ఇండోనేషియా: వక్కలు నమలడానికి డ్రగ్స్‌ వాడకానికి సంబంధముందా, తాజా పరిశోధనలో ఏం తేలింది?

ఇండోనేషియా, డ్రగ్స్, తమలపాకు వక్కలు, గ్రిఫిత్ యూనివర్సిటీ

ఫొటో సోర్స్, MAPANG Project

ఫొటో క్యాప్షన్, పాతిక వేల ఏళ్ల కిందటే కొన్ని ఇండోనేషియా తెగలు వక్కలను మత్తు పదార్థాలుగా ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయి.
    • రచయిత, ఎల్లా కిప్లింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

మనుషుల మానసిక స్థితిని మార్చే పదార్థాలను శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే చాలా ముందునుంచే ఉపయోగించి ఉండవచ్చని తాజా పరిశోధన వెల్లడించింది.

పాతిక వేల ఏళ్ల కిందటే కొన్ని ఇండోనేషియా తెగలు వక్కలను మత్తు పదార్థాలుగా ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయి.

ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మనుషుల్లో తొలి వేటగాళ్ల అస్థిపంజర అవశేషాల్లో కొన్ని అసాధారణ మార్పులను గుర్తించారు. ఈ మార్పులకు, వక్కలు నమలడానికి సంబంధం ఉందని వారు భావిస్తున్నారు.

"ప్రపంచంలో ఎక్కడైనా మత్తు పదార్థాల వినియోగానికి లభించిన అత్యంత పురాతన ఆధారం ఇదే కావచ్చు" అని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ ఆడమ్ బ్రమ్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇండోనేషియాలోని సులవేసి ద్వీపానికి చెందిన ఇద్దరు ప్రాచీన వేటగాళ్ల అరుదైన అస్థిపంజర అవశేషాలను కనుగొన్నట్లు 'సైన్స్ అడ్వాన్సెస్' జర్నల్‌లో ప్రచురితమైన ఈ కొత్త అధ్యయనంలో పరిశోధకులు తెలిపారు.

అందులో ఒకటి 25,000-16,000 సంవత్సరాల క్రితం నాటిది కాగా మరొకటి 7,600-6,300 సంవత్సరాల క్రితం నాటిది. ఈ ఇద్దరు వేటగాళ్ల దంతాలపై లోతైన, గుండ్రని గీతలతో కూడిన అసాధారణమైన అరుగుదల కనిపించింది.

ఈ ఇద్దరు వేటగాళ్ల దంతాల్లోనూ అసాధారణమైన అరిగిపోయిన ఆనవాళ్లు కనిపించాయి. పళ్లపై లోతైన, గుండ్రటి గీతలు ఉన్నాయి. మొత్తం వక్కలను నోట్లో పెట్టుకుని చప్పరించడం వల్లే ఈ గీతలు ఏర్పడ్డాయని పరిశోధకులు గుర్తించారు.

ఇండోనేషియా, డ్రగ్స్, తమలపాకు వక్కలు, గ్రిఫిత్ యూనివర్సిటీ

ఫొటో సోర్స్, professor Adam Brumm

ఫొటో క్యాప్షన్, తమలపాకు గింజలను తిన్నప్పుడు ఉల్లాస భావన, చురుకుదనం కలుగుతాయి

డ్రగ్స్ వాడకానికి ఇదే మూలమా?

వక్కలను నమిలినప్పుడు అవి స్వల్ప ఉల్లాసాన్ని, చురుకుదనాన్ని కలిగిస్తాయి.

బ్రమ్ మాట్లాడుతూ, "పాశ్చాత్య సమాజాల్లో దీని గురించి పెద్దగా తెలియకపోయినా, మానసిక ప్రభావం కలిగించే పదార్థాలలో మద్యం, కెఫీన్, నికోటిన్ తర్వాత ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే నాలుగో పదార్థం ఇదే" అని అన్నారు.

సుమారు 13వేల ఏళ్ల క్రితం వ్యవసాయం ప్రారంభమైన తర్వాతే, పులియబెట్టిన మద్య పానీయాలతో డ్రగ్స్ వాడకం మొదలైందని గతంలో భావించేవారు.

అయితే, చాలా పురాతన కాలంలోనే మత్తు పదార్థాల వినియోగం ప్రారంభమై ఉండొచ్చనే అవకాశాన్ని ఈ సిద్ధాంతం పరిగణనలోకి తీసుకోలేదని బ్రమ్ అన్నారు.

"ఈరోజు మనకు తెలిసిన వక్కలను నమిలే పద్ధతికి ఆధారమైన పురాతన ఆచారాన్ని గుర్తించడం ద్వారా, ఆధునిక కాలంలోని కొన్ని మత్తు పదార్థాల వినియోగ పద్ధతులకు వేటగాళ్ల సంప్రదాయాల్లోనే లోతైన మూలాలు ఉన్నాయని ఈ అధ్యయనం సూచిస్తోంది" అని ఆయన చెప్పారు.

ఆధునిక కాలంలో, వక్కలను ప్రాసెస్ చేసి, సున్నం ఇతర పదార్థాలతో కలిపి 'కిళ్లీ'లాగా నములుతున్నారు. ఈ మిశ్రమం దక్షిణాసియా, ఆగ్నేయాసియాలలో ఎంతో ప్రాచుర్యం పొందింది.

ప్రపంచ జనాభాలో దాదాపు పదో వంతు మంది దీన్ని నములుతున్నారు.

పరిశోధకులు వక్కలను కృత్రిమ లాలాజలంలో నానబెట్టి ప్రయోగాలు చేశారు. కేవలం వక్కలను నోట్లో చప్పరించడం ద్వారా కూడా మెదడు పనితీరును మార్చే సైకోయాక్టివ్ సమ్మేళనాలు తగినంత మొత్తంలో విడుదలవుతున్నట్లు వాళ్లు కనుగొన్నారు.

వక్కలను చప్పరించడం వల్ల కలిగే ప్రభావం, ప్రస్తుతం వక్క మిశ్రమాన్ని నమలడం వల్ల కలిగే ప్రభావం కంటే తక్కువగా ఉండి ఉండవచ్చని పరిశోధకులు తెలిపారు. అయినప్పటికీ, ఈ అలవాటు తీవ్రంగా ఉండటం వల్ల తీవ్రమైన చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశం ఉందని వారు సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)