గాంధీ: 73 ఏళ్ల వయసులో 21 రోజుల నిరాహార దీక్ష: ఇక బతకరని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన బ్రిటీష్ ప్రభుత్వం

ఫొటో సోర్స్, Hulton-Deutsch Collection/CORBIS/Corbis via Getty Images
- రచయిత, ఉర్విష్ కొఠారి
- హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
దిల్లీలో నిరాహార దీక్ష ఉద్యమం సందర్భంగా మహాత్మా గాంధీ నిరశన దీక్ష మరోసారి వార్తల్లోకి వచ్చింది.
సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను విమర్శించిన వారిలో కొందరు గాంధీ నిరాహార దీక్షనూ మోసం, బ్లాక్‌మెయిల్ అని అభివర్ణించారు.
మరికొందరు.. బ్రిటిష్ ప్రభుత్వమే శత్రువు కాబట్టి గాంధీ నిరాహార దీక్ష ఆయుధం విజయవంతమైందని అభిప్రాయపడ్డారు.
1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చినప్పటి నుంచి, 1948 జనవరి 30న హత్యకు గురయ్యే వరకు.. తన జీవితకాలంలో సుమారు 30సార్లు నిరాహార దీక్ష చేశారు.
'గాంధీజీ డైలీ డైరీ' వంటి విశ్వసనీయమైన రిఫరెన్స్ బుక్‌లకు ఎడిటర్ అయిన చందూలాల్.. గాంధీ నిరాహార దీక్షల వివరాలను రికార్డు చేశారు. అయితే, ''ఆయన అన్ని నిరాహార దీక్షలను బయటికి ప్రకటించలేదు'' అని పేర్కొన్నారు.

వీటిలో ఒకరోజు ఉపవాస దీక్ష నుంచి 21 రోజుల వరకు ఉండే దీక్షలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. గాంధీ చేసిన నాలుగు నిరాహార దీక్షలూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే జరిగాయి.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే నిరాహార దీక్షను గాంధీ సత్యాగ్రహంలో చివరి దశగా భావించారు. అయితే, ఆయన మిగిలిన అనేక నిరాహార దీక్షలు తన సహచరులు, సన్నిహితులు చేసిన కొన్ని తప్పుల కారణంగానే చేశారని చందూలాల్ పేర్కొన్నారు. ఎందుకంటే, తన సహచరుల ప్రవర్తనకు తనను తాను దోషిగా చూసుకున్నారు.
ఆయన నిరాహార దీక్షల్లో మరో ప్రధాన ఉద్దేశ్యం.. మత ఐక్యత, ప్రజలు పాల్పడిన హింసకు వ్యతిరేకంగా ఆందోళన తెలపడమే. హిందూ-ముస్లింల ఐక్యత కోసం 1924లో 21 రోజుల పాటు తొలిసారి ఆయన నిరాహార దీక్ష చేశారు. హత్య జరగడానికి రెండు వారాల ముందు కూడా.. అదే ఉద్దేశంతో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు గాంధీ.

ఫొటో సోర్స్, Getty Images
నిరాహార దీక్ష, శిక్ష ఒప్పందం
1932లో ఎరవాడ జైలులో ఉన్నప్పుడు గాంధీ చేపట్టిన నిరాహార దీక్ష అత్యంత వివాదాస్పదమైంది. ఎందుకంటే, దళితుల కోసం బ్రిటిష్ ప్రధానమంత్రి ప్రకటించిన ప్రత్యేక నియోజకవర్గాలకు వ్యతిరేకిస్తూ దానికి నిరసనగా ఆయన ఈ దీక్ష చేపట్టారు.
ఆయన ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్ అంబేడ్కర్ హిందూ నేతలతో కలిసి పూనా ఒప్పందంపై సంతకం చేశారు.
ఫలితంగా ప్రత్యేక నియోజకవర్గాలకు బదులుగా, ఉమ్మడి నియోజకవర్గాల్లో రిజర్వ్డ్ సీట్లు దళితులకు లభించాయి. (ప్రత్యేక నియోజకవర్గాల్లో దళిత ఓటర్లు మాత్రమే దళిత ప్రతినిధులను ఎంచుకోగలరు.)
ఈ నిరాహార దీక్ష బ్రిటిష్ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా చేపడుతున్నట్లు ప్రకటించినప్పటికీ.. దీనిని బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టినట్లు చూడలేదు.
ఎందుకంటే, దీని అసలు ఉద్దేశం దళితుల ప్రయోజనాలు, హక్కులకు సంబంధించినది.
ఈ ఆరు రోజుల నిరాహార దీక్ష తర్వాత.. అదే ఏడాది డిసెంబర్‌లో సత్యాగ్రహి సంస్కర్త అప్పాసాహెబ్ పట్వవర్ధన్, జైలులోని పారిశుద్ధ్య బృందంలో చేరేందుకు అనుమతి కోరారు.
ప్రభుత్వం ఆ అనుమతి ఇవ్వకపోయే సరికి, అప్పాసాహెబ్ తన ఆహారాన్ని పూర్తిగా తీసుకోవడం మానేశారు.
దళితేతరుడైన అప్పాసాహెబ్ డిమాండ్‌కు మద్దతుగా, పారిశుధ్య పని కోసం ఆయన చేసిన ఆ డిమాండ్‌ను అంటరానితనం నిర్మూలన ఉద్యమంలో భాగంగా భావిస్తూ.. గాంధీ కూడా 1932 డిసెంబర్ 3న నిరాహార దీక్షను ప్రారంభించారు.
కానీ, ప్రభుత్వం దీనిపై విచారణ జరుపుతామని హామీ ఇవ్వడంతో, గాంధీ తన దీక్షను విరమించారు. ఆ తర్వాత సంవత్సరం పాటించిన నిరాహార దీక్షలు కూడా అంటరానితనం నిర్మూలన, దళిత సమాజ సేవకు సంబంధించినవే.
అంతకుముందు జైలు శిక్ష సమయంలో ఆ సమస్యపై పని చేయడానికి గాంధీకి ప్రభుత్వం అనుమతించింది. ఎందుకంటే, ఆ సమయంలో ఆయన ఒక డిప్లొమాటిక్ ప్రిజనర్‌గా ఉన్నారు. 1933లో జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు మాత్రం ప్రభుత్వం అలాంటి అనుమతి ఇవ్వలేదు.
దీంతో, బొంబాయి ప్రభుత్వ హోం సెక్రటరీకి గాంధీ లేఖ రాస్తూ.. "ఎరవాడ ఒప్పందం (పూనా ఒప్పందం)లో ప్రధాన భాగంగా.. మనస్ఫూర్తిగా నేను తీసుకున్న ప్రతిజ్ఞకు అనుగుణంగా, అంటరానితనాన్ని నిర్మూలించడానికి నేను చేస్తున్న కృషిలో ఇది ఒక భాగం మాత్రమే" అని పేర్కొన్నారు.
''నా ప్రాణత్యాగం చేయకుండా ఈ పనిని మీరు ఆపలేరు'' అని చెప్పారు. పదేపదే చేసిన తన అభ్యర్థులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో.. 1933 ఆగస్టు 16 నుంచి నిరాహార దీక్షకు దిగారు.
ఆ దీక్ష సమయంలో, ఆగస్టు 20న తన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. పుణేలోని సాసూన్ ఆస్పత్రికి గాంధీని తరలించారు. ఆ తర్వాత కూడా తన పరిస్థితి విషమించడంతో.. గాంధీ కూడా బతకాలనే ఆశను వదులుకున్నారు.
ఆగస్టు 21న కస్తూర్బా కూడా వచ్చారు. మృత్యువు సమీపించినట్లు తోచడంతో వ్యక్తిగత వస్తువులను తనకు చికిత్స అందిస్తున్నవారికి అప్పగించారు గాంధీ.
తర్వాత గాంధీ స్పృహ కోల్పోయారు. ప్రభుత్వం ఆయనను ఆగస్టు 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించగా, ఆ తర్వాత ఆయనఆస్పత్రిలోనే నారింజ రసం తాగి తన నిరాహార దీక్షను విరమించారు.

ఫొటో సోర్స్, Getty Images
తప్పుడు ఆరోపణలు, ప్రాణాపాయ స్థితి
1933 డిసెంబర్ నిరాహార దీక్ష గురించి గాంధీ ఇలా రాశారు. ''నాకు ఇష్టమున్నా లేకున్నా నిరాహార దీక్ష నా రోజువారీ అంశంగా మారింది. ఇందులో తప్పేముంది? ఉపవాసం నా జీవితంలో భాగమైందని అర్థం చేసుకోవాలి. నా శరీరంపై ఉన్న మమకారాన్ని వదులుకోవాల్సిన అవసరం ఉంది'' అని గాంధీ చెప్పినట్లు 'గాంధీజీనో అక్షర్‌దేహ్’ పుస్తకం (55వ సంపుటం పేజీ 393) లో పేర్కొన్నారు.
ఇలా రాసిన పదేళ్ల తర్వాత.. గాంధీ మరోసారి నిరాహార దీక్ష సమయంలో మృత్యుముఖం వరకు వెళ్లారు.
1942 ఆగస్టులో జరిగిన 'క్విట్ ఇండియా' ఉద్యమం అనంతరం.. కాంగ్రెస్ నేతలందర్ని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించింది. ఈ ఉద్యమంలో హింస కూడా హింస జరిగింది.
ఈ హింసకు, ఆందోళన పరిస్థితికి గాంధీని, కాంగ్రెస్‌ను నిందించింది ప్రభుత్వం.
బ్రిటన్ ప్రధానమంత్రి చర్చిల్‌లాగానే అప్పటి వైస్రాయ్ లిన్‌లిత్‌గోకు కూడా గాంధీపై తీవ్రమైన ద్వేషం ఉండేది.
ఈ అశాంతికి గాంధీయే కారణమని ఆయన గట్టిగా నమ్మారు. గాంధీకి, వైస్రాయ్‌కి మధ్య లేఖల ద్వారా సుదీర్ఘమైన సంభాషణలు జరిగాయి.
వైస్రాయ్ గనుక ఆ అభియోగాలను నిరూపించగలిగితే, ఎలాంటి సంకోచం లేకుండా తన తప్పును ఒప్పుకుంటానని, లేకపోతే ఆ ఆరోపణలను ఉపసంహరించుకోవాలని గాంధీ ఆయనకు లేఖ రాశారు.
వైస్రాయ్ చర్యలకు వెనకడుగు వేయకుండా, గాంధీ 73 ఏళ్ల వయసులో ఆగఖాన్ ప్యాలెస్ జైలులో 21 రోజుల నిరాహార దీక్షను చేపట్టారు.
ఆ సమయంలో గాంధీ ఆరోగ్యాన్ని చూస్తే.. 21 రోజుల నిరాహార దీక్షను పూర్తి చేస్తారన్న నమ్మకం ఏమాత్రం లేదు. మరో జైలులో ఉన్న కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ గిల్డర్‌కు గాంధీ సంరక్షణ బాధ్యతల అప్పజెప్పారు.
డాక్టర్ సుశీలా నాయర్ కూడా ఆయనతోనే ఉన్నారు. బ్రిటీష్ వైద్యుడు, మేజర్ జనరల్ క్యాండీ సైతం గాంధీ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 10న ప్రారంభమైన నిరాహార దీక్ష సమయంలో గాంధీ పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది.
గాంధీకి ఇచ్చే నీళ్లలో జ్యూస్ కలిపి ఇవ్వాలని, లేకపోతే ఆయన బతకడం కష్టమని ఆయన సహచరులకు మేజర్ జనరల్ క్యాండీకి చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అయితే, గాంధీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేంత వరకు ఎవరూ కూడా ఈ ఆ పని చేసేందుకు సిద్ధంగా లేరు.
ఆయన శ్వాసలో ఎసిటోన్, యురేమియా లక్షణాలు కనిపించాయి. అవి కిడ్నీ దెబ్బతింటున్నట్లు సూచించాయి. చివరికి ఫిబ్రవరి 21 సాయంత్రం డాక్టర్ సుశీలా నాయర్ సలహాతో ఆయన దీక్షను విరమించేందుకు అంగీకరించారు.
''ఆయన నీళ్లు తాగలేకపోతే, కనీసం కొంత బత్తాయి రసాన్నయినా తాగగలిగేలా చేసుకుంటానని ఇదివరకే చెప్పారు" అని ‘బాపూస్ స్టోరీ ఆఫ్ ఇంప్రిజన్‌మెంట్’ (పేజీ 278-9) అనే పుస్తకంలో దీని గురించి డాక్టర్ సుశీలా నాయర్ ప్రస్తావించారు.
ఆ తర్వాత, ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో, డాక్టర్ల సలహాను పక్కన పెట్టి, బత్తాయి రసం తాగడం తగ్గించారు.
మళ్లీ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. దీంతో, వైద్యులు ఆయన ఆరోగ్యంపై నిరంతరం ఆందోళన చెందారు. కానీ, అత్యవసర పరిస్థితి మాత్రం తలెత్తలేదు.

ఫొటో సోర్స్, Getty Images
గాంధీ మరణానికి బ్రిటీష్ ప్రభుత్వం కూడా సిద్ధమైంది
ఈ నిరాహార దీక్ష సమయంలో కేవలం వైస్రాయ్ మాత్రమే కాక, బ్రిటీష్ ప్రభుత్వం కూడా గాంధీ మరణం ఖాయమని భావించి, అందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధమైంది.
గాంధీకి అత్యంత సన్నిహితురాలైన మీరా బెహన్ పేర్కొన్న అంశాల్లో, "దహన సంస్కారాల కోసం సుఖద్, ఇతర కలపను ప్రభుత్వమే ఆర్డర్ చేసిందని, అలాగే దహన సంస్కారాల ఊరేగింపు వెళ్లే మార్గాన్ని కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని తరువాత తెలిసింది'' అని రాశారు.
''అదే సమయంలో బాపు మరణ వార్త తెలిసిన తర్వాత తలెత్తే ఎలాంటి అశాంతినైనా వెంటనే అణచివేయాలని, తీవ్ర అప్రమత్తతో ఉండాలని దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు వచ్చాయి'' అని 'జర్నీ ఆఫ్ ఏ సేజ్' (పేజీ 234-5) లో పేర్కొన్నారు.
''సత్యాగ్రహి నిస్సహాయ స్థితిలో ఉండి, వేరే ఏ ఇతర సత్యాగ్రహ మార్గాన్ని అవలంబించే అవకాశం ఆయనకు లేనప్పుడు, పాలక వ్యవస్థ చేసిన అన్యాయం ఎంతగానో వేధించింది. ఆ అన్యాయాన్ని భరించడం అనేది కేవలం సత్తా లేని శూన్యమైన జీవితంగా మారినప్పుడు.. తన ప్రాణాలను సైతం వదిలేందుకు సిద్ధపడి నిరాహార దీక్షను ప్రారంభించాలి" అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నిరాహార దీక్షల గురించి రాస్తూ గాంధీ పేర్కొన్నారు.
గాంధీ అనేక వ్యాసాలు, లేఖలలో నిరాహార దీక్షలకు సంబంధించి విషయాల గురించి చర్చించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































