'మీ ప్రధాని కష్టమైన ప్రశ్నలకు ఎప్పుడు సమాధానమిస్తారు?'అని ప్రశ్నించిన నార్వే జర్నలిస్ట్, భారత్ జవాబు ఏంటంటే..

ఫొటో సోర్స్, X/@Narendramodi
నార్వేలో జరిగిన భారత విదేశాంగ శాఖ విలేఖరుల సమావేశంలో జర్నలిస్ట్ హెలే లింగ్, కార్యదర్శి సీబీ జార్జ్, అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మధ్య వాగ్వాదం జరిగింది.
అంతకుముందు నార్వే ప్రధానమంత్రి జోనాస్ స్టోర్‌తో సమావేశం అనంతరం హేలే లింగ్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ రెండు ఘటనలు భారత్‌లో పెద్ద చర్చకు దారితీశాయి.
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా సహా పలువురు దీనిపై స్పందించారు.
భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు, ప్రధానమంత్రి మోదీ కష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంపై హేలే లింగ్ ప్రశ్నించారు.
దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ, భారత్ గొప్ప దేశమని, ప్రాచీన నాగరికత కలిగిన దేశమని అభివర్ణిస్తూ, ‘‘కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్ అనేక దేశాలకు వ్యాక్సిన్‌లను అందించింది. ఇలాంటి పనులవల్ల ప్రపంచమంతా భారత్‌ను నమ్ముతోంది" అని తెలిపింది.


ఫొటో సోర్స్, ANI
అసలేం జరిగింది?
"భారత్, నార్వే పరస్పరం పటిష్ఠమైన భాగస్వామ్యాన్ని నిర్మించుకుంటున్నాయి. కానీ మేం మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? మీ దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ఆపుతామని మీరు హామీ ఇస్తారా? మీ ప్రధానమంత్రి కష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఎప్పుడుమొదలుపెడతారు?" అని ఓస్లోలో భారత విదేశాంగ శాఖ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఓ నార్వేజియన్ జర్నలిస్టు ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, "మేం మీ ప్రశ్న విన్నాం, దానికి సమాధానం ఇస్తాం" అని చెప్పగా "వెంటనే సమాధానం కోరుకుంటున్నా" అని నార్వే జర్నలిస్ట్ అన్నారు.
తరువాత అదే విలేఖరుల సమావేశంలో విదేశాంగ శాఖ (పశ్చిమ) కార్యదర్శి సీబీ జార్జ్ ఈ ప్రశ్నకు స్పందిస్తూ "భారత్ సుమారు ఐదు వేల ఏళ్ల ప్రాచీన నాగరికతగల దేశం. మేం సున్నాను కనుగొన్నాం. మేం యోగాను కనుగొన్నాం" అని సమాధానమిచ్చారు.
దీంతో ఆ జర్నలిస్టు మళ్ళీ ఆయనను అడ్డుకుని, ‘‘మీరు నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి’’ అన్నారు.
దీంతో "ఇది నా పత్రికా సమావేశం. మీరు ప్రశ్న అడిగారు. నా సమాధానం వినే సహనం మీకు ఉండాలి" అని సీబీ జార్జ్ బదులిచ్చారు.
"యోగ, ఇతర విషయాలు కాకుండా నేరుగా నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి" అని ఆ జర్నలిస్ట్ మళ్లీ అడిగారు.
అప్పుడు సీబీ జార్జ్ మాట్లాడుతూ "నేను నమ్మకం గురించి మాట్లాడుతున్నా. ప్రపంచమంతా కోవిడ్ మహమ్మారితో పోరాడుతున్నప్పుడు, మేం 150కు పైగా దేశాలకు వ్యాక్సిన్‌లు, మందులు అందించాం. ప్రపంచం మొత్తం ఆ సంక్షోభాన్ని అధిగమించడానికి సాయం చేశాం. ప్రపంచం మాపై విశ్వాసముంచింది. దాన్నే నమ్మకం అంటారు" అని చెప్పారు.
కానీ ఆ జర్నలిస్ట్ మానవ హక్కుల ఉల్లంఘనపై తన ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వాలని పదేపదే అడ్డుపడ్డారు.
దీనికి ప్రతిస్పందనగా సీబీ జార్జ్ భారత్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని ప్రస్తావించారు. "రష్యా-యుక్రెయిన్ యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితులలో భారత్ తన నేతృత్వంలో అన్ని దేశాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. భారత్ అందరినీ ఏకం చేసి తొలిసారిగా ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించడంలో విజయం సాధించింది. ఆఫ్రికా దేశాల ఆందోళనలకు భారత్ ఒక వేదికను కల్పించింది. అదే నమ్మకం అంటే" అన్నారు.
సీబీ జార్జ్ ఈ విషయాలు చెబుతుండగానే ఆ జర్నలిస్టు మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఫొటో సోర్స్, @HelleLyngSvends
‘‘జవాబులు కావాలి’’
అంతకుముందు నార్వే ప్రధానితో సమావేశానంతరం హేలే లింగ్ ప్రధాని మోదీని ప్రశ్నించడం, ప్రధాని అక్కడి నుంచి వెళ్లిపోవడం ఓ వీడియోలో కనిపించింది.
‘‘ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుత మీడియా ప్రశ్నలకు మీరు ఎందుకు సమాధానమివ్వరు?’’ అని జర్నలిస్ట్ హేలే లింగ్ అడగడం ఆ వీడియోలో వినిపిస్తోంది.
"భారత ప్రధాని నరేంద్ర మోదీ నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఇస్తారన్న ఆశకూడా లేదు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో నార్వే మొదటి స్థానంలో ఉండగా, భారత్ 157వ స్థానంలో ఉంది" అని ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హెలీ లింగ్ రాశారు.
ఆ తర్వాత ఈ పోస్ట్‌కు స్పందించిన నార్వేలోని భారత రాయబార కార్యాలయం ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అందులో తన ప్రశ్నలు అడగవచ్చని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆ వీడియో గురించి ప్రస్తావిస్తూ.. 'ప్రధానమంత్రి మోదీ భయపడి ఆ ప్రదేశం విడిచి వెళ్ళిపోయారు' అని ఆరోపించారు.
"దాచడానికి ఏమీ లేనప్పుడు, భయపడాల్సిన అవసరం లేదు. ప్రధాని కొన్ని ప్రశ్నలకు భయపడి వెళ్లిపోవడం చూస్తే , భారత ప్రతిష్ఠపై ఎలాంటి ప్రభావం పడుతుంది?" అని రాహుల్ అన్నారు .
"డియర్ హేలీ లింగ్! భారత్ ప్రతిపక్షం తరపున, లక్షలాదిమంది భారతీయుల తరపున మీకు ధన్యవాదాలు. మా మీడియా నిరంతరం విఫలమవుతున్న ఓ పనిని మీరు చేశారు . అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించి, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేశారు. ప్రెస్ బ్రీఫింగ్ అయినా, ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా పేరులో మాత్రమే తేడా. వాటిలో సమాధానాలు ఉండవు నిజమూ ఉండదు" అని తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
‘‘జర్నలిజం కొన్నిసార్లు సంఘర్షణాత్మకంగానే ఉంటుంది. మాకు సమాధానాలు కావాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే మరింత స్పష్టమైన, నేరుగా ఉన్న సమాధానం కోసం నేను వారిని అడ్డుకుని ప్రశ్నిస్తాను. అది నా వృత్తి, బాధ్యత. నాకు కావాల్సింది సిద్దం చేసి పెట్టుకున్నమాటలు కాదు, నిజమైన సమాచారం’’ అంటూ హేలే లింగ్ ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.
అంతకుముందు ఆమె మరో పోస్టులో ‘‘నేను ఎప్పుడైనా ఇలా రాయాల్సి వస్తుందని అనుకోలేదు. నేను ఏ విదేశీ ప్రభుత్వం పంపిన గూఢచారిని కాదు. జర్నలిజమే నా వృత్తి. ప్రస్తుతం నేను నార్వేలో పనిచేస్తున్నా’’ అని రాశారు.
ప్రధానమంత్రి మోదీ ఐదు దేశాల అధికారిక పర్యటనలో ఉన్నారు. యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్‌లో పర్యటించిన తర్వాత ఇప్పుడు నార్వేకు చేరుకున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























