అల్లరి నరేశ్ నటించిన 'రంభ, ఊర్వశి, మేనక' ఎలా ఉంది?

ఫొటో సోర్స్, facebook.com/AnnapurnaStudio
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ సొంత స్టైల్ల్ కామెడీ రంభ, ఊర్వశి, మేనకలో నటించాడు. మరి నవ్వించాడా? ఈ అందగత్తెలు మెప్పించారా?
కథ ఏమంటే రాజమండ్రిలో ఉన్న సూరికి (అల్లరి నరేష్) చిన్నప్పటి నుంచి ఒక కల సినిమా హీరో కావాలని. వాళ్ల ఇంట్లో ఒక మ్యాజిక్ బుక్ ఉంటుంది. దాన్ని అన్‌లాక్ చేస్తే రంభ, ఊర్వశి, మేనక ప్రత్యక్షమవుతారని అతని నమ్మకం.
పుస్తకం తెరవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ దేవకన్యల కోసం యాగాలు పూజలు చేస్తూ ఉంటాడు. దీని కోసం ఊరంతా అప్పులు చేస్తాడు. అదే ఊళ్లో ఉన్న చిన్ని (సురభి)తో లవ్. కానీ ఆమె తండ్రి పెళ్లికి ఒప్పుకోడు.
నెలరోజుల్లో అప్పులు తీర్చాలని షరతు పెడతాడు. మరోవైపు సూరి తల్లికి అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాలి. 30 లక్షలు అవసరం.
ఈ టెన్షన్లో సూరిబాబు మ్యాజిక్ బుక్‌ని అన్‌లాక్ చేస్తాడు. నిజంగానే రంభ, ఊర్వశి, మేనక ప్రత్యక్షమవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? సూరి కష్టాలు తీరాయా?


ఫొటో సోర్స్, facebook.com/AnnapurnaStudio
ఒకప్పుడు రాజేంద్రప్రసాద్ తర్వాత హాస్యం అంటే అల్లరి నరేషే. జనం బాగా నవ్వుకునేవాళ్లు.
నరేష్ సినిమాకి వెళితే కామెడీ మినిమం గ్యారెంటీ. కానీ కాలం మారింది. నరేష్ మారలేదు. ఇంకా పాతికేళ్ల క్రితం కామెడీనే నమ్మి మళ్లీ తీసారు.
జబర్దస్త్ తదితర కామెడీ షోలు వచ్చిన తర్వాత నరేష్ తరహా కథలన్నీ ఎపిసోడ్స్‌గా మారిపోయి టీవీల్లోకి వెళ్లిపోయాయి.
హాస్యం ఇంకో అడుగు ముందుకేసి రీల్స్, మీమ్స్ రెండు నిముషాల స్కిట్స్, పంచ్‌లకి వచ్చేసింది.
ఈ వేగంలో రెండున్నర గంటలు థియేటర్లో కూర్చోపెట్టాలంటే ఎంత ఫ్రెష్ ఎనర్జీ ఉండాలి?
రంభ, ఊర్వశి మేనకలో లోపించింది అదే. మనిషి దేవలోకానికి వెళ్లడం, దేవతలే దిగిరావడం, మ్యాజిక్ బుక్ ఇవన్నీ దేవాంతకుడు, యమగోల, యమలీలలో చూసేశాం.
దేవకన్యలు భూమ్మీదకి రావడం కూడా పాతదే. అయితే ఫాంటసీలు ఎపుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. సరిగ్గా రాసుకుంటే.

ఫొటో సోర్స్, facebook.com/AnnapurnaStudio
బలహీనమైన రైటింగ్, అరిగిపోయిన పంచ్‌లు, డైలాగ్‌లు రెండు గంటల 20 నిముషాలు భరించాలంటే సాధ్యమేనా?
అసలా కథేంటో, ఎటు పోతుందో కూడా అర్థంకాదు.
దేవకన్యలు వచ్చిన తర్వాత కొంత మారుతుందనుకుంటే వాళ్లు ఎక్స్ప్రెషన్ లేని డైలాగులు చెప్పి, లాస్ట్‌లో ఒక డాన్స్ చేసి వెళ్లిపోతారు.
ఫాంటసీలో ఎవరూ లాజిక్‌లు అడగరు కానీ, పాత్రలకి ఏదో ఒక క్యారెక్టర్ , కథకి గమ్యం ఉండాలి కదా?
దర్శకుడు చంద్రమోహన్ ఎపిసోడ్స్ రాసుకుంటూ తీసుకుంటూ వెళ్లాడు కానీ, అవి స్క్రీన్ మీద ఎంత అవుట్‌డేటెడ్ అనేది చెక్ చేసుకోలేదు.
హీరోయిన్ చేతిలో హీరో, శ్రీనివాసరెడ్డి, సీనియర్ నరేష్ దెబ్బలు తినే సుదీర్ఘ సీన్లో ప్రేక్షకులు చంద్రముఖిలో ప్రభులా ఏం ఖర్మరా దేవుడా అనుకుంటే అది వాళ్ల తప్పుకాదు.
ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ కూడా నవ్వించలేకపోయాడు. చిన్న నరేష్, పెద్ద నరేష్ మాత్రం అక్కడక్కడ నవ్వించారు. శ్రీనివాసరెడ్డి ఓకే.
పాటలు , ఎడిటింగ్, కెమెరా దేని గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ సినిమాలో ఒక లేడీ క్యారెక్టర్ అడుగుతూ ఉంటుంది.
బట్టల్ని వాషింగ్ మిషన్‌లో వేయనా? అని.
ఆల్రెడీ ప్రేక్షకుల్ని వాషింగ్లో వేసేశారని ఆమెకి తెలియదు.
ఈ సినిమా అన్నపూర్ణ వారిది.
మరి నాగార్జునకు ఈ కథ ఎలా నచ్చిందో అది దేవ రహస్యం.
ప్లస్ పాయింట్స్
1. ఇద్దరు నరేష్‌ల కొంచెం కామెడీ
మైనస్ పాయింట్స్
1. ఎన్ని చెప్పేది దేవేంద్రా
(అభిపాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























