టమోటా తోటలపై స్ప్రే చేసిన పురుగు మందే 15 ఏనుగుల ప్రాణాలు తీసిందా?

- రచయిత, థామస్ ముఖ్వానా
- హోదా, ఆఫ్రికా కరస్పాండెంట్, అంబోసెలి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
అంబోసెలి నేషనల్ పార్క్ చుట్టుపక్కల ఉన్న టమోటా తోటలపై పిచికారీ చేసిన పురుగుమందుల వల్లే ఇటీవల 15 ఏనుగులు మరణించి ఉండవచ్చనే వార్త కెన్యాలో ఆందోళనలను, పలు అనుమానాలను రేకెత్తించింది.
జూన్ 24 నుంచి జులై 24 మధ్య నెల రోజుల వ్యవధిలో మరణించిన కొన్ని ఏనుగులలో పక్షవాతానికి లోనైన సంకేతాలను కనిపించాయని, ఇది పురుగుమందులలో ఉండే సైనైడ్ వల్ల జరిగిన విషప్రయోగాన్ని సూచిస్తోందని కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్ (కేడబ్ల్యూఎస్) తెలిపింది.
అయితే ఇది పూర్తిగా నిజం కాకపోవచ్చని కన్జర్వేషనిస్టులు బీబీసీతో చెప్పారు. ఈ ప్రాంతంలో మేం మాట్లాడిన రైతులు కూడా దీనిపై అనుమానం వ్యక్తం చేశారు.
"మేం దశాబ్దాలుగా ఈ వన్యప్రాణులతో కలిసి ఉంటున్నాం, ఎప్పుడూ ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కోలేదు" అని ఈ ప్రాంతంలోని కొంతమంది భూయజమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్న డేనియల్ నీనా బీబీసీతో చెప్పారు.
అంబోసెలి నేషనల్ పార్క్, దక్షిణ కెన్యాలోని త్సావో నేషనల్ పార్క్ మధ్య ఉన్న రవాణా మార్గంలో భాగమైన కిమానా ప్రాంతంలో ఈ టమోటా తోటలు ఉన్నాయి.

ఇది అంబోసెలి ఎకోసిస్టమ్‌గా పిలిచే ఒక విస్తారమైన ప్రాంతం. ఇది టాంజానియా సరిహద్దు వరకు విస్తరించి ఉంది. ఆహారం, నీటి కోసం 2,000 కి పైగా ఏనుగులు ఇక్కడ తిరుగుతుంటాయి.
సమీపంలో ఉన్న కిలిమంజారో పర్వతం నుండి వచ్చే నీటి ప్రవాహాల వల్ల ఇక్కడ పంటలు సమృద్ధిగా పండుతాయి. ఇక్కడి నుంచి కెన్యా రాజధాని నైరోబితో పాటు ఇతర మార్కెట్లకు పంట సరఫరా అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్ చీఫ్ వెట్ డాక్టర్ ఐజాక్ లెకోలూల్ మాట్లాడుతూ.. ఏనుగుల కడుపు నుంచి తీసిన నమూనాల్లో సైనేడ్ ఆనవాళ్ళు కనిపించాయని చెప్పారు.
ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన విషప్రయోగం కాదని చెప్పలేమని.. అయితే ఈ దశలో ఏనుగుల మరణానికి అసలు కారణం ఏమిటో చెప్పడం అసాధ్యమని ఆయన అన్నారు.
'ఇలాంటి కేసులను మేం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు కాబట్టి దీని గురించి ఇప్పుడే చెప్పడం కష్టం. ఇది దాదాపు ఒకేసారి జరిగిన సంఘటనలా ఉంది. ఒక నెల వ్యవధిలోనే జరిగింది' అని లెకోలూల్ చెప్పారు.
సమీపంలో ఉన్న టమోటా తోటలపై పిచికారీ చేసిన పురుగు మందుల కారణంగా ఏనుగులు ఈ విషపదార్థానికి గురై ఉండవచ్చనేది వారి ప్రాథమిక అంచనా.
'ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కూడా కాకపోవచ్చు. రైతులు తమ పంటలపై చీడపీడల నివారణకు పురుగు మందులు చల్లితే అది కారణమై ఉండొచ్చు' అన్నారు.
కెన్యా ఫుడ్ సేఫ్టీ ఇనిషియేటివ్ రూట్ టు ఫుడ్ 2024 నివేదిక ప్రకారం.. కిమానా ప్రాంతంలోని ఒక రైతు ఉపయోగిస్తున్న ఒక పురుగుమందులో సైనైడ్ సంబంధిత రసాయన సమ్మేళనం యాక్టివ్ ఇన్గ్రీడియెంట్గా ఉంది.
ఈ నివేదిక రూపొందించిన వాంగున్యు ఉంజుగునా మాట్లాడుతూ.. కెన్యాలో నిషేధించినప్పటికీ, కొన్ని విషపూరితమైన వ్యవసాయ రసాయనాలు టాంజానియా సరిహద్దు మీదుగా దేశంలోకి దొంగతనంగా రవాణా అవుతున్నాయని చెప్పారు.

ఫొటో సోర్స్, Peter Njoroge/BBC
సరిహద్దు ప్రాంతంలో మనం ఇటువంటి ప్రమాణాలను కఠినంగా అమలు చేయకపోవడమే అతిపెద్ద సమస్య అని ఉంజుగునా అన్నారు. 'నేను సరిహద్దు దాటి వెళ్లి ఏమి కొంటున్నానో తనిఖీ చేసేవారు ఎవరూ లేరు, అలాగే, నేను సరిహద్దుల అవతల ఏం కొని తీసుకొస్తున్నా ఎవరూ అడ్డుకోరు' అన్నారు.
కెన్యాలోని పొలాల్లో ప్రమాదకరమైన పదార్థాల వాడకం సాధారణంగా మారింది, వీటిలో కొన్ని తీవ్రమైన వ్యాధులకు కారణమవుతున్నాయి.
వ్యవసాయంలో వాడే రసాయనాల నియంత్రణకు నిబంధనలు ఉన్నప్పటికీ, వాటి అమలు బలహీనంగా ఉంది, అలాగే అవి జంతువులపై ఎలా ప్రభావం చూపుతాయనే దానిపై చాలా తక్కువ శ్రద్ధ చూపుతున్నారు.
అయితే, కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్ ప్రాథమిక నిర్ధారణలను ప్రశ్నించిన పలువురు వన్యప్రాణి సంరక్షకులతో మేం మాట్లాడాం.
పౌలా కహుంబు దాదాపు 30 ఏళ్లుగా ఏనుగులతో కలిసి పనిచేస్తున్నారు. పంటల్లోని పురుగుమందుల వల్లే ఇది జరిగిందనే వాదనను నమ్మడానికి తగినంత వివరణాత్మక సమాచారం మన వద్ద లేదు అని కహుంబు చెప్పారు.
కొంత సమాచారం ప్రజలకు విడుదల చేసినప్పటికీ, అది పొంతన లేకుండా ఉంది. ఏనుగులు చనిపోవాలంటే అవి అంత పెద్ద మొత్తంలో పురుగుమందులను తినాల్సి ఉంటుంది.
అయితే... పురుగు మందుల కారణంగా ఏనుగులు చనిపోయి ఉండొచ్చన్న వాదన వాటి సహజ ప్రవర్తనకు విరుద్ధంగా ఉందని కొందరు పేరు చెప్పడానికి ఇష్టపడని నిపుణులు చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
మగ ఏనుగులు సాధారణంగా ఆడ ఏనుగులు, గున్న ఏనుగుల కంటే ఎక్కువ ప్రమాదాలను తెగించి ఎదుర్కొంటాయి కాబట్టి, అవే పొలాలపై దాడి చేసే అవకాశం ఎక్కువ అని వారు చెప్పారు. అయితే, చనిపోయిన 15 ఏనుగులలో ఒక్కటి మాత్రమే పెద్ద మగ ఏనుగు.
గతంలో పొలాల్లో జరిగిన విషప్రయోగ ఘటనల్లో.. ఈ ప్రాంతాల్లోకి వచ్చే జింకలు, కృష్ణజింకలు ప్రభావితమయ్యాయని, కానీ ఈ తాజా ఘటనలో అలా జరగలేదని భూ యజమానుల ప్రతినిధి నీనా అన్నారు.
ఒకే చోట కలిసి గడ్డి మేసే జింకలు, కృష్ణజింకలు, వైల్డ్బీస్ట్లకు ఏమీ కానప్పుడు ఏనుగులు మాత్రమే ఎలా చనిపోతాయి? అని నీనా ప్రశ్నించారు.
కెన్యా వ్యాప్తంగా ఉన్న కన్జర్వేషన్ ఏరియాస్ సమీపంలోని కమ్యూనిటీలలో మనుషులు, వన్యప్రాణుల సంఘర్షణ దశాబ్దాలుగా కొనసాగుతోంది.
కిమానాలోని టమోటా రైతు స్టీఫెన్ మైకేల్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని పొలాలపై ఏనుగులు, జిరాఫీలు అప్పుడప్పుడు దాడి చేస్తుంటాయని చెప్పారు.
ఏనుగులు త్సావో, అంబోసెలి నుండి ఎప్పటికప్పుడు వస్తుంటాయి. అవి నా పొలాన్నే కాకుండా చాలా పొలాలను నాశనం చేస్తాయి అని మైకేల్ చెప్పారు.
చివరిసారిగా ఏనుగులు వచ్చినప్పుడు, అవి క్యాబేజీలు, టమోటాలను నాశనం చేశాయి. నేను భారీగా నష్టపోయాను అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కన్జర్వేషన్ సంస్థ సేవ్ ది ఎలిఫెంట్స్ సీఈఓ ఫ్రాంక్ పోప్ బీబీసీతో మాట్లాడుతూ, అంబోసెలిలోని ఏనుగులపై ఇప్పుడు దంతాల వేట ముప్పు లేదని చెప్పారు.
ఇది భూ వినియోగానికి సంబంధించిన సమస్య అని ఆయన అన్నారు.
గతంలో ఏనుగులు తిరిగిన పార్క్ చుట్టుపక్కల ఉన్న భూమి ఇప్పుడు పంటపొలాలుగా మారడంతో పాటు లాడ్జీలు ఎక్కువయ్యాయని.. ఇటువంటి కార్యకలాపాలే వన్యప్రాణులతో సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయని పోప్ చెప్తున్నారు.
పంటలు పండించడానికి సరిపడా నీరు, సారవంతమైన నేలలు ఉన్న ప్రాంతాల్లోకి ప్రజలు విస్తరిస్తున్నారు, అయితే ఏనుగులు కూడా సరిగ్గా అవే ప్రాంతాలను ఉపయోగిస్తుంటాయి.
ఏనుగుల మరణాలకు ప్రస్తుతం అసలు కారణం ఏమిటో ఎవరికీ స్పష్టంగా తెలియదు.
మిగిలి ఉన్న ఏనుగులకు, వాటి సమీపంలో నివసించే ప్రజలకు ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందేమోనన్నదే ఆందోళన.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























