గొడుగుతో విష ప్రయోగం.. లండన్‌లో బల్గేరియా రచయితను ఎలా హత్య చేశారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫియోనా మెక్‌డొనాల్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
జార్జి మార్కోవ్‌ను 1978లో లండన్‌లో ఒక గొడుగుతో పొడిచారు, ఇది కేజీబీ (సోవియట్ గూఢచార సంస్థ) చేసిన రాజకీయ విషప్రయోగంగా పలువురు అనుమానించారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత మార్కోవ్ మరణించారు.
ఈ హత్యకు కొన్నినెలల ముందే ఒక అజ్ఞాత వ్యక్తి ఈ కుట్ర గురించి తమను హెచ్చరించారని మార్కోవ్ భార్య, ఆయన అన్నయ్య మరుసటి ఏడాది బీబీసీ 'పనోరమా' కార్యక్రమానికి తెలిపారు.
"తన తొడకు ఏదో గుచ్చుకున్నట్లు ఆయనకు అనిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి, గొడుగు కిందపడేసిన ఒక వ్యక్తి ఆయనకు క్షమాపణలు చెప్పాడు".
బల్గేరియా ప్రభుత్వ అసమ్మతివాది, జర్నలిస్టు, రచయిత అయిన జార్జి మార్కోవ్ గురించి ఆయన భార్య అన్నాబెల్ మార్కోవ్ చెప్పిన మాటలివి.
1978 సెప్టెంబర్ 7న మధ్య లండన్‌లోని వాటర్లూ బ్రిడ్జ్ బస్టాప్ వద్ద 49 ఏళ్ల మార్కోవ్ బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో గొడుగుతో పొడిచారు. నాలుగు రోజుల తర్వాత ఆయన ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. రక్తంలో విషం చేరడం వల్లే ఆయన మరణించినట్లు వైద్యులు మొదట నిర్ధరించారు.

అయితే, మార్కోవ్ది రాజకీయ హత్య అని దర్యాప్తు అధికారులు త్వరలోనే గ్రహించారు. మరో బల్గేరియా ప్రవాసుడిని కూడా ఇలాగే లక్ష్యంగా చేసుకున్నారని, ఈ హత్యకు కూడా అత్యంత అధునాతన పద్ధతిని ఉపయోగించారని వారు గుర్తించారు.
మార్కోవ్ చనిపోవడానికి కొన్నినెలల ముందే, ఆయనపై విషప్రయోగం జరగబోతోందని ఓ అజ్ఞాత వ్యక్తి తమను ఎలా హెచ్చరించాడో 1979లో బీబీసీ 'పనోరమా' కార్యక్రమానికి ఆయన భార్య, అన్నయ్య వివరించారు.
కేజీబీ హత్యా దళం మాజీ అధిపతి, బల్గేరియా సీక్రెట్ సర్వీస్ మాజీ కల్నల్ల అప్పటి ఇంటర్వ్యూలను పరిశీలిస్తే, ఈ హత్యకు బల్గేరియా, సోవియట్ ప్రభుత్వాల అత్యున్నత స్థాయిల్లోనే కుట్ర జరిగినట్లు స్పష్టమైంది.

దర్యాప్తులో కీలక వివరాలు
మార్కోవ్ మరణించిన కొన్నిరోజులకు, ఆయన హత్య కుట్రకు బలయ్యారని నిర్ధరించే ఓ ఆధారాన్ని బ్రిటన్ ఉగ్రవాద వ్యతిరేక దళం కనుగొంది.
"మార్కోవ్ తొడలో లభించిన అత్యంత చిన్న లోహపు వస్తువును స్కాట్లాండ్ యార్డ్ ఫోరెన్సిక్ ప్రయోగశాలలో చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ పరీక్షించారు" అని పనోరమా రిపోర్టర్ మైఖేల్ కాకెరెల్ తెలిపారు.
"మైక్రోస్కోప్‌తో పరిశీలించినప్పుడు, అది గుండుసూది మొన కంటే చిన్నదైన అత్యంత అధునాతన లోహపు గుళిక అని స్పష్టమైంది. దానికి అటూఇటూ నాలుగు సూక్ష్మ రంధ్రాలు ఉన్నాయి, అందులో అత్యంత స్వల్ప పరిమాణంలో ప్రాణాంతకమైన విషం ఉండి ఉంటుందని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధరించారు" అన్నారు.
మార్కోవ్ మరణానికి అత్యంత ప్రమాదకరమైన 'రిసిన్' అనే విషపదార్థమే కారణమని బ్రిటన్ రసాయన, సూక్ష్మజీవ యుద్ధ పరిశోధనా కేంద్రమైన 'పోర్టన్ డౌన్' శాస్త్రవేత్తలు భావించారు. పనోరమా కథనం ప్రకారం, బ్రిటన్‌లో అంతకుముందెన్నడూ ఓ హత్య కోసం దీనిని ఉపయోగించలేదు.

అదే తరహాలో మరో ప్రవాసుడిపై దాడి
మార్కోవ్పై దాడికి పది రోజుల ముందు, బల్గేరియాకు చెందిన మరో ప్రవాసుడిపై అలాంటి దాడి జరిగి ఉండొచ్చన్న విషయం వెలుగులోకి వచ్చింది. వ్లాదిమిర్ కోస్టోవ్ తన భార్యతో కలిసి పారిస్ మెట్రో స్టేషన్ నుంచి బయటకు వస్తున్నప్పుడు వీపులో తీవ్రమైన నొప్పి వచ్చినట్లు అనిపించింది. ఆయన మూడు రోజుల పాటు తీవ్ర జ్వరంతో బాధపడ్డారు, అయితే ఆ తర్వాత కోలుకున్నారు.
మార్కోవ్ మరణవార్త విన్న తర్వాత కోస్టోవ్ తన వీపును ఎక్స్-రే తీయించుకున్నారు. అందులో ఓ చిన్న లోహపు వస్తువు ఉన్నట్లు తేలింది. పారిస్‌లోని ఒక క్లినిక్‌లో సర్జికల్ మాస్క్, గౌను ధరించిన ఓ ఫ్రెంచ్ పోలీసు అధికారి పర్యవేక్షణలో ఒక సర్జన్ ఆయనకు ఆపరేషన్ చేశారు.
"సర్జన్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది. ఆ లోహపు గుళికను ఏమాత్రం తాకకుండా ఆయన బయటకు తీశారు" అని కోస్టోవ్ బీబీసీకి చెప్పారు.
ఆ తర్వాత దాన్ని ఓ స్కాట్లాండ్ యార్డ్ ఇన్స్పెక్టర్కు అప్పగించి, విశ్లేషణ కోసం ఇంగ్లండ్‌కు తీసుకెళ్లారు.
కోస్టోవ్ వీపు నుంచి తీసిన గుళికను స్కాట్లాండ్ యార్డ్ లోహశాస్త్ర నిపుణులు అత్యంత శక్తిమంతమైన స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ను ఉపయోగించి పరిశీలించారు. అది అచ్చం మార్కోవ్ శరీరంలో దొరికిన గుళిక లాగానే ఉందని గుర్తించారు.
"రెండు గుళికల బరువు కచ్చితంగా ఒకేలా ఉంది" అని కాకెరెల్ చెప్పారు.
"రంధ్రాలు ఒకే చోట ఉన్నాయి, ఆ రెండు గుళికలనూ మానవ శరీరం తిరస్కరించని అరుదైన ప్లాటినం-ఇరిడియం మిశ్రమ లోహంతో తయారు చేశారు" అన్నారు.
కోస్టోవ్ శరీర కణజాలంలో రిసిన్ యాంటీబాడీలను పోర్టన్ డౌన్లోని టాక్సికాలజీ నిపుణులు గుర్తించారు. ఆ గుళికలో తగినంత విషం లేకపోవడం వల్లే ఆయన ప్రాణాలతో బయటపడ్డారని నిర్ధరించారు.
దీనికోసం వాడిన అధునాతన పద్ధతి, పక్కా ప్రణాళికతో జరిగిన దాడుల ఆధారాలను బట్టి చూస్తే... మార్కోవ్ మరణంలో ఏదైనా దేశానికి చెందిన రహస్య నిఘా సంస్థ పాత్ర ఉందని స్కాట్లాండ్ యార్డ్ ఓ నిర్ధరణకు వచ్చింది.

'బల్గేరియన్ భాషలోనే మాట్లాడుకున్నారు'
స్వదేశంలో నవలా రచయితగా, నాటక రచయితగా ఎంతో గుర్తింపు పొంది, అక్కడి ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా మెలిగిన మార్కోవ్... 1969లో అప్పటి కమ్యూనిస్ట్ బల్గేరియా నుంచి పారిపోయి వచ్చారు. యూకేలో స్థిరపడిన తర్వాత బల్గేరియా ప్రభుత్వానికి ఆయన బహిరంగ విమర్శకుడిగా మారారు. బీబీసీ వరల్డ్ సర్వీస్‌తో పాటు అమెరికా ప్రభుత్వ నిధులతో నడిచే మీడియా సంస్థ రేడియో ఫ్రీ యూరప్‌లో ఆయన పనిచేశారు.
తన భర్తను చంపడానికి జరుగుతున్న కుట్ర గురించి ముందే హెచ్చరికలు వచ్చాయని అన్నాబెల్ మార్కోవ్ చెప్పారు. 1978 మే నెలలో ఓ వ్యక్తి జార్జిని సంప్రదించినట్లు ఆమె బీబీసీకి తెలిపారు.
"వాళ్లు సాయంత్రమంతా బల్గేరియన్ భాషలోనే మాట్లాడుకున్నారు. మధ్యమధ్యలో జార్జి నా వైపు తిరిగి ఇంగ్లిష్‌లో 'ఈ వ్యక్తి చెబుతున్న విషయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి' అని అంటుండేవాడు" అన్నారామె.
ఆర్.ఎఫ్.ఈ కోసం జార్జి నిర్భయంగా రాస్తున్న ప్రసారాల కారణంగా ఆయన్ను చంపాలని బల్గేరియా అత్యున్నత రాజకీయ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారని ఆ అజ్ఞాత వ్యక్తి చెప్పినట్లు అన్నాబెల్ వివరించారు.
మార్కోవ్ సోదరుడు నికోలాయ్ కూడా దీన్ని ధ్రువీకరించారు. 1977 సెప్టెంబర్‌లో తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందని ఆయన వెల్లడించారు.
"ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, జార్జిని చంపాలని, ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లూ లేకుండా ఆయన్ను అంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పాడు" అని నికోలాయ్ బీబీసీకి తెలిపారు.
"మొదట్లో నేనది నమ్మలేదు. అది విడ్డూరంగా, అసాధ్యంగా అనిపించింది. కానీ, ఆ వ్యక్తి నాకు కొన్ని కచ్చితమైన వివరాలు చెప్పడంతో, ఇక అందులో సందేహించడానికి ఏమీ లేకుండా పోయింది. అవకాశం దొరికిన వెంటనే కచ్చితంగా జార్జిపై విషప్రయోగం జరుగుతుందని... అందుకోసం ఏదో ఒక రకమైన విషం లేదా బ్యాక్టీరియాను ఇప్పటికే పశ్చిమ ఐరోపాకు తీసుకొచ్చారని, అయితే అది కచ్చితంగా ఏంటనేది తనకు తెలియదని అతను నాతో చెప్పాడు" అన్నారాయన.

హత్య వెనుక భారీ కుట్ర
యూకేకు వెళ్లిన తర్వాత కూడా, ఆర్.ఎఫ్.ఈ ద్వారా చేసే ప్రసంగాలతో మార్కోవ్ స్వదేశంలో ప్రముఖుడిగానే కొనసాగారు. బల్గేరియా సమాజంలోని ఉన్నత స్థాయి వర్గాల నిజ జీవితం ఎలా ఉంటుందనే విషయాలపై ఆయన ప్రతి వారం కార్యక్రమాలను ప్రసారం చేసేవారు.
అధికారులు వాడే ప్రతి నల్లటి మెర్సిడెస్ కారుకు పక్కన, వెనుక భాగంలో ఉండే చిన్న కర్టెన్లను ఉద్దేశిస్తూ ఆయన తన ప్రసారాల్లో ఒకదానికి 'లైఫ్ బిహైండ్ ది కర్టెన్స్' (కర్టెన్ల వెనుక జీవితం) అని పేరు పెట్టారు. దేశంలో సంపూర్ణ అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే విషయాలను ఆయన వివరించారు. బంధుప్రీతి, ఆర్థిక అక్రమాలు, అవినీతికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆయన నిర్భయంగా బయటపెట్టారు.
మార్కోవ్ ప్రసారాలకు ఎలాంటి ప్రభావం లేదని బల్గేరియా ప్రభుత్వం అధికారికంగా కొట్టిపారేసినప్పటికీ... 'మై మీటింగ్స్ విత్ టోడార్ జివ్కోవ్' పేరుతో మార్కోవ్ చేసిన వరుస ప్రసంగాల పట్ల బల్గేరియా అధ్యక్షుడు టోడార్ జివ్కోవ్ అసంతృప్తిగా ఉన్నారని బీబీసీ గుర్తించింది.
"తనతో జరిగిన సమావేశాల గురించి మార్కోవ్ చేసిన ప్రసంగాలపై అధ్యక్షుడు చాలా కోపంగా ఉన్నారని మేం విన్నాం" అని ఆర్.ఎఫ్.ఈలో పనిచేసే బల్గేరియన్ బ్రాడ్‌కాస్టర్ కైరిల్ పనోవ్ చెప్పారు.
"బల్గేరియాలో నిషిద్ధంగా భావించే అంశాల గురించి, ప్రభుత్వం బయటపెట్టకూడదని భావించే విషయాల గురించి, అలాగే ప్రజలకు తెలియకూడదనుకునే రహస్యాల గురించి మార్కోవ్ బహిరంగంగా మాట్లాడారు" అన్నారు.
1956 నుంచి బల్గేరియాను పాలిస్తున్న జివ్కోవ్కు సోవియట్ యూనియన్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. రెండు దేశాల మధ్య ఉన్న బంధం ఒకే శరీరంలోని రెండు ఊపిరితిత్తుల్లాంటిదని, ఆ రెండింటికీ ఒకే రక్తం సరఫరా అవుతుందని ఆయన అభివర్ణించేవారు.
మార్కోవ్ హత్యలో సోవియట్ యూనియన్ ప్రమేయం కూడా కచ్చితంగా ఉంటుందని నిపుణులు భావించారు.
1971లో దేశం విడిచివెళ్లే వరకు బల్గేరియా రహస్య పోలీసు దళంలో కల్నల్‌గా పనిచేసిన స్టెఫాన్ స్వెర్డ్లోవ్, 1979లో బీబీసీతో మాట్లాడారు.
"దర్జావ్నా సిగుర్నోస్ట్ (బల్గేరియన్ సీక్రెట్ సర్వీస్)లోని ప్రతి విభాగాన్ని రష్యా కేజీబీకి చెందిన ఒక సలహాదారు నియంత్రిస్తుంటారు. కొన్నిసార్లు ఆయనను 'అంకుల్' అని పిలుస్తారు. ఆయన నేరుగా మాస్కోకు సమాచారం అందిస్తారు. రష్యన్లకు తెలియకుండా ఈ హత్య జరగడం అసాధ్యం" అని ఆయన అన్నారు.
కేజీబీ హత్యా దళం మాజీ అధిపతి అభిప్రాయం ప్రకారం, ఈ హత్యలో వాడిన పద్ధతి సోవియట్ ప్రమేయాన్ని సూచిస్తోంది.
"ఇందులో వాడిన విధానం... అత్యంత అసాధారణమైన ఆధునిక సాంకేతికతతో కూడుకున్నది" అని నికోలాయ్ ఖోఖ్లోవ్ అన్నారు.
"ఈ ఆపరేషన్‌కు ప్రణాళికలు రచించిన అధికారులు, అత్యున్నత స్థాయిలో ఉన్న ఒక వ్యక్తిని మెప్పించడానికి ప్రయత్నించారని దీన్ని బట్టి నాకు అర్థమవుతోంది" అన్నారాయన.
మార్కోవ్పై ఈ ప్రాణాంతక దాడి సరిగ్గా జివ్కోవ్ పుట్టినరోజు నాడే జరిగింది.
బాధితుల శరీరంలోకి రిసిన్ గుళికలను చొప్పించగల గొడుగును కేజీబీ అభివృద్ధి చేసినట్లు సోవియట్ యూనియన్ పతనం తర్వాత వెలుగులోకి వచ్చింది. పికాడిల్లీ అనే మారుపేరున్న ఇటాలియన్ నేరస్థుడు ఈ హత్య చేసినప్పటికీ, తమ సంస్థ ఈ హత్యకు సహకరించిందని దేశం విడిచిపెట్టిన ఇద్దరు మాజీ కేజీబీ అధికారులు తర్వాత వెల్లడించారు.
మార్కోవ్ హత్య కేసులో ఇప్పటివరకు ఎవరిపైనా అభియోగాలు నమోదు కాలేదు. అనుమానితులెవరూ లేకపోవడంతో బల్గేరియా 2013లో ఈ కేసును మూసివేసింది. అయితే, యూకేలో మాత్రం ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























