సీజేపీ 'పార్లమెంట్ మార్చ్': మద్దతుదారులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం.. పార్లమెంట్ వద్ద ఇదీ పరిస్థితి..

ఫొటో సోర్స్, Sajjad HUSSAIN / AFP via Getty Images
- రచయిత, దిగవల్లి పవన్ కాంత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
దిల్లీలో ఉదయం వర్షం పడింది. కానీ, ఆ వర్షం కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులను, మద్దతుదారులను జంతర్ మంతర్ చేరుకోకుండా ఆపలేకపోయింది.
వేలాది మంది సీజేపీ మద్దతుదారుల మార్చ్ ముందుగా అనుకున్నట్లే పార్లమెంటు వరకూ చేరుకుంది. ఈ క్రమంలో పోలీసు బలగాలకు, వేల సంఖ్యలో తరలివచ్చిన మద్దతుదారులకు మధ్య తోపులాట జరిగింది. అక్కడక్కడా ఘర్షణ వాతావరణం కనిపించింది.
ముందుకు వెళ్లనివ్వకుండా నిరసనకారులను అడ్డుకుంటోన్న పోలీసు బలగాలపై సీజేపీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారికేడ్లను పక్కకు తోసేశారు.
దాదాపుగా ఆరు అడుగుల భారీ బ్యారికేడ్లను కిందపడేసి వాటిపైకి ఎక్కి తొక్కే ప్రయత్నం చేశారు. మరికొందరు బ్యారికేడ్ల పైకెక్కి ముందుకెళ్లే ప్రయత్నం చేశారు.
"పోలీసులు ఏ స్థాయిలో మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా మేము పార్లమెంటు వరకూ వెళ్లి తీరుతాం. మేం శాంతియుతంగా మార్చ్‌గా వెళ్లాలి అనుకుంటున్నాం. పార్లమెంటుకు వెళ్లడాన్ని ఎవరూ ఆపలేరు. అది మా హక్కు" అని మార్చ్ కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన శివకోటి రెడ్డి అన్నారు.


ఫొటో సోర్స్, ANI Video Grab
నిరసనకారులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం
జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వరకూ దారి పొడవునా అనేక జంక్షన్లలో వేల సంఖ్యలో ముందుకు కదులుతున్న నిరసనకారులను పోలీసు బలగాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అనేక చోట్ల లాఠీచార్జ్ ఘటనలు జరిగాయి.
"పార్లమెంటు మార్చ్ కోసం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. కానీ, ఇంతస్థాయిలో ముందుకెళ్తున్న నిరసనకారులను అడ్డుకోవడం మాకు చాలా కష్టంగా ఉంది. వాళ్లు బలవంతంగా ముందుకెళ్తే మేము వీలైనంత జాగ్రత్తగా వ్యవహరిస్తాం. వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తాం" అని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఒక సీనియర్ దిల్లీ పోలీసు అధికారి అన్నారు.
పార్లమెంటు వద్దకు చేరుకున్న సీజేపీ నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పార్లమెంటు వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులు దారి పొడవునా చెట్లు, ట్రాఫిక్ సిగ్నల్ పోల్స్ ఎక్కి కనిపించారు.

వేల సంఖ్యలో జంతర్ మంతర్‌కు చేరుకున్న నిరసనకారులను భారీ సంఖ్యలో మోహరించిన పోలీసు బలగాలు అడ్డుకోలేకపోయాయి. పార్లమెంటుకి మార్చ్‌గా వెళ్లాలని ఉదయం ఆరు గంటలకే సిద్ధమైన నిరసనకారులు దాదాపుగా 11 గంటల సమయంలో ముందుకు కదిలారు.
అనేక జంక్షన్లలో జరిగిన లాఠీచార్జ్ ఘటనల్లో కొందరు నిరసనకారులు గాయపడగా, ఇంకొందరు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని స్ట్రెచర్ల ద్వారా అంబులెన్సుల్లో ఎక్కించి చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు.

భారీగా భద్రతా బలగాల మోహరింపు
జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు ప్రాంగణం వరకూ పోలీసు బలగాలు అంచెలంచెలుగా రోడ్లపై బ్యారికేడ్లను అమర్చారు. వందల సంఖ్యలో ఉన్న దిల్లీ పోలీసులతో సహా రాపిడ్ యాక్షన్ ఫోర్సెస్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్ బలగాలు కనిపించాయి. వందల సంఖ్యలో పోలీసు బలగాలు వ్యాన్లు కనిపించాయి. మొబైల్ సీసీటీవీ వాహనాలు, వాటర్ క్యానన్ వాహనాలు, అల్లర్లను అదుపు చేసే రాయిట్ వాహనాలు భారీ సంఖ్యలో కనిపించాయి.
ప్రస్తుతం పార్లమెంటు ప్రాంగణమంతా ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు పార్లమెంటు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసు బలగాలు శ్రమిస్తున్నాయి.

పరీక్షా పత్రాల లీకులను తీవ్రంగా నిరసిస్తున్న ఆందోళనకారులంతా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని పట్టుబడుతున్నారు. పరీక్షా పత్రాల లీకుల నేపథ్యంలో దేశ విద్యా వ్యవస్థ, పరీక్షల నిర్వహణలో నిర్మాణాత్మక సంస్కరణలు రావాలని వారు కోరుతున్నారు.
సీజేపీ మార్చ్ గురించి, సీజేపీ డిమాండ్ల గురించి పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. దీంతో పార్లమెంటులో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేది వేచిచూడాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































