ఆరెస్సెస్, అమిత్ షాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ, లోక్‌సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం

ఫొటో సోర్స్, PTI
పేపర్ లీకేజీలకు సంబంధించిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్‌మెంట్ యాక్ట్, 2026' బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది.
మంగళవారం కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర గందరగోళం నెలకొనగా, బుధవారం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై తీవ్ర చర్చ నడుస్తోంది.
జంతర్ మంతర్ నిరసనలో పాల్గొన్న కొందరు యువ విద్యార్థుల గురించి ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ఒక పదాన్ని ఉపయోగించారు. ఆ పదం పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమని బీజేపీ పేర్కొంది.
బీజేపీ ఎంపీ కిరణ్ రిజిజు ఆ పదంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దానిని ఉపయోగించవద్దని కోరారు. ఆ పదాన్ని పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించాలని లోక్‌సభ స్పీకర్‌ను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు.
దీనితో పాటు, దిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనల సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుకు హోం మంత్రి అమిత్ షాయే బాధ్యులంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. అలాగే రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఆరెస్సెస్, 'అంధభక్తుల' ప్రస్తావన కూడా చేశారు.


ఫొటో సోర్స్, ANI
రాహుల్ గాంధీ ఏమన్నారు?
"మన దేశ భవిష్యత్తు రోడ్లపై ఏం చేసిందో చూశాక నాకు ఉత్సాహం వేసింది. అది కోపం కాదు, హింస కాదు, ద్వేషం కాదు. అది ఈ దేశ యువత, ఈ దేశ భావి తరం వ్యక్తం చేసిన లోతైన భావన. బీజేపీలోని నా స్నేహితులతో సహా రాజకీయ పార్టీలన్నీ ఈ భావనను గౌరవించాలని నేను భావిస్తున్నాను" అని లోక్‌సభలో రాహుల్ గాంధీ అన్నారు.
ఆ నిరసనల గురించి బీజేపీ నాయకులు తమ సొంత పిల్లలను అడిగినా, వారు కచ్చితంగా విద్యార్థుల పోరాటాన్ని సమర్థిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
లోక్‌సభలో రాహుల్ గాంధీ ఇంకా ఏమన్నారంటే..
"నేను రాబోయే తరం కోసం ఈ ప్రసంగం చేయబోతున్నానని అనుకున్నప్పుడు, నా ప్రసంగం ఎక్కడి నుంచి ప్రారంభం కావాలని ఆలోచించాను. యువ విద్యార్థులతో నేను జరిపిన సంభాషణే ఇందుకు మంచి ప్రారంభం కావాలని నాకు అనిపించింది"
"నేను ఒక యువతిని 'నువ్వు విద్యార్థివి అని చెప్పావు కదా, అసలు దాని అర్థం ఏమిటి?' అని అడిగాను. ఆమె నాకు చాలా అందమైన సమాధానం ఇచ్చింది. 'ఎవరైతే విశాల హృదయంతో ఉంటారో, తమకు సమస్తం తెలియదనే విషయాన్ని మొదటి నుంచే అంగీకరిస్తారో వారే విద్యార్థి' అని ఆమె చెప్పింది. ఈ విశ్వం నిరంతరం మారుతూనే ఉంటుందని ఆ వ్యక్తి నమ్ముతారు. జ్ఞానం కూడా మారుతూనే ఉంటుందని విద్యార్థి అర్థం చేసుకుంటాడని ఆ విద్యార్థిని నాకు వివరించింది"
"నేను ఆమెను తర్వాతి ప్రశ్న అడిగాను, 'విద్యార్థిని నువ్వు చాలా బాగా నిర్వచించావు. మరి ఇంకా ఎలాంటి వారు ఉంటారు?' అని అడిగాను. అందుకామె, 'ఇంకొక రకం వ్యక్తులు కూడా ఉన్నారు' అని చెప్పింది. 'వారు ఎవరు?' అని నేను ప్రశ్నించాను"
అందుకు ఆమె, "తమకు అన్నీ తెలుసని భావించే వ్యక్తులు వీరు. ఈ విశ్వం నిశ్చలంగా ఉంటుందని వారు నమ్ముతారు. జ్ఞానం తమ లోపలి నుంచే వస్తోందని భావిస్తూ, తమను తాము దేవుళ్లుగా అనుకుంటారు. వీరు అహంకారులు, ఎవరి మాట వినరు, ఇతరుల వాస్తవాలను గౌరవించరు. 'నువ్వు ఈ వ్యక్తులను ఏమని పిలుస్తావు?' అని నేను ఆమెను అడిగాను" అన్నారు.
ఈ ప్రకటన చేసిన తర్వాత రాహుల్ గాంధీ ఒక పదాన్ని ఉపయోగించారు. దీనిపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయన వ్యాఖ్యలు పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, తాను నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
రికార్డుల నుంచి తొలగించాలని ప్రభుత్వం డిమాండ్
రాహుల్ గాంధీ ప్రసంగంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, "పార్లమెంటులో ఉపయోగించకూడని పదాలను మేమేమీ సొంతంగా నిర్ణయించలేదు. మీ ప్రసంగానికి ఆటంకం కలిగించాలని మాకు లేదు. కానీ, మీరు ఉపయోగించిన పదాన్ని మాత్రం వాడవద్దు. నా విన్నపం ఇంతే" అన్నారు.
ఆ తర్వాత, తన ప్రసంగాన్ని కొనసాగించాలని రాహుల్ గాంధీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పలుమార్లు కోరారు. అయితే, సభ మొదట అదుపులోకి వస్తేనే మాట్లాడతానని చెప్తూ ఆయన తన సీట్లోనే కూర్చుండిపోయారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ లేచి నిలబడి, "నేను మాట్లాడటం ప్రారంభించగానే అధికార పక్షం అంతా గందరగోళం చేయడం మొదలుపెట్టింది" అన్నారు.
దానికి రిజిజు స్పందిస్తూ, "రాహుల్ గాంధీ గారూ, మీరు ప్రతిపక్ష నాయకులనే విషయాన్ని నేను మళ్లీ గుర్తుచేస్తున్నాను. పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమైన పదాలను మాట్లాడవద్దని మాత్రమే మేం కోరుతున్నాం" అని పేర్కొన్నారు.
దీనిపై రాహుల్ గాంధీ, "ఈ పదాన్ని నేను ఏ ఎంపీకి వ్యతిరేకంగానైనా ఉపయోగించి ఉంటే అది నిబంధనలకు విరుద్ధం అయ్యేది. నేను మాట్లాడుతుంటే చాలు రిజిజు గారు లేచి నిలబడతారు" అని వ్యాఖ్యానించారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఆ పదంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దానిని సభ రికార్డుల నుంచి తొలగించాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరారు.
అదే సమయంలో మంత్రి తన పక్షం వైపు చూస్తూ, "మీరంతా ప్రశాంతంగా ఉండి ఆయన చెప్పేది వినాలని విజ్ఞప్తి చేస్తున్నా" అన్నారు.
రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఆరెస్సెస్ ప్రస్తావన కూడా చేశారు.
"ధర్మేంద్ర ప్రధాన్ కేవలం ఒక ముఖచిత్రం మాత్రమే, మీ అసలు శత్రువు ఆరెస్సెస్.. ఇది అర్థం చేసుకోండి. మిమ్మల్ని విద్యార్థులుగా ఎదగనివ్వనిది ఆ వ్యక్తులే. మీరు అంధభక్తులుగా మారాలని వారు కోరుకుంటున్నారు. మేం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అంధభక్తులుగా మారబోమని చెబుతున్న భారతదేశ ఆత్మ ప్రతిస్పందన ఇది" అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























