‘పిల్లలకు చదువు చెప్పడంలో న్యాయం చేయలేకపోతున్నాం’.. దేశంలో లక్షకుపైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు

 భారత్‌లో 16 వేలకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది
ఫొటో క్యాప్షన్, భారత్‌లో 16 వేలకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది
    • రచయిత, దిగవల్లి పవన్ కాంత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 10 నిమిషాలు

‘‘బాలలకు చదువు చెప్పడంలో న్యాయం చేయలేకపోతున్నాం’’ అంటున్న టీచర్లు ఒకవైపు... మారుమూల గ్రామాలకు వెళ్లి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రజలకు విద్యను అందించడంలో టీచర్లు వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు మరోవైపు.

లక్షకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలున్న భారత్‌లో 16 వేలకు పైగా పాఠశాలలతో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉందని ది యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ UDISE+ 2025-26 నివేదికలోని డేటా చెబుతోంది..

సింగిల్ టీచర్ స్కూళ్లలో టీచర్లపై ఉండే పని ఒత్తిడి కారణంగా దేశంలోని దాదాపుగా 30 లక్షల మంది బాలల విద్యా నాణ్యతపై ఎలాంటి ప్రభావం పడుతుందో బీబీసీ తెలుగు అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది.

''మా పాఠశాలలో 41 మంది విద్యార్థులకు నేనొక్కడినే పాఠాలు చెప్పాలి. స్కూల్ నిర్వహణ దగ్గర్నుంచి ఆన్‌లైన్‌లో చేయాల్సిన అనేక పనుల కారణంగా, పాఠాలు చెప్పేందుకు చాలా తక్కువ సమయం ఉంటుంది. సమయానికి సిలబస్ పూర్తి చేయలేకపోతున్నాం. నాణ్యమైన విద్యను అందించే విషయంలో న్యాయం చేయలేకపోతున్నాం'' అని అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని ఓ ఏకోపాధ్యాయ పాఠశాలలో పని చేస్తున్న టీచర్ ఒకరు బీబీసీతో చెప్పారు.

ఈ స్కూల్లో ఒకటో తరగతిలో 14 మంది, రెండో తరగతిలో 13 మంది, మూడో తరగతిలో ముగ్గురు, నాలుగో తరగతిలో తొమ్మిది మంది, అయిదో తరగతిలో ఇద్దరు ఉన్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బాలలకు నాణ్యమైన విద్యను అందించడంలో దేశ విద్యా వ్యవస్థ విఫలమవుతోందని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సింగిల్ టీచర్ స్కూళ్లలో పనిచేసే అనేక మంది టీచర్లతో బీబీసీ నేరుగా మాట్లాడింది.

పాఠశాలల్లో బోధనేతర పనుల కారణంగా తమపై పెరిగే ఒత్తిడి గురించి వాళ్లు మాట్లాడారు.

అయితే, టీచర్లపై ఒత్తిడి నాణేనికి ఒకవైపు మాత్రమే.

మారుమూల, దళిత, గిరిజన ప్రాంతాలకు వెళ్లి చదువులు చెప్పడానికి ఇష్టపడని టీచర్ల తీరు వివక్షకు తావిచ్చేలా ఉందని కొందరు నిపుణులు, బాలల హక్కుల కోసం పని చేస్తున్నవాళ్లు ఆరోపిస్తున్నారు.

దీంతో, పరిస్థితి ఎంత సంక్లిష్టంగా ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.

బీబీసీతో మాట్లాడిన అనేక మంది టీచర్లు.. ప్రభుత్వం తమపై చర్యలు తీసుకుంటుందనే భయంతో తమ పేర్లను, ఇతర వివరాలను వెల్లడించొద్దని కోరారు.

యునిసెఫ్ ఇండియా, చైల్డ్ ఎడ్యుకేషన్ చీఫ్ సాధనా పాండే
ఫొటో క్యాప్షన్, యునిసెఫ్ ఇండియా, చైల్డ్ ఎడ్యుకేషన్ చీఫ్ సాధనా పాండే

‘మారుమూల, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోనే అత్యధికం’

భారత్‌లో చేరుకోవడానికి కష్టంగా ఉన్న ప్రాంతాలు, గ్రామీణ, మారుమూల గిరిజన ప్రాంతాల్లోనే ఏకోపాధ్యాయ పాఠశాలలు అత్యధికంగా ఉన్నాయని బీబీసీతో యునిసెఫ్ చెప్పింది. చిన్న పాఠశాలలను సమగ్ర పాఠశాలలుగా మార్చుకోవాలని యునిసెఫ్ సూచిస్తోంది.

''ఇండియాలో గడిచిన కొన్నేళ్లుగా పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయి.బోధనా సిబ్బందిని బలోపేతం చేశారు. అయితే, చేరుకోవడం కష్టంగా ఉండే ప్రాంతాలు, గ్రామీణ, మారుమూల గిరిజన ప్రాంతాల్లోనే ఏకోపాధ్యాయ పాఠశాలలు అత్యధికంగా ఉన్నాయి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బాలలకు ఈ స్కూళ్లు సేవలందిస్తున్నాయి'' అని యునిసెఫ్ ఇండియా, చైల్డ్ ఎడ్యుకేషన్ చీఫ్ సాధనా పాండే బీబీసీతో అన్నారు.

''బాలలకు విద్యను భౌతికంగా చేరువ చేయడంలో ఈ స్కూళ్లు కీలకంగా ఉన్నాయి. ఇప్పుడున్న ఏకోపాధ్యాయ పాఠశాలల్లాంటి చిన్న స్కూళ్లను సమగ్ర పాఠశాలలుగా వినియోగించుకుంటే పిల్లలు చదువుకు దూరం కాకుండా ఉంటారు. చదువుకోవడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించగలరు. చేరుకోవడం కష్టంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని స్కూళ్లల్లో సెకండరీ స్థాయిలో మౌలిక వసతులను మెరుగుపరచాల్సిన అవసరం కూడా ఉంది'' అని సాధనా పాండే సూచిస్తున్నారు.

ఇలాంటి స్కూళ్లల్లో టీచర్లు అనేక పనులు చూసుకోవాల్సిన పరిస్థితులుంటాయి కాబట్టి, బోధనేతర పనుల ఒత్తిడిని తగ్గిస్తూ బోధనా సమయాన్ని మరింత మెరుగ్గా వినియోగించాలని సాధనా పాండే అభిప్రాయపడ్డారు.

సింగిల్ టీచర్ స్కూళ్లలో పాఠాలు చెప్పడానికి మించిన సవాళ్లు ఎన్నో ఉంటాయి
ఫొటో క్యాప్షన్, సింగిల్ టీచర్ స్కూళ్లలో పాఠాలు చెప్పడానికి మించిన సవాళ్లు ఎన్నో ఉంటాయని టీచర్లు చెబుతున్నారు.

'ఏకోపాధ్యాయ ఉద్యోగం ఒక శిక్ష’

సింగిల్ టీచర్ స్కూళ్లలో పాఠాలు చెప్పడానికి మించిన సవాళ్లు ఎన్నో ఉంటాయని టీచర్లు చెబుతున్నారు.

''నేను రోజూ ఒక్కో తరగతికి నాలుగు క్లాసులు చెప్పాలి. అంటే ఐదు తరగతుల్లో మొత్తం 41 మంది ఉన్న మా స్కూల్లో కనీసం రోజుకి 20 క్లాసులు చెప్పాలి. కానీ, ఏకోపాధ్యాయ పాఠశాల కావడంతో మొత్తం అందరికీ కలిపి రోజుకు ఐదారు క్లాసులు మాత్రమే చెప్పగలుగుతున్నా. ఎందుకంటే అనేక ఇతర పనులు కూడా మేం చూసుకోవాల్సి ఉంటుంది'' అని ఓ టీచర్ వివరించారు.

ఆన్‌లైన్‌లో ట్రైనింగ్స్, డిజిటల్ నైపుణ్యాల అనివార్యత వంటివి అదనపు భారమని ఇంకొందరు టీచర్లు చెబుతున్నారు.

''నేను 24 ఏళ్లుగా టీచింగ్ చేస్తున్నా. ఇప్పుడు నా వయసు 52 ఏళ్లు. డిజిటల్ నైపుణ్యాలను పెంచుకుంటూ, డెడ్‌లైన్స్‌లోపు ఆన్‌లైన్‌లో సర్టిఫికేషన్స్ పూర్తి చేయాల్సిన కారణంగా నాపై ఒత్తిడి తీవ్రమవుతోంది'' అని తూర్పు గోదావరి జిల్లాలో పని చేస్తున్న ఓ టీచర్ చెప్పారు.

‘కనీసం కలిసి కప్పు టీ తాగేవాళ్లూ ఉండరు’

ఒంటరితనానికి లోనవుతున్నామని, పలకరించేందుకు ఎవరూ ఉండరని కొందరు టీచర్లు అంటున్నారు.

''మమ్మల్ని ఒంటరితనం వేధిస్తుంది. సింగిల్ టీచర్ స్కూళ్లల్లో మమ్మల్ని పలకరించి మాతో కలిసి ఒక కప్పు టీ తాగేందుకు కూడా ఎవరూ ఉండరు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పని చేయడానికి మించిన పెద్ద శిక్ష మరొకటి ఉండదు. ప్రమోషన్ వస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చని ఎదురు చూస్తున్నా'' అని తూర్పుగోదావరి జిల్లాలోని టీచర్ అన్నారు.

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు సెలవులు తీసుకోవడం కూడా చాలా సవాలుగా ఉంటుందన్నారు సర్వశిక్ష అభియాన్ రూపకల్పనలో అత్యంత కీలకపాత్ర పోషించిన రిటైర్డ్ టీచర్ డీఎన్ మూర్తి.

‘‘వారి స్థానంలో మరొకరిని పంపేందుకు ప్రతిసారీ ఇంకొక టీచర్ దొరకరని, ఇలాంటి స్థితిలో టీచర్లు తమ సెలవును మానుకోవడమో లేక ఆ స్కూలుకి అనధికారిక సెలవు ప్రకటించడమో జరుగుతుందని’’ మూర్తి వివరించారు.

ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, ఐఏఎస్ అధికారి తమీమ్ అన్సారియా
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, ఐఏఎస్ అధికారి తమీమ్ అన్సారియా

‘టీచర్ల సమస్యల పరిష్కారం దిశగా పని చేస్తున్నాం’

టీచర్లపై పని ఒత్తిడి గురించి టీచర్స్ యూనియన్ల ద్వారా తమకు సమాచారం వస్తోందని, ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోందని, స్కూళ్లలో టీచర్ల బోధనా పరిస్థితులను మెరుగు పరిచే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర విద్యా శాఖ చెబుతోంది.

''టీచర్స్ యూనియన్ల నుంచి మాకు సమాచారం వస్తోంది. బోధనేతర పని ఒత్తిడి అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. స్కూల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలను మరింత సులభతరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్ ట్రైనింగ్ కోర్సులు వారానికి ఒకసారి అటెండ్ అయ్యేలా ఉంటాయి కాబట్టి వాటిని టీచర్లకు భారంగా చూడకూడదు'' అని ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, ఐఏఎస్ అధికారి తమీమ్ అన్సారియా బీబీసీతో అన్నారు.

జీన్ ద్రీజ్
ఫొటో క్యాప్షన్, దళిత, ఆదివాసీ ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లి చదువులు చెప్పడానికి చాలా మంది టీచర్లు సిద్దంగా లేరని ప్రముఖ ఆర్థికవేత్త జీన్ ద్రీజ్ అంటున్నారు.

ఆ ప్రాంతాల్లో బోధనకు విముఖత చూపుతున్నారా?

''దళిత, ఆదివాసీ ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లి చదువు చెప్పడానికి చాలా మంది టీచర్లు సిద్దంగా లేరు. మారుమూల ప్రాంతాలకు కూడా అవసరమైన స్థాయిలో టీచర్లను రిక్రూట్ చేసి పంపించాల్సిన అవసరముంది'' అని ప్రముఖ ఆర్థికవేత్త జీన్ ద్రీజ్ బీబీసీకి చెప్పారు.

క్షేత్రస్థాయిలో పని చేస్తున్న కొందరు బాలల హక్కుల కార్యకర్తలు కూడా ఇదే విషయం చెప్పారు.

"మచిలీపట్నంలో మత్స్యకారులు ఎక్కువగా ఉండే ఒక ప్రాంతం ఉంటుంది. అలానే శ్రీకాళహస్తిలో, రాజమండ్రికి దగ్గర్లోని గోదావరి లంక గ్రామాల్లో దళితులు ఎక్కువగా ఉండే ప్రాంతాలున్నాయి. ఇక్కడున్న ఏకోపాధ్యాయ పాఠశాలల్లోని టీచర్లు స్కూళ్లకు వచ్చేందుకు గతంలో ఆసక్తి చూపేవారు కాదు. పాఠాలు చెప్పడానికి నిరాకరించేవారు. కానీ, ప్రస్తుతం ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ మార్క్ చేయడం తప్పనిసరైంది. దీంతో, స్కూళ్లల్లో టీచర్ల అటెండెన్స్ పెరుగుతోంది. కానీ, పాఠాలు చెప్పడంలో వాళ్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు'' అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బాలల హక్కులపై పని చేస్తున్న మున్నా సన్నకి బీబీసీతో చెప్పారు.

అయితే, ఈ వాదన సరైంది కాదని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ చెబుతోంది.

''ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని మేం అనుకోవట్లేదు. సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం, స్థానికంగా వసతులు సరిగా లేకపోవడం వంటి సమస్యలు న్నాయి. కానీ, చదువు చెప్పడంలో టీచర్లు వివక్షతో వ్యవహరిస్తారనేది సరైనది కాదు. అందుకు అవకాశం లేదు'' అని బీబీసీతో తొమ్మిది టీచర్ యూనియన్ల కూటమి, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ అన్నారు.

‘ వివక్ష నిజమైతే దృష్టి పెడతాం’

ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. ఇప్పటి వరకూ ఎవరూ ఈ సమస్యపై విద్యాశాఖకు సమాచారం ఇవ్వలేదని, ఇలాంటి ఫీడ్‌బ్యాక్ తమకు రాలేదని, ఇదే నిజమైతే టీచర్లకు కచ్చితంగా రీఓరియెంటేషన్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ చెబుతోంది.

''ఇలాంటి సమాచారమేదీ మాకు అందలేదు. కానీ, నిజంగానే క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితులుంటే మేం ఖచ్చితంగా వాటిని పరిశీలిస్తాం. సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో టీచర్లకు రీఓరియెంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తాం'' అని కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ తమీమ్ అన్సారియా బీబీసీతో అన్నారు.

మిత్ర రంజన్
ఫొటో క్యాప్షన్, రైట్ టూ ఎడ్యుకేషన్ ఫోరం కోఆర్డినేటర్ మిత్ర రంజన్

‘నాణ్యమైన విద్యకు చాలా దూరంలో ఉండిపోయాం’

గత నాలుగేళ్ల యూడీఐఎస్‌ఇ ప్లస్ డేటా ప్రకారం దేశంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 1.18 లక్షల నుంచి దాదాపు 1.01 లక్షలకు తగ్గింది.

అయితే, ఈ తగ్గుదలను సానుకూల పురోగతిగా అన్వయించడం ప్రమాదకరమని విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

''క్రమంగా కనిపించే తగ్గుదలకు అర్థం స్కూళ్లు అప్‌గ్రేడ్ చేస్తూ మెరుగైన వసతులు కల్పిస్తున్నారనో, పురోగతి దిశగా అడుగులేస్తూ అవసరమైన స్థాయిలో టీచర్లను అందిస్తున్నారనో కాదు. ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం దగ్గరగా ఉన్న స్కూళ్లను కలిపేయడం లేదా కొన్ని స్కూళ్లను మూసేయడం'' అని రైట్ టూ ఎడ్యుకేషన్ ఫోరం కోఆర్డినేటర్ మిత్ర రంజన్ బీబీసీతో అన్నారు.

అసలు సమస్య అంకెలకు మించిందని ఆయన హెచ్చరిస్తున్నారు.

''స్కూళ్లలో కనీస వసతులు ఉండట్లేదు. స్కూళ్ల కోసం అవసరమైన స్థాయిలో బడ్జెట్‌, మానవ వనరుల కేటాయింపులు జరగట్లేదు. ఇది వివక్షతో కూడిన బలహీనమైన విద్యా వ్యవస్థకు అద్ధం పడుతోంది. దేశంలోని పిల్లలందరికీ సమ్మిళిత, సమాన, నాణ్యమైన విద్యను అందించడంలో మనం ఇంకా చాలా దూరంలో ఉండిపోయాం. దీని ప్రభావం అణగారిన ప్రజలపై తీవ్రంగా ఉంటుంది'' అని మిత్ర రంజన్ వివరించారు.

విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పదేళ్ల కాలం అంటే 2010 నుంచి 2020 వరకూ విద్యారంగం కోసం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులను విశ్లేషిస్తూ, రైట్ టూ ఎడ్యుకేషన్ ఫోరం ఒక నివేదికను విడుదల చేసింది.

ఇందులో విద్యా రంగం కోసం అవసరమైనంత బడ్జెట్, మానవ వనరుల కేటాయింపులు జరగట్లేదని ఆర్టీఈ ఫోరం పేర్కొంది.

దీని తర్వాత 2022-23లో కోవిడ్ మహమ్మారి కాలంలో దేశంలోని స్కూళ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో విశ్లేషిస్తూ మరో నివేదికను విడుదల చేసింది.

భౌగోళిక సంక్లిష్టతలతో సమస్య జటిలం

నగర, పట్టణ కుటుంబాలకు తమ బాలలను ఏ స్కూలుకు పంపించాలనే విషయంలో అవకాశాలు అందుబాటులో ఉంటాయి. కానీ, మారుమూల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి అలా ఉండదు.

స్కూల్స్ సంఖ్య తక్కువగా ఉంటుంది. కొన్ని జిల్లాల్లో రెండు మూడు మండలాలకు కలిపి ఒకటే స్కూలు ఉంది. కొన్ని గ్రామీణ పాఠశాలల్లో 40 మంది విద్యార్థులున్నా ఒక్కరే టీచర్ ఉండటాన్ని క్షేత్రస్థాయిలో బీబీసీ పరిశీలించింది.

''నేను గత 8 నెలలుగా మూడు మండలాలకు ఇంచార్జ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నా. పోలవరం జిల్లాలోని రంపచోడవరం, వై.రామవరం, గుర్తేడు మండలాలకు కలిపి ఒకటే ప్రభుత్వ హై స్కూల్ ఉంది. ఇక్కడ 329 మంది విద్యార్థులకు 13 మంది టీచర్లున్నారు. మూడు మండలాల్లో 46 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. ప్రభుత్వం చేయాల్సినంతా చేస్తోంది. సమస్యలపై సత్వరమే స్పందిస్తోంది. త్వరలోనే కొత్త ఉద్యోగులు వచ్చి స్కూళ్లలో చేరతారు'' అని పోలవరం జిల్లాలోని గుర్తేడు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ రావి శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.

గిరిజన ప్రాంతాల్లో భౌగోళిక సంక్లిష్టతలు, సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వంటి కారణాలతో రిక్రూటైన టీచర్లు గిరిజన ప్రాంతాల్లోకి వెళ్లి చదువులు చెప్పడానికి ఇష్టపడటం లేదని కొందరు అంటుంటే, దళితులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని స్కూళ్లకు వెళ్లేందుకు మరికొందరు టీచర్లు నిరాకరిస్తున్నారని, దీనిని వివక్ష కోణంలోనే చూడాలని ఇంకొందరు అంటున్నారు.

''చిన్న పంచాయతీలు, చిన్న మండలాలు ఏర్పడే వరకూ ఆదివాసీ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడవు. పరిపాలన వికేంద్రీకరణ మారుమూల గ్రామాల స్థాయిలో మరింత మెరుగ్గా జరగాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచనలు చేస్తోంది'' అని స్థానిక నాయకుడు, డొంకరాయ మండల పరిషత్ సభ్యుడు కరక వెంకట రమణ బీబీసీతో అన్నారు.

గ్రామీణ ప్రాంతాలు
ఫొటో క్యాప్షన్, పోలవరం జిల్లాలోని ఓ గ్రామంలో రేకుల షెడ్డులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

ఇబ్బందులున్నా స్కూళ్లకు వస్తున్న చిన్నారులు

బాలలను స్కూళ్లకు వచ్చేలా చేయడంలో మిడ్ డే మీల్స్ పథకం కీలకంగా ఉందని కొందరు టీచర్లు చెప్పారు.

అయితే, కొండ ప్రాంతాల్లో సరైన రోడ్లు లేకపోయినా, వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తినా, ఇళ్లల్లో తల్లిదండ్రుల గొడవలు, కుటుంబ సమస్యలు.. ఇలా అనేక సవాళ్ల మధ్య కూడా చిన్నారులు చదువుకోవాలనే పట్టుదలతో స్కూళ్లకు వస్తారని కొందరు టీచర్లు వివరించారు.

''ఓ ఇంట్లో భార్యాభర్తల గొడవ కారణంగా తల్లి స్కూలుకొచ్చి బిడ్డని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయి చాలా రోజులు తిరిగి రాలేదు. ఆ పిల్లాడు చాలా రోజులు చదువుకు దూరమైపోయాడు. ఇంకోసారి మరో సంఘటనలో పిల్లాడు ఏడుస్తున్నాడు. ఏంటని అడిగితే, ముందు రోజు రాత్రి తండ్రి తాగొచ్చి తల్లిని బాగా కొట్టాడని బోరున ఏడ్చేశాడు. ఇలాంటి అనేక పరిస్థితుల కారణంగా ప్రశాంతంగా చదువుకోవాల్సిన పిల్లలపై మానసిక ఒత్తిళ్లుంటున్నాయి. వాళ్ల సున్నితమైన స్థితిని మేం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వాళ్లకు పాఠాలు చెప్పాల్సి ఉంటుంది'' అని తూర్పు గోదావరి జిల్లాలోని ఒక టీచర్ తన అనుభవాలను వివరించారు.

లోక్ సభలో జవాబు

''ఆదివాసీ గ్రామాల్లో బాలలు కిలోమీటర్ల దూరం కాలి నడకన వాగులు, వంకలు దాటుకుంటూ స్కూళ్లకు చేరుకోవాలి. వర్షాకాలంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. కాంక్రీటు రేకుల షెడ్డుతో నిర్మించిన స్కూలు పైకప్పు నుంచి వర్షాకాలంలో నీళ్లు కారిపోతూ ఉంటాయి. వర్షంలో రేకుల శబ్దాలు బాగా వినిపిస్తుంటాయి'' అని పోలవరం జిల్లాలోని ఏకోపాధ్యాయ పాఠశాలలో పని చేస్తున్న మహిళా టీచర్ చెబుతున్నారు

‘ఇండియాలో 9.83 లక్షల టీచర్ ఉద్యోగాలు ఖాళీ’

UDISE ప్లస్ నివేదికల రూపకల్పనలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ప్రొ. అరుణ్ సీ మెహతా స్థాపించిన ఎడ్యుకేషన్ ఫర్ ఆల్‌ సంస్థ దేశంలోని టీచర్ల సరఫరా, నాణ్యత, ట్రైనింగ్ అంశాలపై అధ్యయనం చేసి ఒక నివేదికను గత మార్చి నెలలో విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా మొత్తం ఎంతమంది టీచర్లున్నారు, ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే వివరాలను వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం ఇండియాలో దాదాపుగా 9.83 లక్షల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న టీచర్ల సంఖ్య కోటి దాటిందని పేర్కొంది.

''దాదాపుగా పది లక్షల వరకూ టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సంబంధిత ప్రభుత్వాలు ఈ ఖాళీలను భర్తీ చేసి విద్యా హక్కు చట్టాన్ని సరిగా అమలు చేయాలి'' అని రైట్ టూ ఎడ్యుకేషన్ ఫోరం కోఆర్డినేటర్ మిత్ర రంజన్ అన్నారు.

దేశంలో మొత్తం ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలున్నాయి, వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటో వివరించాలంటూ పలుమార్లు లోక్‌సభ, రాజ్యసభల్లో పార్లమెంటు సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అయితే, అత్యధిక స్కూళ్లు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఉన్నాయని, కాబట్టి టీచర్ల రిక్రూట్‌మెంట్, సర్వీస్ కండిషన్స్, వాళ్ల కేటాయింపుల అంశాలు సంబంధిత ప్రభుత్వాల పరిధుల్లోకి వస్తాయని కేంద్ర ప్రభత్వం సమాధానం చెబుతూ వస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ఏకోపాధ్యాయ స్కూళ్లు ఎందుకున్నాయి?

ఏకోపాధ్యాయ పాఠశాలల విషయంలో ప్రభుత్వ విధానం ఏంటి? దీనిపై స్పందించిన విద్యాశాఖ ఏమంటోంది?

''స్కూళ్లను మూసివేయాలని విద్యాశాఖ మంత్రి కోరుకోవట్లేదు. ఐదుగురు, పది మంది విద్యార్థులున్న స్కూళ్లలోనూ టీచర్లు పని చేసేలా మేం ప్రోత్సహిస్తున్నాం. అత్యంత తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచి మోడల్ స్కూళ్లుగా వాటిని అప్‌గ్రేడ్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో ఏకోపాధ్యాయ పాఠశాలకు ముఖ్యమైన కారణం ఇదే'' అని కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తమీమ్ అన్సారియా బీబీసీకి చెప్పారు.

''ప్రతి సంవత్సరం కనీసం 3000 మంది టీచర్లు రిటైరవుతున్నారు. స్కూల్ టీచర్ వర్క్‌ఫోర్స్‌లో ఉన్న గ్యాప్స్‌ను గుర్తించాం. వీటిని దశల వారీగా భర్తీ చేస్తాం. డీఎస్సీ ద్వారా దాదాపుగా 16 వేల మంది కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నాం. టీచర్ల కొరత సమస్యను ఇది చాలా వరకు పరిష్కరిస్తుంది'' అని తమీమ్ అన్సారియా వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)