మారువేషంలో శిక్షణ... ఆసియా కప్‌లో పతకం.. ఎవరీ అమ్మాయి?

ఫరీబా హషిమి
ఫొటో క్యాప్షన్, హషిమి (మధ్యలో) 2021లో అఫ్గానిస్తాన్ నుంచి పారిపోయారు.
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

జపాన్‌లో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో అఫ్గానిస్తాన్‌కు చెందిన ఒక మహిళా సైక్లిస్ట్ రజత పతకం గెలుచుకున్నారు. ఒకనాడు ఆమె తన కెరీర్ కొనసాగించడానికి అబ్బాయిలా మారువేషంలో శిక్షణ తీసుకోవాల్సి వచ్చింది.

తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో ఫరీబా హష్మీ తన దేశాన్ని విడిచిపెట్టారు.

అఫ్గానిస్తాన్‌లో మహిళలు కఠినమైన ఆంక్షలు ఎదుర్కొంటున్నందున ఆ దాడుల నుంచి తప్పించేందుకు తనను పురుషుడి వేషంలో శిక్షణ పొందాలని బలవంతం చేశారని ఆమె చెప్పారు.

మంగళవారం జపాన్‌లోని నగోయా సమీపంలో జరిగిన రేసులో హషిమి రజత పతకాన్ని గెలుచుకున్నారు.

23 ఏళ్ల హషిమి ఆదివారం జరిగిన వుమెన్స్ ఇండివిడ్యువల్ టైమ్ ట్రయల్‌లో ఏడో స్థానంలో నిలిచారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తాను సాధించిన రజత పతకం ''ఎంతో ప్రత్యేకమైనది'' అని ఆమె వర్ణించారు. తన ఈ విజయం అఫ్గానిస్తాన్‌లో ఇతర మహిళలు వారి కలలను సాకారం చేసుకునేందుకు స్ఫూర్తినిస్తుందని ఆమె ఆశిస్తున్నారు.

"కలలు కనే మహిళలపై దాడులు జరిగే దేశంలో నేను పుట్టాను. దానికి వ్యతిరేకంగా పోరాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అని ఆమె అన్నారు.

"తర్వాత తరం వారు ఎలాంటి భయం లేకుండా ఇక్కడికి వచ్చి మా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని నేను ఆశిస్తున్నాను" అని ఆమె చెప్పారు.

హషిమి తనకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే సైక్లింగ్ ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయి సైక్లిస్ట్ అయిన తన సోదరి యుల్దుజ్ అడుగు జాడలను ఆమె అనుసరించారు.

అయితే, ఆమె సొంత ప్రావిన్స్ అయిన ఫర్యాబ్‌లో సైక్లింగ్ చేయడం ప్రమాదకరంగా ఉండేది.

''నేను పురుషుడి వేషధారణలో శిక్షణ తీసుకునే దాన్ని. ప్రజలు నన్ను గుర్తు పట్టి దాడి చేయకుండా ఉండేందుకు రెండు మూడు వేర్వేరు మాస్క్‌లు ధరించేదాన్ని'' అని హషిమి గతంలో రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

తాను సైక్లింగ్ చేస్తున్నప్పుడు ప్రజలు రాళ్లు విసురుతారేమోనని భయపడ్డట్లు ఆమె చెప్పారు.

మాజీ ఇటాలియన్ వరల్డ్ చాంపియన్ అలెస్సాండ్రా కాపెల్లోట్టో సాయంతో హషిమి ఇప్పుడు ఇటలీలో ఉంటూ అక్కడే శిక్షణ పొందుతున్నారు.

అఫ్గానిస్తాన్‌లో తన జీవితాన్ని గుర్తుకు తెచ్చుకున్న హషిమి.. తాలిబాన్లు '' మా స్వేచ్ఛను హరించారు'' అని అన్నారు.

''ఈ రజత పతకం అఫ్గాన్ మహిళల ధైర్యాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను'' అని చెప్పారు.

''నేనొక్కదాన్నే కాదు. అనేక దేశాలకు చెందిన లక్షలాది మంది మహిళలు నాకు అండగా ఉన్నారని తెలుసు. వారికి కూడా అదే కల ఉంది. వారు నావెన్నంటే నిలిచారు'' అని తెలిపారు.

హషిమి, ఆమె సోదరి 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పోటీ చేశారు. నేడు వారు, 2028 లాస్ ఏంజలెస్‌ ఒలింపిక్స్‌పై దృష్టిపెట్టారు.

''నేను ఎప్పటికీ వెనుకడుగు వేయను'' అని హషిమి అన్నారు. ''లాస్ ఏంజలెస్‌లో ఏది సాధ్యమో మళ్లీ మనం చూడగలమని ఆశిస్తున్నా'' అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)