మీ పిల్లలు బడికి వెళుతున్నారా.. అయితే ఏం తినాలి, ఎంత తినాలి?

lunch box

ఫొటో సోర్స్, Getty Images

పిల్లలు ఏ వయసులో ఏం తినాలి? ఏ సమయానికి ఏం తినాలి? తల్లిదండ్రుల ఆలోచనలు వీటి చుట్టూనే తిరుగుతుంటాయి.

ముఖ్యంగా పిల్లలు స్కూలుకు వెళ్లే సమయంలో సరిగా తినకుండానే వెళ్లిపోతుంటారని, లేదా లంచ్ బాక్సును పూర్తిగా తినకుండానే ఇంటికి తెస్తుంటారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు.

అయితే, ఈ సమయంలో పిల్లల ఎదుగుదలను బట్టి నిర్దేశిత ప్రమాణాల్లో ఆహారాన్ని అందిస్తే పిల్లల ఆహారపు అలవాట్లను కాపాడుకోవచ్చని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) సూచిస్తోంది.

సాధారణంగా పిల్లలు స్కూలుకు వెళ్లడం మొదలయ్యే 3-4 ఏళ్ల వయసు నుంచి పదేళ్లు వచ్చే వరకు సమతుల ఆహారం అందించాల్సిన అవసరాన్ని ఈ సంస్థ తెలియజేస్తోంది.

''ఎదిగే పిల్లల విషయంలో సమతుల ఆహారం ఎంతో ముఖ్యం. కేవలం ఒకే రకమైన ధాన్యాలపై ఆధారపడకుండా అన్ని రకాల ఆహారధాన్యాలు ఇవ్వాలి. దీనివల్ల పిల్లలకు సమతుల ఆహారం అందుతుంది'' అని ఎన్ఐఎన్ మాజీ డిప్యూటీ డైరెక్టర్, స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ డి.రఘునాథరావు బీబీసీతో చెప్పారు.

అయితే, సమతుల ఆహారం అందించడమే కాకుండా జంక్ ఫుడ్ నుంచి దృష్టి మళ్లించే చర్యలు అవసరమని హైదరాబాద్‌కు చెందిన న్యూట్రిషనిస్ట్ సయ్యదా సనా అభిప్రాయపడ్డారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
food

ఫొటో సోర్స్, Getty Images

ఏ వయసు పిల్లలు ఎంత తినాలి?

7-9 ఏళ్ల వయసు పిల్లలకు మెనూ

గమనిక: చిరుధాన్యాల కింద బియ్యం, గోధుమలు, మిల్లెట్స్ వస్తాయని ఎన్ఐఎన్ సూచించింది. పప్పుధాన్యాలు కింద కందిపప్పు, శెనగపప్పు, మినుములు, శెనగలు, బఠాణి, రాజ్మా, బొబ్బర్లు వంటివి పరిగణించాలని చెబుతోంది.

రఘునాథ్

ఫొటో సోర్స్, Prof. D Raghunadha Rao

పై పట్టికలోని వివరాలు వివిధ వయసుల పిల్లలు నిర్ధిష్ట ప్రమాణాల్లో ఏయే రకాల ఆహార పదార్థాలను ఎంత పరిమాణంలో తీసుకోవాలో జాతీయ పోషకాహార సంస్థ చేసిన మార్గదర్శకాలు ఇవి అని చెప్పారు ప్రొఫెసర్ రఘునాథరావు.

''నేరుగా ఉడకబెట్టిన లేదా నానబెట్టిన పప్పుధాన్యాలు వంటివి తినడానికి పిల్లలు ఇష్టపడకపోవచ్చు. రుచికి తగ్గట్టుగా మార్పులు చేసి పిల్లలకు అందించాలి. తాలింపు వేయడం లేదా కాస్త ఉప్పు వేసుకోవడం వంటివి చేయవచ్చు. కానీ అదే సమయంలో ఉప్పు లేదా ఆయిల్ వంటివి ఎక్కువగా వాడకుండా చూసుకోవాలి'' అని వివరించారు.

మాంసకృత్తులతో కూడిన ఆహారాన్ని అందించాలని ఆయన సూచించారు.

పాలు తాగకపోతే ఏం చేయాలి?

ఉదయం, సాయంత్రం పిల్లలు పాలు తాగాలని సమతుల ఆహార ప్రణాళికలో భాగంగా ఎన్ఐఎన్ సూచించింది.

చాలా మంది పిల్లలు పాలు తాగేందుకు ఇష్టపడరు. పిల్లలు పాలు తాగేందుకు మారాం చేస్తుంటారని ఎక్కువమంది తల్లిదండ్రులు చెబుతుంటారు.

''మా అబ్బాయి ఇప్పుడు రెండో తరగతి చదువుతున్నాడు. రోజూ పాలు తాగించడానికి కష్టపడాల్సిందే. అందుకే వాటిల్లో బెవరేజస్ మిక్స్ పొడి కలుపుతుంటాం. కానీ, వాటి విషయంలో కూడా మాకు ఆందోళన ఉంది'' అని హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని సరస్వతినగర్‌కు చెందిన మేఘన చెప్పారు.

అందుకే చాలా సందర్భాల్లో నేరుగా పాలు పట్టించేందుకు ప్రయత్నిస్తుంటామని ఆమె వివరించారు.

నేరుగా పాలు ఇస్తే తాగని పిల్లలకు రుచి కోసం 'మాల్ట్' తరహా పౌడర్ కొంత కలుపుకోవచ్చని ప్రొఫెసర్ రఘునాథరావు వివరించారు.

''రాగులు వంటి చిరుధాన్యాలు దోరగా వేయించుకుని పొడిగా చేసుకుని పాలలో కలిపి ఇవ్వవచ్చు. దానివల్ల పాలు రుచిగా ఉండి పిల్లలు తాగేందుకు ఇష్టపడతారు'' అని ఆయన సూచించారు.

సయ్యద్ సనా

ఫొటో సోర్స్, Sayyeda Sana

''పిల్లలకు ఏది ఇష్టమో గుర్తించాలి''

పిల్లల వయసును బట్టి ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తుంటాయని, ముఖ్యంగా స్కూల్ వయసు పిల్లల విషయంలో స్నాక్స్, లంచ్ మీద తల్లిదండ్రులు ఎక్కువగా దృష్టి పెట్టాలని సయ్యదా సనా వివరించారు.

''పిల్లలకు ఎలాంటి ఆహారం ఇష్టమో గుర్తించాలి. దానికి తగ్గట్టుగా ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు పాటించాలి. ఎదిగే వయసును కాబట్టి కాల్షియం, విటమిన్-డి చాలా ముఖ్యం. పప్పుధాన్యాలు వంటివి వివిధ రూపాల్లో అందించాలి'' అని బీబీసీతో చెప్పారు.

సాధారణంగా పాస్తా వంటివి సులువుగా వండేందుకు వీలవుతుందని పిల్లల బాక్సుల్లో పెడుతుంటారు. అయితే, పాస్తా వంటి వాటితో వచ్చే శక్తి తక్కువ సమయమే ఉంటుందని సయ్యదా సనా వివరించారు.

పాఠశాల యాజమాన్యాలు కూడా వాటర్ బెల్ పాటించాలని తెలిపారు.

''వాటర్ బెల్ తప్పకుండా ఉండాలి''

పిల్లలకు మంచి ఆహారపు అలవాట్లు అలవడితే, తమ వయసులోని మరికొందరికి చెప్పి, స్ఫూర్తినిస్తారని స్లేట్ విద్యా సంస్థల అధినేత వాసిరెడ్డి అమర్నాథ్ చెప్పారు.

''మా సంస్థల్లో వాటర్ బెల్ రోజుకు మూడుసార్లు ఉంటుంది. మిగిలిన సమయాల్లో నీటిని తాగుతారు కానీ ఈ బెల్ మోగినప్పుడు తప్పకుండా నీటిని తాగుతారు'' అని చెప్పారు.

ఈ తరహా ప్రయోగాలు అన్ని పాఠశాలలూ చేస్తే పిల్లలు, తల్లిదండ్రుల పరంగా మంచి ఆహారపు అలవాట్లపై అవగాహన వస్తుందని అన్నారు.

''జంక్ ఫుడ్ వైపు వెళ్లకుండా మంచి మండే (నట్స్ తినాలి), కాల్షియం ట్యూస్ డే, వెజీ వెడ్నెస్ డే, టేస్టీ థర్స్ డే, ఫ్రూటీ ఫ్రైడే.. పేరుతో ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పిస్తున్నాం'' అని ఆయన వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)