శ్రీలంకలోని జైళ్లలో ఘర్షణలెందుకు జరుగుతున్నాయి.. ఖైదీలు, అధికారుల ప్రాణాలు తీస్తున్న ఈ గొడవలు మాదకద్రవ్యాల కోసమా?

శ్రీలంక, జైళ్లలో ఖైదీల గొడవలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్, డ్రగ్స్
ఫొటో క్యాప్షన్, పల్లెర్సేన జైలు
ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

శ్రీలంకలోని మూడు జైళ్లలో 12 గంటల వ్యవధిలో జరిగిన గొడవల్లో ముగ్గురు మరణించారు. అనేకమంది గాయపడ్డారు.

కొలంబోలోని న్యూ మాగస్, కురువిత, పల్లన్సేన జైళ్లలో గొడవలు జరిగాయి.

మూడు జైళ్లలోనూ పరిస్థితిని ప్రస్తుతం అదుపులోకి తెచ్చినట్లు జైళ్ల శాఖ తెలిపింది.

ఈ మూడు జైళ్లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర జైళ్లలోనూ భద్రత చర్యలను పటిష్టం చేసినట్లు జైళ్ల శాఖ అధికారులు వెల్లడించారు.

జైళ్లలో అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో పరిశీలించేందుకు ఉమ్మడి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీలంక, జైళ్లలో ఖైదీల గొడవలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్, డ్రగ్స్
ఫొటో క్యాప్షన్, అనురాధపుర జైలు

నిన్న రాత్రి నుంచి ఏం జరిగింది?

ఆగస్టు 7 రాత్రి సుమారు 10.15 గంటలకు కొలంబోలోని బొరెల్లా ప్రాంతంలో ఉన్న న్యూ మాగస్ జైలులో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.

ఖైదీల్లో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తిందని జైళ్ల శాఖ పేర్కొంది. ఖైదీలు అకస్మాత్తుగా జైలు గదుల్లో నుంచి బయటకు వచ్చి గొడవకు దిగారు.

దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు, పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగాయి.

మాదక ద్రవ్యాల కోసమే ఈ రెండు వర్గాల మధ్య గొడవ జరిగి ఉండవచ్చని, జైలు బయట పడేసిన డ్రగ్స్ ప్యాకేజీలను ఖైదీలు అందుకోలేకపోవడమే ఈ సమస్యకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ఈ గొడవల్లో ఒక ఖైదీ మరణించారు. పది మంది గాయపడ్డారు.

గాయపడిన ఖైదీలను కొలంబో జాతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. న్యూ మాగస్ జైలులో పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అదుపులో ఉందని అధికారులు చెప్పారు.

శ్రీలంక, జైళ్లలో ఖైదీల గొడవలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్, డ్రగ్స్
ఫొటో క్యాప్షన్, జైలులో భద్రతను కట్టుదిట్టం చేశారు.

కురువిట జైలు ఘర్షణ

ఆగస్టు 8 ఉదయం సుమారు 6.30 గంటలకు కురువిట జైలులోనూ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

ఖైదీలు జైలులోని ఆసుపత్రిని ధ్వంసం చేశారని నివేదికలు సూచిస్తున్నాయి.

జైలులో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బందిని రంగంలోకి దించారు.

అయితే పరిస్థితి అదుపు తప్పడంతో టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు కాల్పులు కూడా జరిపారు.

కురువిట జైలులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కాల్పులు జరపడం అవసరమైందని న్యాయశాఖ మంత్రి హర్షన నానాయక్కర పేర్కొన్నారు.

ఈ ఘటనలో ఇద్దరు ఖైదీలు మరణించగా 13 మంది గాయపడ్డారు.

గాయపడిన ఖైదీలకు రత్నపుర ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

కురువిట జైలులో పరిస్థితులు అదుపులోకి రావడంతో అక్కడ భద్రత చర్యలను పటిష్టం చేశారు.

శ్రీలంక, జైళ్లలో ఖైదీల గొడవలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్, డ్రగ్స్
ఫొటో క్యాప్షన్, పల్లన్సేన జైలు

పల్లన్సేన జైలులో ఉద్రిక్తత

కొలంబోలోని న్యూ మాగస్, కురువిటు జైలులో గొడవల తర్వాత నెగొంబో పల్లన్సేన జైలులో అశాంతి చెలరేగింది.

ఆగస్టు 8 ఉదయం ఖైదీలకు అల్పాహారం అందించేందుకు జైలు గదుల్ని తెరిచారు.

తమ గదుల్లోంచి బయటకు వచ్చిన ఖైదీలు తిరిగి తమ సెల్స్‌కు తిరిగి వెళ్లేందుకు నిరాకరించి జైలు పైకప్పుపై నిరసన చేపట్టారు.

దీంతో జైలుకు భద్రత కల్పించేందుకు పోలీసులు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బందిని రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు.

ఆ తర్వాత, ఖైదీలు జైలు ప్రధాన ద్వారం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

అంతేకాకుండా, ఖైదీలు రాళ్లతోత అధికారులపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో, భద్రతా దళాలు వారిపై బాష్పవాయువు ప్రయోగించాయి.

పల్లన్సేన జైలు ఘర్షణలో 28 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఇక్కడ కూడా పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

సుమారు 12 గంటల వ్యవధిలో మూడు జైళ్లలో చెలరేగిన ఉద్రిక్తతను ఇప్పుడు పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు జైళ్ల శాఖ ధ్రువీకరించింది. మూడు జైళ్లలో జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మరణించగా 51 మంది గాయపడ్డారు.

శ్రీలంక, జైళ్లలో ఖైదీల గొడవలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్, డ్రగ్స్

ఫొటో సోర్స్, AnandaWijepala/FB

ఫొటో క్యాప్షన్, మాదకద్రవ్యాలు, అండర్ వరల్డ్ కుట్రల వల్లే జైళ్లలో గొడవలు జరిగినట్లు మంత్రి ఆనంద విజయపాల చెప్పారు.

గొడవలెప్పుడు మొదలయ్యాయి?

జులై 5, 6న నెగొంబో జైలులో మొదటిసారిగా జైలులో ఖైదీలు గొడవ పడ్డారు.

నెగొంబో జైలులో జరిగిన ఘర్షణలో అధికారులు సహా 28 మంది మరణించారు.

వందల మంది గాయపడ్డారని స్థానిక మీడియా కథనాలు వచ్చాయి.

నెగొంబో జైలులో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భద్రతా దళాలు కాల్పులు జరిపాయి.

దీని తర్వాత ఆగస్టు ఒకటిన మహారా జైలులోనూ ఖైదీలు గొడవ పడ్డారు.

అల్లర్లలో గాయపడిన 10 మందిని రాగమ ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో ఒకరు మరణించారు.

జైళ్లలో నిరంతరం జరుగుతున్న ఘర్షణలకు కారణాల గురించి ప్రజా భద్రత శాఖ మంత్రి ఆనంద విజయపాల పార్లమెంట్‌లో మాట్లాడారు.

ఈ గొడవల వెనుక మాదకద్రవ్యాల, క్రిమినల్ గ్యాంగుల కార్యకలాపాలు ఉన్నాయని గుర్తించినట్లు ఆయన చెప్పారు.

"నెగొంబో జైలులో ప్రారంభమైన గొడవలు పల్లన్సేనకు వ్యాపించాయి. ఈ విషయానికి సంబంధించి మాకు అందిన నిఘా సమాచారం దర్యాప్తు ఆధారంగా ఇది ఒక కుట్ర లేదా గందరగోళం సృష్టించే ప్రయత్నం కావచ్చనే అనుమానం ఉంది. అయితే, ఈ సంఘటనలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా మాదకద్రవ్యాలు అండర్‌వరల్డ్ గ్రూపుల కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తించాం. వారిని అదుపు చేసేందుకు చర్యలు చేపట్టాం" అని ఆనంద విజయపాల అన్నారు.

అదే సమయంలో, ఖైదీలు, అధికారుల భద్రతను కాపాడటమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)