చనుబాలు: పుట్టగానే ఎంతమందికి అందుతున్నాయి? వాటి మీద అపోహలేంటి, నిజమేంటి?

తల్లిపాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

"ఏటా ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లల ప్రాణాలను కేవలం తల్లిపాలు ఇవ్వడం ద్వారా కాపాడగలం’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేస్తోంది.

అయినా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇద్దరు శిశువుల్లో ఒకరికి కూడా తొలి 6 నెలలు పూర్తిగా తల్లిపాలు అందడం లేదు.

భారత్‌లో ప్రతి సంవత్సరం సుమారు 2.3 కోట్ల మంది శిశువులు జన్మిస్తున్నారు.

కానీ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (NFHS-5) ప్రకారం మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు అందుతున్న శిశువులు సుమారు 64% మాత్రమే.

జననం తర్వాత మొదటి గంటలోనే తల్లిపాలు ప్రారంభించే శాతం ఇంకా ఆశించిన స్థాయికి చేరలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తల్లిపాలు

ఫొటో సోర్స్, Getty Images

"తొలి ఆహారం, తొలి టీకా, తొలి రోగ నిరోధక శక్తి"

పుట్టగానే ఏ బిడ్డకైనా తొలి ఆహారం, తొలి టీకా, తొలి రోగనిరోధక శక్తి తల్లి పాలే. ఈ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత బలంగా చాటిచెప్పేందుకు ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవం (World Breastfeeding Week) నిర్వహిస్తారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యునిసెఫ్ (UNICEF), వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్‌ ఫీడింగ్ యాక్షన్ (డబ్ల్యూఏబీఏ) ఆధ్వర్యంలో దీన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.

తల్లిపాల ప్రాముఖ్యంపై అవగాహన పెంచడం, ప్రతి శిశువుకు జీవిత ప్రారంభంలో ఉత్తమ పోషకాహారం అందించడం, బిడ్డలకు పాలు ఇచ్చే తల్లుల శాతాన్ని పెంచడం, ఉద్యోగినులైన తల్లులకు ఆఫీసుల్లో అనుకూలమైన వాతావరణం కల్పించడం, శిశు మరణాలను తగ్గించడం, భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం ఈ వారోత్సవం ప్రధాన లక్ష్యాలు.

తల్లిపాలు

ఫొటో సోర్స్, Getty Images

ఏటా ప్రత్యేక థీమ్

తల్లి పాల వారోత్సవాన్ని ప్రతి ఏటా ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తుంటారు. అలాగే ఈ ఏడాది కూడా దీనికో థీమ్ ఉంది.

‘‘తల్లిపాలకు ప్రాముఖ్యం - తల్లులకు నిరంతర సహకారం’’

ఈ థీమ్ ముఖ్య ఉద్దేశం తల్లిపాలను విజయవంతంగా అందించడానికి కుటుంబ సభ్యులు, ఆరోగ్య కార్యకర్తలు, సంస్థలు, ప్రభుత్వాలు, సమాజం కలిసి తల్లులకు నిరంతర సహకారం అందించాలనే సందేశాన్ని ఇవ్వడం.

తల్లిపాలే ఎందుకు ఉత్తమ ఆహారం?

శిశువు జన్మించిన వెంటనే వచ్చే పసుపు రంగు పాలను కొలోస్ట్రం (Colostrum) అని పిలుస్తారు. ఇవి సహజసిద్ధమైన తొలి టీకాలాంటివి. ఇందులో ఇమ్యూనోగ్లోబులిన్-ఏ, లాక్టోఫెరిన్, ల్యూకోసైట్లు, గ్రోత్ ఫ్యాక్టర్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శిశువును అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.

తొలి ఆరు నెలల వరకు సాధారణంగా తల్లిపాలు మాత్రమే పిల్లలకు సరిపోతాయి. నీరు కూడా అవసరం ఉండదు.

ఆరు నెలల తరువాత పరిపూరక ఆహారం ప్రారంభించినా, రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం తల్లిపాలు కొనసాగించడం మంచిది.

తల్లిపాలతో ప్రయోజనాలివీ...

  • సంపూర్ణ పోషకాహారం
  • సులభంగా జీర్ణమవుతాయి
  • డయేరియా, న్యుమోనియా, చెవి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి
  • సెప్సిస్ ప్రమాదం తగ్గుతుంది
  • ఎన్ఈసీ వంటి ప్రాణాంతక వ్యాధి ప్రమాదం (ముఖ్యంగా నెలలు నిండకుండా పుట్టిన బిడ్డల్లో ) తగ్గుతుంది
  • మెదడు అభివృద్ధి మెరుగుపడుతుంది
  • ఐక్యూ పెరగడంలో సహాయపడుతుంది
  • ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది
  • అలర్జీలు, ఆస్థమా వచ్చే అవకాశాలు తగ్గుతాయి
  • ఆకస్మిక శిశు మరణం (Sudden Infant Death Syndrome – SIDS) ప్రమాదం తగ్గుతుంది
  • దవడ, దంతాల అభివృద్ధి మెరుగుపడుతుంది
  • తల్లి-బిడ్డ అనుబంధం బలపడుతుంది
తల్లిపాటు

ఫొటో సోర్స్, Getty Images

నెలలు నిండని బిడ్డలకు అమ్మపాలే ఔషధం

నెలలు నిండకుండా జన్మించిన పిల్లలకు తల్లిపాలు ఔషధంలాంటివి. తల్లిపాలతో వీరిలో పేగులకు సంబంధించిన తీవ్ర సమస్య అయిన NEC ప్రమాదం తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

ఆసుపత్రిలో గడిపే రోజులు తగ్గుతాయి. బరువు మెరుగ్గా పెరుగుతుంది. మెదడు అభివృద్ధి మెరుగుపడుతుంది. కంటి, ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి.

పాలివ్వడం వల్ల తల్లులకీ ఎన్నో ప్రయోజనాలున్నాయి.

  • గర్భాశయం త్వరగా మామూలు పరిమాణానికి వస్తుంది
  • ప్రసవానంతర రక్తస్రావం తగ్గుతుంది
  • బరువు తగ్గడంలో సహాయపడుతుంది
  • రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది
  • అండాశయ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది
  • టైప్-2 మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుంది
  • గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది
  • ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది
  • ప్రసవానంతర డిప్రెషన్ తగ్గే అవకాశం ఉంది
  • కుటుంబ నియంత్రణలో సహాయకారిగా పనిచేస్తుంది (LAM పద్ధతి)

కుటుంబానికి, సమాజానికి కలిగే ప్రయోజనాలు

శిశువుకు సరిపడా పాలు తల్లి ద్వారా లభిస్తే ఆ కుటుంబానికి కూడా ప్రయోజనమే. ఎందుకంటే ఫార్ములా పాలు కొనాల్సిన అవసరం తగ్గుతుంది, వైద్య ఖర్చులు తగ్గుతాయి, శిశువులకు అనారోగ్యంతో ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. వీటన్నింటితో కుటుంబంపై ఆర్థిక భారం తగ్గుతుంది.

అలాగే, శిశు మరణాలు తగ్గుతాయి. ఆరోగ్యవంతమైన జనాభా పెరుగుతుంది. ఆరోగ్య రంగంపై భారం తగ్గుతుంది. ప్లాస్టిక్ బాటిళ్లు, టిన్నులు తగ్గడంతో పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఈ విధంగా సమాజానికి కూడా ప్రయోజనం కలుగుతుంది.

తల్లిపాలు

ఫొటో సోర్స్, Getty Images

తల్లిపాలు: అపోహలు – నిజాలు

తల్లిపాలలో 200కు పైగా బయోయాక్టివ్ పదార్థాలు ఉంటాయి. తల్లి అనారోగ్యానికి గురైనప్పుడు కూడా చాలా సందర్భాల్లో తల్లిపాలలో యాంటీ బాడీస్ పెరిగి బిడ్డకు రక్షణ అందిస్తాయి.

ప్రతి ఫీడ్‌లో పాల కూర్పు మారుతూ ఉంటుంది.

తల్లిపాలలో మెలటోనిన్ ఎక్కువగా ఉండటం వల్ల రాత్రివేళల్లో శిశువుకు మంచి నిద్రకు తోడ్పడుతుంది.

అపోహ: మొదట్లో వచ్చే పసుపు పాలు ఇవ్వకూడదు.

నిజం: అవే అత్యంత విలువైన పాలు. చాలా పోషకాలు, ఇమ్యూనో గ్లోబులిన్లతో నిండి ఉండి రోగ నిరోధక శక్తి పెంపొందిస్తాయి.

అపోహ: సిజేరియన్ అయితే రెండు రోజుల వరకు పాలు ఇవ్వకూడదు.

నిజం: సిజేరియన్ తర్వాత కూడా వీలైనంత త్వరగా తల్లిపాలు ప్రారంభించడం ఉత్తమం.

అపోహ: చిన్న రొమ్ములు ఉంటే పాలు తక్కువ వస్తాయి.

నిజం: రొమ్ము పరిమాణానికి పాల ఉత్పత్తికి సంబంధం లేదు.

అపోహ: మొదటి ఆరు నెలల్లో పిల్లలకు నీరు తప్పనిసరిగా ఇవ్వాలి.

నిజం: మొదటి ఆరు నెలలు తల్లిపాలే సరిపోతాయి.

అపోహ: తల్లికి జలుబు చేస్తే పాలు ఇవ్వకూడదు.

నిజం: ఎక్కువ సందర్భాల్లో తల్లిపాలు కొనసాగించాలి.

అపోహ: పాలు పలుచగా ఉంటే పోషకాలు ఉండవు.

నిజం: తల్లిపాలలోని ప్రతి చుక్కా శిశువు అవసరాలకు అనుగుణంగా తయారవుతుంది.

పుట్టిన గంటలోనే శిశువుకు పాలివ్వాలి

పుట్టిన గంటలోనే శిశువుకు తల్లిపాలు ప్రారంభించాలి.

బిడ్డ కోరినప్పుడల్లా పాలు ఇవ్వాలి.

శిశువుకు సరైన ల్యాచ్ (రొమ్మును పట్టుకోవడం) నేర్పించాలి.

రాత్రిపూట కూడా పాలు ఇవ్వాలి.

బాటిళ్లు, పాసిఫైయర్లు ప్రారంభ నెలల్లో వీలైనంత వరకు నివారించాలి.

తల్లి సమతుల్య ఆహారం తీసుకోవాలి, తగినంత నీరు తాగాలి.

కుటుంబ సభ్యులు తల్లికి విశ్రాంతి కల్పించాలి.

ఉద్యోగినులైన తల్లులు ప్రసూతి సెలవులను పూర్తిగా వినియోగించుకోవాలి.

కార్యాలయాల్లో పాలిచ్చే గదులు ఏర్పాటు చేయాలి.

పాలను శుభ్రంగా సేకరించి నిల్వ చేసే పద్ధతులను తెలుసుకుని, నేర్చుకోవాలి.

తల్లిపాటు

ఫొటో సోర్స్, Getty Images

అమ్మ పాలు ప్రతీ శిశువు హక్కు

భారత ప్రభుత్వం 'మా' (MAA - Mother's Absolute Affection) కార్యక్రమం ద్వారా తల్లిపాలపై అవగాహన పెంచుతోంది. ఆసుపత్రుల్లో బేబీ-ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (BFHI) ద్వారా పుట్టిన వెంటనే తల్లిపాలను ప్రారంభించేలా ప్రోత్సహిస్తోంది.

తల్లిపాలు కేవలం ఆహారం కాదు. అది ప్రేమ, రక్షణ, ఆరోగ్యం, భవిష్యత్తు. ఒక బిడ్డ ఆరోగ్యానికి పుట్టిన వెంటనే పెట్టే అత్యంత విలువైన పెట్టుబడి తల్లిపాలే.

ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా ప్రతి కుటుంబం, ఆసుపత్రి, కార్యాలయం, సమాజం తల్లులకు అండగా నిలిస్తే ఆరోగ్యవంతమైన తరం అభివృద్ధి చెందుతుంది.

ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా పాలిచ్చే ప్రతి తల్లీ ఓ మాట గుర్తుంచుకోవాలి - 'మీ పాలే మీ బిడ్డకు అమూల్యమైన బహుమతి'.

తల్లిపాలు – ప్రతి శిశువు హక్కు, ప్రతి తల్లి గర్వం, ప్రతి సమాజం బాధ్యత.

(గమనిక: రచయిత ఓ డాక్టర్. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)