చుట్టూ ఉన్న బావుల్లో నీళ్లు నిశ్చలంగా ఉన్నా, ఆ బావిలో నీళ్లు మాత్రం అలల్లా ఎందుకు ఎగసి పడుతున్నాయి?

ఫొటో సోర్స్, Rajesh Ambaliya
సహజంగా బావిలో నీరు నిశ్చలంగా ఉంటుంది. కానీ, గుజరాత్‌లోని మోర్బీ జిల్లా వీర్‌పర్డా గ్రామంలో ఓ బావిలోని నీరు అలల మాదిరి ఎగసిపడుతూ బావి అంచులను తాకుతోందని స్థానికులు చెబుతున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా నీరు అటూ ఇటూ ఊగుతూ అలల్లా ఎగసిపడటం ఆ వీడియోల్లో కనిపిస్తోంది.
అయితే ఈ నీటి కదలికలు నిరంతరం జరగడం లేదు. నీరు కొంతసేపు నిశ్చలంగా ఉన్న తరువాత కదలికలు మళ్లీ మొదలవుతున్నాయి.
అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ రాజేష్ అంబాలియా ఆ ప్రాంతానికి వెళ్లారు. స్థానికులతో మాట్లాడారు.
బావిలో నీరు ఎగసిపడుతున్న వీడియో వైరల్ కావడంతో ఈ దృశ్యాన్ని చూసేందుకు చాలామంది ప్రజలు అక్కడికి వచ్చారు. కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులు కూడా బావిని సందర్శించారు.


ఫొటో సోర్స్, Rajesh Ambaliya
మధ్యాహ్నం వేళల్లో..
ఈ పొలం యజమాని ప్రాణ్‌జీవన్ సాదరియా ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు.
"ఈ వారంలో మొదటి రెండు రోజులు (ఆగస్టు 2, 3 తేదీలలో) ఇక్కడకు వచ్చాను. అప్పుడు కూడా బావిలోని నీరు కదులుతూ అలల్లా ఎగసిపడుతూనే ఉంది. మధ్యాహ్నం తరువాత బావిలో నీటిలో కదలిక ఏర్పడి అలల్లా ఎగసిపడటం కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. కాసేపటి తరువాత బావి ప్రశాంతంగా మారుతోంది’’ చెప్పారు.
అయితే ఆగస్టు 4వ తేదీన బావి నీటిలో ఎటువంటి కదలికలు లేవు. కానీ తిరిగి 5,6 తేదీలలో నీరు కదలడం మొదలైంది.
సంబంధిత అధికారులు కూడా బావిని పరిశీలించి, ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఫొటో సోర్స్, Rajesh Ambaliya
భూకంపంతో సంబంధం ఉందా?
ఈ ఘటనపై స్థానికుల్లో అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు దీనిని భూకంపానికి సంబంధించినదిగా భావిస్తున్నారు. అయితే ఈ బావికి సమీపంలో మరో రెండు, మూడు బావులు ఉన్నా, వాటిలోని నీరు మాత్రం ఎలాంటి కదలిక లేకుండా నిశ్చలంగా ఉన్నాయి.
ప్రాథమికంగా బావి లోపల ఉన్న గాలి కారణంగానే నీటిలో ఈ కదలిక ఏర్పడుతుండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
మోర్బీకి చెందిన భూగర్భశాస్త్రవేత్త జగదీశ్ వాఢేర్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ "నీరు కదులుతున్న విషయంపై మేం గాంధీనగర్‌లోని భూకంప పరిశోధనా సంస్థతో కూడా సంప్రదించాం. ఇక్కడ భూకంపానికి సంబంధించిన ఎలాంటి సూచనలు కనిపించలేదు'' అని వివరించారు.
"నీరు కదలడానికి ప్రాథమిక కారణం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు భూగర్భజలాలు రీచార్జ్ అవుతాయి. రీచార్జ్ జరిగే సమయంలో భూమిలోని రాళ్ల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాల నుంచి గాలి బయటకు రావచ్చు. ఆ గాలి కారణంగా కూడా నీటిలో కదలిక ఏర్పడవచ్చు. ఇతర కారణాలేవీ ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు'' అన్నారు.
"మరి పక్కనే ఉన్న ఇతర బావుల్లో కాకుండా ఈ ఒక్క బావిలోనే ఇలా ఎందుకు జరుగుతోంది?" అని ప్రశ్నిస్తే, ''చుట్టుపక్కల బావులున్నప్పటికీ, రాళ్లలోని ఖాళీ ప్రదేశాల నుంచి గాలి బయటకు వచ్చే బావుల్లోనే ఇలా నీరు కదలడం సాధారణం'' అని చెప్పారు.
మోర్బీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ఖరే కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
"భూగర్భశాస్త్రవేత్తల బృందం ఇక్కడికి వచ్చి పరిశీలించింది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం, వర్షం కారణంగా భూమి లోపల గాలిలో ఏర్పడే కదలికల ప్రభావంతో నీటిలో కూడా కదలిక ఏర్పడుతోంది" అన్నారు.
"ఇది భూకంపానికి సంబంధించినదేమో అని కొందరు అనుమానించారు. అయితే అలాంటి విషయం ఏదీ మా దృష్టికి రాలేదు" అని కలెక్టర్ తెలిపారు.
ఈ విషయంపై ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, వాటికి దూరంగా ఉండాలని మోర్బీ జిల్లా కలెక్టర్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు ఈ విషయాన్ని భూగర్బజల విభాగానికి కూడా తెలియజేశామని ఆయన తెలిపారు. ఆ శాఖ అధికారులు రాబోయే రోజుల్లో బావిని సందర్శించి, దీనిపై తమకు నివేదిక అందిస్తారని కలెక్టర్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























