నరేంద్ర మోదీ: పరాజయం లేని రాజకీయ జీవితంలో ఇప్పుడు ఎందుకు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీష్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో పరాజయాలను చవిచూసింది చాలా తక్కువ.
అక్టోబర్ 2001లో మోదీ కనీసం ఎమ్మెల్యే కూడా కాకపోయినా, బీజేపీ ఆయనను గుజరాత్ ముఖ్యమంత్రిని చేసింది. సీఎంగా బాధ్యతలు చేపట్టాకే ఆయన ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2002 ఫిబ్రవరిలో రాజ్‌కోట్-2 నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఉపఎన్నికలో గెలిచారు. మోదీ రాజకీయ జీవితంలో పోటీ చేసిన మొదటి ఎన్నిక ఇదే.
ఆ ఎన్నికలో ఆయన 14,700 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మోదీ రాజకీయ ప్రస్థానంలోనే అత్యంత తక్కువ ఓట్ల తేడాతో వచ్చిన విజయం ఇదే. మే 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ, ఆ తర్వాత దేశ ప్రధానమంత్రి అయ్యారు.
నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ తొలిసారిగా దేశంలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశంలో 1984 తర్వాత ఒకే పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడం కూడా ఇదే మొదటిసారి.
2019 సార్వత్రిక ఎన్నికల నాటికి మోదీ ప్రజాదరణ శిఖరాగ్రానికి చేరింది. ఆ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో బీజేపీ 303 స్థానాలు గెలుచుకుంది. ఇది 2014 నాటి 282 స్థానాల కంటే ఎక్కువ. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ పట్టు సడలి, బీజేపీ కేవలం 240 స్థానాలకు పరిమితమైంది.

2001 నుంచి ఇప్పటివరకు నరేంద్ర మోదీ రాజకీయ శైలిని గమనిస్తే అధికారం మొత్తం ఒకేచోట కేంద్రీకృతమై సాగింది. ఆయనపై ప్రతిపక్షాల ఒత్తిడి కూడా పెద్దగా ఉండేది కాదు.
నరేంద్ర మోదీ తన నిర్ణయాల నుంచి వెనక్కి తగ్గిన సందర్భాలు చాలా అరుదు.
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పటికీ, అది ఆయనను పదవి నుంచి దించే స్థాయికి చేరలేకపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
నరేంద్ర మోదీ ప్రతిష్ఠకు సవాలు
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 37 రోజుల పాటు సాగిన జెన్ జెడ్ ఆందోళన మోదీ వ్యక్తిగత ప్రతిష్ఠకు గట్టి సవాలు విసిరింది. దీనివల్ల ఆయన మంత్రివర్గంలోని విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. బాహ్య ఒత్తిళ్లకు తలొగ్గి మోదీ ప్రభుత్వంలోని ఒక మంత్రి రాజీనామా చేయడం అనేది ఆయన రాజకీయ శైలికి పూర్తిగా భిన్నమైన విషయం.
ఇది ప్రధానమంత్రి మోదీ, అధికార భారతీయ జనతా పార్టీ రాజకీయ స్థితికి ఒక పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు.
త్వరలోనే బీజేపీ కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. అక్కడ యువతకు ఉపాధి కల్పన అనే అంశమే అధిక సంఖ్యాక ఓటర్ల ప్రధాన ఆందోళనగా మారింది. ఇవి కాకుండా పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి.
"ఇది మోదీకి దెబ్బేనని, ఒక కఠినమైన, ప్రజాదరణ గల, బలమైన నాయకుడిగా నిర్మించుకున్న ఆయన ఇమేజ్‌కు ఇది పెద్ద విఘాతం" అని 'నరేంద్ర మోదీ: ద మ్యాన్, ద టైమ్స్' రచయిత నీలాంజన్ ముఖోపాధ్యాయ్ విశ్లేషించారు.

దాదాపు నెల రోజుల కిందట ప్రారంభమైన ఈ ఆందోళన, జులై 20న ఉద్రిక్తంగా మారింది. పార్లమెంట్ వైపు మార్చ్ చేయడానికి ప్రయత్నించిన విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఈ హింసకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా, వార్తా సంస్థలలో వేగంగా వైరల్ అయ్యాయి. దీనివల్ల సాధారణ ప్రజల్లో విద్యార్థుల పట్ల విస్తృత సానుభూతి వ్యక్తమైంది. పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తూ బాలీవుడ్ నటులు సైతం విద్యార్థులకు మద్దతుగా నిలిచారు.
విపక్ష ఎంపీలు కూడా విద్యార్థుల పక్షాన నిలబడ్డారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ సమావేశాలను అడ్డుకున్నారు. వారాంతం వచ్చేసరికి ఈ ఉద్యమం పట్నా, ముంబయి, కోల్‌కతా సహా దేశంలోని పలు పెద్ద నగరాలకు విస్తరించింది. వేలాది మంది యువకులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
సమర్థించిన వారే శత్రువులుగా మారారా?
శనివారం జంతర్ మంతర్ వద్దకు విద్యాశాఖ మంత్రి రాజీనామా వార్త చేరగానే విద్యార్థుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. దేశ యువత ఇప్పుడు మేల్కొందని, భవిష్యత్తులోనూ మార్పు కోసం పోరాటాన్ని కొనసాగిస్తుందని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ పేర్కొన్నారు.
ప్రజా ఒత్తిడికి మోదీ ప్రభుత్వం తలొగ్గడం ఇదే మొదటిసారి కాదు. 2021లో కూడా ఉత్తర భారతానికి చెందిన వేలాది మంది రైతులు నెలల తరబడి సాగించిన సుదీర్ఘ ఉద్యమం తర్వాత, వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోక తప్పలేదు. అయితే, ఈసారి ఆందోళనకారులు కేవలం కొద్దిరోజుల్లోనే ప్రభుత్వం వెనక్కి తగ్గేలా చేశారు.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, మోదీకి దీనికంటే ఎక్కువ ఆందోళన కలిగించే అంశం మరొకటి ఉంది. నిరసనకారుల ఆగ్రహం ఇప్పుడు కేవలం పేపర్ లీకేజీలకే పరిమితం కాలేదు. డిగ్రీలు పూర్తి చేసిన వారిలో పెరుగుతున్న నిరుద్యోగం, దేశంలోని 37 కోట్ల యువ జనాభాకు గౌరవప్రదమైన, మెరుగైన వేతనాలతో కూడిన ఉద్యోగాలు లేకపోవడం వంటి విస్తృత అసంతృప్తి ఈ ఉద్యమంలో స్పష్టంగా కనిపించింది.
అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన యూత్ లేబర్ మార్కెట్ స్టడీ ప్రకారం, 15 నుంచి 25 ఏళ్ల వయసు గ్రూపులోని డిగ్రీ చదివిన యువతలో దాదాపు 40 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఉపాధి పొందుతున్న వారిలో కూడా చాలా తక్కువ మందికే క్రమబద్ధమైన వేతనం ఇచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. సామాజిక భద్రత వంటి సదుపాయాలు లభిస్తున్న వారు వారిలో ఇంకా తక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందా?
"యువతతో ఎలా వ్యవహరించాలో గ్రహించడంలో బీజేపీ విఫలమైందని అనుకుంటున్నా. ఈ తరం ఇప్పుడు బీజేపీని కఠినమైన ప్రశ్నలు వేస్తోంది. బెదిరింపులకు లొంగడానికి నిరాకరిస్తోంది. ప్రధానమంత్రి, సీనియర్ మంత్రులు, ప్రభుత్వంపై 16 నుంచి 19 ఏళ్ల యువతలో ఇంతటి ఆగ్రహాన్ని నేను మొదటిసారిగా చూశా" అని నీలాంజన్ ముఖోపాధ్యాయ్ అన్నారు.
యువత నుంచి ఇన్ని సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, మోదీ రాజకీయంగా బలహీనపడుతున్నారని భావించవచ్చా? కేవలం రెండు నెలల కిందటే, భారతదేశంలో నాలుగో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తన మొట్టమొదటి విజయాన్ని సాధించింది.
తదుపరి లోక్‌సభ ఎన్నికలు 2029లో జరగనున్నాయి. కాబట్టి మళ్లీ ఓటర్లను ఎదుర్కొనే ముందు యువత సమస్యలను పరిష్కరించడానికి మోదీకి పుష్కలంగా సమయం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
యువత ఆగ్రహాన్ని మోదీ తగ్గించగలరా?
సమయం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించడంలేదని నీలంజన్ ముఖోపాధ్యాయ అభిప్రాయపడ్డారు.
''ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో విద్యాశాఖ మంత్రిగా మోదీ నియమించిన వ్యక్తిలో ఈ విషయంలో సీరియస్‌నెస్ కనిపించడం లేదు. విద్యాశాఖ కార్యదర్శిగా నియమితులైన వ్యక్తిలో కూడా అటువంటి గంభీరత కనిపించడం లేదు. వీరిద్దరిపైనా పలు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి" అన్నారు ముఖోపాధ్యాయ్.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను సీజేపీకి ఒక విజయంగా భావించవచ్చు, కానీ విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియామకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
"ఒక ఆరెస్సెస్ సభ్యుడి స్థానంలో మరొకరిని నియమించడం ఎలాంటి విజయం అని ప్రశ్నించడంలో అర్థం ఉంది. అత్యాచారాల విషయంలో ప్రహ్లాద్ జోషి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే, నేను దానిని ఆ కోణంలో చూడటం లేదు. ఇది ఒక సింబాలిక్ విజయం. అధికారంలో ఉన్న ప్రభుత్వం చాలా బలంగా ఉన్నప్పుడు, సింబాలిక్ విజయాలు కూడా ముఖ్యమే" అని రచయిత, చరిత్రకారుడు ముకుల్ కేశవన్ అభిప్రాయపడ్డారు.
''ఈ ఉద్యమం ప్రభుత్వం మారడం గురించినది కాదు. ప్రజలు తమ గళాన్ని వినిపించగలరని, ప్రభుత్వాన్ని ప్రశ్నించగలరని, అలాగే అధికారులు వినేలా గట్టిగా తమ గళాన్ని వినిపించగలరని వారికి అవగాహన కల్పించడం దీని ఉద్దేశ్యం. ఆ కోణంలో చూస్తే, ఇది ఉద్యమానికి ఒక విజయం" అన్నారు కేశవన్.

''భారతదేశ ఆర్థిక నమూనాకు సంబంధించి అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ముఖ్యంగా మోదీ ఇంతకాలం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇది మరింత కీలకం. అధిక ఆర్థిక వృద్ధి రేటు నమోదైనప్పటికీ, భారతదేశానికి అవసరమైన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు, సామాజిక పురోగతి, ఆర్థిక అభివృద్ధి మాత్రం ఇంకా సమకూరలేదు" అని బ్రిటిష్ పత్రిక 'ఫైనాన్షియల్ టైమ్స్'తో యేల్ యూనివర్సిటీకి చెందిన సౌత్ ఏషియన్ స్టడీస్ అధ్యాపకుడు సుశాంత్ సింగ్ చెప్పారు.
భారతదేశ విద్యా వ్యవస్థ పరిస్థితి పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని ఈ ఉద్యమం స్పష్టంగా తెలియజేసింది.
సుమారు 7 శాతం ఆర్థిక వృద్ధి రేటుతో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచినప్పటికీ, ప్రతి సంవత్సరం ఉద్యోగ రంగంలోకి ప్రవేశించే లక్షల మంది పట్టభద్రులకు తగిన ఉపాధిని కల్పించడంలో దేశం ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది.
"వీధుల్లో కనిపిస్తున్న ఆగ్రహాన్ని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల విజయంగా మలచుకోగలదా లేదా అనేది ఇంకా స్పష్టంగా లేదు" అని రాజకీయ విశ్లేషకుడు రాము మణివన్నన్ అమెరికా మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్‌తో అన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన భారీ విజయం, ఈ విషయంలో ఎదురుదెబ్బలు తగిలినా, అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంపై ఇంకా బలమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తోందని నిరూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మణివణ్ణన్ మద్రాస్ విశ్వవిద్యాలయంలోని పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి మాజీ అధిపతి
"విద్యార్థులపై అణచివేత, వారిపై పోలీసుల హింస ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేశాయి. ఇది నరేంద్ర మోదీని రాజకీయంగా ఏకాకిని చేసి, ఆత్మరక్షణలో పడేలా చేసింది" అని అన్నారు.
భారత యువత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలోని ప్రతి ఐదుగురు నిరుద్యోగులలో నలుగురు 30 ఏళ్లలోపు వారే. అంతకంటే ఆందోళనకరమైన విషయం ఏంటంటే, నిరక్షరాస్యులతో పోలిస్తే పట్టభద్రులలో నిరుద్యోగ రేటు తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉంది.
మరోవైపు, వాస్తవ వేతనాలు చాలా వరకు స్తంభించిపోయాయి. ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వడంలో విఫలమయ్యాయి. గత దశాబ్దంలో శిక్షణ పొందిన సుమారు కోటిన్నర మందిలో, కేవలం 15 శాతం మంది మాత్రమే ఉపాధి పొందారు.
భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక ఐటీ కంపెనీలు కూడా ఇంజనీర్లను తొలగిస్తూ, కొత్త నియామకాలను నిలిపివేస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో, ఈ రంగంలోని ఐదు అతిపెద్ద కంపెనీలు మొత్తం మీద కేవలం 17మందిని మాత్రమే నియమించుకున్నాయి.
గత దశాబ్ద కాలంగా మోదీ యువత మద్దతుతో తన రాజకీయ పునాదిని నిర్మించుకున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానని, 100 కొత్త నగరాలను ఏర్పాటు చేస్తానని, మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తానని, అవినీతిని నిర్మూలిస్తానని, కొత్త మధ్యతరగతి వర్గాన్ని సృష్టిస్తానని ఆయన వాగ్దానం చేశారు. అయితే, 12 సంవత్సరాల తర్వాత, యువత ఇప్పుడు ఈ వాగ్దానాలను ప్రశ్నిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























