ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదం: ‘‘పొగ, మంటల మధ్య నా చేతికందిన 12 మంది శిశువులను రక్షించా, కానీ నా బిడ్డను కోల్పోయా’’- గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
(ఈ కథనంలో మిమ్మల్ని కలిచివేసే అంశాలున్నాయి)
‘‘నా కూతురు కోసం వెతక లేదు. ముందుగా నా చేతికి అందిన 12 మంది శిశువులనే బయటకు తెచ్చా. ఐదు రోజుల వయసున్న మా అమ్మాయి ఊపిరాడక చనిపోయింది’’ అని పీర్ ఖాన్ అన్నారు. 'వారూ మరొకరికి పిల్లలే కదా? ఎలా వదిలేస్తాను' అన్నారాయన.
సెప్టెంబర్ 21 రాత్రి 11.40 సమయంలో ఆదిలాబాద్ 'రిమ్స్' ఆసుపత్రిలోని ఎస్ఎన్సీయూ (స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్) లో జరిగిన అగ్ని ప్రమాదంలో పీర్ ఖాన్ కూతురు సహా అయిదుగురు శిశువులు మృతి చెందారని అధికారులు తెలిపారు. ( ప్రమాద ఘటన జరిగిన సెప్టెంబర్ 21న ముగ్గురు, చికిత్స పొందుతూ సెప్టెంబర్ 23న ఇద్దరు శిశువులు మృతి చెందారు)
పీర్ ఖాన్ ఇచ్చోడలో పాన్ షాప్ నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. ఇటీవలే కూతురు పుట్టింది.
‘‘ప్రాథమిక విచారణ ప్రకారం..ఎస్ఎన్సీయూ ఏసీ యూనిట్ లో ఏర్పడ్డ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు, టాక్సిక్ వాయువులు కమ్మేశాయి’’ అని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

‘‘ప్రమాద సమయంలో ఎస్ఎన్‌సియూలో మొత్తం 27 మంది శిశువులున్నారు. రెస్క్యూ చేసిన మిగతా పిల్లలను ఆదిలాబాద్‌లోని వివిధ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నాం’’ అని మంత్రి రాజనర్సింహ అన్నారు.
ఈ ప్రమాద ఘటనపైన తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల విచారణ బృందం ఏర్పాటు చేసింది.
‘‘కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి’’ అని దామోదర రాజనర్సింహ తెలిపారు.

‘‘లోపల ఏమీ కనిపించలేదు’’
ప్రమాదం జరిగిన ఎస్‌ఎన్‌సీయూలోకి బీబీసీ వెళ్లినప్పుడు గోడలు, ఫ్లోర్ నల్లగా పొగచూరి కనిపించాయి.
వదిలేసిన చెప్పులు, మసిబారిన ఫ్లోరింగ్, వైద్యపరికరాలు చిందరవందరగా పడిఉన్నాయి.
‘‘నర్సింగ్ స్టేషన్ ఏరియాలో ఉన్న ఏసీ మిషన్ లో మొదట మంటలు అంటుకున్నాయి. తర్వాత మూడుసార్లు పేలుడు శబ్దాలు వినిపించాయి. లోపలికి వచ్చి చూస్తే అప్పటికే కమ్ముకున్న పొగలతో ఏం కనిపించలేదు, ఊపిరి ఆడక బయటకు వచ్చేశా. అరగంట తర్వాత నా కూతురును ఎవరో బయటకు తెచ్చారు’’ అని ఇంద్రవెల్లి మండలం గిన్నెరకు చెందిన కుమ్ర దినేశ్ బీబీసీతో చెప్పారు.
పదిహేను రోజుల కింద ఇదే రిమ్స్ ఆసుపత్రిలో తన భార్య ప్రసవించిందనీ, కూతురుకు జన్మనిచ్చిందని, ఎస్ఎన్‌సీయూ ప్రమాదం నుంచి బయటకు తెచ్చిన కొన్ని గంటల్లోనే తన కూతురు చనిపోయిందని దినేశ్ చెప్పారు.

రిమ్స్ ఆసుపత్రి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించే లక్ష్యంతో 2008లో ప్రారంభమైంది. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఆదివాసీలు మెరుగైన పెద్దాసుపత్రి సేవలకోసం ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు.
తలసేమియా, రక్తహీనత జబ్బులు ఇక్కడి ఏజెన్సీ ప్రాంత గర్భిణీల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
దీంతో ప్రసవం సమయంలో తల్లులు, వారికి పుట్టిన బిడ్డల్లో బరువు తక్కువ సమస్య, రక్తహీనత, శ్వాస ఇబ్బందులు ప్రసవానికి ముందు, ప్రసవానంతర కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి.
‘‘ఈ కాంప్లికేషన్స్‌ను దృష్టిలో ఉంచుకునే నవజాత శిశువుల మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 'సంకల్ప్ ప్రాజెక్ట్‌లో భాగంగా దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లో ఎస్‌ఎన్‌సీయూలు ఏర్పాటు చేసింది. అందులో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఒకటి’’ అని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ బీబీసీకి తెలిపారు.

ఎస్ఎన్సీయూలో మంటలు, పొగలు వ్యాపించి ఏమీ కనిపించని సమయంలో కొంత మంది ఆ యూనిట్ అద్దాలను పగులగొట్టి పొగ బయటకు వెళ్లేలా చేశారు.
పెందూర్ విక్రమ్ మహారాష్ట్ర కిన్వట్‌కు చెందిన వ్యక్తి. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న తన తమ్ముడి కూతురును చూసేందుకు వచ్చారు.
‘‘ఎస్‌ఎన్‌సీయూలో తమ్ముడు కూతురును చూసి బయటకు వచ్చిన కొద్ది సేపటికే పేలుళ్ల శబ్దాలు వచ్చాయి. లోపలికి వెళ్లి చూస్తే దట్టమైన పొగలు కమ్ముకుని ఉన్నాయి. అక్కడున్న ఒక డాక్టర్ సూచనతో మంటలు ఆర్పే సిలిండర్‌తో అద్దాలు పగులగొట్టా. తర్వాత శిశువును తీసుకుని బయటపడ్డా. మరికొందరిని కూడా బయటకు తెచ్చాను’’ అని బీబీసీతో చెప్పారు విక్రమ్.
‘‘విషయం తెలిసి వచ్చేసరికి అంతా గందరగోళంగా కనిపించింది. అందరూ పరుగులు పెడుతున్నారు. మా ఆదివాసీలకు తెలుగు భాష సరిగా రాదు. మావాళ్లు చాలామంది ఇక్కడ చికిత్స పొందుతున్నారు. వారికి సాయం చేస్తూ ఇతర వార్డులకు తరలించాం. ఇన్‌ఫెక్షన్స్ వ్యాపిస్తాయని చెప్పులు వేసుకున్నవారిని కూడా ఈ వార్డు సమీపంలో తిరగనివ్వరు. కానీ ఇంత పెద్ద నిర్లక్ష్యం బయటపడింది’’ అని ఆదివాసీ గిరిజన సంఘానికి చెందిన పూసం సచిన్ బీబీసీతో అన్నారు.

‘‘ప్రాణాలకు తెగించి మంటల్లోకి వెళ్లా’’
ఎస్‌ఎన్‌సీయూలో ప్రమాదంలో చిక్కుకున్న తమ పిల్లలను బయటకు తెచ్చేందుకు కొందరు కుటుంబసభ్యులు లోపలికి వెళ్లారు. వారిలో ఆదిలాబాద్ జిల్లా అనుకుంట గ్రామానికి చెందిన కావేటి నిర్మల ఒకరు.
‘‘మరో రోజు గడిస్తే డిశ్చార్జ్ కావాల్సి ఉంది. మంటలు, పొగలు చూసి షాక్ గురయ్యా. ఊపిరాడలేదు. నా మనవరాలిని బతికించాలని శరీరం మండుతున్నా లోపలికి వెళ్లా. చెవి దగ్గర ఉన్న మచ్చ, బెడ్‌పైన పరిచిన దుస్తుల రంగు ఆధారంగా నా మనవరాలిని గుర్తించి బయటకు తెచ్చా’’ అని నిర్మల అన్నారు.
శిశువులను బయటకు తీసుకురావడంతో అక్కడి నర్సింగ్ సిబ్బంది కొందరు తాత్సారం చేశారని నిర్మల ఆరోపించారు.
‘‘పగవారికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు’’ అని తన అనుభవాన్ని ఆమె బీబీసీకి వివరించారు.
‘‘పిల్లలకు మంచి ట్రీట్మెంట్ అందిస్తే అదే చాలు. మాకు ఇంకేమీ వద్దు’’ అని నిర్మల అల్లుడు తాండ్ర లక్ష్మణ్ అన్నారు.
‘‘అలా జరుగుతుందనీ ఎవరూ కలగనలేదు. ఆసుపత్రి సిబ్బంది కొందరు ఘటనాస్థలంలో సాయం చేశారు’’ అని లక్ష్మణ్ అన్నారు.

‘‘నిర్లక్ష్యం ప్రదర్శించలేదు’’
అయితే, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించామన్న ఆరోపణలను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ తోసిపుచ్చారు. సరైన రీతిలో సిబ్బంది స్పందించి శిశువులను బయటకు తెచ్చారని అన్నారు.
నాసిరకం ఏసీ యూనిట్ల ఆరోపణలనూ ఆయన ఖండించారు.
‘‘ఘటన జరిగిన నిమిషాల్లో అక్కడి చేరుకున్నా. మా వైపు నుంచి ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదు. డ్యూటీ డాక్టర్, హెచ్ఓడీలు, జూనియర్ డాక్టర్లు, ఇతర స్టాఫ్ కలిసి పది నిముషాల వ్యవధిలో శిశువులను బయటకు తెచ్చాం. ఆంబులెన్స్‌ల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించాం’’ అని డాక్టర్ జైసింగ్ తెలిపారు.
రిమ్స్ ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లో ఎస్‌ఎన్‌సీయూ తమ టాప్ ప్రయార్టీలో ఉంటుందని , అక్కడ చిన్న ఇబ్బందొచ్చినా వెంటనే పరిష్కరిస్తుంటామని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























