మీరు తింటున్నది నిజమైన ఐస్‌క్రీమేనా?

ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్ డిజర్ట్
    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

'నేను ఐస్‌క్రీమ్ తినను, ఐస్‌క్రీమ్‌ను చదువుతాను. డబ్బా మీద రియల్ ఐస్‌క్రీమ్ అని రాసి ఉంటేనే తింటాను. వెజిటబుల్ ఆయిల్‌తో చేసింది నిజమైన ఐస్‌క్రీమ్ కాదు' అంటూ కొన్నేళ్ల క్రితం టీవీల్లో ఒక అడ్వర్టైజ్‌మెంట్ వచ్చింది.

అసలు ఐస్‌క్రీమ్ పేరుతో మనం తినేది ఐస్‌క్రీమేనా?

వెజిటబుల్ ఆయిల్‌ ఉండే పదార్థాలను ఐస్‌క్రీమ్ అని కాకుండా ఫ్రోజెన్ డిజర్ట్‌గా గుర్తించాలంటూ భారత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సంస్థ పేర్కొంది.

అసలు ఐస్‌క్రీమ్‌, ఫ్రోజెన్ డిజర్ట్‌ మధ్య తేడా ఏంటి? చల్లని తీపి పదార్థాలను ఇష్టపడే సగటు వ్యక్తికి ఈ రెండింటిలో పెద్ద తేడా ఏం కనిపించదు.

ఎందుకంటే ఈ రెండూ కూడా రుచిలో దాదాపు ఒకేలా తీపిగా ఉంటూ, చల్లచల్లగా నోట్లో కరిగిపోతాయి. మరి వీటి మధ్య తేడాను ఎలా గుర్తించాలి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇంకో విషయం, గత 30 ఏళ్లుగా ఫ్రోజెన్ ట్రీట్స్ ఇండస్ట్రీలో భారత్‌లో గుర్తింపు పొందిన 'క్వాలిటీ వాల్స్' సంస్థ ఈ మధ్యకాలంలో ఒక ప్రకటన చేసింది.

2027 నాటికి తమ పోర్ట్‌ఫోలియోను పూర్తిగా 100 శాతం పాల ఆధారిత ఐస్‌క్రీమ్‌ ఉత్పత్తులుగా మార్చేస్తామని ప్రకటించింది.

'ప్రపంచవ్యాప్తంగా క్వాలిటీ వాల్స్ ఇక ఫ్రోజెన్ డిజర్ట్ కంపెనీ కాదు. భారత్‌లో మాది ఒక ఐస్‌క్రీమ్ కంపెనీ. కంపెనీలో అంతా మారింది'' అని ది మాగ్నమ్ ఐస్‌క్రీమ్ కంపెనీ గ్లోబల్ సీఈవో పీటర్ వ్యాఖ్యానించారు. క్వాలిటీ వాల్స్ పేరెంట్ సంస్థ ది మాగ్నమ్ ఐస్‌క్రీమ్ కంపెనీ.

ఐస్‌క్రీమ్ అని దేనిని అనాలి?

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనల ప్రకారం ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్ డిజర్ట్ రెండూ వేర్వేరు కేటగిరీలకు చెందినవి. దీనిప్రకారం, ఐస్‌క్రీమ్ తప్పనిసరిగా డెయిరీ ఫ్యాట్‌తో తయారు చేయాలి. ఇందులో కనీసం 10 శాతం మిల్క్ ఫ్యాట్, 3.5 శాతం ప్రోటీన్ తప్పనిసరిగా ఉండాలి.

పాలతో చేసే ఉత్పత్తులనే ఐస్‌క్రీమ్‌లుగా వర్గీకరించాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలు తెలుపుతున్నాయి.

FSSAI 2.1.14 రూల్ ప్రకారం... ఐస్‌క్రీమ్, కుల్ఫీ, చాక్లెట్ ఐస్‌క్రీమ్, సాఫ్టీ ఐస్‌క్రీమ్ వంటి ఉత్పత్తులను డైరీ బేస్డ్ డిజర్ట్స్ విభాగంలో చేర్చారు. పాలు లేదా పాల ఉత్పత్తుల నుంచి తయారుచేసిన పాశ్చరైజ్డ్ మిశ్రమాన్ని గడ్డకట్టించడం ద్వారా ఈ పదార్థాలను తయారు చేస్తారు. వీటిలో పోషక తీపి పదార్థాలు (nutritive sweeteners), అనుమతించిన ఇతర నాన్-డైరీ పదార్థాలు కలపవచ్చు లేదా కలపకపోవచ్చు. వీటిలోకి గాలిని చిలకరించవచ్చు. ఇవి గట్టిగా ఉండాలి. సాప్టీకి మినహాయింపు ఉంది. సాఫ్టీ మెత్తగా ఉంటుంది.

ఫ్రోజెన్ డిజర్ట్ అంటే..

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ రూల్స్ ప్రకారం, ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్ లేదా వాటి ఫ్యాట్స్‌తో తయారయ్యే పదార్థాలను ఫ్రోజెన్ డిజర్ట్స్ అంటారు. వీటిలో వెజిటబుల్ ప్రోటీన్లను కూడా వాడొచ్చు. ఈ ఉత్పత్తుల్లో పోషక తీపి పదార్థాలతో పాటు ఇతర నాన్ డైరీ పదార్థాలు కలుపుతారు. ఇందులోనూ మిల్క్, మిల్క్ సాలిడ్స్ వాడొచ్చు.

అయితే, ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్ డిజర్ట్స్ మధ్య ప్రధాన తేడా వాటిలో వాడే కొవ్వు మూలం. ఐస్‌క్రీమ్‌లో పాల కొవ్వు ఉండగా, ఫ్రోజెన్ డిజర్ట్స్‌లో వెజిటబుల్ ఆయిల్ కొవ్వు వాడతారు.

ఫ్రోజెన్ డిజర్ట్స్‌లో పాల కొవ్వును వాడరు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా పామాయిల్, వనస్పతి వంటి ఇతర నూనెలను కలుపుతారని ఇవి ఆరోగ్యానికి హానికరమని వైజాగ్‌కు చెందిన క్లినికల్, మెడికల్ కన్సల్టెంట్, డైటీషియన్ నీతి దిలీప్ బీబీసీకి చెప్పారు.

'పామాయిల్ అనే కాదు.. గది ఉష్ణోగ్రత వద్ద గడ్డకట్టే ఏ కొవ్వు పదార్థమైనా ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఒకప్పుడు 45 లేదా 50 ఏళ్లు వస్తే నడివయసుగా భావించేవారు. కానీ ఇప్పుడది 35 ఏళ్లకు పడిపోయింది. ఒక వ్యక్తి 35 ఏళ్లు వచ్చేసరికే రకరకాల ఆరోగ్య సమస్యల బారిన పడతున్నారు. గుండెపోటు, కార్డియక్ అరెస్ట్, పక్షవాతం వంటివి చాలా సాధారణమైపోయాయి. దీనికి ప్రధాన కారణం.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోవడం. అధిక చక్కెరతో పాటు అనారోగ్యకరమైన కొవ్వులు, ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల ఇది జరుగుతుంది. ప్రాసెస్ చేసిన నూనెలు, పామాయిల్, వనస్పతి, వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి' అని నీతి దిలీప్ వివరించారు.

ఇక చక్కెర పరంగా చూస్తే.. ఐస్‌క్రీమ్ అయినా ఫ్రోజెన్ డిజర్ట్ అయినా రెండూ ఆరోగ్యానికి హానికరమే అని ఆమె స్పష్టం చేశారు.

ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్ డిజర్ట్

లేబుల్‌పై తప్పనిసరిగా ప్రస్తావించాలా?

పాలతో చేసే ఉత్పత్తులనే 'ఐస్‌క్రీమ్' అని, వెజిటబుల్ ఆయిల్‌తో తయారయ్యే ఉత్పత్తులను 'ఫ్రోజెన్ డిజర్ట్' అని స్పష్టంగా లేబుల్‌పై రాయాలని FSSAI నిబంధనలు స్పష్టం చేశాయి. అలాగే ఫ్రోజెన్ డిజర్ట్ ప్యాకెట్‌పై "Made with Edible Vegetable Oil/Fat" అని ప్రింట్ చేయడం తప్పనిసరి.

FSSAI చట్టం ప్రకారం పాల కొవ్వు కాకుండా ఇతర నూనెలను ఉపయోగించే ఏ ఉత్పత్తిపైనా "Ice Cream" అని రాయడం చట్టరీత్యా నేరం.

కుల్ఫీని ఐస్‌క్రీమ్ అనొచ్చా? లేక ఫ్రోజెన్ డెజర్టా?

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS), ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనల ప్రకారం.. కుల్ఫీ కూడా ఐస్‌క్రీమ్ కేటగిరీ కిందకే వస్తుంది. అయితే, సాధారణ ఐస్‌క్రీమ్‌లో గాలిని చిలుకుతారు (Churning). కానీ కుల్ఫీలో చిక్కటి పాలను నేరుగా మౌల్డ్స్‌లో పోసి గాలి చేరకుండా గడ్డకట్టిస్తారు.

ఏ పదార్థాలు ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి?

ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు, ప్యాకింగ్ వెనుక ఉన్న పదార్థాల జాబితా చూడాలి.

ఆ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉండే పదార్థాలే ఆ ఉత్పత్తిలో అత్యధిక పరిమాణంలో ఉంటాయి. చివరగా పేర్కొన్నవి అతి తక్కువ పరిమాణంలో ఉంటాయని హైదరాబాద్‌కు చెందిన న్యూట్రీషియన్ అంజలి బీబీసీతో చెప్పారు.

'తినే పదార్థాల్లో మిల్క్ సాలిడ్స్ లేదా కృత్తిమ రంగులు ఉంటే అవి ఆరోగ్యానికి చేటు చేయవచ్చు. మిల్క్ సాలిడ్స్‌లో ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ ఉండే అవకాశం ఉంది. ఇది రక్తనాళాలను దెబ్బతీసి గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది. అందుకే తరచుగా ఇలాంటివి తినకూడదు. కృత్రిమ చక్కెరలైన లిక్విడ్ గ్లూకోజ్, ఇన్వర్టెడ్ షుగర్ సిరప్‌తో పాటు వెజిటబుల్ సోయా ప్రొటీన్, స్టెబిలైజర్లు, ఎమల్సిఫైయర్లు ఉన్న ఆహారపదార్థాలు ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు. వీటికి వీలైనంతవరకు దూరంగా ఉండాలి' అని ఆమె తెలిపారు.

ఐస్ క్రీమ్

చల్లని పదార్థాలు తినొచ్చా?

అసలు ఆయుర్వేదం ప్రకారం చల్లగా గడ్డకట్టిన ఏ పదార్థమైనా శరీరానికి మంచిది కాదని నీతి దిలీప్ తెలిపారు. ఆ విధంగా చూసుకున్నా చల్లచల్లటి ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్ డిజర్ట్‌లు రెండూ ఆరోగ్యానికి మంచివి కావని ఆమె చెప్పారు.

'కుల్ఫీ అయినా, పానీయాలు అయినా, ఆఖరికి పండ్లైనా సరే.. బాగా చల్లబరిచి లేదా గడ్డకట్టించి తింటే ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే మన శరీరం సహజమైన పద్ధతులకు అలవాటుపడేలా నిర్మితమైంది' అని నీతి దిలీప్ చెప్పారు.

పోషకాహార పరంగా చూస్తే కుల్ఫీ, ఫ్రోజెన్ డిజర్ట్‌, ఐస్‌క్రీమ్స్‌లో చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, లేదా స్థూలకాయం ఉన్నవారు వైద్యులు లేదా డైటీషియన్ల సలహా మేరకు సరైన వాటిని ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)