మక్కా ఒప్పందంలో భారత్ వల్లే ఈజిప్ట్ చేరలేదా? తెరవెనక కారణమేంటి...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆగస్టు 6న సౌదీ అరేబియా వెళ్లినప్పుడు, అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోవాన్ కూడా అక్కడికి రానున్నారనే విషయాన్ని తుర్కియే రహస్యంగా ఉంచింది.
తుర్కియే ఈ పర్యటనను గోప్యంగా ఉంచడమే కాకుండా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ రక్షణ ఒప్పందంలో తాము కూడా చేరబోతున్నామనే విషయాన్ని వెల్లడించలేదు.
ఈ ఒప్పందంలో ప్రత్యేక సైనిక కట్టుబాట్లను స్పష్టంగా పేర్కొనలేదు. అయితే, ఇందులో నేటోలోని ఆర్టికల్ 5 తరహా సామూహిక రక్షణ నిబంధన ఉంది. దీని ప్రకారం ఒక సభ్య దేశంపై జరిగే దాడిని, అన్ని సభ్య దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తారు.
భద్రతా ఒప్పందంపై సంతకం చేసేలా గత రెండేళ్లుగా సంబంధిత పక్షాలన్నింటినీ ఒప్పించేందుకు తుర్కియే ప్రయత్నిస్తూ వచ్చిందని ఆ దేశ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ శనివారం తెలిపారు.
మొదట ఈ రక్షణ ఒప్పందంలో ఈజిప్ట్ కూడా చేరుతుందనే చర్చ జరిగింది, కానీ అది కార్యరూపం దాల్చలేదు.


ఫొటో సోర్స్, Getty Images
ఈజిప్ట్ చేరకపోవడంపై తుర్కియే ఏమంది?
ఈజిప్ట్ చేరకపోవడంపై ఆగస్టు 8న తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ స్పందిస్తూ, "అన్ని విషయాల్లోనూ ఈజిప్ట్ మాకు సహజ భాగస్వామి. తదుపరి దశలో ఈజిప్ట్ కూడా మాతో పాటు ఈ కూటమిలో భాగమవుతుందని భావిస్తున్నాను. ఇందులో కొన్ని సాంకేతికపరమైన అంశాలు ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తే, ఈజిప్ట్ కూడా ఇందులో భాగస్వామి కాకపోవడానికి కారణముండదు" అని అన్నారు.
అయితే, ఈజిప్ట్ ఈ ఒప్పందంలో చేరకపోవడం వెనుక తుర్కియే విదేశాంగ మంత్రి చెబుతున్న కారణం మాత్రమే కాకుండా వేరే కథ కూడా వినిపిస్తోంది.
ఇరాన్ పొరుగున ఉన్న అరబ్ దేశాలపై పెద్ద సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించి, కీలకమైన సైనిక, ఇంధన స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు హార్ముజ్ మార్గానికి అంతరాయం కలిగించిన సమయంలో.. సౌదీ అరేబియా, పాకిస్తాన్‌లతో కూడిన రక్షణ ఒప్పందంలో తుర్కియే చేరింది.
చాలా నెలలుగా తుర్కియే, పాకిస్తాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా అధికారులు "రీజనల్ ఫోర్" అనే సమూహం కింద విదేశాంగ మంత్రి స్థాయిలో క్రమం తప్పకుండా చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రయత్నాలపై ఇజ్రాయెల్‌లో తీవ్ర స్పందన వ్యక్తమైంది.
మధ్యప్రాచ్యానికి చెందిన ప్రముఖ న్యూస్ అనాలిసిస్ వెబ్‌సైట్ 'మిడిల్ ఈస్ట్ ఐ' తుర్కియే బ్యూరో చీఫ్ రాగిప్ సోయ్లు తన కథనంలో "ఇటీవలి నెలల్లో ఈజిప్ట్, సౌదీ అరేబియా రెండూ తుర్కియేతో సన్నిహిత ప్రాంతీయ భద్రతా నిర్మాణాన్ని ఏర్పాటు చేయడంపై స్పష్టమైన సంకోచాన్ని ప్రదర్శించాయి" అని రాశారు.
ఈ విషయంపై నిరాశ వ్యక్తం చేస్తూ ఒక తుర్కియే అధికారి ఏడాది క్రితం మిడిల్ ఈస్ట్ ఐతో మాట్లాడుతూ, "మేం ఈజిప్ట్, సౌదీ అరేబియాలను ఈ వేదికపై ఉంచడానికి ప్రయత్నిస్తుండగా, ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా వారిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈజిప్ట్‌కు ఉన్న రిస్క్
'మిడిల్ ఈస్ట్ ఐ' లో రాగిప్ సోయ్లు రాసిన కథనం ప్రకారం, "ఈ ఒప్పందంలో ఈజిప్ట్‌ను చేర్చేందుకు తుర్కియే తీవ్రంగా ప్రయత్నించింది, అధికారికంగా దానికి ప్రతిపాదన కూడా చేసింది. అయితే, కైరో ఈ ఒప్పందంలో చేరడానికి సిద్ధంగా లేదని స్పష్టమైనప్పుడు, మిగతా దేశాలు ఈజిప్ట్ లేకుండానే ముందుకు సాగాలని నిర్ణయించాయి".
ఈజిప్ట్ ఈ ఒప్పందంలో చేరకపోవడాన్ని భారతదేశంతో కూడా ముడిపెడుతున్నారు.
"గ్రీస్, సైప్రస్‌లతో ఉన్న సంక్లిష్ట సంబంధాల దృష్ట్యా ఈజిప్ట్ తుర్కియేతో ఎలాంటి రక్షణ ఒప్పందంలో చేరబోదని ఒక మాజీ అరబ్ దౌత్యవేత్త భావిస్తున్నారు. అదేవిధంగా, భారతదేశంతో ఆర్థిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈజిప్ట్ చర్చలు జరుపుతున్నందున, పాకిస్తాన్‌తో అది ఏదైనా రక్షణ ఒప్పందంలో చేరుతుందనుకోవడం కూడా కష్టమే" అని ఈజిప్ట్‌కు చెందిన స్వతంత్ర ఆన్‌లైన్ వార్తాపత్రిక 'మాడా మస్ర్' తన కథనంలో రాసింది.
"సౌదీ అరేబియా, యూఏఈ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో ఏ ఒక్క పక్షానికీ మద్దతు ఇవ్వకుండా ఈజిప్ట్ దూరంగా ఉంది. సంప్రదాయ ప్రాంతీయ నాయకత్వ పాత్రకు వేగంగా సవాలు విసురుతున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఇతర దేశాలను దూరం చేయాలని సౌదీ అరేబియా భావిస్తున్నప్పటికీ, ఈ ప్రాంతీయ విభేదాలకు ఇరువైపులా ఉన్న పలు దేశాలతో ఈజిప్ట్ సంబంధాలను కొనసాగిస్తోంది. అందుకే ఏ ఒక్క పక్షాన్ని ఎంచుకోవడానికి అది అంతగా ఆసక్తి చూపడం లేదు" అని తెలిపింది.
యూఏఈతో ఈజిప్ట్‌కు రక్షణ ఒప్పందం ఉంది, మే నెలలో యూఏఈపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా అది రఫేల్ యుద్ధ విమానాలను కూడా మోహరించింది.
ఈ పరిస్థితి కారణంగానే సౌదీ అరేబియా కూడా ఈజిప్ట్‌ను కొంతవరకు నమ్మదగని భాగస్వామిగా చూడటం ప్రారంభించిందని చెబుతున్నారు.
"ఈజిప్ట్... ఒకవైపు తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్‌లతో కూడిన వర్గం, మరోవైపు ఇజ్రాయెల్, యూఏఈ, భారత్‌లతో కూడిన వర్గం మధ్య ఏ ఒక్క పక్షాన్నీ ఎంచుకోవాలని కోరుకోవడం లేదు. ఈజిప్ట్‌కు ఈ ప్రాంతానికి మించిన విస్తృత వ్యూహాత్మక దృష్టి ఏదీ లేదు, పైగా న్యూదిల్లీతో తన వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి అది ఆసక్తి చూపుతోంది. అదే సమయంలో, యూఏఈ నుంచి అందే ఆర్థిక సహాయంపై కూడా అది ఆధారపడి ఉంది" అని 'మిడిల్ ఈస్ట్ ఐ' తన కథనంలో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈజిప్ట్‌కు భారత్ ప్రాముఖ్యత
మక్కా ఒప్పందంలో ఈజిప్ట్ చేరకపోవడానికి భారత్ కూడా ఒక కారణమని, అయితే అది చివరి కారణమని దిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ 'అనంతా సెంటర్' సీఈఓ ఇంద్రాణీ బాగ్చీ కూడా భావిస్తున్నారు.
"ఈజిప్ట్‌కు ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం ఉంది. ఇజ్రాయెల్‌ను గుర్తించిన మొదటి అరబ్ దేశం ఈజిప్ట్. యూఏఈతో ఈజిప్ట్‌కు చాలా లోతైన సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ఉనికిని అంగీకరించని, భారతదేశంతో శత్రుత్వం ఉన్న పాకిస్తాన్ సభ్య దేశంగా ఉన్న ఇలాంటి కూటమిలో చేరడానికి ఈజిప్ట్ దూరంగా ఉంది. మరో సభ్య దేశం సౌదీ అరేబియాపై యూఏఈకి అపనమ్మకం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈజిప్ట్ ఏ పక్షాన్ని ఎంచుకోవాలని అనుకోవడం లేదు" అని ఇంద్రాణీ బాగ్చీ అన్నారు.
"ఒకవేళ ఈజిప్ట్ మక్కా ఒప్పందంలో భాగంగా ఉన్నప్పటికీ, భారతదేశంతో సంబంధాలపై పెద్దగా ప్రభావం పడేది కాదు. కానీ, దాని ద్వారా వెళ్లే సందేశం బాగుండేది కాదు" అన్నారు..
ఈజిప్ట్‌లో 700కు పైగా భారతీయ కంపెనీలు నమోదై ఉన్నాయి, వాటిలో దాదాపు 70 కంపెనీలు వేర్వేరు రంగాల్లో చురుకుగా పనిచేస్తున్నాయి. వీటి మొత్తం పెట్టుబడి 5.5 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఈ కంపెనీలలో దాదాపు 40,000 మందికి ఉపాధి లభించింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్, ఈజిప్ట్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 6.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈజిప్ట్‌కు భారత్ ప్రధానంగా ఎగుమతి చేసే వాటిలో పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, రసాయనాలు, పత్తి దారం, మాంసంతో పాటు ఔషధాలు కూడా ఉన్నాయి. ఈజిప్ట్ నుంచి భారత్ ప్రధానంగా దిగుమతి చేసుకునే వాటిలో పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, లోహాలు, సిట్రస్ జాతి పండ్లు ఉన్నాయి.
ఈజిప్ట్‌కు ఎగుమతులు చేసే దేశాల్లో భారత్ ఐదో అతిపెద్ద దేశం, ఈజిప్ట్ నుంచి దిగుమతులు చేసుకునే దేశాల్లో 12వ అతిపెద్ద దేశం, అలాగే ఈజిప్ట్‌కు ఆరవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.

ఫొటో సోర్స్, Getty Images
ఈజిప్ట్ ప్రత్యేక సమీకరణం
1973 అక్టోబర్‌లో జరిగిన అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం కేవలం మూడు వారాలు మాత్రమే కొనసాగినప్పటికీ, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. చివరగా ఈ పరిణామాలే క్యాంప్ డేవిడ్ ఒప్పందానికి దారితీశాయి. దీని కింద ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను నెలకొల్పిన మొదటి అరబ్ దేశంగా ఈజిప్ట్ నిలిచింది.
ఇజ్రాయెల్‌లో యోమ్ కిప్పూర్ యుద్ధంగా, అరబ్ ప్రపంచంలో అక్టోబర్ యుద్ధంగా పిలిచే ఈ పోరు.. ఈజిప్ట్, సిరియాలు రెండు వైపుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో ప్రారంభమైంది. 1967లో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో కోల్పోయిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడమే వారి లక్ష్యం. ఆ యుద్ధంలో ఈజిప్ట్‌కు చెందిన సినాయ్, సిరియాకు చెందిన గోలన్ హైట్స్ ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించింది.
1967లో పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం, గాజా లాంటి పెద్ద ప్రాంతాలను కూడా ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఆనాడు అరబ్‌లు, పాలస్తీనియన్లు ఎదుర్కొన్న ఆ ఓటమిని "అల్ నక్సా" అని పిలుస్తారు. దీనికి ఎదురుదెబ్బ లేదా పరాజయం అని అర్థం.
సినాయ్‌పై ఈజిప్ట్ తిరిగి తన నియంత్రణను సాధించింది, కానీ సిరియాకు చెందిన గోలన్ హైట్స్ ఇంకా ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. అప్పట్లో ఈజిప్ట్‌ను అరబ్ లీగ్ నుంచి బహిష్కరించారు. ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చిన తర్వాత అన్ని అరబ్ దేశాలు కైరోతో దౌత్య సంబంధాలను తెంచుకున్నాయి.
పాలస్తీనా సమస్యను విస్మరించిందంటూ ఈజిప్ట్‌పై ఆరోపణలు వచ్చాయి. కానీ, 50 ఏళ్ల తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు మరికొన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలు నెలకొల్పుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి.
1994లో జోర్డాన్ కూడా ఈజిప్ట్ తరహాలోనే ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత 2020లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా పలు దేశాలు అబ్రహం అకార్డ్స్ కింద ఇజ్రాయెల్‌కు గుర్తింపునిచ్చాయి.
అయినప్పటికీ, ఈ కూటమి రూపుదిద్దుకున్న తర్వాత, ఇందులో చేరేందుకు కైరో మరింత ఆసక్తి చూపుతుందని తుర్కియే అధికారులు ఆశిస్తున్నారు.

ఫొటో సోర్స్, @SPA
మక్కా ఒప్పందం ఎవరికి కీలకం?
మక్కా ఒప్పందం ప్రాథమికంగా రక్షణ ఒప్పందం కంటే ఎక్కువగా సౌదీ అరేబియా ఇస్తున్న ఒక సందేశమని తుర్కియేలో కూడా పనిచేసిన ఒక మాజీ అరబ్ దౌత్యవేత్త 'మాడా మస్ర్'తో అన్నారు.
ఆయన అంచనా ప్రకారం, "ప్రస్తుత, స్థిరపడిన వ్యవస్థను పక్కనపెట్టి ఒక కొత్త రక్షణ వ్యూహాన్ని అభివృద్ధి చేసి, దానిపై పనిచేయగల సామర్థ్యం మాకు ఉంది, మేం ఆ పని చేస్తాం" అని సౌదీ అరేబియా సందేశం ఇస్తోంది.
'మాడా మస్ర్' తన కథనంలో "తుర్కియే పొరుగున ఉన్న ఇజ్రాయెల్‌తో పాకిస్తాన్ పొరుగున ఉన్న భారత్ పూర్తిగా సమన్వయం చేసుకుంటోంది. అంతేకాకుండా, భారత్, ఇజ్రాయెల్ రెండు దేశాలూ గ్రీస్‌తో కూడా సంబంధాలు కలిగి ఉన్నాయి. అంటే మ్యాప్‌లో భారత్, గ్రీస్, ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికే ఒక కూటమి రూపుదిద్దుకుంటోంది" అని తెలిపింది.
2023లో గాజా యుద్ధం ప్రారంభం కావడానికి ముందు న్యూదిల్లీలో జరిగిన జీ20 సమావేశంలో 'ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్' (ఐఎంఈసీ)ను భారత్ ప్రకటించింది. యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్, గ్రీస్ మీదుగా వెళ్లే సముద్ర మార్గాలు, రైల్వే నెట్‌వర్క్ ద్వారా భారతదేశాన్ని యూరప్‌తో అనుసంధానం చేయడమే ఈ బిజినెస్ కారిడార్ ఉద్దేశం.
కానీ, అనేక యుద్ధాలు.. పొత్తులు, పోటీల సమీకరణాలను మార్చేశాయి. ఆ తర్వాత పలు దేశాలు ఈ వాణిజ్య కారిడార్‌ను అనుమానపు దృష్టితో చూడటం ప్రారంభించాయి. తమ ప్రభావంతో పాటు ఆర్థిక ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషించడం మొదలుపెట్టాయి.
"ఐఎంఈసీ ఇప్పుడు కేవలం ఊహల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. సౌదీ అరేబియా, యూఏఈ మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఇజ్రాయెల్ వేరొక యుద్ధంలో కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఐఎంఈసీని ఓ కొలిక్కి తేవడం కష్టమే. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వచ్చే వరకు ఐఎంఈసీ కార్యరూపం దాల్చడం సాధ్యం కాదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సంబంధాలు సాధారణ స్థితికి వచ్చేలా కనిపించడం లేదు" అని ఇంద్రాణీ బాగ్చీ అన్నారు.
మక్కా ఒప్పందం వల్ల ప్రభావం పడుతుందని భావిస్తున్న దేశాలు దీనిపై ఆచితూచి స్పందించాయి.
ఇరాన్ నుంచి తక్షణమే స్పందన వచ్చినప్పటికీ, అందులో ఎలాంటి ఉత్సాహం కనిపించలేదు. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడొకరు ఈ ఒప్పందాన్ని బహిరంగంగా తోసిపుచ్చారు. దశాబ్దాల పాటు అమెరికాపై ఆధారపడటం సౌదీ అరేబియా భద్రతకు ఎంత మేలు చేసిందో, తుర్కియే, పాకిస్తాన్‌లతో కాగితంపై కుదిరిన ఒప్పందం అంతకంటే ఎక్కువ చేసిందేమీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఇజ్రాయెల్ సైనిక చర్యల స్వేచ్ఛపై ఈ ఒప్పందం చూపగల ప్రభావాన్ని ఇజ్రాయెల్ మీడియా, విశ్లేషకులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. మక్కా ఒప్పందానికి ముందే, తుర్కియే-పాకిస్తాన్ కూటమిని ఒక సంభావ్య శత్రు వర్గంగా ఇజ్రాయెల్‌కు చెందిన కొన్ని వర్గాలు అభివర్ణించాయి.
అత్యంత సంయమనంతో స్పందిస్తూ.. పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. పాకిస్తాన్ అణు సామర్థ్యానికి సంబంధించిన ఏ పరిణామంపైనైనా భారతదేశానికి ఉన్న చారిత్రక సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఈ స్పందన కూడా ఒక ముఖ్యమైన సంకేతమనే చెప్పాలి.
మరోవైపు, ఈ ఒప్పందంపై సంతకాలు జరిగిన తొలి రోజుల్లో అమెరికా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























