West Indies vs India: 406 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా సాధించిన భారత్, గిల్ డబుల్ సెంచరీ, రోహిత్ సెంచరీ.. ముగ్గురు వెస్టిండీస్ బ్యాటర్ల సెంచరీలు వృథా

శుభ్‌మన్ గిల్
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

భారత కెప్టెన్ శుభ్‌మన్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో రెండో వన్డేలో వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం సాధించింది.

రోహిత్ శర్మ (101) సైతం శతకం బాదాడు. దీంతో 406 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది.

గువాహటి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి 405 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

వన్డేల్లో వెస్టిండీస్‌కి ఇదే అత్యుత్తమ స్కోరు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

టీమ్ ఇండియా అదిరిపోయే ఆరంభం..

406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి భారత్‌కి శుభ్‌మన్ గిల్ (223: 133 బంతుల్లో 26 ఫోర్లు, 8 సిక్సర్లు), రోహిత్ శర్మ (101 పరుగులు; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీలతో శుభారంభాన్ని అందించారు.

సెంచరీ చేసిన కాసేపటికే 27వ ఓవర్‌లో జేడెన్ సీల్స్ బౌలింగ్‌లో రోహిత్ ఎల్బీగా వెనుదిరిగాడు. రోహిత్-గిల్ కలిసి భారత్‌కి 255 పరుగుల భారీ ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 29 పరుగులు చేసి వెనుతిరిగాడు. రుతురాజ్ గైక్వాడ్ 31 పరుగులు చేశాడు.

వెస్టిండీస్,జాన్ క్యాంప్‌బెల్
ఫొటో క్యాప్షన్, ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ 68 బంతుల్లో 101 పరుగులు చేశాడు.

వెస్టిండీస్ భారీ స్కోర్.. ముగ్గురు సెంచరీలు

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి 406 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. వన్డేల్లో వెస్టిండీస్‌కి ఇదే అత్యుత్తమ స్కోరు.

జాన్ క్యాంప్‌బెల్ 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేయగా, షాయ్ హోప్ 8 ఫోర్లు 3 సిక్సర్లతో104 పరుగులు, అమీర్ జంగూ 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు చేసి సెంచరీలతో రాణించారు.

భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, గుర్నూర్ బ్రార్ తలో 2 వికెట్లు తీశారు. ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ పడగొట్టాడు.

రోహిత్ శర్మ

వన్డేల్లో రోహిత్ 12 వేల పరుగులు

ఈ మ్యాచ్‌తో రోహిత్ శర్మ వన్డేల్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

భారత్ తరఫున ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్ అతను. రోహిత్ కంటే ముందు సచిన్, విరాట్ కోహ్లీ ఉన్నారు.

విండీస్.. వన్డేల్లో అత్యధిక స్కోరు

భారత్‌పై 405 పరుగులు చేసిన వెస్టిండీస్‌కి వన్డేల్లో ఇదే అత్యుత్తమ స్కోరు. అంతకుముందు ఇంగ్లాండ్‌పై ఆ జట్టు 389 పరుగులు సాధించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)