ధర్మేంద్ర ప్రధాన్: ఒకప్పుడు ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి.. ఇప్పుడు అదే వ్యవహారంలో రాజీనామా చేస్తారా?

ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా, బీజేపీ, నీట్ ప్రశ్న పత్రా లీక్

ఫొటో సోర్స్, Raj K Raj/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ జీవితం విద్యార్థి రాజకీయాలతో ప్రారంభమైంది.
    • రచయిత, సందీప్ సాహు
    • నుంచి, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

ప్రస్తుత కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒకప్పుడు ప్రశ్న పత్రాల లీకేజీకి వ్యతిరేక ఆందోళనల్లో పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు.

ఇప్పుడు నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ విషయంలో ఆయన రాజీనామా కోరుతున్న విద్యార్థులు పోలీసుల లాఠీచార్జ్‌లో గాయపడ్డారు.

2021లో 'ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్'లో ప్రచురితమైన వార్తా కథనం ఒకటి ఇప్పుడు విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది.

దివంగత జె.బి. పట్నాయక్ ప్రభుత్వ హయాంలో 1997లో, ఒడిశాలో ప్రశ్నపత్రం లీక్‌కు వ్యతిరేకంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) చేపట్టిన నిరసన సందర్భంగా పోలీసుల లాఠీఛార్జ్‌లో ధర్మేంద్ర ప్రధాన్ గాయపడ్డారని ఆ వార్తా కథనం చెబుతోంది.

ఈ నిరసన ప్రదర్శనకు ప్రధాన్ నాయకత్వం వహించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ సంఘటన జరిగిన 29 ఏళ్ల తర్వాత, 2026 జులై 20న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ నిరసనకు దిగిన విద్యార్థులు, యువకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో అనేక మంది గాయపడి ఆసుపత్రి పాలయ్యారు.

ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి నాటి ప్రదర్శనలో పాల్గొన్న ప్రశాంత్ రౌత్ బీబీసీతో మాట్లాడుతూ ఈ సంఘటనను ధ్రువీకరించారు.

ఆయన ప్రస్తుతం భువనేశ్వర్‌లోని పాటియా ప్రాంతంలో ఉన్న రాజా మాధవానంద దేవ్ కాలేజ్ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.

"ఆ రోజుల్లో నేను ఏబీవీపీ భువనేశ్వర్ శాఖకు అధ్యక్షుడిగా ఉండేవాడిని. ధర్మేంద్ర ప్రధాన్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. నాకు తేదీ కచ్చితంగా గుర్తులేదు. కానీ, 1997 జులై మూడో వారంలో (బహుశా 17 లేదా 18వ తేదీన), ధర్మేంద్ర ప్రధాన్ నాయకత్వంలో వందల మంది ఏబీవీపీ కార్యకర్తలు ప్లస్ టూ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా అసెంబ్లీ ముందు నిరసన తెలిపారు" అని రౌత్ తెలిపారు.

"1988 -1997 మధ్య దాదాపు ప్రతీ ఏటా ప్రశ్నపత్రాలు లీక్ అయ్యేవి. అందుకే దానిని 'ప్రశ్నపత్రాల లీకుల దశాబ్దం' అని పిలిచేవాళ్లం. నిరసనకారులను చెదరగొట్టేందుకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మాపై దారుణంగా లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో 64 మంది కార్యకర్తలు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. గాయపడిన వారిలో ధర్మేంద్ర ప్రధాన్, నేను కూడా ఉన్నాం" అని ప్రశాంత్ రౌత్ వివరించారు.

ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా, బీజేపీ, నీట్ ప్రశ్న పత్రా లీక్

ఫొటో సోర్స్, Saumya Khandelwal/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్కల్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్ష ఎన్నికల్లో ధర్మేంద్ర ప్రధాన్ ఏబీవీపీ తరఫున పోటీ చేశారు

విద్యార్థి సంఘ ఎన్నికల్లో మూడో స్థానం

ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ ప్రస్థానం 80లలో విద్యార్థి రాజకీయాలతో మొదలైంది.

ఆయన చిన్నప్పటి నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. తాల్చేర్ కాలేజ్ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఆ తర్వాత ఏబీవీపీ తరఫున ఉత్కల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పటి జనతా దళ్ విద్యార్థి విభాగం నాయకుడు, ప్రస్తుత బిజు జనతా దళ్ సీనియర్ నాయకుడు అరుణ్ సాహు చేతిలో ఓడిపోయారు.

ఆ ఎన్నికలో ధర్మేంద్ర ప్రధాన్ మూడో స్థానంలో, కాంగ్రెస్ విద్యార్థి విభాగం అభ్యర్థి సింధుజ్యోతి త్రిపాఠి రెండో స్థానంలో నిలిచారు. అయితే, ఆ ముగ్గురు అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉంది.

ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థి జీవితం గురించి సింధుజ్యోతి త్రిపాఠి బీబీసీతో మాట్లాడారు.

"ధర్మేంద్ర చాలా సాధారణ విద్యార్థి. నిజం చెప్పాలంటే అధ్యక్ష పదవికి ఏబీవీపీ అభ్యర్థిగా అతని పేరు ప్రకటించక ముందు క్యాంపస్‌లో అతని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆ రోజుల్లో ఉత్కల్ యూనివర్సిటీలో ఏబీవీపీ బలంగా ఉండేది. అందుకే అతనికి మంచి సంఖ్యలో ఓట్లు వచ్చాయి" అని త్రిపాఠి చెప్పారు.

ఈ ఎన్నికల్లో ప్రధాన్‌ను ఓడించిన అరుణ్ సాహు, ఆ తర్వాత ప్రముఖ బీజేడీ నాయకుడిగా, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.

యాదృచ్ఛికంగా 2019లో జరిగిన ఉత్కల్ యూనివర్సిటీ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ప్రధాన్, సాహు ఇద్దరూ వేదికపైన ఉన్నారు.

తన మాజీ రాజకీయ ప్రత్యర్థి రాజీనామా చేయాలన్న డిమాండ్ గురించి అరుణ్ సాహుని అడిగినప్పుడు, "మా నాయకుడు, పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్. ఆయన రాజీనామా చేయాలని స్పష్టంగా చెప్పారు. నా అభిప్రాయం కూడా అదే" అని ఆయన బీబీసీతో చెప్పారు.

"బీజేపీలో అన్ని నిర్ణయాలు సంఘ్ తీసుకుంటుందనే విషయం మీకు తెలుసు. ఆయనకు చాలా కాలంగా సంఘ్‌తో అనుబంధం ఉంది. ఒడిశాలో బీజేపీకి ఉనికి లేకపోవడంతో ఆయనకు పార్టీలో ఆ తర్వాత ప్రభుత్వంలో పెద్ద పదవి లభించడం సహజమే" అని సాహు చెప్పారు.

ప్రధాన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, అయితే ఆయన తనను కలవడం లేదా మాట్లాడటం చాలా అరుదని అరుణ్ సాహు తెలిపారు.

ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా, బీజేపీ, నీట్ ప్రశ్న పత్రా లీక్

ఫొటో సోర్స్, Ajay Aggarwal/Hindustan Times via Getty Images

ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ జీవితం

ఉత్కల్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ధర్మేంద్ర రాజకీయ ఎదుగుదల కొనసాగింది.

కృషి, అంకితభావంతో ఆయన బీజేపీ విద్యార్థి, యువజన సంస్థలలో విజయ సోపానాలు అధిరోహించారు.

ప్రధాన్ 1994లో ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1997 వరకు ఈ పదవిలో కొనసాగారు. ఆయన 2004 - 2006 మధ్య భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు.

ఆ తర్వాత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు.

ఈ హోదాలో రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా ఉత్తర ప్రదేశ్, బిహార్, కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో పార్టీ విజయాలలో కీలక పాత్ర పోషించారు.

ధర్మేంద్ర ప్రధాన్ ఎన్నికల జీవితం 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ సంవత్సరంలో ఆయన బీజేడీ - బీజేపీ కూటమి అభ్యర్థిగా పాల్లహ్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు.

నాలుగేళ్ల తర్వాత 2004 సార్వత్రిక ఎన్నికలలో ఆయన దేవ్‌గఢ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. దేవ్‌గఢ్ ప్రస్తుతం పార్లమెంటరీ నియోజకవర్గం కాదు. దానిని సంబల్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో విలీనం చేశారు.

ఆ తర్వాత ఆయన చాలా కాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయలేదు.

పార్టీలో ఆయనకున్న పలుకుబడితో ఇతర రాష్ట్రాల నుంచి రెండుసార్లు రాజ్యసభ ఎంపీ అయ్యారు.

ఏప్రిల్ 2012 నుంచి ఏప్రిల్ 2018 వరకు బిహార్, ఆ తర్వాత ఏప్రిల్ 2018 నుంచి ఏప్రిల్ 2024 వరకు మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.

2014లో, నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రధాన్ పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు. అప్పుడాయన బిహార్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత, 2024లో మళ్లీ ఒడిశా నుంచి ఎన్నికల్లో పోటీ చేసి సంబల్‌పూర్ నుంచి లోక్‌సభ ఎంపీ అయ్యారు.

ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా, బీజేపీ, నీట్ ప్రశ్న పత్రా లీక్

ఫొటో సోర్స్, Sanjeev Verma/Hindustan Times via Getty Images

'ధర్మేంద్ర ప్రధాన్ ఇంట్లో అమిత్ షా బస చేశారు'

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్‌కున్న బలమైన వ్యక్తిగత సంబంధాలు పార్టీ, ప్రభుత్వంలో ఆయన అభివృద్ధికి కీలకపాత్ర పోషించాయని ప్రధాన్ సహ విద్యార్థి సింధుజ్యోతి త్రిపాఠి అభిప్రాయపడ్డారు.

"నా దగ్గర దీనికి ఎలాంటి రుజువు లేదు. కానీ, షాపై కోర్టు బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు ఆయన తాల్చేర్‌లోని ధర్మేంద్ర ప్రధాన్ ఇంట్లో కొన్ని రోజులు బస చేశారని పలు విశ్వసనీయ వర్గాల ద్వారా నేను విన్నాను" అని త్రిపాఠి చెప్పారు.

కొందరు ప్రధాన్ విజయాన్ని ఆయన వ్యక్తిగత సంబంధాలకు ఆపాదించినప్పటికీ, ఒడిశాకు అత్యధిక కాలం (24 ఏళ్లు) ముఖ్యమంత్రిగా పనిచేసిన బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ మొదటి నుంచే ఆయన రాజకీయ సామర్థ్యాన్ని గుర్తించారని సీనియర్ జర్నలిస్ట్ రూబెన్ బెనర్జీ అభిప్రాయపడ్డారు.

నవీన్ పట్నాయక్‌పై రాసిన తన పుస్తకంలో 2000 ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు పాల్లహ్రాలో ధర్మేంద్ర ఆధిక్యంలో ఉన్నారనే వార్త రాగానే ఆయన "ఇది నాకొక సమస్య" అని అన్నారని రాశారు.

నవీన్ ఈ వ్యాఖ్య చేసినప్పుడు తాను కారులోనే ఉన్నానని బెనర్జీ అంటున్నారు. అయితే, ఆ సమయంలో నవీన్ పట్నాయక్ ఒడిశాకే కాకుండా రాజకీయాలకు కూడా కొత్త కావడంతో ఈ కథనంపై చాలా మందికి సందేహాలున్నాయి.

ఆ ప్రకటన 'కచ్చితంగా' నిజమని బెనర్జీ బీబీసీతో ఫోన్ సంభాషణలో పునరుద్ఘాటించారు.

ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా, బీజేపీ, నీట్ ప్రశ్న పత్రా లీక్

ఫొటో సోర్స్, Sneha Srivastava/Mint via Getty Images

ఫొటో క్యాప్షన్, ఒడిశాలో బీజేపీ విస్తరణలో ధర్మేంద్ర ప్రధాన్ కీలకపాత్ర పోషించారని రాష్ట్ర పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఒడిశాలో బీజేపీ విస్తరణ

ఒడిశాలో బీజేపీ విస్తరణ ఘనత ధర్మేంద్ర ప్రధాన్‌దే అన్నది బెనర్జీ అభిప్రాయం. 2014లో కేంద్ర మంత్రి అయిన తర్వాత ప్రధాన్ ప్రతి శని, ఆదివారాల్లో ఒడిశాలోనే గడిపేవారని ఆయన గుర్తు చేశారు.

ఈ సమయంలో ఆయన పార్టీని బలోపేతం చేయడం గురించి స్థానిక కార్యకర్తలతో సంభాషించేవారు. చాలామంది దానిని సరదాగా వారాంతపు పార్టీ అని పిలిచేవారు.

2014 నుంచి 2019 వరకు ప్రధాన్‌కు ఓఎస్‌డీ, వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సంబిత్ త్రిపాఠి కూడా రాష్ట్రంలో పార్టీ విస్తరణలో ప్రధాన్ కీలక పాత్ర పోషించారని ధ్రువీకరించారు.

"రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బీజేపీ కార్యకర్తలు ఆయనకు వ్యక్తిగతంగా పేరు పేరునా తెలుసు. కేంద్రంలో తనకున్న పలుకుబడి ఉపయోగించి స్థానిక సమస్యలను పరిష్కరించడంలో ఆయన ఎల్లప్పుడూ ముందుంటారు" అని సంబిత్ త్రిపాఠి బీబీసీతో చెప్పారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై త్రిపాఠి మాట్లాడుతూ "ఈ డిమాండ్ ఏమాత్రం సమర్థనీయం కాదు. విద్యార్థుల మనోభావాలను ప్రతిపక్షాలు ఆయుధంగా వాడుకుంటున్నాయి" అని అన్నారు.

ఒడిశా బీజేపీ నాయకుల అభిప్రాయం ఇలాగే ఉంది.

"ప్రతిపక్షం తమ రాజకీయ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు నీట్‌ను ఒక సాకుగా వాడుకుంటోంది. పరీక్షను మరోసారి విజయవంతంగా నిర్వహించి విద్యార్థులు తమ విజయాన్ని జరుపుకుంటున్నప్పుడు ఈ ఉద్యమం వెనుక రాజకీయాలు తప్ప మరే కారణం ఉంటుంది? ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రతిపక్షం పన్నిన ఉద్దేశపూర్వక కుట్రే ఈ ఉద్యమం" అని సీనియర్ పార్టీ నాయకుడు సజ్జన్ శర్మ అన్నారు.

"నీట్ కేవలం ఒక సాకు మాత్రమే. ప్రతిపక్షంలో జరుగుతున్న ఈ గందరగోళానికి అసలు కారణం విద్యా వ్యవస్థను జాతియీకరించడం. పాఠ్య పుస్తకాల్లో మొఘల్ పాలనకు తగిన స్థానం కల్పించారు. నవీన్ పట్నాయక్ ఇప్పుడాయన రాజీనామా డిమాండ్ చేస్తున్నారు. అయితే, నవీన్ పట్నాయక్ చివరి ప్రభుత్వ హయాంలో ఒడిశాలో తొమ్మిదిసార్లు ప్రశ్నపత్రాలు లీకయ్యాయన్న విషయం ఆయన మర్చిపోయినట్లున్నారు" అని పార్టీ సీనియర్ నేత గోలక్ మహాపాత్ర చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)