రాహుల్ గాంధీ ధర్నా: మోదీ ఇంటి నుంచి ఛత్రసాల్ స్టేడియం వరకు.. మంగళవారం రాత్రి ఏం జరిగింది?

Rahul Gandhi, Chhatrasal stadium

ఫొటో సోర్స్, Getty Images/x.com/RahulGandhi

    • రచయిత, దిగవల్లి పవన్ కాంత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

కాక్రోచ్ జనతా పార్టీ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం నిర్వహించిన నిరసన, పార్లమెంట్ మార్చ్‌లో విద్యార్థులపై లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాల తరువాత మరుసటి రోజు మంగళవారం విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ఎదుట మంగళవారం బైఠాయించారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మరికొందరు నేతలు మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో దిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాన మంత్రి ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేశారు.

సీజేపీ నిరసనకారులపై పోలీసులు పాల్పడిన హింసకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని, నీట్ పరీక్షా పత్రాల లీకుల విషయంలో ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మరికొందరు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు.

నిరసన తెలపడానికి ప్రధాన మంత్రి నివాస ప్రాంగణం సరైన ప్రాంతం కాదని ధర్నా చేస్తున్న నేతలకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి వివరించే ప్రయత్నం చేశారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ధర్నా చేస్తున్న ప్రతిపక్ష నేతలతో ప్రభుత్వం తరపున చర్చలు జరిపేందుకు ప్రయత్నించానని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
 కాంగ్రెస్, ప్రధాని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నీట్, పార్లమెంట్, సీజేపీ

ఫొటో సోర్స్, Congress

ఫొటో క్యాప్షన్, మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌

మరోవైపు దేశవ్యాప్తంగా మద్దతుదారులు, నిరసనకారులు దిల్లీలోని ప్రధాని మోదీ నివాసానికి చేరుకోవాలని రాహుల్ గాంధీ 'ఎక్స్‌'లో పిలుపునిచ్చారు.

దీంతో అలర్టైన పోలీసులు, భద్రత బలగాలు.. ధర్నాను భగ్నం చేస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇతర నేతలను, నిరసనకారులను అదుపులోకి తీసుకుని దిల్లీలో వేర్వేరు ప్రాంతాలకు తరలించారు.

''ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తున్న దాదాపు వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశ చరిత్రలో మొదటిసారిగా ప్రతిపక్ష నేతను రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయారు'' అని సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ బీబీసీ తెలుగుతో చెప్పారు.

బీబీసీతో మాట్లాడిన సమయంలో యోగేంద్ర యాదవ్ అపుడే పోలీసుల అదుపులోంచి విడుదలై ఛత్రసాల్ స్టేడియంనుంచి బయటకు వస్తున్నారు.

రాహుల్ గాంధీని వాయువ్య దిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంకు, ప్రియాంక గాంధీని సెంట్రల్ దిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అయితే ప్రధాని నివాస ప్రాంగణంలో ధర్నా చేస్తున్న ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నాక వాళ్లను ఎక్కడికి తరలిస్తున్నారో పోలీసు అధికారులెవరూ వెల్లడించలేదు. వ్యుహాత్మకంగా నిరసనకారులను వేర్వేరు ప్రాంతాలకు తరలించి వివరాలను గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు.

''వాళ్లను ఎక్కడికి తీసుకెళ్లారో మేం చెప్పలేం. ఇప్పుడు ఆ సమాచారం మీకిచ్చే స్థితిలో మేం లేం'' అని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో పరిస్థితులను పర్యవేక్షిస్తున్న సీనియర్ పోలీసు అధికారి ఒకరు ‘బీబీసీ’తో అన్నారు.

 కాంగ్రెస్, ప్రధాని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నీట్, పార్లమెంట్, సీజేపీ
ఫొటో క్యాప్షన్, ఛత్రసాల్ స్టేడియం

రాహుల్ గాంధీని ఛత్రసాల్ తీసుకెళ్లాక ఏం జరిగింది?

రాహుల్ గాంధీని తరలించిన ఛత్రసాల్ స్టేడియం దగ్గర పోలీసు బలగాల భారీ మోహరింపు, బారికేడ్లు కనిపించాయి.

స్టేడియం బయట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేస్తూ బారికేడ్లను పక్కకు లాగేసే ప్రయత్నంతోపాటు పోలీసులను దాటుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్లను పోలీసులు అడ్డుకున్నారు.

స్టేడియం లోపలే రాహుల్ గాంధీ ఉన్నారని, పోలీసు బలగాలు ఆయన్ను లోపలికి తీసుకెళ్లేటపుడు చూసిన ఏఐసీసీ సభ్యుడొకరు బీబీసీ తెలుగుతో చెప్పారు.

 కాంగ్రెస్, ప్రధాని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నీట్, పార్లమెంట్, సీజేపీ
ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీకి మద్దతుగా అఖిలేశ్ యాదవ్ వచ్చారు.

బస్సులో ఛత్రసాల్ స్టేడియానికి వచ్చిన అఖిలేశ్ యాదవ్

సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ ఛత్రసాల్ స్టేడియానికి పసుపు రంగు టూరిస్ట్ బస్‌లో చేరుకున్నారు. డ్రైవర్ పక్క సీటులో ఆయన కూర్చోగా బస్సులోపలా, పైనా, ముందు, వెనుకా, చుట్టూ భారీ సంఖ్యలో సమాజ్ వాదీ పార్టీ మద్దతుదారులు నినాదాలు చేసుకుంటూ రావడం కనిపించింది.

రాత్రి 9:10 గంటల నుంచి 9:30 గంటల మధ్యలో అఖిలేశ్ యాదవ్ బస్సు ఛత్రసాల్ స్టేడియం ఎంట్రన్స్‌కు చేరుకుంది.

ఎక్కడా ఆగని బస్సు క్రమంగా ముందుకు కదులుతూనే కనిపించింది. ముందున్న నిరసనకారులంతా బారికేడ్లను ఎత్తి పక్కకు నెట్టేశారు. పోలీసులను తోసుకుంటూ ముందుకెళ్లిపోయారు. దీంతో భద్రతా బలగాలు వాళ్లను ఆపలేకపోయాయి.

అఖిలేశ్ యాదవ్ కూర్చున్న బస్సు బారికేడ్లను దాటుకుని మూసి ఉన్న గేటును తాకేంత వరకూ వెళ్లింది. వీళ్లను ఆపేందుకు ప్రయత్నిస్తున్న పోలీసు బలగాలపై అక్కడున్న నిరసనకారుల్లో ఆగ్రహం కనిపించింది. పరిస్థితి చేయి దాటిపోతుందని అర్థం చేసుకున్న పోలీసులు తప్పక స్టేడియం గేటుని తెరవాల్సి వచ్చింది.

బస్సు స్టేడియం లోపలికి దూసుకెళ్లింది. బస్సుతో పాటు అనేక మంది నిరసనకారులు పోలీసులను నెట్టుకుంటూ, తోసుకుంటూ స్టేడియం లోపలికి వచ్చేశారు. బస్సు లోపలికి వెళ్లిపోగానే వెంటనే గేటుని ముసేసిన పోలీసులు అనేక మంది నిరసనకారులను స్టేడియం బయటే నిలిపేశారు.

ఈలోగా స్టేడియం లోపల నినాదాలతో మార్మోగింది. అఖిలేశ్ యాదవ్ బస్సు దిగి స్టేడియం మైదానంలోకి వెళ్లే సమయానికి, అప్పటి వరకూ అక్కడే పోలీసుల అదుపులో ఉన్న రాహుల్ గాంధీని పోలీసులు బయటకు తరలించేశారు.

ఆ సమయంలో రాహుల్ గాంధీని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియలేదు. దీంతో స్టేడియం మైదానంలోనే కూర్చొన్న అఖిలేశ్ యాదవ్ అక్కడున్న మీడియా వాళ్లతో మాట్లాడారు. ఆయన చుట్టూ గుమిగూడిన సమాజ్ వాదీ పార్టీ మద్దతుదారులు చాలాసేపు బైఠాయించి నినాదాలు చేస్తూ కనిపించారు.

అప్పటికే రాహుల్ గాంధీ సహా పోలీసులు అదుపులోకి తీసుకున్న వాళ్లందరినీ విడిచిపెట్టేశారని అక్కడే ఉన్న యోగేంద్ర యాదవ్ బీబీసీ తెలుగుతో చెప్పారు.

పోలీసులు రాహుల్ గాంధీని అక్కడి నుంచి తరలించడంతో దాదాపుగా 10:10 గంటల సమయంలో అఖిలేశ్ యాదవ్ స్టేడియం నుంచి బయలుదేరి దిల్లీలో ఆయన నివాసానికి వెళ్లిపోయారు.

తర్వాత కూడా చాలా సేపు స్టేడియం బయట కొందరు ఆందోళనకారులు నినాదాలతో నిరసనలు కొనసాగించారు. క్రమంగా పదకొండు గంటల సమయానికి అక్కడ పరిస్థితి సద్దుమణిగింది.

 కాంగ్రెస్, ప్రధాని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నీట్, పార్లమెంట్, సీజేపీ

ఫొటో సోర్స్, @INCIndia

కాంగ్రెస్ నిరసనలు కొనసాగుతాయి: ఏఐసీసీ

ఛత్రసాల్ స్టేడియం నుంచి రాహుల్ గాంధీ, మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ నుంచి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వెళ్లిపోయాక ఏఐసీసీ జాతీయ కో-ఆర్డినేటర్ ఒకరు బీబీసీ తెలుగుతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ నిరసనలు కొనసాగుతాయని, దేశవ్యాప్తంగా మరింత మంది నిరసనకారులు దిల్లీ వస్తారని చెప్పారు.

కొన్ని కేసుల విషయంలో పోలీసులతో పోరాడుతున్న ఈ నాయకుడు తన పేరు వెల్లడి చేయొద్దని బీబీసీ తెలుగుని కోరారు.

ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు?

కాగా రాజీనామా డిమాండ్ ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం రాత్రి తాజా పరిణామాలపై స్పందించారు.

ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించాలని చూస్తున్నారని ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు.

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి బయట ధర్నా చేయడంతో సామాన్య ప్రజలకు అసౌకర్యం కలిగిందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

మంగళవారం రాత్రి ధర్మేంద్ర ప్రధాన్ 'ఎక్స్'లో దీనికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆయన.. 'లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ... పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించడానికి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను వాడుకుంటున్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల ప్రజలకు అసౌకర్యం కలగించడమే కాకుండా భద్రత నిబంధనలనూ ఉల్లంఘించారు' అని రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)