అనుమాన పక్షి : డీజే టిల్లు డైరెక్టర్, ఈ సినిమా దర్శకుడు ఒక్కరే.. మరి, కొత్త సినిమా ఎలా ఉందంటే

ఫొటో సోర్స్, T-Series Telugu/Youtube
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
డీజే టిల్లు దర్శకుడు విమల్‌కృష్ణ, నటుడు రాగ్ మయూర్ కాంబినేషన్‌లో అనుమాన పక్షి థియేటర్‌లోకి వచ్చింది.
కథ ఏమంటే రాగ్ మయూర్‌కి అన్నీ అనుమానాలే. ఎప్పుడు ఏదైనా జరగొచ్చనే భయం. పాత బట్టలు ఎవరికైనా ఇస్తే చేతబడి చేస్తారని భయం. గుమ్మానికి గుమ్మడికాయ కడితే వూడి నెత్తిన పడుతుందనే భయం. అన్నింటిలోనూ అతి.
ఒక స్నేహితుడి కోసం హీరో కాశ్మీర్ వెళ్లాల్సి వస్తుంది. తనతో పాటు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్‌ని వెంట తీసుకెళతాడు. అక్కడ రకరకాల సంఘటనలు ఎదురవుతాయి.
తీవ్రవాదులు కిడ్నాప్ చేస్తారు. ఒక అమ్మాయి కలిసి పెళ్లి ప్రపోజల్ చేస్తుంది. వైజాగ్ పోలీస్ అధికారి వెంటపడతాడు.
ఇలా రకరకాల ఇబ్బందులనుంచి హీరో ఎలా బయటపడ్డాడు. ఇది మిగతా కథ.

అతి ఆలోచనలు, అలవాట్లు వున్న మనుషుల మీద కథ నడపడం, కామెడీ సృష్టించడం మంచి జానర్. మతి మరుపుతో భలేభలే మగాడివోయ్ , అతి శుభ్రతతో మహానుభావుడు ఈ రెండు సినిమాలు దర్శకుడు మారుతి హిట్స్.
డీజే.టిల్లు లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు విమల్‌కృష్ణ నుంచి సహజంగానే ఎక్కువ ఆశిస్తాం. కానీ నూరుశాతం నిరాశ పరిచాడు.
అనుమానం అందరిలో సహజ లక్షణం. మనం వెళ్లే బస్సుకి యాక్సిడెంట్ అవుతుందేమో, రైల్లో సూట్‌కేస్ మిస్సవుతుందనే అనుమానాలు అందరికీ వుంటాయి. కానీ అనుమానం ఓవర్‌డోస్‌లో వుంటే ఎలా వుంటుందనేది మంచి జానర్. పాయింట్ కరెక్ట్ తీసుకున్నాడు కానీ, కథాకథనాలే అందుకు తగినట్లుగా లేవు.

ఫొటో సోర్స్, T-Series Telugu/Youtube
అసలు ఏ క్యారెక్టర్ ఎందుకలా మాట్లాడుతుందో , ప్రవర్తిస్తుందో అర్థంకాదు. ఒక్క క్యారెక్టర్‌కి కూడా సరైన ఆర్క్ వుండదు. స్నేహితుడు సూసైడ్ చేసుకుంటానని భయపెడితే కశ్మీర్ వెళ్లిన హీరో, అక్కడ చేసిందేంటో అర్థంకాదు.
కామెడీ కథలకున్న అడ్వాంటేజ్ ఏమంటే లాజిక్ ఎవరూ అడగరు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడి, ప్రవర్తించే స్వేచ్ఛ వుంటుంది. అయితే మనకి నవ్వు రావాలి.
ఈ సినిమాలో కూడా నవ్వించడానికి చాలా ప్రయత్నం జరిగింది. కానీ వర్కవుట్ కాలేదు. ఇక్కడ నవ్వండ్రా బాబూ అని సంగీత దర్శకుడు చాలా వాయిద్యాలని ఉపయోగించినా ఫలితం లేదు.
ఏవేవో సంఘటనలు జరుగుతూ వుంటాయి. చాలా సినిమాల్లో చూసిన శవం కామెడీ కూడా వుంటుంది. రాశి, అజయ్ కొత్త దంపతులుగా హనీమూన్ వస్తారు. రాశి దెయ్యాలతో మాట్లాడుతుంటుంది. ఇదంతా ఒక ఎత్తయితే అజయ్ డాన్స్ చేస్తాడు. అది టార్చర్.
విమల్‌కృష్ణ ఏం రాసుకున్నాడో , ఏం తీసాడో కానీ ఒక బ్రహ్మ పదార్థాన్ని ప్రేక్షకులపైకి వదిలాడు. టీవీ సీరియల్ చూస్తున్నట్టు ఫీలయితే అది మన తప్పుకాదు.
కశ్మీర్‌లో తీయడం, నిడివి రెండు గంటల కంటే తక్కువే వుండడం ఒక ఊరట.
ప్లస్ పాయింట్స్ః
ఏమీ లేవు
మైనస్ పాయింట్స్ః
చెప్పడం అనవసరం
ఫైనల్‌గా డీజే టిల్లు తీసింది ఇతనేనా అని మనకూ అనుమానం వస్తుంది.
(అభిప్రాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























