‘భయంకరమైన ఆర్థిక సునామీ రానుంది, ఏడాదిలోగా మోదీ దిగిపోతారు’అంటూ రాజకీయ దుమారం రేపిన రాహుల్‌గాంధీ

భారత్, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, బీజేపీ, కాంగ్రెస్, ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కాక రేపాయి. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ ఆయనను లక్ష్యంగా చేసుకుంది.

దేశంలో ఓ వైపు 'భయంకరమైన ఆర్థిక సునామీ' రాబోతోందని, మరోవైపు 'వ్యవస్థాగత తిరుగుబాటు'ను కూడా ఎదుర్కోబోతోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం సృష్టించిన 'నియంత్రిత వ్యవస్థ' ఇప్పుడు కుప్పకూలుతోందని ఆయన చెప్పారు.

వచ్చే ఏడాదిలోగా మోదీ ప్రభుత్వం కూలిపోతుందని, నరేంద్ర మోదీ ఇకపై ప్రధానమంత్రిగా ఉండబోరని కూడా రాహుల్ వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చాలా మంది బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘రాహుల్ తన పార్టీ సంగతి చూసుకోవాలి’

బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ రాహుల్ గాంధీని 'అరాచకవాది' అని, దేశంలో ప్రజాస్వామ్య సంక్షోభాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ప్రధానిగా నరేంద్ర మోదీ ఉన్నంత కాలం రాహుల్ గాంధీ దేశం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తన పార్టీ గురించి ఆలోచించుకోవాలని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్‌కులే అన్నారు.

బీజేపీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలోనే రాహుల్ గాంధీ ప్రకటనను కాంగ్రెస్ నాయకులు సమర్థించారు.

'ఆర్థిక సునామీ సంభవిస్తుంది' అని ప్రతిపక్ష నాయకుడు సరిగ్గానే అంచనా వేశారని కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ తివారీ అన్నారు . ఆర్థిక రంగం గురించి రాహుల్ గాంధీ చెప్పినదంతా దేశంలో కనిపిస్తున్న వాస్తవ పరిస్థితేనని తివారీ అభిప్రాయపడ్డారు.

భారత్, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, బీజేపీ, కాంగ్రెస్, ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, ani

ఫొటో క్యాప్షన్, వ్యవస్థల అంతర్గత సమాచారం తనకు అందుతోందని రాహుల్ గాంధీ చెప్పారు.

అసలు రాహుల్ గాంధీ ఏం చెప్పారు?

తన సోషల్ మీడియా ఖాతాలలో బుధవారం కాంగ్రెస్ ఒక వీడియోను అప్‌లోడ్ చేసింది. ఆ వీడియోలో మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ పలు ఆరోపణలు చేశారు.

దేశంలో ఓవైపు 'భయంకరమైన ఆర్థిక సునామీ' రాబోతోందని, మరోవైపు కీలక వ్యవస్థలలో అంతర్గతంగా అసంతృప్తి పెరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. దీనికి ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీనే కారణమని రాహుల్ వ్యాఖ్యానించారు.

"ఒకవైపు భయంకరమైన ఆర్థిక సునామీ వస్తోంది. ధరలు పెరుగుతున్నాయి. మీరు మునుపెన్నడూ చూడనంత ఆర్థిక సంక్షోభాన్ని భారత్ ఎదుర్కోబోతోంది. దానిని ఇప్పుడు ఎవరూ ఆపలేరు. మరోవైపు వ్యవస్థలలో అంతర్గత తిరుగుబాటు జరుగుతోంది"

"ఎన్నికల సంఘం పూర్తిగా మీ అదుపులో ఉందనిఅనుకుంటున్నారు. కానీ అది మూడేళ్ల క్రితం సంగతి. నాకు ప్రధాన ఎన్నికల కమిషనర్ నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అధిపతులు, న్యాయవ్యవస్థలో సీనియర్లు..ఇలా అందరూ తిరుగుబాటు చేస్తున్నారు. వారు మాకు సమాచారం ఇస్తున్నారు" అని రాహుల్ వ్యాఖ్యానించారు.

'' నియంత్రిత వ్యవస్థలు లోపలి నుంచే కుప్పకూలుతున్నాయి. ప్రస్తుత మార్గంలోనే కొనసాగితే ప్రజల నుంచి ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉంటుందని, అది తమకు ప్రమాదకరం అవుతుందని వారు గ్రహించగలుగుతున్నారు'' అని రాహుల్ గాంధీ చెప్పారు.

వ్యవస్థలలో జరుగుతున్న పరిణామాలపై తనకు అంతర్గత సమాచారం అందుతోందని రాహుల్ అంటున్నారు.

"నాకు సమాచారం వస్తోంది. మోదీ గురించి, షా గురించి, ఆయన కుమారుల గురించి, మంత్రుల గురించి, అజిత్ ధోబల్ గురించి పూర్తి సమాచారం వస్తోంది" అని ఆయన అన్నారు.

ప్రజా ఒత్తిడిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం 'అత్యవసర పరిస్థితి'ని విధించే అవకాశముందని రాహుల్ గాంధీ అన్నారు.

"వారు ప్రజా ఒత్తిడిని అణచివేసేందుకు ప్రయత్నించవచ్చు. అత్యవసర పరిస్థితివంటిది ప్రకటించవచ్చు. ఇది జరిగే అవకాశముంది. కానీ ఇప్పుడు మనం మరో దశలోకి వెళ్తున్నాం. ఇంతకుముందు మనం పూర్తిగా నియంత్రిత దశలో ఉండేవాళ్లం. ఇప్పుడు అది అదుపు తప్పుతోంది" అని ఆయన అన్నారు.

"తాను నియంత్రించిన వ్యవస్థ ఇప్పుడు కుప్పకూలి మొత్తం సమాచారాన్ని బయటపెడుతోందని మోదీకి తెలుసు. ఏడాదిలోపే మోదీ ప్రధానమంత్రిగా ఉండరనేది నా అంచనా" అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

భారత్, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, బీజేపీ, కాంగ్రెస్, ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, ani

ఫొటో క్యాప్షన్, దేశంలో అరాచకాన్ని వ్యాప్తి చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

బీజేపీ ఎదురుదాడి

"రాహుల్ గాంధీ ఒక అరాచకవాది. జార్జ్ సోరోస్, రాహుల్ గాంధీ ఇద్దరూ కలిసి దేశంలో అరాచకాన్ని వ్యాప్తి చేయాలని కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ దేశంలో ప్రజాస్వామ్య సంక్షోభాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు" అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ వ్యాఖ్యానించారు.

"రాహుల్ గాంధీ తరహాలో భారత్‌ను ద్వేషించే వ్యక్తిని నేను రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా దేశ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోలేనని రాహుల్ గాంధీ గ్రహించారు. అందుకే ఇప్పుడు ఆయన భారత ప్రజాస్వామ్యాన్ని, స్థిరత్వాన్ని, భద్రతను వ్యతిరేకించడం ప్రారంభించారు" అని ఆయన అన్నారు.

దేశం గురించి కాకుండా మీ పార్టీ గురించి ఆలోచించండని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్‌కులే రాహుల్ గాంధీకి సలహా ఇచ్చారు.

"రాహుల్ గాంధీ పగటిపూట కూడా పీడకలలు కంటారు. కలలు కనాలి గానీ ఆ కలలు వాస్తవికంగా ఉండాలి. రాహుల్ గాంధీ సంపన్న కుటుంబంలో పెరిగారు. ఆయనకు పేదరికం అర్థం కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పేదరికం అర్థం అవుతుంది"

"మోదీ పేదల సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టి పేదరికం సమస్యను పరిష్కరించారు. దేశాన్ని ఎలా తీర్చిదిద్దాలో ఆయనకు తెలుసు. మోదీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం రాహుల్ గాంధీ దేశం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన తన కుటుంబం, పార్టీ గురించి మాత్రమే ఆలోచించాలి" అని చంద్రశేఖర్ బావన్‌కులే సూచించారు.

భారత్, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, బీజేపీ, కాంగ్రెస్, ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను గతంలో సమర్థించిన సుర్జిత్ భల్లా ఇప్పుడు విమర్శిస్తున్నారు.

ఆర్థికవేత్తలు ఏమంటున్నారు?

చాలా మంది ఆర్థికవేత్తలు భారత ఆర్థిక వ్యవస్థ విషయంలో మోదీ ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించారు. ఈ విమర్శకుల జాబితాలో ఒకప్పుడు మోదీ ప్రభుత్వ విధానాలకు మద్దతుదారులుగా ఉన్న ఆర్థికవేత్తలు కూడా ఇటీవల చేరారు.

సెప్టెంబర్ 2017 నుంచి డిసెంబర్ 2018 వరకు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో సభ్యునిగా పనిచేసిన సుర్జిత్ భల్లా మోదీ అనుకూల ఆర్థికవేత్తగా పేరుగాంచారు. అయితే ఇప్పుడు ఆయన వైఖరి మారుతోంది. మోదీ ప్రభుత్వ విధానాలను బహిరంగంగా విమర్శిస్తున్నారు.

మే 21న సుర్జిత్ భల్లా 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'లో "బీజేపీ ఎన్నికల్లో గెలుస్తోంది కానీ ఆర్థిక వ్యవస్థను కోల్పోతోంది" అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు. మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను ఆ వ్యాసంలో భల్లా తీవ్రంగా విమర్శించారు.

"ప్రస్తుతానికి ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో బీజేపీ పనితీరు అల్పస్థాయికి చేరుకుంటున్నట్టు కనిపిస్తోంది. పరిస్థితి మరింత దిగజారదని ఎటువంటి హామీ లేదు" అని భల్లా రాశారు.

2014 నుంచి 2018 వరకు మోదీ ప్రభుత్వంలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అరవింద్ సుబ్రమణియన్ కూడా మే 26న ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన ఓ వ్యాసంలో ప్రభుత్వ విధానాలను విమర్శించారు.

" రూపాయి నిరంతరం పడిపోతున్నప్పుడు, భారత్ తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు... అంతిమంగా బాధ్యత ఎవరు వహిస్తారు?" అని అరవింద్ సుబ్రమణియన్ ప్రశ్నించారు.

" రూపాయి సంక్షోభం ఇంధన దిగుమతులపై ఆధారపడిన భారత్‌పై ఇరాన్ యుద్ధం ప్రభావం పర్యవసానం మాత్రమే కాదు. ఇది భారత్ మధ్యకాలిక ఆర్థిక భవిష్యత్తుపై పెరుగుతున్న సందేహాలను కూడా అంతే లేదా అంతకంటే ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే వర్ధమాన దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలహీనపడింది" అని ఆయన అన్నారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు కూడా మొదట్లో నరేంద్ర మోదీని ప్రశంసించేవారు. కానీ ఆయన స్వరం కూడా మారింది.

పెట్టుబడిదారులకు విశ్వాసం లేని గత పరిస్థితిలోనే భారత్ ఉందని మే 24న న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో సంజయ్ బారు రాశారు.

" పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించే వాతావరణాన్ని సృష్టించమని 1991, 2004ల్లో వ్యాపారులు, మీడియా తమ ఆందోళనలను బహిరంగంగా వ్యక్తం చేశాయి. రాజకీయ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చాయి. కానీ ఇప్పటి మీడియా నానాటికీ పిరికిగా, సంకోచంగా మారుతుండగా వ్యాపార వర్గం మాత్రం రిస్క్‌కు దూరంగా ఉంటూ మరింత భయపడుతున్నట్టు కనిపిస్తోంది"

"ఇప్పుడు ప్రతి మంచి వార్తను అతిశయోక్తిగా చెబుతున్నారు, ప్రతి చెడు వార్తను అణచివేస్తున్నారు. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోందని చెప్పినప్పుడు పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. కానీ ఇప్పుడు భారత్ ఆరో స్థానానికి పడిపోయినప్పుడు ఇలా ఎందుకు జరిగిందని కొద్దిమంది మాత్రమే ప్రశ్నిస్తున్నారు" అని సంజయ్ బారు విశ్లేషించారు.

భారత్, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, బీజేపీ, కాంగ్రెస్, ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Antonio Masiello/Getty Images

ఫొటో క్యాప్షన్, బంగారం కొనొద్దని, పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని గత నెలలో ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

భారత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?

ఇరాన్ యుద్ధం అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభానికి దారితీసి ముడి చమురు, ఇంధన ధరలను పెంచింది.

మేలో రెండు వారాల వ్యవధిలో భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను నాలుగు సార్లు పెంచింది. మే 25న చివరిసారి ధరలు పెరిగాయి.

అలాగే కమర్షియల్ సిలిండర్లు, సీఎన్‌జీ ధరలను కూడా ప్రభుత్వం పెంచింది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడంపైనా దేశంలో ఆందోళన వ్యక్తమవుతోంది.

గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు క్షీణించడంతో ఒక డాలర్ విలువ 95.83 రూపాయలకు చేరిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి ప్రజా రవాణాను వినియోగించుకోవాలని గత నెలలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అనవసర విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉండాలని, ఏడాది పాటు బంగారం కొనవద్దని, ఇంటి నుంచే పని చేయాలని, రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని 50 శాతం తగ్గించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

అయితే ప్రధాని ప్రకటన తర్వాత మాజీ ఆర్థిక కార్యదర్శి అశోక్ ఝా బీబీసీ హిందీ 'ది లెన్స్' కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుతానికి పరిస్థితి అంత ఆందోళనకరంగా లేదన్నారు.

''విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసుకోవాలనేది ప్రధాని ఉద్దేశం. అందుకే బంగారం కొనొద్దని, ఇంటి నుంచే పని చేయాలని, దాని వల్ల ఇంధన ఖర్చులు తగ్గుతాయని ప్రధాని చెప్పారు'' అని అశోక్ ఝా తెలిపారు.

మరోవైపు భారత షేర్ మార్కెట్ విలువ(మార్కెట్ క్యాపిటలైజేషన్) తైవాన్, దక్షిణ కొరియాల కంటే వెనుకబడి ఉంది.

స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్‌లలో భారత్ ఏడో స్థానానికి పడిపోగా దక్షిణ కొరియా ఆరోస్థానంలో ఉంది.

గతంలో తైవాన్ కూడా భారత్‌ను అధిగమించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.