వంగవీటి రాధాకృష్ణ, రాధాకృష్ణన్ ఎలా అయ్యారు?

వంగవీటి రాధాకృష్ణ, విజయవాడ, మేయర్, జనసేన
ఫొటో క్యాప్షన్, వంగవీటి రాధా విజయవాడ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

విజయవాడ మేయర్‌గా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా వంగవీటి రాధా తన పేరును ''ఐ వంగవీటి రాధాకృష్ణన్' అంటూ పలకడం ఆసక్తికరంగా కనిపించింది.

ఇప్పటిదాకా అందరూ ఆయన పేరును వంగవీటి రాధాకృష్ణ అనే అచ్చ తెలుగుపేరుగా భావించారు.

కానీ ఆయన రాధాకృష్ణన్ అని పలకగానే రాధా పేరు రాధాకృష్ణన్‌గా ఎందుకు మారిందనే ఆసక్తి మొదలైంది.

దీనిపై వంగవీటి రాధా సోమవారం బీబీసీతో మాట్లాడారు.

రాధాకృష్ణన్ అని రికార్డుల్లో నమోదు కావడం వెనుక కారణాలను ఆయన వివరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వంగవీటి రాధాకృష్ణ, విజయవాడ, మేయర్, జనసేన
ఫొటో క్యాప్షన్, ప్రమాణ స్వీకార పత్రంలో ఆయన పేరు వంగవీటి రాధాకృష్ణన్ అని ఉంది.

తన పేరు వంగవీటి రాధాకృష్ణగా తల్లిదండ్రులు పెట్టినప్పటికీ.. తమిళనాడులో విద్యాభ్యాసం చేసిన సమయంలో తన పేరును రాధాకృష్ణన్ గా అక్కడి అధికారులు నమోదు చేశారని అప్పట్టి నుంచి రికార్డుల్లో తన పేరు రాధాకృష్ణన్ గానే ఉందని బీబీసీ తో చెప్పారు.

తన పెదనాన్న వంగవీటి రాధా పేరు కలిసి వచ్చేలా తన పేరుని వంగవీటి రాధాకృష్ణగా తల్లిదండ్రులు రత్నకుమారి, వంగవీటి మోహనరంగా నామకరణం చేశారని ఆయన తెలిపారు.

అయితే తాను తమిళనాడు ఊటీలో పాఠశాల విద్య అభ్యసించానని ఆ సందర్భంలోనూ ఆ తర్వాత సేలంలోని మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేరినప్పుడు.. తన పేరును రాధాకృష్ణన్‌గా నమోదు చేశారని ఆయన వివరించారు.

అప్పటినుంచి రికార్డుల్లో తన పేరు రాధాకృష్ణన్‌గానే ఉండిపోయిందన్నారు.

తమిళనాడులో టెన్త్‌క్లాస్ సర్టిఫికెట్‌లో నమోదైన పేరే ఆ తర్వాత అన్ని రికార్డుల్లోనూ కొనసాగుతోందన్నారు.

వంగవీటి రాధాకృష్ణ, విజయవాడ, మేయర్, జనసేన
ఫొటో క్యాప్షన్, విజయవాడ కార్పోరేషన్ ఎన్నికలకు ముందు వంగవీటి రాధా జనసేనలో చేరారు.

‘రాధా’ అన్న పిలుపే ఇష్టం

కాలేజ్ రికార్డుల్లో రాధాకృష్ణన్ అని ఉన్నప్పటికీ ఆయనను అందరూ రాధా అనే పిలుస్తుంటారు.

2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాధా ఆ తర్వాత తిరిగి 2026 లో జరిగిన స్థానిక సంస్థల ప్రత్యక్ష ఎన్నికల్లో విజయవాడ మేయర్ గా గెలుపొందారు.

ఈ సందర్భంగా ఆయన నామినేషన్ దాఖలు ప్రక్రియవేళగానీ, ఆ తర్వాత గెలిచినప్పుడు గాని తాజాగా నవంబర్ 23 సోమవారం నాడు మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు గానీ అధికారిక రికార్డుల్లో ఆయన పేరు వంగవీటి రాధాకృష్ణన్‌గానే నమోదైంది.

తమిళనాడులో చదువు కారణంగా తన పేరు రాధాకృష్ణన్‌గా రికార్డుల్లో నమోదైందని చెప్పిన రాధాకృష్ణ విజయవాడ మేయర్‌గా నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తానని చెప్పారు.

పేరు మార్పు వల్ల తనకి ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని, కేవలం అధికారిక రికార్డుల్లోనే ఆ పేరు ఉంటుందే కానీ పెద్దగా ఎవరికి తెలియదని రాధాకృష్ణ బీబీసీతో అన్నారు. తన తల్లిదండ్రులు పెట్టిన పెదనాన్న పేరు వంగవీటి రాధాగా పిలవడమే తనకు ఎంతో ఇష్టమని ఆయన చెప్పారు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)