‘నేను నగ్నంగా ఓడ ఎక్కగానే అందులోని వారంతా కెమెరాలు పట్టుకుని నన్నే చూస్తుండి పోయారు’- పసిఫిక్ మహాసముద్రంపై 15 నెలలు ఒంటరిగా ప్రయాణించిన యువకుడి అనుభవాల కథ

పసిఫిక్ మహాసముద్రం, సాహసయాత్ర, పెరూ, ఆస్ట్రేలియా, పడవ ప్రయాణం

ఫొటో సోర్స్, Tom Robinson

    • రచయిత, మొబీన్ అజార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 10 నిమిషాలు

అది 2023 అక్టోబర్ 6. అప్పుడే తెల్లవారుతోంది. 24 ఏళ్ల టామ్ రాబిన్సన్ పసిఫిక్ మహాసముద్రం నడిమధ్యలో ఒంటరిగా ఉన్నాడు. ఒంటిపై దుస్తులు కూడా లేవు. బోల్తాపడిన తన పడవ అడుగు భాగాన్ని పట్టుకుని, తీవ్రమైన చలిలో వణుకుతూ ప్రాణాలు నిలబెట్టుకునేందుకు పోరాడుతున్నాడు.

ఆ సమయంలో తనను ఎవరైనా రక్షించడానికి వస్తారో లేదో అతనికి ఏమాత్రం తెలియదు.

ఆస్ట్రేలియా దేశస్థుడైన టామ్ రాబిన్సన్, తానే డిజైన్ చేసి నిర్మించిన చెక్క పడవలో కొన్ని నెలల కిందట పెరూ నుంచి పసిఫిక్ మహాసముద్రంపై ప్రయాణం ప్రారంభించాడు.

14 ఏళ్ల వయసు నుంచే తన మనసులో ఉన్న కలను సాకారం చేసుకోవడమే అతని లక్ష్యం.

పసిఫిక్ మహాసముద్రాన్ని పడవ నడుపుతూ దాటిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలవాలన్నది అతని సంకల్పం.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ప్రయాణంలో అతను కేవలం విశాలమైన మహాసముద్రాన్నే కాదు, జీవితంలో భయాన్ని, అనిశ్చితిని అధిగమించేలా తనలో ఉన్న సామర్థ్యం ఎంతో కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాడు. "ఒక క్షణం పాటు అంతా ముగిసిపోయిందని, ఈ ప్రయాణమే నా ప్రాణాల మీదకు తీసుకొచ్చిందని అనుకున్నాను" అని రాబిన్సన్ బీబీసీతో చెప్పారు.

"ఆ ఆలోచన నిజంగా తీవ్రంగా కలచివేసింది. కానీ కొద్దిసేపటికే నా దృక్పథాన్ని మార్చుకున్నాను. నా కోసం చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవడం ప్రారంభించాను" అని రాబిన్సన్ అన్నాడు. ఈ ప్రయాణంలో కొన్ని రోజులు పూర్తి స్థాయి ప్రశాంతతను కూడా అతను అనుభవించాడు. అలాగే పసిఫిక్ దీవుల్లోని ప్రజలు అతడిని ఆప్యాయంగా ఆహ్వానించి, తమలో ఒకడిగా చేసుకున్న అనుభవాన్ని కూడా పొందాడు.

టామ్ రాబిన్సన్ తన ప్రయాణం నేర్పిన పాఠాల గురించి బీబీసీ వరల్డ్ సర్వీస్ రేడియో కార్యక్రమం ఔట్‌లుక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఈ ఇంటర్వ్యూను పాత్రికేయుడు మొబీన్ అజర్ నిర్వహించారు.

పసిఫిక్ మహాసముద్రం, సాహసయాత్ర, పెరూ, ఆస్ట్రేలియా, పడవ ప్రయాణం

ఫొటో సోర్స్, Tom Robinson

ఇంటర్వ్యూ ఇలా సాగింది....

మొబీన్ అజర్: పసిఫిక్ మహాసముద్రాన్ని దాటాలన్న మీ కల ఎలా మొదలైంది?

టామ్ రాబిన్సన్: నేను బ్రిస్బేన్ నది ఒడ్డున పెరిగా. చిన్ననాటి జీవితం మొత్తం ఆ నది చుట్టూనే గడిపా.

ప్రతిరోజూ స్కూలు ముగిసిన తర్వాత నదిలో పడవ నడిపేవాడిని. చేపలు పట్టేవాడిని. హకిల్‌బెర్రీ ఫిన్ కథల్లో ఉండే పిల్లాడిలా నా బాల్యం గడిచింది. అక్కడే నాకు పడవలు, సముద్రంపై ఆసక్తి ఏర్పడింది.

రోజూ రాత్రిపూట నావికులు, అన్వేషకులు, సాహసికుల గురించి పుస్తకాలు చదివేవాడిని. ఒకరోజు తెల్లవారుజామున లేచి అద్దంలో చూసుకుంటూ "టామ్, నువ్వు పసిఫిక్ మహాసముద్రాన్ని పడవ నడుపుతూ దాటిన అత్యంత పిన్న వయస్కుడివి అవుతావు. అందుకోసం పడవను కూడా నువ్వే నిర్మించుకుంటావు" అని నాతో నేనే చెప్పుకున్నా.

14 ఏళ్ల వయసు నుంచి ప్రతి రోజూ ఆ ప్రయాణం, ఆ సాహసం గురించే ఆలోచించేవాడిని.

పసిఫిక్ మహాసముద్రం, సాహసయాత్ర, పెరూ, ఆస్ట్రేలియా, పడవ ప్రయాణం

ఫొటో సోర్స్, Tom Robinson

మొబీన్ అజర్: పడవను కూడా మీరే నిర్మించాలని ఎందుకు అనుకున్నారు?

టామ్ రాబిన్సన్: నాకు సాధ్యమైనంత పెద్ద సవాలును స్వీకరించాలని అనిపించింది. పసిఫిక్‌ను ఎన్నుకోవడానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ఒకటి అది ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రం కావడం. దక్షిణ పసిఫిక్‌ను దాటడం అన్నది సముద్రంలో అత్యంత సుదీర్ఘ పడవ ప్రయాణాల్లో ఒకటి.

అందుకే పడవ నిర్మాణం కూడా ఈ ప్రయాణంలో కీలక భాగమైంది. ఆ పడవ నిజంగానే నాలో ఒక భాగం. నా చిత్రాలే దానికి రూపమిచ్చాయి. నా చేతులే దాన్ని నిర్మించాయి.

మొత్తం ఈ ప్రయాణం నా వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా వ్యక్తపరచడానికే. పడవ నిర్మాణం కూడా అందులో భాగమే.

మొబీన్ అజర్: మీ పడవకు మైవార్ అని పేరు పెట్టారు. ఆస్ట్రేలియా ఆదివాసీ భాషలో దానికి ‘బ్రిస్బేన్ నది’ అని అర్థం కదా?

టామ్ రాబిన్సన్: అవును. దాని రూపకల్పన 18వ శతాబ్దంలో తిమింగలాల వేట కోసం పసిఫిక్‌లోకి వెళ్లిన నౌకలను ఆధారంగా చేసుకుని రూపొందించాను.

ఒక రాత్రి ఆ నౌకల నమూనాలను పుస్తకంలో చూస్తూ "ఈ ప్రయాణానికి నాకు ఇలాంటి పడవే కావాలి" అని అనుకున్నాను.

250 ఏళ్లలో సముద్రం మారలేదు, అలలు మారలేదు. కాబట్టి పడవ కూడా మారాల్సిన అవసరం లేదని భావించాను.

మొబీన్ అజర్: ఈ ప్రయాణానికి మానసికంగా ఎలా సిద్ధమయ్యారు?

టామ్ రాబిన్సన్: అలాంటి ప్రయాణానికి పూర్తిగా ఎలా సిద్ధం కావాలో నాకు తెలియదు.

అయితే బ్రిస్బేన్ నుంచి బయలుదేరిన తర్వాత ఇంటి జ్ఞాపకాలు వెంటాడకుండా ఉండేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా.

స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎప్పటికీ ఉంటారు. కానీ ఈ ప్రయాణంలో నేను నా మనసుతో, నా చుట్టూ ఉన్న ప్రపంచంతో ప్రశాంతంగా ఉండాలని అనుకున్నా.

అందుకే కొన్ని బంధాలు, సంబంధాల నుంచి కొంత దూరం పాటించాను. ఎక్కడో ఇంకెక్కడో ఎవరి కోసం ఉండాల్సిందనే భావన కలగకూడదనుకున్నా.

పసిఫిక్ మహాసముద్రం, సాహసయాత్ర, పెరూ, ఆస్ట్రేలియా, పడవ ప్రయాణం

ఫొటో సోర్స్, Tom Robinson

మొబీన్ అజర్: అప్పటికి నీకో గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉంది కదా?

టామ్ రాబిన్సన్: అవును. ఈ ప్రయాణంలో అత్యంత విషాదకరమైన అంశాల్లో అది కూడా ఒకటి. ఎందుకంటే ఈ యాత్రకు మిగతా వాటన్నీటికంటే ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది.

"రాబోయే రెండేళ్లపాటు, లేదా ఈ ప్రయాణం ఎంతకాలం కొనసాగినా, ఇదే నా జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం" అని నేను నిర్ణయించుకున్నా.

అందుకే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది.

మొబీన్ అజర్: అంటే ఆమెతో విడిపోయారా?

టామ్ రాబిన్సన్: అవును. అది చాలా విషాదకరమైన విషయం. కానీ అది జరగాల్సిందేనని ఇద్దరికీ తెలుసు.

చాలామంది నన్ను మధ్యలో దీవుల్లో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మిమ్మల్ని కలుస్తారా? అని అడిగేవారు.

అప్పుడు నేను" అది జరగదు. నేను బ్రిస్బేన్ నుంచి విమానంలో లీమా( పెరూ దేశపు రాజధాని) కు బయలుదేరిన క్షణం నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. తిరిగి బ్రిస్బేన్ చేరుకున్నప్పుడే అది ముగుస్తుంది" అని చెప్పేవాడిని.

నా గత జీవితం, పాత ప్రపంచంతో ఎలాంటి సంబంధం కొనసాగినా ఈ ప్రయాణంపట్ల నా అనుభూతిని మార్చేస్తుందని భావించాను. ఈ ప్రయాణానికి పూర్తిగా అంకితమయ్యా.

ఈ అనుభవం నిజమైనదిగా, నిర్మలమైనదిగా, సంపూర్ణమైనదిగా ఉండాలని కోరుకున్నా. దానికి ఇదే ఉత్తమ మార్గం.

పసిఫిక్ మహాసముద్రం, సాహసయాత్ర, పెరూ, ఆస్ట్రేలియా, పడవ ప్రయాణం

ఫొటో సోర్స్, Tom Robinson

2022 జూలై 2. ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది విచిత్రమైన, మరపురాని రోజు.

స్థానిక మార్కెట్‌కు వెళ్లి అల్పాహారం కోసం పంది చర్మపు ముక్కలతో చేసే బ్రెడ్ కొన్నా. అక్కడి మహిళలకు వీడ్కోలు చెప్పా. తర్వాత యాట్ క్లబ్‌కు వెళ్లా. అక్కడికి చాలామంది రావడం ప్రారంభించారు.

లీమాలో రెండు నెలలు గడిపిన నేను అక్కడ చాలామంది స్నేహితులను సంపాదించుకున్నా. ఆస్ట్రేలియాకు చెందిన ఈ యువకుడికి వీడ్కోలు చెప్పేందుకు దాదాపు మొత్తం కమ్యూనిటీనే అక్కడికి వచ్చింది.

అక్కడ టెలివిజన్ కెమెరాలు కనిపించాయి. కొద్దిదూరంలో నౌకాదళ సంగీత బృందం వస్తుండడం చూశాను.

మొదట అది వేరే కార్యక్రమం కోసం అనుకున్నాను. కానీ యాట్ క్లబ్ మేనేజర్ నావైపు చూసి నవ్వాడు. వెంటనే ఆ బృందం సంప్రదాయ పెరూవియన్ నౌకాదళ గీతాలను వాయించడం ప్రారంభించింది.

సంగీతకారులు ఒక పడవలోకి ఎక్కి వాయిద్యాలు వాయించారు. నేను నా పడవలోకి ఎక్కి తాడును విప్పి, రెండు తెడ్లను చేతిలో పట్టుకుని మొదటిసారి తెడ్డు వేశాను.

అది నేను మున్ముందు వేయబోయే లక్షలాది తెడ్లలో మొదటిదని అప్పుడు నాకు అర్థమైంది. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది.

నా చుట్టూ అనేక పడవలు, సంగీత బృందం ఉన్నాయి. నేను మాత్రం పూర్తిగా ఏకాగ్రతతో బలంగా పడవ నడిపాను. ప్రయాణానికి కావాల్సిన ఆహారం, నీటితో పడవ చాలా బరువుగా ఉంది.

కొద్దికొద్దిగా మిగతా పడవలన్నీ తిరిగి వెళ్లిపోయాయి. చివరకు నా మంచి స్నేహితుడు గోన్జాలో రివాగో ప్రయాణిస్తున్న పడవ మాత్రమే మిగిలింది. ఈ ప్రయాణంలో అతను నాకు ఎంతో సహాయం చేశాడు.

చివరకు అతను కూడా వెనుదిరిగాడు. అప్పటికి ఇక నేను, సీలయన్స్ ( ఒక రకం సముద్రపు జీవులు) మాత్రమే మిగిలాం. అప్పుడే నిజమైన సాహసం ప్రారంభమైందని అర్థమైంది.

ప్రయాణంలోని తొలి 75 రోజులు అమితమైన ఆనందంతో గడిచాయి.

అది కలల జీవితంలా అనిపించింది. పసిఫిక్ మధ్యలో నా చిన్న పడవలో ఉండటం, రాత్రి భోజనం కోసం చేపలు పట్టడం, సముద్రంపైనే ఆధారపడి జీవించడం.. ఇదంతా ఒక విచిత్రమైన జీవితం.

పసిఫిక్ మహాసముద్రం, సాహసయాత్ర, పెరూ, ఆస్ట్రేలియా, పడవ ప్రయాణం

ఫొటో సోర్స్, Tom Robinson

మొబీన్ అజర్: 75వ రోజు ఏం జరిగింది?

టామ్ రాబిన్సన్: పెరూ నుంచి బయలుదేరినప్పుడు ఫ్రెంచ్ పాలినీషియాలోని మార్క్వెసాస్ దీవుల్లో ఆగాలని భావించా. అవి దక్షిణ అమెరికాకు పశ్చిమాన ఉన్న తొలి ద్వీప సమూహం. దక్షిణ అమెరికా నుంచి సుమారు 3,000 నుంచి 4,000 మైళ్లు, అంటే దాదాపు 6,800 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి.

సుమారు 100 రోజుల్లో అక్కడికి చేరుతానని అనుకున్ను. అంతా బాగానే సాగుతోంది.

అయితే అకస్మాత్తుగా ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలి వీచడం మొదలైంది. అది రోజుల తరబడి కొనసాగింది. ఎంత ప్రయత్నించినా నేను లక్ష్యానికి దూరంగా, ఉత్తర దిశగా కొట్టుకుపోతూనే ఉన్నా.

అప్పుడు పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించిన పెద్ద సముద్ర పటాన్ని తీసి మళ్లీమళ్లీ పరిశీలించా. సమీపంలో జనావాసం ఉన్న దీవి కోసం వెతికాను.

అలాంటి దీవి ఆ క్షణాన చాలా అవసరం. ఎందుకంటే ఏ దీవికి చేరినా తుపానుల కాలం ముగిసే వరకు నాలుగు నెలలు అక్కడే ఉండి పోవాల్సి వస్తుందని నాకు తెలుసు.

చివరకు పెన్‌రిన్, లేదా టొంగరేవా అని పిలిచే చిన్న దీవి కనిపించింది. అది పటంలో ఒక చిన్న చుక్కలా మాత్రమే ఉంది.

ఆ క్షణం నుంచి మొత్తం ప్రయాణమే మారిపోయింది. నా లక్ష్యం ఆ చిన్న చుక్కగా మారింది. అక్కడి ప్రజలు ఎలా ఉంటారో, ఆ ప్రాంతం ఎలా ఉంటుందో నాకు తెలియదు. అయినా పడవ నడుపుతూనే ఉన్నా.

బతికి బయటపడాలంటే అక్కడికి చేరుకోవాల్సిందే. అందుకే రోజుకు దాదాపు 14 గంటల పాటు నిర్విరామంగా పడవ నడిపాను.

దాదాపు 5,000 నాటికల్ మైళ్లు ప్రయాణించిన తర్వాత, 160వ రోజు చివరకు భూమిని, నా వైపు వస్తున్న ఓడను చూశాను.

ఆ సమయంలో కలిగిన ఆనందం, ఉత్సాహాన్ని మాటల్లో చెప్పలేను. వారు నన్ను చూసి ఎంతో సంతోషించారు. నన్ను లాగుకుంటూ దీవిలోని అతిపెద్ద గ్రామమైన ఒమోకాకు తీసుకెళ్లారు. అక్కడ సుమారు 140 మంది నివసిస్తున్నారు. ఇటుకలు, టిన్ షీట్లతో నిర్మించిన ఇళ్లు ఉన్నాయి.

వారు "టామ్, ఇప్పుడు నువ్వు నేలపైకి దిగొచ్చు" అన్నారు.

అప్పుడు నా కాళ్లవైపు చూసి, 150 రోజులకు పైగా గడిచిన తర్వాత నేను వేయబోయే తొలి అడుగు ఇదేనని గ్రహించాను.

పడవ చాలా చిన్నది కావడంతో అందులో నడవడం సాధ్యం కాదు. అందుకే ఒక్కసారిగా పెద్దగా దూకి దిగాను. నా కాళ్లు గట్టి పగడపు నేలను తాకాయి.

నా పాదాల కింద భూమి వెచ్చదనాన్ని ఆస్వాదించాను. అది అసాధారణమైన అనుభూతి. నిలబడేందుకు ప్రయత్నించాను. కానీ తీవ్రమైన తలతిరుగుడు వచ్చింది. మద్యం తాగిన నావికుడిలా నడిచాను.

గ్రామానికి చెందిన బలిష్ఠమైన వ్యక్తులు నన్ను పట్టుకుని నిలబెట్టారు. ఆ గ్రామ పెద్దల్లో ఒకరు నా దగ్గరకు వచ్చి, "టామ్, మా పెన్‌రిన్ దీవికి స్వాగతం. నువ్వు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. గత మూడు సంవత్సరాల్లో ఇక్కడికి వచ్చిన తొలి అంతర్జాతీయ నౌక నీదే" అన్నారు.

ఆ తర్వాత "కానీ నీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడికి నువ్వు టామ్ రాబిన్సన్‌గా వచ్చావు. ఇకపై నీకు కొత్త పేరు ఉంది. మా భాషలో నిన్ను మహుటా హోయ్ హో అసంగా అని పిలుస్తాం. దాని అర్థం 'దూర ప్రాంతం నుంచి పడవ నడుపుకుంటూ వచ్చిన యోధుడు'. స్వాగతం మహుటా" అని చెప్పారు.

ఆ మాటలు విని నేను భావోద్వేగానికి లోనయ్యా. ఇంతకాలం సముద్రంలో గడిపిన తర్వాత చివరకు ఈ చిన్న స్వర్గధామానికి చేరుకున్నాననే విషయం నమ్మలేకపోయాను.

ఆ ప్రజలు నన్ను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. వెంటనే తమ ఇళ్లలోకి, తమ జీవితాల్లోకి నన్ను ఆహ్వానించారు.

అక్కడి నుంచి బయలుదేరడం చాలా కష్టంగా అనిపించింది. వారు తమ భావోద్వేగాలను ఎంతో స్వేచ్ఛగా వ్యక్తం చేస్తారు. ఎంతో దయగలవారు, నిస్వార్థులు. నిజం చెప్పాలంటే, అక్కడ నాకు చిరకాల స్నేహితులు, కుటుంబ సభ్యులు దొరికారు.

పసిఫిక్ మహాసముద్రం, సాహసయాత్ర, పెరూ, ఆస్ట్రేలియా, పడవ ప్రయాణం

ఫొటో సోర్స్, Tom Robinson

మొబీన్ అజర్: ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు, కానీ 260 రోజులకు పైగా సముద్రంలో గడిపిన తర్వాత ఎదురైన అసలైన పరీక్ష ఏంటి?

టామ్ రాబిన్సన్: నేను అప్పటికి సుమారు 7,000 నాటికల్ మైళ్లు ప్రయాణించా. భూమి మీదకు వచ్చి, నా చిన్ననాటి కలను నెరవేర్చుకోవడానికి ఇంకా సుమారు 50 రోజులు మిగిలి ఉన్నాయని అనుకున్నా. రోజంతా నేను చాలా సులభంగా సౌకర్యవంతంగా తెడ్డు వేస్తూనే ఉన్నా.

నేను కొంచెం ముందుగానే తెడ్లను పక్కన పెట్టి, నా క్యాబిన్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఈ సముద్రం మీద తిరిగే ఈ పడవలలో ప్రత్యేకత ఏంటంటే అవి తలక్రిందులుగా పడితే అలాగే ఉండిపోవు.

అంటే, అలల తాకిడికి ఒకవేళ అవి తలక్రిందులైతే, వాటంతట అవే తిరిగి నిటారుగా నిలబడతాయి. ఎందుకంటే అలా పడినప్పుడు క్యాబిన్ లోపల గాలి ఉండిపోతుంది. దీంతో అవి మునిగిపోవు.

పసిఫిక్‌లో, భూమధ్యరేఖకు సమీపంలో, విపరీతమైన వేడి ఉంటుంది. కొన్నిసార్లు మీరు నిద్రకూడా పట్టదు. ఊపిరాడనట్లు అనిపిస్తుంది. అందుకే ఆ రోజు నేను నా పడవ హ్యాచ్ తెరిచి ఉంచా. అదే నేను చేసిన పెద్ద పొరపాటు.

నేను నా బెడ్ మీద పడుకుని, డిన్నర్ గురించి ఆలోచిస్తున్నా. అకస్మాత్తుగా భయంకరమైన శబ్దం వినిపించింది, నేను స్పందించేలోపే నా పడవ అలల తాకిడికి పల్టీలు కొట్టింది. క్షణంలో క్యాబిన్ నీటితో నిండిపోవడంతో నేను ఊపిరి బిగపట్టుకున్నాను. ఆలోచించడానికి సమయమే లేదు. అది దారుణమైన పరిస్థితి. అప్పటికే సూర్యుడు అస్తమించాడు, చీకటి పడుతోంది. సగం తెరిచి ఉన్న హ్యాచ్‌లోంచి ఈది, బయటకు వచ్చి, తలక్రిందులుగా పడిన పడవను ఒక పక్కన పట్టుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు.

ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి లేదని నేను గ్రహించాను. పడవను మళ్లీ మామూలుగా చేయడానికి ప్రయత్నించా. ఒక వైపుకు తాడు కట్టి, దానిని నిటారుగా లాగి చూశా. కానీ అది చాలా బరువుగా ఉంది. ఎమర్జెన్సీ ట్రాన్స్‌పాండర్ పడవ లోపల ఉందని నేను అర్థమైంది. కాబట్టి నేను పడవ కింద నుంచి క్యాబిన్‌కు ఈది, ఎమర్జెన్సీ బీకన్‌ను పట్టుకుని, మళ్ళీ పడవ కింద నుంచి పక్కకు ఈదవలసి వచ్చింది. దాన్ని ఒక తాడుతో నా మణికట్టుకు కట్టుకుని, ఆ తర్వాత బోల్తా పడిన పడవ మీదకు ఎక్కి, నన్ను నేను బెల్టుతో బిగించుకున్నా. రాత్రికి రాత్రే పడవను సరిచేసి, పరిస్థితిని చక్కదిద్దడం అసాధ్యమని నాకు తెలుసు. చాలా చీకటిగా ఉంది, సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. అలలు పెరుగుతున్నాయి. నా తల పడవకు తగిలి స్పృహ కోల్పోయి, నా కథ అక్కడితో ముగిసిపోయే ప్రమాదం పొంచి ఉంది. నేను బోల్తా పడిన పడవ అడుగుభాగంపై పూర్తిగా నగ్నంగా, చలికి వణుకుతూ కూర్చున్నా.

అంతా అయిపోయిందని, ఈ ప్రయాణం నా ప్రాణాలనే బలిగొంటోందని ఒక్క క్షణం నాకు అనిపించింది. అది నిజంగానే దిగ్భ్రాంతికరమైన ఆలోచన.

కానీ వెంటనే తేరుకుని, అదొక తాత్కాలిక ఆటంకం మాత్రమేనని అర్థం చేసుకున్నా.

పసిఫిక్ మహాసముద్రం, సాహసయాత్ర, పెరూ, ఆస్ట్రేలియా, పడవ ప్రయాణం

ఫొటో సోర్స్, Tom Robinson

మొబీన్ అజర్: ఆ క్షణంలో మీరేం ఆలోచిస్తున్నారు?

టామ్ రాబిన్సన్: ఆ 14 గంటల సమయంలో నా మనసులో ఎన్నో ఆలోచనలు మెదిలాయి. మొదట్లో అంతా నిరాశా నిస్పృహలే. నా ప్రయాణమే కాదు, నా జీవితమే ముగిసిపోతోందని అనుకున్నాను. ఆ ఆలోచన నిజంగానే చాలా బాధాకరంగా ఉండేది. కానీ త్వరలోనే నా దృక్పథాన్ని మార్చుకుని, ఏదైనా మార్గం ఉందేమోనని వెతకడం మొదలుపెట్టా.

ఆ ప్రయాణమంతా అడ్డంకులను అధిగమించడమే కదా. కాబట్టి, వాటన్నింటినీ దాటుకుని వచ్చినప్పుడు, ఈ రాత్రిని కూడా ఎందుకు దాటలేను అని నాకు అనిపించింది.

నా కోసం చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవడం మొదలుపెట్టాను. అందులో ముఖ్యమైనది అంటే పెద్ద లక్ష్యం ఆ రాత్రిని గడిపి సూర్యోదయాన్ని చూడటం.

ఏదో ఒక సమయంలో చంద్రుడు ఉదయిస్తాడని నాకు తెలుసు, అది నేను చూసిన వాటిలో అత్యంత అందమైన చంద్రోదయం అవుతుందని అనుకున్నాను. ఆ తర్వాత ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో ప్లాన్లు వేయడం మొదలుపెట్టాను.

మరుసటి రోజు సూర్యుడు ఉదయిస్తాడు. పడవలో ఏదైనా ఆహారం దొరకవచ్చు. ఆపై పడవను సరిచేయడానికి కొన్ని భాగాల్లో నీటిని నింపి ప్రయత్నించి చూడొచ్చు అనుకున్నా.

నా దగ్గర ఒక 'ఎమర్జెన్సీ లొకేటర్ బీకన్' ఉంది. అది బీప్ శబ్దాలు, కాంతి సంకేతాలను ఇచ్చే ట్రాన్స్‌పాండర్. కానీ ఎవరికైనా నా గురించి తెలిసిందో లేదో, వాళ్లు నాకోసం వస్తారో రారో అనే విషయం నాకు తెలిసే అవకాశం లేదు.

మొబీన్ అజర్: సహాయం ఎలా అందింది?

టామ్ రాబిన్సన్: అలలు పడవపైకి ఉవ్వెత్తున ఎగసిపడుతూ నన్ను దాదాపు కొట్టుకుపోయేలా చేస్తున్నాయి. అప్పుడు, రాత్రంతా చూసినట్లుగానే తూర్పు వైపు చూస్తుండగా... ఆ గాఢమైన చీకటి కాస్త లేత ముదురు ఊదా రంగులోకి మారింది. వెలుతురు పెరుగుతూ వచ్చింది, దాంతో అంతా సర్దుకుంటుందనే బలమైన నమ్మకం నాకు కలిగింది.

నా జీవితంలోనే అత్యంత కఠినమైన రాత్రిని, అత్యంత క్లిష్టమైన అనుభవాన్ని దాటి వచ్చాను. ఇకపై పరిస్థితులు చాలా మెరుగుపడతాయని అనుకున్నా.

నాలో భావోద్వేగాలు ఉప్పెన అయ్యాయి. సూర్యుడు పైకి రాగానే, నాకు ఒక పెద్ద నల్లని చుక్క కనిపించింది. అది ఒక నౌక అని అర్థమైంది. ఇక నా ప్రయాణం ముగిసిందని మొదటిసారిగా నాకు అర్థమైంది.

పసిఫిక్ మహాసముద్రం, సాహసయాత్ర, పెరూ, ఆస్ట్రేలియా, పడవ ప్రయాణం

ఫొటో సోర్స్, Tom Robinson

మొదట్లో అది సరుకు రవాణా నౌక అనుకున్నారు కదా?

టామ్ రాబిన్సన్: అది సరుకు రవాణా నౌక అని, బహుశా చైనాకు వెళ్తుందేమో అని అనుకున్నా. కానీ ఆ నౌక దగ్గరకు వచ్చేకొద్దీ, అది పీ అండ్ ఓ క్రూయిజ్ షిప్ అని నాకు తెలిసింది.

నాకు నవ్వు ఆగలేదు. అప్పుడే నాకు నా నగ్నత్వం గురించి కూడా గుర్తొచ్చింది. ఆ నౌక దగ్గరకు వస్తుండగా, దాని డెక్‌ల మీద పెద్ద కెమెరా లెన్స్‌లు, బైనాక్యులర్లు పట్టుకున్న వందలాదిమంది ప్రజలు కనిపించారు.

నౌక పక్కన భారీ అలలు ఎగసిపడుతుండగా, నా చిన్న పడవను ఆ నౌక పక్కకు చేర్చడంలో కెప్టెన్ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అది నిజంగా ప్రమాదకరమైన పరిస్థితి.

వాళ్లు నౌక పక్క నుంచి ఒక నిచ్చెనను కిందకు దించారు. దాంతో నా చిన్న పడవను వదిలి ఆ నిచ్చెనను అందుకోవడానికి దూకడం తప్ప నాకు వేరే మార్గం లేదు. దూకేశాను.

ధైర్యం కూడగట్టుకుని నిచ్చెన ఎక్కాను. నౌక పైకి చేరగానే, ఒక కారిడార్‌లో సిబ్బంది, ఇతర వ్యక్తులున్న ఒక గుంపు కనిపించింది. వారు నా వైపు చూస్తున్నారు, నేను వారి వైపు చూస్తున్నాను. ఆ మొత్తం పరిస్థితి ఒక చిత్రమైన కలలా అనిపించింది.

మొబీన్ అజర్: ప్రయాణం పూర్తికాకున్నా, పసిఫిక్ మహాసముద్రాన్ని పడవలో దాటిన అతి పిన్న వయస్కుడిగా గిన్నిస్ రికార్డును నెలకొల్పడానికి సరిపడా దూరాన్ని మీరు ప్రయాణించారు. మీకల సాకారమైంది. మరి తిరిగి రావడం ఎలా అనిపించింది?

టామ్ రాబిన్సన్: నేను తిరిగి వచ్చిన తర్వాత గడిచిన పన్నెండు నెలలు నా జీవితంలోనే అత్యంత కష్టమైనవి. రోజువారీ జీవితంలోకి మారడం నాకు పూర్తిగా అసాధ్యంగా అనిపించింది. నేను ఎంతో ముఖ్యమైన పని చేశా, చాలాకాలం అనుకున్నది సాధించా. కానీ ఇప్పుడు నా జీవితంలో ఒక పెద్ద శూన్యం మిగిలిపోయింది.

తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి, కొన్నిసార్లు ఈ ప్రయాణం మొత్తం విలువైనదేనా అని అనిపిస్తుంది. కానీ నిజానికి, నేను పడవ నడుపుతున్నప్పుడు ఎలాగైతే ప్రతిరోజూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ, దానిని అంగీకరించడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు.

మొబీన్ అజర్: తిరిగి వచ్చిన తర్వాత మీ లక్ష్యం మారిందా?

టామ్ రాబిన్సన్: నేను తిరిగి పనిలో చేరా. మళ్ళీ పడవలు తయారు చేస్తున్నా. ఒక చిన్న వ్యాపారం ఉంది. కానీ ఏదో ఒకటి నన్ను ఎప్పుడూ లోలోపల వేధిస్తూనే ఉంటుంది.

నన్ను నేను ప్రశ్నించుకుంటుంటా 'నేను మళ్ళీ సముద్రంలోకి ఎప్పుడు వెళతాను? అని.

పసిఫిక్ మహాసముద్రం, సాహసయాత్ర, పెరూ, ఆస్ట్రేలియా, పడవ ప్రయాణం

ఫొటో సోర్స్, Tom Robinson

మొబీన్ అజర్: ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టిన 'టామ్'కు, ఈ రోజు మాతో మాట్లాడుతున్న 'టామ్'కు మధ్య తేడా ఏంటి?

టామ్ రాబిన్సన్: జీవితం గురించి, నేను తీసుకున్న నిర్ణయాల గురించి లోతుగా ఆలోచించడానికి, సమీక్షించుకోవడానికి నాకు చాలా సమయం దొరికింది. ఆ దీవులకు చేరుకున్నాక, అక్కడి ప్రజలు పూర్తిగా భిన్నమైన లైఫ్ స్టైల్‌తో ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా జీవించడం చూశాక నా రోజువారీ నిర్ణయాల గురించి, నా జీవన విధానం గురించి నాకు సందేహాలు కలిగాయి. నా అంతరాత్మను లోతుగా పరిశీలించుకోవడానికి అది నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. నేను పరమానందభరితమైన క్షణాలను అనుభవించా. కొందరు దీనిని 'నిర్వాణం' అని కూడా అంటారు.

బహుశా 120వ రోజున అనుకుంటా, నా అంతరంగంలోని ఒక కాంతి లేదా తేజస్సు ప్రపంచమంతటా ప్రసరిస్తున్నట్లు నాకు అనిపించిన ఒక క్షణం ఉంది.

రెండు మూడు రోజుల పాటు నేను ఎంతో ప్రశాంతంగా ఉన్నా. అంతకు ముందెన్నడూ లేనంత ప్రశాంతత అది. అది నిజంగా అద్భుతం.

బహుశా అలాంటి అనుభూతిని నేను మళ్లీ ఎప్పటికీ పొందలేకపోవచ్చు. కానీ ఆ అనుభూతిని నాలో నిలుపుకోవడం, అది సాధ్యమేనని తెలుసుకోవడం మాత్రం చాలా గొప్ప విషయం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)