'దెయ్యాలుండే ఇంటిని అద్దెకు తీసుకున్నా, అడుగుల చప్పుళ్లు, దెయ్యం మాటలు వినిపిస్తుంటాయి’

- రచయిత, మైకెల్ ఫిట్జ్‌పాట్రిక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
టోక్యోలో తాను అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లోకి తొలిసారి అడుగుపెట్టినప్పటి నుంచే అక్కడ దెయ్యం ఉందని ర్యూవా నమ్మారు.
"ఇల్లు చూడటానికి వెళ్లినప్పుడు అక్కడ ఒక వ్యక్తి నిలబడి నన్నే తీక్షణంగా చూస్తున్నాడు" అని ఆమె చెప్పారు.
"అయితే రియల్ ఎస్టేట్ ఏజెంట్‌కు ఆ వ్యక్తి కనిపించలేదు. దీంతో ఆ వ్యక్తి దెయ్యమే అయి ఉంటాడని అర్థమైంది" అని ఆమె అన్నారు.
దెయ్యాలంటే భయపడేవారైతే ఆ ఇంటి నుంచి వెంటనే వెళ్లిపోయి, మళ్లీ అటువైపు చూసేవారు కూడా కాకపోవచ్చు. కానీ ర్యూవా మాత్రం ఆ ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.
"నేను కాస్త భిన్నంగా ఆలోచించే వ్యక్తిని. అందుకే నన్ను తీక్షణంగా చూస్తున్న ఆ మగ దెయ్యంతో స్నేహం చేయాలని నిర్ణయించుకున్నా" అని ఆమె చెప్పారు.


ర్యూవా ఒక ఐడోరు. అంటే వినోద రంగానికి చెందిన కళాకారిణి. తన ఇంటి పేరును వెల్లడించడానికి ఆమె ఇష్టపడలేదు.
నాలుగేళ్లు గడిచినా ఆమె ఇప్పటికీ అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. అక్కడ ప్రతిరోజూ ఏదో ఒక అతీంద్రియ అనుభవం ఎదురవుతూనే ఉందని ఆమె చెబుతున్నారు. నిరంతరం అడుగుల చప్పుళ్లు వినిపిస్తుంటాయని, దెయ్యం మాట్లాడుతున్న శబ్దం కూడా వినిపిస్తుందని ఆమె అంటున్నారు.
జపాన్‌లో ఇటీవలి సంవత్సరాల్లో హాలోవీన్ వేడుకలకు ఆదరణ పెరుగుతున్నప్పటికీ, అక్కడ చాలామంది మిగతా సమయాల్లో కూడా దెయ్యాల ఉనికిని తీవ్రంగానే పరిగణిస్తారు. కలతతో, అసంతృప్తితో భూమిపై ఉండిపోయే ఆత్మను సూచించేందుకు జపనీస్ భాషలో 'యూరే' అనే పదం ఉంది.
హింసాత్మకంగా లేదా విషాదకర పరిస్థితుల్లో మరణించినవారి ఆత్మలను యూరే అంటారు. హత్యకు గురైనవారు, ఆత్మహత్య చేసుకున్నవారు లేదా ఒంటరితనంతో ఎవరూ తోడులేకుండా మరణించినవారి ఆత్మలు ఈ కోవలోకి వస్తాయని నమ్ముతారు. ఇలాంటి వారు ఇంట్లోనే మరణిస్తే, వారి ఆత్మ అక్కడి నుంచి వెళ్లదని విశ్వసిస్తారు.
మూఢనమ్మకాలు లేనివారికి, దెయ్యాలంటే భయపడనివారికి ఇలాంటి ఇళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. జపాన్‌లో వీటిని 'జికో బుక్కెన్' అంటారు. అంటే అపఖ్యాతి పాలైన లేదా ఏదైనా అసాధారణ ఘటన చోటుచేసుకున్న ఇళ్లు అని అర్థం.

ఫొటో సోర్స్, Diane Tincher
ప్రభుత్వం 2021లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, జపాన్‌లోని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఆత్మహత్య, హత్య, అగ్నిప్రమాదంలో మరణం, అలాగే మరణించిన వ్యక్తి మృతదేహం చాలా కాలం పాటు గుర్తించలేని సందర్భాల గురించి కొనుగోలుదారులకు లేదా అద్దెకు తీసుకునేవారికి వెల్లడించాలి.
అద్దె ఇళ్ల విషయంలో ఈ సమాచారాన్ని మూడేళ్లపాటు వెల్లడించాల్సి ఉంటుంది. అమ్మకానికి పెట్టిన ఆస్తుల విషయంలో మాత్రం ఈ వివరాలను నిరవధికంగా వెల్లడించాలి.
దీనికి భిన్నంగా, బ్రిటన్‌లో ఒక వ్యక్తి ఏదైనా ప్రాపర్టీలో మరణించిన విషయాన్ని వెల్లడించాలనే చట్టపరమైన నిబంధన లేదు. అమెరికాలో మాత్రం ఈ నిబంధనలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఉదాహరణకు, కాలిఫోర్నియాలో గత మూడేళ్లలో ఒక ప్రాపర్టీలో ఎవరైనా మరణిస్తే ఆ విషయాన్ని వెల్లడించాలి. అరిజోనా, ఒరెగాన్ రాష్ట్రాల్లో మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు.
ర్యూవా అద్దెకు తీసుకున్న అపార్ట్‌మెంట్‌లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమెకు ముందే చెప్పారు. దీంతో టోక్యోలోని సెటగయా అనే ఖరీదైన ప్రాంతంలో ఉన్న 25 చదరపు మీటర్ల చిన్న స్టూడియో అపార్ట్‌మెంట్‌కు ఆమె దాదాపు 30 శాతం తక్కువ అద్దె చెల్లిస్తున్నారు. సాధారణంగా నెలకు 62,000 యెన్లు చెల్లించాల్సి ఉండగా, ప్రస్తుతం 45,000 యెన్లు మాత్రమే చెల్లిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ మొత్తం సుమారు రూ.27,000.
ప్రపంచంలో ఎక్కడైనా హత్య లేదా ఆత్మహత్య జరిగిన ఇంటిని విక్రయించడం లేదా అద్దెకు ఇవ్వడం కష్టమే. అయితే జపాన్‌లో ప్రజలు ఇలాంటి విషయాల పట్ల మరింత మూఢనమ్మకంతో వ్యవహరిస్తారని, అపఖ్యాతి అనుకున్న ఇళ్లను తీసుకోవడానికి వెనకాడతారని టోక్యోకు చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎరిక్ ఓస్కాంప్ చెబుతున్నారు.
"శ్మశానం పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇవ్వడం కూడా కష్టమే. ముఖ్యంగా వంటగది నుంచి సమాధులు కనిపిస్తుంటే పరిస్థితి మరింత కష్టం" అని ఓస్కాంప్ వివరించారు.
"అపార్ట్‌మెంట్‌లో ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడం అన్నింటికంటే తీవ్రమైన సమస్య. ఎవరైనా భవనం పైకప్పు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నా, చాలామంది అద్దెదారులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. తీవ్రమైన నేరం జరగడం లేదా ఎవరైనా ఒంటరిగా మరణించడం కూడా ఇలాంటి సమస్యలకు కారణమవుతాయి" అని ఆయన చెప్పారు.
ఒక వ్యక్తి ఒంటరిగా మరణించిన విషయం బ్రిటన్ లేదా అమెరికా వంటి దేశాల్లో సాధారణంగా ఆస్తి ధరపై ప్రభావం చూపకపోవచ్చు.
కానీ ఇలాంటి పరిస్థితి డయాన్ టించర్‌కు మాత్రం జపాన్ నైరుతి ప్రాంతంలోని గ్రామీణ కగోషిమాలో మూడు పడక గదుల పెద్ద ఇంటిని సగం ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది.

ఫొటో సోర్స్, Diane Tincher
'అక్కడ దెయ్యం ఉంటే, ప్రతిరోజూ ఆమెకు కృతజ్ఞతలు చెబుతాను'
అమెరికన్ మహిళ డయాన్ టించర్ వయసు 79 ఏళ్లు. ఆమె దాదాపు 40 ఏళ్లుగా జపాన్‌లో నివసిస్తున్నారు. టూర్ గైడ్‌గా పనిచేస్తున్నారు.
ఆ ఇంటి గురించి రియల్ ఎస్టేట్ ఏజెంట్ తనకు నిజాయతీగా వివరించారని ఆమె చెప్పారు. వృద్ధురాలు ఒకరు ఆ ఇంట్లో ఒంటరిగా మరణించడంతో ఆ ఆస్తికి చెడ్డపేరు వచ్చిందని, అందుకే భారీ తగ్గింపుతో విక్రయిస్తున్నారని ఆయన తెలిపినట్లు టించర్ వివరించారు.
సాధారణంగా ఇలాంటి ఇళ్లు 45 మిలియన్ యెన్ల(రూ.2,71,23,678) వరకు ధర పలికే ప్రాంతంలో, ఆమె ఆ ఇంటిని 20 మిలియన్ యెన్లకే(రూ.1,50,68,300) కొనుగోలు చేశారు.
"నాకు దెయ్యాలపై నమ్మకం లేదు. కానీ జపాన్ ప్రజలు మూఢనమ్మకాలను బలంగా విశ్వసిస్తారని నాకు తెలుసు" అని ఆమె చెప్పారు.
"అక్కడ దెయ్యం ఉంటే, ప్రతిరోజూ ఆమెకు కృతజ్ఞతలు చెబుతాను. ఇంత అద్భుతమైన ఇంట్లో, ఇంత తక్కువ ఖర్చుతో నివసించే అవకాశం నాకు లభించింది" అని టించర్ అన్నారు.
ఆ ఇంటి గురించి తెలుసుకునే క్రమంలో టించర్ 'ఓషిమాల్యాండ్' అనే వెబ్‌సైట్‌లో దాని వివరాలను గుర్తించారు. జికో బుక్కెన్‌గా పరిగణించే ఇళ్ల జాబితాను ఈ వెబ్‌సైట్ ప్రచురిస్తుంది. ఆయా ఇళ్లలో గతంలో జరిగిన ఘటనల వివరాలను కూడా అందిస్తుంది.
టోక్యోలోని ఇళ్ల వివరాలతో ఈ వెబ్‌సైట్‌ను 2005లో ప్రారంభించారు. ఆ తర్వాత 2011లో జపాన్‌లోని ఇతర ప్రాంతాలకు, అనంతరం అంతర్జాతీయ స్థాయికి విస్తరించారు.
ఈ వెబ్‌సైట్ ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తుంది. అంటే సాధారణ ప్రజలే ఇళ్ల వివరాలను, అక్కడ గతంలో జరిగిన ఘటనలకు సంబంధించిన సమాచారాన్ని ఇందులో చేర్చవచ్చు.
గతంలో జపాన్‌లో ఇలాంటి ఇళ్లు కొనుగోలు చేయడానికి లేదా అద్దెకు తీసుకోవడానికి అంతగా ఆసక్తి చూపేవారు కాదని ఓషిమాల్యాండ్ వ్యవస్థాపకులు తెరు ఓషిమా చెప్పారు.
అయితే ఇటీవలి సంవత్సరాల్లో జపాన్‌లో ఇళ్ల ధరలు భారీగా పెరగడంతో పాటు, జీవన వ్యయం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో తక్కువ ధరకు లభిస్తే జికో బుక్కెన్‌ను అద్దెకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సగానికి పైగా జపాన్ ప్రజలు 2025లో నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడించారు.
మరోవైపు, సెటగయాలో ర్యూవా తన దెయ్యం ఫ్రెండ్‌తో కలిసి జీవించడం పట్ల సంతోషంగా ఉన్నానని చెబుతున్నారు.
"దెయ్యాలు కూడా ఒకప్పుడు మనుషులుగా జీవించినవారేనని నమ్ముతాను. అందుకే వాటిని కూడా గౌరవించాలి" అని ఆమె చెప్పారు.
- ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
- సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























