ఇందిరాగాంధీకే ప్రభుత్వ వ్యతిరేకత తప్పలేదు.. మోదీ మాత్రం ఎలా ఎదుర్కొంటున్నారు, ఏదో ఉంది: రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

ఆంగ్ల దినపత్రిక ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బుధవారం ప్రచురించిన ఒక కథనం తర్వాత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

తాను మూడేళ్లుగా ఆధారాలతో 'ఓట్ల దొంగతనం' అంశాన్ని లేవనెత్తుతున్నానని, ఇప్పుడు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కూడా ఎలక్షన్ కమిషన్‌లోని ‘అవకతవకల’ అంశాన్ని ప్రస్తావించారని రాహుల్ ఆరోపించారు.

2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు తాను 'ఓట్ల దొంగతనం' అంశాన్ని లేవనెత్తిన విలేకరుల సమావేశాలు, కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.

ఇందిరా గాంధీకి ప్రజాదరణ తారస్థాయిలో ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఓడిపోయారని పేర్కొన్న రాహుల్, ఇటీవలి కాలంలో 'ప్రభుత్వ వ్యతిరేకత' ప్రభావం ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆయన, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు.

రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందించిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది మాట్లాడుతూ.. ఎన్నికల్లో పారదర్శకత పెరిగినప్పటి నుంచి అధికారంలోకి రావడం కాంగ్రెస్‌కు కష్టమైందని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’ కథనంలో ఏముంది?

‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన దర్యాప్తు కథనం తర్వాత ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఎలక్షన్ కమిషన్‌ తీసుకున్న చర్యలపై 10 నెలల్లో 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని, నిర్ణయాల నుంచి తమను దూరంగా ఉంచడం, కొత్త ఓటర్లను చేర్చడం, ఓటర్ల పేర్లను తొలగించడం వంటి అంశాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేశారని.. అలాగే "అనధికారిక, చట్టవిరుద్ధమైన" చర్యలు అంటూ కొన్ని నిర్ణయాలను ప్రశ్నించినట్లు ఆ కథనం పేర్కొంది.

ప్రధాని మోదీ, అమిత్ షా, గౌతమ్ అదానీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలేంటి?

హరియాణా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌వంటి రాష్ట్రాల్లో గతంలో ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు మారుతూ ఉండేవని, కానీ అకస్మాత్తుగా ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించడం మానేసిందని రాహుల్ గాంధీ అన్నారు.

"నేను ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చా. 50 ఏళ్లకు పైగా ఒక రాజకీయ కుటుంబంలో గడిపా. ప్రజాస్వామ్య వాతావరణంలో పనిచేసే ఏ రాజకీయ నాయకుడూ ఇలాంటి ప్రకటన చేయలేడు. ఎందుకంటే భారతదేశంలో ప్రభుత్వ వ్యతిరేకత అనే ఒక ప్రాథమిక శక్తి ఉంటుంది. అది చాలా వేగంగా ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకంగా మారుతుంది. ఎవరినీ వదిలిపెట్టదు" అని ఆయన తెలిపారు.

"బంగ్లాదేశ్ యుద్ధంలో విజయం సాధించి, తన ప్రజాదరణ తారస్థాయిలో ఉన్నప్పటికీ, ఆ తర్వాత అకస్మాత్తుగా ఒకటి, రెండేళ్లలోనే తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఇందిరా గాంధీ ఎదుర్కొన్నారు" అని రాహుల్ గాంధీ అన్నారు.

"అనేక మంది నాయకులకు ఇలాగే జరిగింది. కాంగ్రెస్ నాయకులకూ జరిగింది, ప్రాంతీయ పార్టీల నాయకులకూ జరిగింది. కానీ నరేంద్ర మోదీకి మాత్రం ఇలా జరగడం లేదు. అమిత్ షాకు, బీజేపీకి కూడా జరగడం లేదు. అందుకు ఏదో కారణం ఉంది" అని ఆయన అన్నారు.

"భారతదేశంలో అతిపెద్ద రాజకీయ శక్తి ఎక్కడ మాయమైందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. చివరకు దానికి సమాధానం దొరికింది. ఓటు మన దేశానికి పునాది. ఎలక్షన్ కమిషన్ ఆ ఓటును భద్రపరుస్తుంది. దానికి రాజ్యాంగం నుంచి శక్తి లభిస్తుంది. ఓట్లు నాశనమైతే మన రాజ్యాంగం కూడా నాశనమవుతుంది" అని అన్నారు.

"అప్పుడు రాజ్యాంగానికి ఎలాంటి శక్తి ఉండదు, దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. రాజ్యాంగం నాశనమైతే మన చట్టాలు అంతమవుతాయి, వ్యవస్థలకు ఎలాంటి అర్థం ఉండదు. ఇది మన ఓటుపై దాడి. ప్రతి పౌరుడి భావప్రకటన స్వేచ్ఛపై దాడి. ఓట్ల విషయంలో ఏదో ఒక సమస్య ఉందని నిరంతరం చెబుతూనే ఉన్నాం. ఎలక్షన్ కమిషనే ఓటును భద్రపరుస్తుంది" అని రాహుల్ గాంధీ అన్నారు.

జ్ఞానేశ్ కుమార్

ఫొటో సోర్స్, Ishant Chauhan/Hindustan Times via Getty Images

"ఓట్ల చోరీ, చట్టాల చోరీ, వ్యవస్థల చోరీ"

రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, అమిత్ షా, గౌతమ్ అదానీ సహా ఏడుగురి ఫొటోలను చూపిస్తూ, "వీరు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులు. భారత ఎన్నికల్లో 100 శాతం అక్రమాలు జరుగుతున్నాయి" అని ఆరోపించారు.

"చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ప్రశ్నలు లేవనెత్తారు. నేను కూడా ఈ ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నా. ఇప్పుడు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కూడా ప్రశ్నలు లేవనెత్తారు. జ్ఞానేశ్ కుమార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా ఎంపిక చేశారు. ఇప్పుడు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు మన ఓటింగ్ వ్యవస్థకు జరుగుతున్న నష్టానికి జ్ఞానేశ్ కుమారే బాధ్యుడని చెబుతున్నారు" అని రాహుల్ గాంధీ అన్నారు.

"ఓట్ల చోరీ తర్వాత చట్టాల చోరీ జరుగుతుంది, ఆ తర్వాత వ్యవస్థల చోరీ జరుగుతుంది. ఓట్ల చోరీ జరిగి ఉంటే, పార్లమెంటులో కూర్చున్న ఏ ఎంపీ చట్టం చేసినా.. అది చట్టవిరుద్ధమే" అని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక టైమ్‌లైన్‌ను కూడా ప్రదర్శించారు.

ఎలక్షన్ కమిషన్‌లో అవకతవకలు, 'ఓట్ల దొంగతనం' అంశాలను తాను ఎప్పుడు, ఎప్పుడు లేవనెత్తారో అందులో వివరించారు.

జ్ఞానేశ్ కుమార్ ఎంపిక సమయంలో తాను తన అసమ్మతి నోట్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చానని, అయినప్పటికీ మోదీ జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేశారని కూడా రాహుల్ గాంధీ తెలిపారు.

"వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. లోపల నుంచి మాకు నిరంతరం సమాచారం అందుతోంది" అని ఆయన అన్నారు.

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది

బీజేపీ స్పందనేంటి?

రాహుల్ గాంధీ ఆరోపణలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది మాట్లాడారు. ''కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ మరోసారి మీ ముందుకు ఒక పీపీటీని తీసుకొచ్చారు, అది ఎవరికీ తెలియని గుర్తుతెలియని, అనుమానాస్పద సోర్సెస్ నుంచి వస్తుంటుంది. ఆయనకు భారతీయ రాజకీయాల గురించి ఎలాంటి అవగాహన లేదు. 1967 నుంచి తమిళనాడులో కాంగ్రెస్ అధికారంలో లేదు. అప్పట్లో బీజేపీ అసలు ఉనికిలోనే లేదు. బెంగాల్‌లో 1977 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. బీహార్‌లో 1990 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. యూపీలో 1989 నుంచి కాంగ్రెస్ అధికారంలో లేదు. ఒడిశాలో 1999 నుంచి కాంగ్రెస్ అధికారంలో లేదు. ఈ విషయంపై రాహుల్ గాంధీకి ఎటువంటి పరిజ్ఞానం లేదు... ఎప్పుడైతే పారదర్శక ఎన్నికలు జరగడం ప్రారంభమయ్యాయో, సీసీటీవీ కెమెరాలు వచ్చాయో, స్వతంత్ర మీడియా వచ్చిందో, అప్పటి నుంచి వారు అధికారంలోకి రావడం కష్టంగా మారింది'' అని సుధాన్షు త్రివేది అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)