్నారు.

చెమ్మణి సామూహిక సమాధిపై నిరసన

ఫొటో సోర్స్, Kumanan Kanapathippillai, BBC

ఫొటో క్యాప్షన్, చెమ్మణి సామూహిక సమాధిపై అంతర్జాతీయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ, అదృశ్యమైన వారి కుటుంబాలు నిరసన తెలుపుతున్నాయి.

విదేశాల జోక్యం కోసం అభ్యర్థన

ఇప్పటి వరకు బయటపడిన అవశేషాలపై జరుగుతున్న దర్యాప్తులో ఆలస్యాన్ని హక్కుల సంఘాలు, బాధిత కుటుంబాలు విమర్శిస్తున్నాయి.

చాలా కాలంగా వస్తున్న ఒత్తిళ్లతో శ్రీలంక ప్రభుత్వం 2018లో ఆఫీస్ ఆఫ్ ది మిస్సింగ్ పర్సన్స్ (ఓఎంపీ) పేరుతో ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేసింది. దీనివల్ల కూడా పెద్దగా పురోగతి లేదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.

‘‘అంతర్యుద్ధంలో అదృశ్యమైన వారి కేసుల దర్యాప్తు చాలా వరకు ఆగిపోయింది. బాధితులు, మానవ హక్కుల సంఘాల నేతలు బెదిరింపులు ఎదుర్కొంటున్నారు’’ అని హ్యూమన్ రైట్స్ వాచ్ ఈ నెలలో విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది.

అందుకే అదృశ్యమైన వారిని గుర్తించి, వారు ఎలా మరణించారో తెలుసుకునేందుకు అంతర్జాతీయ సహాయం కోరాలని శ్రీలంకకు ఐక్యరాజ్యసమితి సూచించింది.

‘‘దశాబ్దాలుగా బాధితులు నిరాశ, బాధతో జీవిస్తున్నారు. దర్యాప్తులపై నమ్మకం కోల్పోయారు. అందుకే విచారణలపై విశ్వాసం పెంచడానికి అంతర్జాతీయ సహాయం కోరడం మంచిది’’ అని బీబీసీతో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఆసియా-పసిఫిక్ విభాగం చీఫ్ రోరీ ముంగోవెన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)