50 ఏళ్ల కిందట మరణించిన మావోను చైనా జెన్ జడ్ ఎలా చూస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images/BBC
- రచయిత, చెన్ యాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
''గొప్ప వ్యక్తులు చాలామంది ఉండొచ్చు. కానీ టీచర్ మాత్రం ఒక్కరే ఉన్నారు''
చాలా మంది చైనా యువత 50 ఏళ్ల కిందట మరణించిన తమ నాయకుడు మావో జెడాంగ్ను ''టీచర్'' అని పిలుచుకుంటూ ఉంటారు.
వీడియో ప్లాట్‌ఫామ్ బిలిబిలిలో మావో జెడాంగ్ లేదా టీచర్ అని సెర్చ్ చేస్తే అనేక సినిమాలు, టీవీ డ్రామాల్లో మావో ఉన్న దృశ్యాలతో రూపొందించిన ఎన్నో వీడియోలు కనిపిస్తుంటాయి.
ఈ వీడియోల్లో మావో జీవితంలోని వివిధ దశలను చూపిస్తారు.
మావో యువకుడిగా ఉన్నప్పుడు, మిలటరీ కమాండర్‌గా పనిచేసిన కాలం, ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్‌తో చైనా సంబంధాలను నెరపడం వంటివి సహా అనేకం ఈ వీడియోల్లో ఉంటాయి.

చాలా వీడియోలకు కోట్ల సంఖ్యలో వ్యూస్, వేలసంఖ్యలో కామెంట్లు ఉంటాయి.
''ఆ మహానుభావుడు చిరకాలం నిలిచిపోతారు''వంటి ప్రశంసలు సహా అనేక కామెంట్లు ఉంటాయి.
బిలిబిలీని ఎక్కువగా చూసేది యువత. బిలిబిలి ప్రేక్షకుల్లో 60 శాతం మంది వయసు 18 నుంచి 24 మధ్య ఉంటుంది.
మరి చనిపోయిన 50 ఏళ్ల తర్వాత చైనా యువ సంస్కృతిలో మావో మళ్లీ ఇంత ప్రముఖంగా ఎందుకు కనిపిస్తున్నారు?

ఫొటో సోర్స్, Mytruestory Photography via Getty Images
మావో అప్పుడు..ఇప్పుడు
20వ శతాబ్దపు చైనా రాజకీయాల్లో మావో అత్యంత కీలకమైన వ్యక్తిగా నిలిచారు. 1949లో చైనా రిపబ్లిక్‌గా మారిన దగ్గరనుంచి 1976లో ఆయన చనిపోయే వరకు దేశాన్ని, కమ్యూనిస్ట్ పార్టీని నడిపించారు. గ్రేట్ లీప్ ఫార్వర్డ్, సాంస్కృతిక విప్లవంవంటి భారీ రాజకీయ కార్యక్రమాల ద్వారా చైనాను నడిపించారు. ఇవి దేశ ఆర్థికవ్యవస్థకు, సమాజానికి కొత్తరూపు ఇచ్చాయి. కానీ ఈ క్రమంలో లక్షలమంది చనిపోయారు.
ఇవాళ మావోపట్ల ఆకర్షితులవుతున్నవారిలో నాన్జింగ్కు చెందిన డాంగ్ ఒకరు. నాన్జింగ్లో ఆయన యూనివర్శిటీ విద్యను అభ్యసించడానికి సిద్ధమవుతున్నారు.
చాంగ్షాలోని ఆరెంజ్ ఐల్లో మావో యువకుడిగా ఉన్నట్లుగా ఉన్న భారీ విగ్రహం ముందు ఇద్దరు యువతులు దేశభక్తి గీతం పాడుతున్న వీడియో చూసి డాంగ్ ఇటీవల భావోద్వేగానికి గురయ్యారు.
''వాళ్లెంతో భావోద్వేగంతో పాడారు. ఆ విగ్రహం చాలా పెద్దగా, యువ మావో రూపంలో ఉంది. అది చూడగానే నాకు ఒక్కసారిగా భావోద్వేగంగా అనిపించింది'' అని డాంగ్ బీబీసీతో చెప్పారు.
డాంగ్‌తో పాటు చదివే చాలా మంది విద్యార్థులు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించే ఆన్లైన్ గ్రూపుల్లో పాల్గొంటారు. వీటిని సాధారణంగా కీబోర్డ్ పాలిటిక్స్ సర్కిల్ అని పిలుస్తారు.
2019 నుంచి సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మావో జెడాంగ్ పుస్తకం సింఘువా యూనివర్శిటీ లైబ్రరీలో అత్యధికంగా తీసుకెళ్లి చదివిన పుస్తకంగా మారడం దీనికి ఇంకో ఉదాహరణ. 2025వరకు ఏటా ఇదే పరిస్థితి కొనసాగింది.

ఫొటో సోర్స్, History/Universal Images Group via Getty Images
'70 శాతం విజయాలు, 30 శాతం తప్పులు'
ముఖ్యంగా యువతకు మావోపై ఉన్న ఆసక్తి, వారి తల్లిదండ్రులు పెరిగిన కాలంలో మావో అంటే ఉన్న అభిప్రాయానికి భిన్నంగా ఉంది.
డెంగ్ షియావోపింగ్ నాయకత్వంలో రూపొందించిన ఒక తీర్మానాన్ని 1981లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆమోదించింది. అందులో మావో సాధించిన విజయాలతో పాటు ఆయన చేసిన తప్పులను కూడా పరిగణనలోకి తీసుకుని అధికారికి అంచనాను రూపొందించారు. దీనిని సాధారణంగా '70 శాతం విజయాలు, 30 శాతం తప్పులు' అని చెబుతారు.
డెంగ్, జియాంగ్ జెమిన్ పాలనాకాలాల్లో రైల్వేస్టేషన్లు, బహిరంగప్రదేశాలు, తరగతిగదుల్లో ఉన్న మావో చిత్రాలు క్రమంగా కనిపించకుండాపోయాయి.
ప్రజలు మావోను దేవుడిలా కాకుండా పరిమితులు, లోపాలు ఉన్న ఒక చారిత్రక వ్యక్తిగా చూడడం ప్రారంభించారు. అదే సమయంలో కొత్త ఆర్థిక శకానికి డెంగ్ ప్రతీకగామారారు. దేశంలో మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడం, దానిని ప్రపంచానికి తెరవడం ఆయన సంస్కరణల ప్రధాన లక్ష్యం.
ఇప్పుడు చైనా యువతలో మావో మళ్లీ ప్రాధాన్యం పొందుతున్నారు. డాంగ్ సహా చాలా మంది ఆయన్ను పేరుతో కాకుండా టీచర్ అని పిలుస్తున్నారు.
ఈ పేరుకు ఓ ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. 1970లో అమెరికా జర్నలిస్ట్ ఎడ్గర్ స్నోతో జరిగిన సమావేశంలో 'ఫోర్ గ్రేట్స్' వంటి బిరుదులు తనకు నచ్చవని మావో చెప్పినట్టు సమాచారం. సాంస్కృతిక విప్లవం సమయంలో ఆయన గొప్ప ఉపాధ్యాయుడు. నాయకుడు. కమాండర్, మార్గదర్శకుడిగా ప్రశంసించేందుకు ఈ నినాదాన్ని ఉపయోగించేవారు. వాటిలో ఒక్కటి మాత్రమే మిగిలింది. టీచర్. ఎందుకంటే నేనూ ఉపయాధ్యాయుణ్నే''
డాంగ్, ఆయన సహచర విద్యార్థులు మావో గురించి స్వేచ్ఛగా చాలా సేపు చర్చించుకుంటారు. కానీ ప్రస్తుత అధ్యక్షుడు షి జిన్ పింగ్ గురించి మాత్రం బహిరంగంగా చర్చించలిగే పరిస్థితి లేదని డాంగ్ భావిస్తున్నారు.
చైనా ఆన్లైన్ ప్రపంచంలో కొంతవరకు బహిరంగ చర్చకు అవకాశం ఉన్నప్పటికీ దేశ అత్యున్నత నాయకత్వానికి సంబంధించిన సున్నితమైన అంశాలను ప్రజలు ఉద్దేశపూర్వకంగా చర్చించకుండాఉంటారని మెర్కేటర్ ఇన్స్టిట్యూట్ ఫర్ చైనా స్టడీస్ చేసిన అధ్యయనంలో తేలింది.
ఈ పరిమితమైన చర్చావాతావరణానికి ప్రభుత్వ సెన్సార్ షిప్ తో పాటు ప్రజలు తమను తాము నియంత్రించుకోవడం కూడా కారణమని ఆ నివేదిక పేర్కొంది.

ఫొటో సోర్స్, MAGWIN/Moment via Getty Images
'ఇది కేవలం గతంపై మమకారం కాదు'
కొందరు యువత మావోపై మళ్లీ ఆసక్తి చూపడం సంపదలో అసమానతలు, సామాజికంగా ఎదిగే అవకాశాలు తగ్గిపోవడం వంటి సమస్యలపై వారి ఆలోచనలతో ముడిపడిఉందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుత యువత గత తరాల కంటే పూర్తిగా భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటోందని చైనా యువత రాజకీయ సంస్కృతిపై చాలా కాలంగా అధ్యయనం చేస్తున్న లైడెన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఫ్లోరియర్ ష్నైడర్ చెప్పారు.
వారి తల్లిదండ్రుల తరం ఆర్థిక అభివృద్ధి అందరి జీవన ప్రమాణాలను పెంచుతున్న కాలాన్ని చూసింది. కానీ ఇప్పుడు చాలా మంది యువత డెంగ్ సంస్కరణలు వాగ్ధానం చేసిన అభివృద్ధిలో తాము వెనకబడిపోయామని భావిస్తున్నారు.
చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాల ప్రకారం 2026 జూలైలో 16 నుంచి 24 ఏళ్ల వయసున్న చదువుకోని యువతలో పట్టణ నిరుద్యోగరేటు 17.9శాతానికి పెరిగింది. మూడేళ్ల క్రితం గణాంకాల విధానాన్ని మార్చిన తర్వాత ఇదే అత్యధిక స్థాయి.

ఫొటో సోర్స్, AFP via Getty Images
996 అంటే...
యువత రోజువారీ భాషలోకి కొత్త పదాలు కూడా వచ్చాయి. 996అంటే ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకు వారానికి ఆరు రోజులుపనిచేయడం.
చాలామంది లై ఫ్లాట్ అనే విధానాన్ని ఎంచుకుంటున్నారు. అంటే ఏం చేయకుండా లేదా తక్కువ ప్రయత్నంతో ప్రశాంతంగా ఉండడం. ఎందుకంటే ఇన్వల్యూషన్ అనే పోటీ జీవితంలో అదే స్థాయిలో ఉండడానికే మరింత ఎక్కువగా కష్టపడాల్సి వస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారీ విధానంపై మావో చేసిన విమర్శలు కొందరు యువతను ఆకట్టుకుంటున్నాయి. వ్యవస్థను నియంత్రిస్తోంది పెట్టుబడి అని భావిస్తూ కొందరు తమ అసంతృప్తిని వ్యక్తంచేయడానికి మావో ఆలోచనలను ఉపయోగిస్తున్నారని ష్నైడర్ చెప్పారు. మరికొందరు జీవితంలోని సమస్యలను ఎదుర్కోడానికి మావో రచనలను ఓ మార్గదర్శకంగా చూస్తున్నారు. డాంగ్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. మా తరం చిన్నప్పటుంచే కష్టపడి పనిచేస్తే దానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని నేర్చుకుంది. కానీ మేం నిజంగా పెద్దయ్యాక ఉద్యోగాలు అంత సులభంగా దొరకడం లేదని, ఇళ్లు కొనడం మా సామర్థ్యానికి అందని విషయమని తెలుసుకున్నాం.
మావో ఉపయోగించిన భాష చాలా సూటిగా ఉంటుందని, ఆయన ప్రజలను వివిధ వర్గాలను విభజించి విషయాలను వివరించారని డాంగ్ చెప్పారు.
''ఎవరు అణిచివేశారు, ఎవరు అణిచివేతకు గురవుతున్నారు'' అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెబుతారు.
ఆ సరళమైన విధానం ఆర్థికరంగంలోకి క్లిష్టమైన పదజాలం కంటే సులభంగా అర్ధమవుతుంది. మావోపై మళ్లీ ఆసక్తి పెరగడం కేవలం గతాన్ని తలచుకోవడం వల్ల కాదు అని ష్నైడర్ అన్నారు.
''తాము ఎదుర్కొంటున్న అసమానతలు, అస్థిరతలను వివరించడానికి, వాటిని అర్ధం చేసుకోడానికి ఇప్పటికే ఉన్న చారిత్రక భాషను ఉపయోగించేందుకు యువత చేస్తున్న ప్రయత్నం ఇది'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ కాలం అద్భుతమైనదన్న భావన
మావోపై చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక అంచనా ఇప్పటికీ 1981తీర్మానంపైనే ఆధారపడిఉంది. అందులో మావో సాధించిన విజయాలకు ప్రధాన ప్రాధాన్యం ఇవ్వగా, ఆయన చేసిన తప్పులను పెద్దగా పరిగణనలోకి తీసుకోరు.
2021లో ఆమోదించిన పార్టీ మూడో చారిత్రక తీర్మానంలో చైనా దేశం గొప్ప పునరుజ్జీవనం అనే అంశాన్ని ప్రధానంగా పేర్కొన్నారు.
ఈ దృక్కోణంలో మావో విప్లవాన్ని చైనా తన కాళ్లపై తాను నిలబడినదశగా చూస్తారు. ప్రజాగణతంత్రాన్ని స్థాపించడం, దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడడం, భవిష్యత్తులో దేశాభివృద్ధికి పునాదులు వేయడం వంటివాటికి ఆ విప్లవం కారణమైందని భావిస్తారు. అందువల్ల మావో కేవలం విజయాలు, వైఫల్యాలను అంచనావేయాల్సిన చారిత్రకవ్యక్తి మాత్రమే కాదు. నేటి చైనా జాతీయశక్తి గురించి చెబుతున్న కథనాలకు ఆయనను ఓ ముఖ్యమైన మూలంగా కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు మావోపై మళ్లీ ఆసక్తి పెరగడానికి పార్టీ విద్యావిధానాలు కూడా కొంతవరకు కారణమని ష్నైడర్ అభిప్రాయపడుతున్నారు.
చాలామంది యువత దృష్టిలో మావో కాలం నాటి చైనా అంటే ఈ గొప్ప నాయకుడు ఎలాంటి ప్రశ్నలు లేని హీరోగా ఉన్న ఒక ఊహాజనిత ప్రపంచంగా మారింది.
గ్రేట్ లీప్ ఫార్వార్డ్, సాంస్కృతిక విప్లవం సమయంలో జరిగిన తీవ్రమైన విషాదాల గురించి చాలామంది యువతకు పూర్తిగా తెలియదని, లేదా వాటిలో మావో పాత్ర గురించి వక్రీకరించారని భావిస్తారని ఆయన అంటున్నారు.
మావోపై కిందిస్థాయి ప్రజల్లో పెరుగుతున్న ఈ అభిమానం బయటకు కనిపిస్తున్నదానికంటే ఎక్కువ రాజకీయ శక్తిని కలిగి ఉందని ష్నైడర్ హెచ్చరిస్తున్నారు.
''ఇది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్న అంశం. ఎందుకంటే ప్రజల నుంచి వస్తున్న ఈ మావో అభిమాన సంస్కృతిలో స్పష్టమైన ప్రజాకర్షక స్వభావం ఉంది. ఇది నేటిపాలనా విధానాలను ప్రశ్నించడంతో ఆగిపోతుందని చెప్పలేం. దీనిని చైనాలో కనిపించే జాతీయవాద భావాలతో ఆయన పోల్చారు.
ఇలాంటి ప్రజాకర్షక భావాలను కొంతమేర అణచివేయొచ్చు. కానీ వాటిని పూర్తిగా నియంత్రించడం చాలా కష్టం.
డాంగ్, ఆయన తరం యువతలో ప్రస్తుతం కనిపిస్తున్న మావో క్రేజ్ ఇప్పుడే ముగిసిపోయేలా కనిపించడం లేదు. ఇది కేవలం ఇంటర్నెట్ సంస్కృతికే పరిమితమవుతుందా లేక భవిష్యత్తులో మరింత స్థిరమైన రాజకీయ గుర్తింపుగా మారుతుందా అన్నది వేచిచూడాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























