ఒప్పందం లేకుండానే ముగిసిన కాప్-31 వాతావరణ సదస్సు.. కారణాలేంటి?

ఫొటో సోర్స్, Sean Gallup/Getty Images
తుర్కియేలో జరిగిన కాప్-31 (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్) వాతావరణ సదస్సు ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. ఆదివారం యూరోపియన్ యూనియన్ (ఈయూ), ఇతర దేశాలు తుది ముసాయిదాను అంగీకరించేందుకు నిరాకరించాయి.
దీంతో అంతాల్యాలో దాదాపు 200 దేశాల ప్రతినిధుల మధ్య రెండు వారాల పాటు సాగిన చర్చలకు తెరపడింది. షెడ్యూల్ ప్రకారం ఈ చర్చలు శుక్రవారమే ముగియాల్సి ఉంది. అయితే, అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు ఆదివారం వరకు చర్చలు కొనసాగాయి. ఈ క్రమంలో అత్యంత సుదీర్ఘంగా సాగిన కాప్ సదస్సుగా ఇది నిలిచింది.
వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు పేద దేశాలకు సంపన్న దేశాల నుంచి అందించే ఆర్థిక సాయం గురించి స్పష్టమైన హామీ లేకపోవడంపై పలు పేద దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సదస్సు ఫలితాలపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.
మరోవైపు, చమురు ఉత్పత్తి చేసే కొన్ని దేశాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా చర్చలను మలుచుకున్నాయని యూరోపియన్ యూనియన్ ప్రతినిధి ఆరోపించారు. నాలుగో ముసాయిదాలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశలవారీగా నిలిపివేయాల్సిన అవసరం గురించి ప్రస్తావించలేదు. వాతావరణ మార్పులకు ప్రధాన కారణం ఈ ఇంధనాల వినియోగమే.

చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన, ఉద్రిక్తమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య ఈ సదస్సు జరిగిందని కాప్-31 సహాధ్యక్షుడు, ఆస్ట్రేలియా మంత్రి క్రిస్ బోవెన్ అన్నారు.
గతంలో 2009లో డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో జరిగిన కాప్ సదస్సు కూడా విఫలమైంది.
అప్పట్లో కుదిరిన ఒప్పందంలోని 11 అంశాల్లో ఏ ఒక్కటీ దేశాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన నిబంధనగా లేదు.

ఫొటో సోర్స్, Abdullah Guclu/Anadolu via Getty Images
కాప్-31 ఒప్పందం ఎందుకు కుదరలేదు?
యూరోపియన్ యూనియన్ తరఫున మాట్లాడిన ఐర్లాండ్ మంత్రి డారాగ్ ఓ'బ్రియన్.. ఈ ఒప్పందాన్ని అధికారికంగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.
ముసాయిదాను ఆలస్యంగా విడుదల చేయడంపై ఆయన విమర్శలు చేశారు. శిలాజ ఇంధనాల ప్రస్తావన కూడా లేని ముసాయిదాను ఈయూ అంగీకరించలేదని స్పష్టం చేశారు. అలాంటి ఒప్పందాన్ని గ్రీన్వాషింగ్గా అభివర్ణించారు.
"మా పౌరుల తరఫున ఈ విషయం చెబుతున్నాం. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అవసరమైన స్థాయి ఆశయాలకు ఈ నిర్ణయాలు కనీసం దగ్గరగా కూడా లేవు. వాతావరణ ఒప్పందంలో శిలాజ ఇంధనాల ప్రస్తావనే లేకపోవడం ఆమోదయోగ్యం కాదు" అని ఆయన అన్నారు.
కొన్ని చమురు ఉత్పత్తి దేశాలు చర్చలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయని డారాగ్ ఓ'బ్రియన్ ఆరోపించారు.
ఆదివారం కాప్-31 చర్చలు ప్రారంభమైన సమయంలోనే ఒప్పందానికి సంబంధించిన కొత్త ముసాయిదాను విడుదల చేశారు.
12 పేజీల ఈ నాలుగో ముసాయిదాలోనూ శిలాజ ఇంధనాల ప్రస్తావన ఎక్కడా లేదు. అయితే, ఈయూ దేశాలు మాత్రం వాటి గురించి స్పష్టమైన ప్రస్తావన ఉండాలని పట్టుబట్టాయి.
2035 నాటికి దేశాల మొత్తం ఇంధన వినియోగంలో విద్యుత్ వాటాను 35 శాతానికి పెంచుకోవాలని కొత్త ముసాయిదా సూచించింది.
కార్బన్ ఉద్గారాలు వాతావరణంలోకి చేరకుండా అడ్డుకోవడం, వాటిని వినియోగించడం, నిల్వ చేయడం వంటి సాంకేతిక పరిజ్ఞానాల అమలుకు సంబంధించి కూడా కొన్ని స్వల్ప మార్పులు చేశారు.
అయితే, ఈ సాంకేతిక పరిజ్ఞానంపై అతిగా ఆధారపడటం వల్ల చమురు ఉత్పత్తి దేశాలు ప్రస్తుత స్థాయిలోనే చమురు, గ్యాస్ వినియోగాన్ని కొనసాగించే అవకాశం ఉందని ఫ్రాన్స్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ సాంకేతికతలో భాగంగా కార్బన్ ఉద్గారాలను భూమి అడుగున నిల్వ చేస్తారు.
వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు, సీఈఓ అనీ దాస్‌గుప్తా సదస్సు ఫలితాలను 'డొల్ల'గా అభివర్ణించారు. ఇది రాజకీయ నాయకత్వ వైఫల్యమని విమర్శించారు.
"శాస్త్రీయ ఆధారాలు ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు.. వాతావరణ మార్పులకు ప్రధాన కారణమైన శిలాజ ఇంధనాల ప్రస్తావన చేయడానికి కూడా దేశాలు అంగీకరించకపోవడాన్ని సమర్థించలేం" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐరాస ప్రధాన కార్యదర్శి ఏమన్నారు?
ఎలాంటి సమగ్ర ఒప్పందం కుదరకుండానే కాప్-31 ముగియడంపై తీవ్ర నిరాశకు గురయ్యానని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు.
"అయితే, ఈ ఎదురుదెబ్బ వల్ల వాస్తవాలు మారవు. చర్చల వేదికపై ఏకాభిప్రాయం కుదరకపోయినా, శాస్త్రీయ పరిశోధనల ఫలితాల విషయంలో ఎలాంటి సందేహాలూ లేవు" అని చెప్పారు.
శక్తిమంతమైన శిలాజ ఇంధన కంపెనీలు, వాటి ప్రయోజనాల కోసం పనిచేసే బృందాలపై ఆయన విమర్శలు చేశారు.
"పెద్ద పొగాకు కంపెనీలు అనుసరించే పద్ధతులనే ఇవి అనుసరిస్తున్నాయి. శాస్త్రీయ వాస్తవాలను వక్రీకరిస్తున్నాయి. విధానపరమైన నిర్ణయాలను ఆలస్యం చేస్తున్నాయి. చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నాయి. భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి. కానీ వాటి ప్రభావానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది" అని గుటెరస్ తెలిపారు.
వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అవసరమైన క్లైమేట్ ఫండ్‌ను అందిస్తామని సంపన్న దేశాలు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన కోరారు. ఆ నిధులు అత్యవసరంగా అవసరమైన ప్రజలకు చేరేలా చూడాలని సూచించారు.
"ఈ హామీని నెరవేర్చేందుకు గడువును, ఎంత నిధులు అందించనున్నారనే వివరాలను ఇప్పుడే ఖరారు చేయాలి. ప్రజల జీవితాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి" అని గుటెరస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒప్పందంపై ప్రధాన దేశాలు ఏమన్నాయి?
ఈ ముసాయిదాను 'చాలా బలహీనమైన ఒప్పందం'గా బ్రిటన్ ప్రతినిధి కేట్ హ్యూస్ అభివర్ణించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దేశాలు కలిసి మరింత బలమైన, ప్రతిష్ఠాత్మకమైన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.
మధ్య అమెరికా దేశమైన పనామా కూడా ఈ ముసాయిదాను తిరస్కరించింది.
"శాస్త్రం చర్చలతో రాజీపడదు. భూమి ఇంకా వేచి ఉండలేదు" అని ఆ దేశ ప్రతినిధి అన్నారు.
భారత ప్రతినిధి బృందం ఈ ఒప్పందాన్ని అంగీకరించలేదు, తిరస్కరించలేదు. చర్చల్లో పాల్గొనడం కొనసాగిస్తామని తెలిపింది. మరోవైపు, కొన్ని ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ చైనా ఒప్పందాన్ని అంగీకరించింది.
శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశలవారీగా నిలిపివేయాలనే హామీని ఒప్పందంలో చేర్చడాన్ని రష్యా వ్యతిరేకించింది. తన ప్రసంగంలో యూరోపియన్ యూనియన్‌పై నేరుగా విమర్శలు చేసింది.
ఇక సౌదీ అరేబియా 22 సభ్య దేశాలున్న అరబ్ లీగ్ తరఫున మాట్లాడింది. చర్చల నుంచి పలు అంశాలను పక్కన పెట్టినప్పటికీ అరబ్ దేశాలు చిత్తశుద్ధితో చర్చలను కొనసాగించాయని సౌదీ ప్రతినిధి మొహమ్మద్ అయూబ్ అన్నారు.
ముసాయిదాలో వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రయత్నాలను, క్షేత్రస్థాయిలో వాటి అమలును ముందుకు తీసుకెళ్లగల పలు పరిష్కారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
2015 పారిస్ ఒప్పందం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఐక్యరాజ్యసమితి మాజీ వాతావరణ విభాగం అధిపతి క్రిస్టియానా ఫిగ్యురెస్.. ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదరకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు.
అయితే, ఎలాంటి నిర్దిష్ట నిర్ణయం తీసుకోలేకపోవడాన్ని ప్రజలు వైఫల్యంగా భావించకూడదని ఆమె సూచించారు.
శిలాజ ఇంధనాలు అంటే ఏమిటి?
లక్షల సంవత్సరాల క్రితం చనిపోయిన జీవుల అవశేషాల నుంచి శిలాజ ఇంధనాలు ఏర్పడ్డాయి. ఇవి సహజ వనరులే అయినప్పటికీ, తిరిగి ఉత్పత్తి చేయలేనివి. అంటే ఒకసారి వినియోగిస్తే మళ్లీ వాటిని సహజంగా భర్తీ చేయడం సాధ్యం కాదు.
ప్రపంచంలో ఎక్కువ శాతం ఇంధన అవసరాలు చమురు, బొగ్గు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాల ద్వారానే తీరుతున్నాయి. కార్లు, విమానాలు నడపడం నుంచి ఇళ్లలో గ్యాస్‌తో వంట చేయడం, వేడి కోసం వినియోగించడం వరకు వీటిని ఉపయోగిస్తున్నారు.
అయితే, ఈ ఇంధనాలను మండించడం వల్ల కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదలవుతుంది. ఈ వాయువు భూమి ఉపరితలానికి సమీపంలోని వాతావరణంలో వేడిని బంధిస్తుంది. ఫలితంగా భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో వాతావరణ మార్పుల సమస్య మరింత తీవ్రమవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు ప్రధాన కారణం శిలాజ ఇంధనాల వినియోగమే.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































