తల్లి హిప్పో కళేబరాన్ని వదలకుండా పట్టుకుని ఉన్న నీటి ఏనుగు పిల్లను రక్షించిన అధికారులు

ఫొటో సోర్స్, Sheldrick Wildlife Trust/X
- రచయిత, బస్సిలియో రుకంగా
- చదివే సమయం: 4 నిమిషాలు
కెన్యాలోని ఒక సరస్సు ఒడ్డున కలచివేసే దృశ్యం ఒకటి కనిపించింది.
చనిపోయిన తన తల్లి శరీరాన్ని వదలకుండా, దీనంగా ముక్కుతో నెడుతూ కనిపించిన ఓ చిన్న హిప్పో పిల్లని స్థానిక అధికారులు ఇప్పుడు రక్షించి ప్రత్యేక సంరక్షణలోకి తరలించారు.
"బంపీ" అని పేరు పెట్టిన ఆ హిప్పో పిల్లను కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్ (కేడబ్ల్యూఎస్) అధికారులు రక్షించి, ప్రత్యేక సంరక్షణ కోసం షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్‌కు అప్పగించారు.
ఈ హిప్పో పిల్ల వయసు కొన్ని రోజులేనని ట్రస్ట్ తెలిపింది. అంత చిన్న వయసులో తల్లిని కోల్పోవడంతో అది అనాథగా మారిపోయింది.

తల్లి మరణించిన తర్వాత కూడా బంపీ దాని కళేబరాన్ని వదలకుండా అక్కడే తిరుగుతూ కనిపించిందని అధికారులు చెబుతున్నారు.
హిప్పో తల్లి సహజ కారణాలతో చనిపోయి ఉండవచ్చని కేడబ్ల్యూఎస్ తెలిపింది. అయితే, తల్లి హిప్పో శరీర కింది భాగంలో స్పష్టమైన గాయాలు ఉన్నాయని, అవి మరో జంతువుతో జరిగిన ఘర్షణ ఫలితంగా ఏర్పడి ఉండవచ్చని తెలిపింది.
"పిల్లను రక్షించే క్రమంలో తల్లి ప్రాణాంతకమైన గాయాలకు గురై ఉండవచ్చు లేదా సహజంగా ఎదురయ్యే ఘర్షణల్లో ఇది జరిగి ఉండవచ్చు. లేదా సంతానోత్పత్తి ప్రక్రియలో భాగంగా మగ హిప్పోతో జరిగిన పోరాటంలోనైనా ఇది సంభవించి ఉండవచ్చు" అని కేడబ్ల్యూఎస్ బీబీసీతో పేర్కొంది.
వన్యప్రాణుల పర్యావరణ వ్యవస్థలో ఇటువంటి సంఘటనలు నిత్యం జరగకపోయినప్పటికీ, అవి అసాధారణమేమీ కాదని సంస్థ తెలిపింది.
బంపీని రక్షించడం సిబ్బందికి చాలా కష్టసాధ్యమైన పనిగా మారింది. ఎందుకంటే ఆ చిన్న హిప్పో తన తల్లి కళేబరాన్ని గట్టిగా అంటిపెట్టుకుని ఉండిపోయింది. దానిని నీటి నుంచి బయటకు తీసుకురావడానికి అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు.

ఫొటో సోర్స్, Sheldrick Wildlife Trust
చివరికి "చాలా బాధాకరమైన నిర్ణయం" తీసుకోవాల్సి వచ్చిందని కేడబ్ల్యూఎస్ తెలిపింది.
కుళ్లిపోతున్న తల్లి కళేబరాన్నే ఆధారంగా ఉపయోగించి, ఆ పిల్లకు దగ్గరగా వెళ్లి సురక్షితంగా బయటకు తీశారు. తల్లి శరీరం కుళ్లిన స్థితిని బట్టి, అది చనిపోయి కనీసం ఒకరోజు దాటిపోయి ఉండవచ్చని షెల్డ్రిక్ ట్రస్ట్ అంచనా వేసింది.
బంపీని నైరోబీలోని ఒక సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ దానికి పాలు పట్టించి, దుప్పట్లో చుట్టి సంరక్షించారు. కొత్త వాతావరణంలో అది చాలా భయంతో, నిస్సహాయంగా కనిపించిందని సంరక్షకులు చెబుతున్నారు.
"అప్పటి నుంచి అది తన జూ కీపర్లను క్షణం కూడా విడిచిపెట్టడం లేదు" అని ట్రస్ట్ తెలిపింది.
కొద్దిరోజుల తర్వాత బంపీని హెలికాప్టర్‌లో త్సావో ఈస్ట్ నేషనల్ పార్క్ సమీపంలోని కలుకు అభయారణ్యానికి తరలించారు. అడవిలో తిరిగి జీవించగల స్థితికి వచ్చే వరకు అక్కడే దానిని పెంచనున్నారు.
ప్రస్తుతం బంపీ అక్కడి నీటి కుంటల వద్ద ఎక్కువ సమయం గడుపుతోంది. ఫారెస్ట్ అధికారులు విడుదల చేసిన ఫోటోల్లో, అది నీటిలో ప్రశాంతంగా తేలుతూ కనిపిస్తోంది. అయితే దాని పక్కన ఎప్పుడూ ఒక సంరక్షకుడు ఉంటూనే ఉంటాడు.
"బంపీ రోజులో చాలా సమయం నీటిలోనే గడుపుతుంది. కానీ అది ఎప్పుడూ ఒంటరిగా ఉండదు," అని షెల్డ్రిక్ ట్రస్ట్ తెలిపింది.
"దాని సంరక్షకుల్లో ఒకరు రోజంతా దాని పక్కనే ఉంటారు.. నీటిలో అయినా, ఒడ్డుపైన అయినా" అని తెలిపింది.

ఫొటో సోర్స్, Sheldrick Wildlife Trust
బంపీకి మనుషులకు దగ్గరగా ఉండాలనే కోరిక ఎక్కువగా కనిపిస్తోందని కూడా సంరక్షకులు చెబుతున్నారు.
"అది చాలా ముద్దుగా ఉంటుంది. ఎవరి ఒడిలోనైనా తల పెట్టుకుని దగ్గరగా ఉండటానికే ఇష్టపడుతోంది" అని ట్రస్ట్ పేర్కొంది.
విడుదల చేసిన ఒక ఫోటోలో, బంపీ తన కీపర్ ఒడిపై తలను ఉంచి, విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది.
కలుకు అభయారణ్యంలో ఇప్పటికే దాదాపు ఏడాది వయసున్న మరో చిన్న హిప్పో కూడా ఉంది. అయితే ప్రస్తుతం రెండింటినీ వేర్వేరు ప్రాంతాల్లో ఉంచి సంరక్షిస్తున్నారు. పూర్తిగా ఎదిగిన తర్వాత అడవిలోని ఇతర హిప్పోల మధ్యలో విడిచిపెట్టే ప్రణాళిక ఉందని ట్రస్ట్ తెలిపింది.
వైల్డ్-లైఫ్ నిపుణుల ప్రకారం, అడవిలో హిప్పో పిల్లలు ఏడాది లేదా అంతకంటే ఎక్కువకాలం తల్లి పాలపైనే ఆధారపడతాయి. లైంగిక పరిపక్వత వచ్చే వరకు తల్లితోనే బలమైన అనుబంధంతో జీవిస్తాయి. అందుకే చిన్న వయసులో తల్లిని కోల్పోయిన బంపీకి ఇప్పుడు నిరంతర సంరక్షణ, మానసిక భద్రత రెండూ అవసరమని వారు చెబుతున్నారు.
1977లో స్థాపించిన షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ప్రపంచవ్యాప్తంగా అనాథ ఏనుగులు, ఖడ్గమృగాల సంరక్షణకు ప్రసిద్ధి చెందింది.
అడవిలో తల్లిదండ్రులను కోల్పోయిన జంతువులను రక్షించి, తిరిగి సహజ వాతావరణంలో జీవించేలా చేయడంలో ఈ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఈ సంస్థ 2016లో మొదటిసారిగా 'హంఫ్రెట్టా' అనే ఆడ హిప్పోను రక్షించింది, కానీ అది ఆరు నెలలకే మరణించింది.
అనుభవజ్ఞులైన వన్యప్రాణి నిపుణుల పర్యవేక్షణలో, పునరావాస కార్యక్రమాల ద్వారా వాటిని పెంచడం సాధ్యమేననికేడబ్ల్యూఎస్ బీబీసీతో చెప్పింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































