పాదాలలో తిమ్మిరి, సూదులతో గుచ్చినట్టు మంట.. ఇవి డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి లక్షణాలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
మధుమేహం అంటే రక్తంలో చక్కెర స్థాయులు పెరగడమే కాదు. దీర్ఘకాలం పాటు రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ సరిగా లేకపోతే నరాలు, మూత్రపిండాలు, కళ్లు, గుండెతో పాటు పాదాల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
ముఖ్యంగా పాదాల్లో మంట, సూదులతో గుచ్చినట్లుగా అనిపించడం, తిమ్మిర్లు, స్పర్శ తెలియకపోవడం వంటి లక్షణాలను చాలామంది వయసు పెరగడం వల్లనో, అలసట వల్లనో వచ్చాయని నిర్లక్ష్యం చేస్తారు.
కానీ ఇవి డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అనే నరాల సమస్యకు సంకేతాలు కావచ్చు. పెరిఫెరల్ న్యూరోపతిలో ఈ డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి ఒక భాగం. ఈ రెండింటి లక్షణాలు ఒకేలా ఉంటాయి. అందుకే ఈ లక్షణాలు ఉన్నవారందరూ డయాబెటిస్ పరీక్షలు చేయించుకోవడం మంచిది.
ఇందులో మరొక ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. పాదాలకు గాయం అయినా నొప్పి తెలియకపోవచ్చు. చిన్న బొబ్బ, చెప్పు రాపిడి లేదా గోరు గుచ్చుకోవడం కూడా క్రమంగా పుండుగా మారి, ఇన్ఫెక్షన్కు, కొన్నిసార్లు అవయవాన్ని తొలగించాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు.
అయితే ముందస్తు పరీక్షలు, విటమిన్ బీ12 లోపాన్ని గుర్తించడం, రక్తంలో చక్కెర నియంత్రణ, సరైన పాద సంరక్షణతో ఇలాంటి సమస్యలలో చాలావాటిని నివారించవచ్చు లేదా తీవ్రతను తగ్గించవచ్చు.


ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ 2025 నివేదిక ప్రకారం, 2024లో భారత్‌లో 20–79 ఏళ్ల వయస్సు గల సుమారు 8.98 కోట్ల మంది మధుమేహంతో జీవిస్తున్నారు.
మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరికీ నరాల సమస్యలు రావు. అయితే వ్యాధి వ్యవధి పెరిగేకొద్దీ, రక్తంలో చక్కెర నియంత్రణ సరిగా లేకపోతే, ఇతర ప్రమాద కారకాలు ఉన్నప్పుడు నరాలు దెబ్బతినే అవకాశం పెరుగుతుంది.
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ఏడీఏ) 2026 మార్గదర్శకాల ప్రకారం, డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి ఉన్నవారిలో దాదాపు 50 శాతం మందికి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే లక్షణాలు వచ్చే వరకు వేచి ఉండకుండా పరీక్షలు చేయించుకోవడం అవసరం.
డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏమిటి?
రక్తంలో చక్కెర స్థాయులు దీర్ఘకాలం ఎక్కువగా ఉండటం వల్ల నరాలకు రక్తాన్ని సరఫరా చేసే సూక్ష్మ రక్తనాళాలు, నరాల జీవక్రియ దెబ్బతినవచ్చు. ఫలితంగా నరాలు తమ పనిని సరిగా చేయలేవు. దీనినే డయాబెటిక్ న్యూరోపతి అంటారు.
ఇది సాధారణంగా పాదాల వేళ్ల దగ్గర ప్రారంభమై, క్రమంగా పైకి వ్యాపిస్తుంది.
ప్రధాన లక్షణాలు
- పాదాల అరికాళ్లలో.. ముఖ్యంగా రాత్రివేళ ఎక్కువ మంటగా ఉండటం
- సూదులతో గుచ్చినట్లు, విద్యుత్ షాక్ తగిలినట్లు అనిపించడం
- వేళ్లలో తిమ్మిర్లు, స్పర్శ తగ్గిపోవడం
- వేడి, చల్లదనం లేదా నొప్పిని సరిగా గుర్తించలేకపోవడం
- నడుస్తున్నప్పుడు సమతుల్యత కోల్పోవడం, తరచూ తడబడటం
- పాదాల కండరాల బలహీనత లేదా పాదాల ఆకృతిలో మార్పులు రావడం
అయితే కొందరిలో ఎలాంటి మంట లేదా నొప్పి లేకుండానే స్పర్శజ్ఞానం తగ్గిపోతుంది. అందువల్ల నొప్పి లేదు అంటే నరాలు ఆరోగ్యంగా ఉన్నాయని భావించడం పొరపాటు.

ఫొటో సోర్స్, Getty Images
పాదాలపై పుండ్లు ఎందుకు ఏర్పడతాయి?
డయాబెటిక్ ఫుట్ అల్సర్ అంటే మధుమేహం ఉన్న వ్యక్తి పాదంపై ఏర్పడే, చర్మాన్ని దాటి లోపలి కణజాలాన్ని ప్రభావితం చేసే పుండు. దీని వెనుక సాధారణంగా మూడు ముఖ్య కారణాలు ఉంటాయి.
1. నరాలు దెబ్బతినడం: చెప్పు రాపిడి, గోరు గుచ్చుకోవడం, చిన్న గాయం లేదా వేడి వల్ల చర్మం దెబ్బ తిన్నా నొప్పి తెలియకపోవచ్చు.
2. రక్తప్రసరణ తగ్గడం: మధుమేహంతో పాటు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల పాదాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా తగ్గవచ్చు. దీనివల్ల గాయం మానడం ఆలస్యమవుతుంది.
3. ఇన్ఫెక్షన్: పుండులోకి బ్యాక్టీరియా ప్రవేశిస్తే వాపు, చీము, కణజాల నష్టం ఏర్పడవచ్చు. ఇన్ఫెక్షన్ ఎముక వరకు వ్యాపించే ప్రమాదం కూడా ఉంది.
పాదాల ఆకృతిలో మార్పులు, బొటనవేలు పక్కన ఎముక ఉబ్బడం, వేళ్లు వంకరగా మారడం, గట్టి కాలస్ (చర్మం మందంగా మారడం) వంటివి కొన్ని ప్రాంతాలపై ఒత్తిడిని పెంచి పుండ్లకు దారితీస్తాయి.
2025లో ప్రచురితమైన భారతీయ అధ్యయనాల సమగ్ర విశ్లేషణలో 55,988 మంది మధుమేహ రోగులకు సంబంధించిన 18 అధ్యయనాలను పరిశీలించారు. అందులో 6.2 శాతం మందిలో డయాబెటిక్ ఫుట్ అల్సర్ ఉన్నట్లు అంచనా.
2024లో బీఎంజే ఓపెన్ డయాబెటిస్ రిసెర్చ్ అండ్ కేర్ (BMJ Open Diabetes Research & Care) లో ప్రచురితమైన భారతీయ అధ్యయనంలో పాల్గొన్న మధుమేహ రోగుల్లో సుమారు నాలుగో వంతు మందికి అధిక ప్రమాదం ఉన్న పాదాల లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.
పాదాలకు పుండు వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే, పుండు ఏర్పడే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడం ఎంతో ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images
విటమిన్ బీ12 లోపం
పాదాల్లో మంట, తిమ్మిర్లు ఉన్న ప్రతి ఒక్కరిలో మధుమేహం వల్ల నరాలు దెబ్బతిన్నాయని చెప్పలేం. విటమిన్ బీ12 లోపం కూడా ఇలాంటి లక్షణాలను కలిగిస్తుంది.
నరాల చుట్టూ ఉండే మైలిన్ పొర నిర్వహణకు, ఎర్ర రక్తకణాల తయారీకి, సాధారణ నాడీ వ్యవస్థ పనితీరుకు విటమిన్ బీ12 అవసరం. దీని లోపం వల్ల చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మంట, స్పర్శజ్ఞానం తగ్గడం, నడకలో అస్థిరత, సమతుల్యత సమస్యలు, అలసట, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.
తీవ్రమైన లేదా దీర్ఘకాలిక లోపంలో నాడీ వ్యవస్థకు శాశ్వత నష్టం కలిగే అవకాశం ఉంది.
మెట్ఫార్మిన్ వాడేవారు అప్రమత్తంగా ఉండాలి
టైప్ 2 మధుమేహానికి విస్తృతంగా ఉపయోగించే మెట్ఫార్మిన్ మందును దీర్ఘకాలం వాడేవారిలో విటమిన్ బీ12 స్థాయులు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా పాదాల్లో కొత్తగా మంట లేదా తిమ్మిర్లు రావడం, రక్తహీనత ఉండటం వంటి సందర్భాల్లో బీ12 పరీక్ష చేయించుకోవాలి.
మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బీ12 మాత్రలు వాడాల్సిన అవసరం లేదు. లక్షణాలు, మెట్ఫార్మిన్ వాడిన కాలం, ఆహారపు అలవాట్లు, పరీక్షల ఫలితాల ఆధారంగా వైద్యుడు నిర్ణయిస్తారు. బీ12 లోపం నిర్ధరణైతే సరైన మోతాదులో మాత్రలు లేదా అవసరాన్ని బట్టి ఇంజెక్షన్లతో చికిత్స చేయవచ్చు.
మెట్ఫార్మిన్ తీసుకుంటున్నవారు బీ12 లోపం అనుమానంతో స్వయంగా మందును ఆపకూడదు. అవసరమైతే బీ12 లోపానికి చికిత్స చేస్తూనే మధుమేహ చికిత్సను కొనసాగించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
నరాల సమస్యలను ముందుగా గుర్తించొచ్చా?
డయాబెటిక్ న్యూరోపతిని ప్రారంభ దశలో గుర్తించడానికి పెద్ద ఖర్చుతో కూడిన పరీక్షలన్నీ అవసరం ఉండవు. వైద్యుడు లక్షణాలు తెలుసుకోవడం, పాదాలను పరిశీలించడం, కొన్ని సాధారణ పరీక్షలు చేయడం ద్వారా ప్రమాదాన్ని అంచనా వేయవచ్చు.
ఏడీఏ 2026 మార్గదర్శకాల ప్రకారం టైప్ 2 మధుమేహంలో వ్యాధి నిర్ధరణ జరిగినప్పటి నుంచే నరాల సమస్యల కోసం పరీక్షలు ప్రారంభించాలి.
టైప్ 1 మధుమేహంలో వ్యాధి నిర్ధరణ జరిగిన ఐదేళ్ల తర్వాత పరీక్షలు ప్రారంభించాలి.
ఆ తర్వాత కనీసం సంవత్సరానికి ఒకసారి నరాల పరీక్షలు, పాదాల సమగ్ర పరీక్ష చేయించుకోవాలి. ఇప్పటికే స్పర్శజ్ఞానం తగ్గినవారు, పుండ్లు వచ్చినవారు మరింత తరచుగా పరీక్షలు చేయించుకోవాలి.
ముఖ్యమైన పరీక్షలు ఇవే
10-గ్రామ్ మోనోఫిలమెంట్ పరీక్ష: సన్నని నైలాన్ తంతువుతో పాదంలోని కొన్ని ప్రాంతాలను తాకి ఒత్తిడిని గుర్తించగలుగుతున్నారా అని పరీక్షిస్తారు. స్పర్శజ్ఞానం తగ్గిందా, పాదానికి గాయాలయ్యే ప్రమాదం ఉందా అనేది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
వైబ్రేషన్ పరీక్ష: 128-Hz ట్యూనింగ్ ఫోర్క్‌ను ఉపయోగించి కంపనాలను గుర్తించే సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.
పాదాల రక్తప్రసరణ పరీక్ష: పాదాల పల్స్లు, చర్మ ఉష్ణోగ్రత, రంగు, గాయాలు మానడంలో ఆలస్యం వంటి అంశాలను పరిశీలిస్తారు.
రోగి లక్షణాల ఆధారంగా విటమిన్ బీ12, థైరాయిడ్ పనితీరు, మూత్రపిండాల పనితీరు వంటివి పరిశీలించవచ్చు. నరాల సమస్యకు మధుమేహమే కారణమని ముందుగానే నిర్ణయానికి రాకూడదు.

ఫొటో సోర్స్, Getty Images
పాదాలను ఎలా సంరక్షించుకోవాలి?
1. రోజూ పాదాలను పరిశీలించండి
అరికాళ్లు, వేళ్ల మధ్య ప్రాంతాలు, మడమలను చూసి పగుళ్లు, బొబ్బలు, ఎర్రదనం, వాపు, గాయాలు ఉన్నాయేమో గమనించాలి. అవసరమైతే అద్దం ఉపయోగించాలి, కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవాలి.
2. పాదాలను శుభ్రంగా, పొడిగా ఉంచండి
గోరువెచ్చని నీటితో శుభ్రం చేసి, ముఖ్యంగా వేళ్ల మధ్య తేమ లేకుండా మృదువుగా తుడవాలి. వేడి నీటిలో పాదాలను నానబెట్టకూడదు.
3. సరైన చెప్పులు ధరించండి
పాదాలకు సరిపోయే, లోపల గరుకుదనం లేని చెప్పులు వాడాలి. ఇంట్లోనూ చెప్పులు ఉపయోగించాలి. చెప్పు లోపల రాళ్లు లేదా ఇతర వస్తువులు ఉన్నాయేమో చూసుకోవాలి.
4. చర్మం పొడిబారకుండా చూసుకోండి
పొడిబారిన చర్మానికి మాయిశ్చరైజర్ ఉపయోగించవచ్చు. అయితే వేళ్ల మధ్య క్రీమ్ రాయకూడదు. తేమ పేరుకుపోతే ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరగవచ్చు.
5. గోళ్లు, కాలస్ల విషయంలో జాగ్రత్త
గోళ్లను నేరుగా, మరీ చిన్నగా కాకుండా కత్తిరించుకోవాలి. కాలస్లు, మొలలు, గోరు చుట్టూ గాయాలను బ్లేడ్‌తో తొలగించకూడదు. స్పర్శజ్ఞానం తగ్గినవారు వైద్య నిపుణుల సహాయం తీసుకోవాలి.
ఈ సూచనలు అంతర్జాతీయ డయాబెటిక్ ఫుట్ వర్కింగ్ గ్రూప్ (IWGDF) 2023 మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించినవి.
ఇప్పటికే పాదాలకు గాయాలు వచ్చినవారు, రక్తప్రసరణ తగ్గినవారు, నరాల సమస్యలు ఉన్నవారు ప్రత్యేక పాద సంరక్షణ, సరైన చెప్పులు, తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
పాదాలకు పుండు వస్తే ఏం చేయాలి?
పాదంపై చిన్న గాయం కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా మధుమేహంతో పాటు నరాల సమస్యలు ఉన్నవారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
పుండును స్వయంగా కోయడం, గట్టిగా రుద్దడం లేదా కాలస్ తొలగించడం చేయకూడదు.
డాక్టర్ సలహా లేకుండా యాసిడ్ ఆధారిత మొలల మందులు, ఇంటి చిట్కాలు, రసాయనాలు వాడకూడదు.
పుండుపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి.
డాక్టర్ని సంప్రదించి అవసరాన్ని బట్టి గాయాన్ని శుభ్రపరచడం, ఒత్తిడి తగ్గించే ప్రత్యేక పరికరాలు, డ్రెస్సింగ్, యాంటీబయాటిక్స్ లేదా రక్తప్రసరణ మెరుగుపరిచే చికిత్స తీసుకోవాలి.
పాదం ఎర్రగా, వేడిగా, బాగా వాచిపోవడం, చీము లేదా దుర్వాసన రావడం, చర్మం నల్లబడటం, జ్వరం, గాయం వేగంగా పెరగడం, అకస్మాత్తుగా పాదం చల్లబడటం లేదా రంగు మారడంతో పాటు తీవ్రమైన నొప్పి రావడం కూడా అత్యవసర పరిస్థితి కావచ్చు.
నొప్పి లేకపోయినా పుండు ప్రమాదకరం కావచ్చు. అందుకే నొప్పి వచ్చే వరకు వేచి ఉండకూడదు.
రక్తంలో చక్కెర నియంత్రణ ఎందుకు ముఖ్యం?
నరాలు దెబ్బతినడాన్ని పూర్తిగా తగ్గించడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. అయితే రక్తంలో గ్లూకోజ్‌ను వ్యక్తిగత లక్ష్యాలకు అనుగుణంగా నియంత్రించడం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం, పొగతాగడం మానేయడం ద్వారా నరాల సమస్యలు ఏర్పడే లేదా మరింత తీవ్రమయ్యే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
వైద్యులు ఇచ్చే మందులు నరాల నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడతాయి కానీ దెబ్బతిన్న నరాలను పూర్తిగా నయం చేస్తాయని చెప్పలేం. అలా అని సాధారణ నొప్పి నివారణ మందులు లేదా విటమిన్ సప్లిమెంట్లను స్వయంగా తీసుకోవడం సరైన పద్ధతి కాదు.
అపోహలు – వాస్తవాలు
అపోహ: పాదాల్లో నొప్పి లేకపోతే నరాలు ఆరోగ్యంగా ఉన్నట్లే
వాస్తవం: స్పర్శజ్ఞానం తగ్గినా నొప్పి లేకపోవచ్చు
అపోహ: పుండు చిన్నదే కాబట్టి దానంతట అదే మానిపోతుంది
వాస్తవం: రక్త ప్రసరణ, స్పర్శజ్ఞానం తగ్గినవారిలో చిన్న గాయం కూడా తీవ్రమవచ్చు
అపోహ: పాదాల్లో మంట ఉంటే అది కచ్చితంగా మధుమేహం వల్లే
వాస్తవం: బీ12 లోపం, ఇతర నరాల సమస్యలు కూడా కారణం కావచ్చు
అపోహ: మధుమేహం ఉన్నవారు బీ12 మాత్రలు తప్పనిసరిగా వాడాలి
వాస్తవం: లోపాన్ని, అవసరాన్ని బట్టి వైద్యులు చికిత్స నిర్ణయిస్తారు
అపోహ: ఇంట్లో చెప్పులు లేకుండా నడవడం ప్రమాదకరం కాదు
వాస్తవం: స్పర్శజ్ఞానం తగ్గినవారికి తెలియకుండానే గాయాలు కావచ్చు, కాబట్టి ఇంట్లో కూడా చెప్పులు ధరించడం మంచిది.
(గమనిక: రచయిత వైద్యురాలు. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























