‘నేను కుప్పకూలే వరకు నాలో ఆ లోపం ఉందనే విషయం తెలియదు’

ఫొటో సోర్స్, Liam Asman
- రచయిత, విక్కీ లోడర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
23 ఏళ్ల సాస్కియా రీవ్స్-ప్రీస్ట్లీ పని చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలారు.
"నాకు ఒక్కసారిగా తల తిరగడం, వికారం మొదలయ్యాయి. గుండె వేగంగా కొట్టుకోవడం, శరీరం బాగా వేడెక్కినట్లు అనిపించింది" అని ఆమె చెప్పారు.
అంతకుముందు ఇలా జరుగుతుందనే సూచనలేవీ లేవు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించే టీచర్‌గా పనిచేస్తున్న సాస్కియా.. ఫుట్‌బాల్‌పై ఆసక్తితో వారానికి నాలుగుసార్లు గోల్‌కీపర్‌గా ఆడేవారు. తాను ఎంతో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నానని భావించేవారు.
అయితే, ఆ తర్వాత ఆమెకు విటమిన్ డి లోపం ఉన్నట్లు వైద్యులు నిర్ధరించారు. రక్త పరీక్షల్లో ఆమె శరీరంలో విటమిన్ డి స్థాయులు తక్కువగా ఉన్నట్లు తేలింది.
యూకేలో కొన్ని వయసుల వారిలో విటమిన్ల లోపం పెరుగుతున్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బాలికలు, యువతుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.
నేషనల్ డైట్ అండ్ న్యూట్రిషన్ సర్వే గణాంకాల ప్రకారం.. గత ఏడాది 11 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారిలో దాదాపు నాలుగో వంతు మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
చేపలు, మాంసం వంటి ఆహార పదార్థాల ద్వారా లేదా సప్లిమెంట్ల రూపంలో విటమిన్ డి మన శరీరానికి అందుతుంది.
అయితే, ఇందులో ఎక్కువ భాగం సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు (యూవీ) చర్మంపై పడినప్పుడు మన శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. మనం నివసించే ప్రాంతం, కాలాన్ని బట్టి సూర్యరశ్మి తీవ్రత మారుతుంది. సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి కూడా తగ్గుతుంది.
శరీరంలోని కొన్ని భాగాలను దుస్తులతో కప్పుకోవడం, సన్‌స్క్రీన్ వాడటం కూడా విటమిన్ డి ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. అయితే, ఇవి సూర్యరశ్మి వల్ల కలిగే హాని నుంచి చర్మాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
తక్కువ రంగు చర్మం ఉన్నవారితో పోలిస్తే ముదురు రంగు చర్మం ఉన్నవారికి అదే స్థాయిలో విటమిన్ డి ఉత్పత్తి కావాలంటే మరింత బలమైన సూర్యరశ్మి అవసరం.
విటమిన్ డి లోపాన్ని గుర్తించేందుకు వైద్యులు సాధారణంగా రక్త పరీక్షలు చేయించరు. అయితే, తమకు ఈ లోపం వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసే వారికి అవసరమైతే సప్లిమెంట్లు సూచిస్తారు.


ఫొటో సోర్స్, Amaka Osu
విటమిన్ డి లోపం లక్షణాలేంటి?
శిశువులు, చిన్న పిల్లల్లో విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ అనే ఎముకల వ్యాధి వస్తుంది. పెద్దవారిలో ఇదే తరహాలో ఎముకలు బలహీనపడే సమస్యను ఆస్టియోమలేసియా అంటారు.
"దీనిని నిశ్శబ్దంగా ప్రభావం చూపించే వ్యాధి అంటారు" అని పిల్లల హార్మోన్ల సమస్యల నిపుణురాలు డాక్టర్ సుమా ఉదయ్ చెప్పారు. ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
చిన్న వయసులో ఉన్నవారితో పాటు పెద్దవారిలోనూ విటమిన్ డి లోపాన్ని గుర్తించడం కష్టమని, కొన్నిసార్లు వైద్యులు కూడా ఈ సమస్యను గుర్తించలేకపోవచ్చని లేదా మరో సమస్యగా పొరబడవచ్చని ఆమె హెచ్చరిస్తున్నారు. అలసట, కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు ఈ లోపం వల్ల కనిపించే లక్షణాల్లో కొన్ని.
"ఈ లోపం నిశ్శబ్దంగా ఎముకలను బలహీనపరుస్తూ ఉంటుంది. దీంతో అవి మెత్తబడి, సులభంగా విరిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది" అని సుమా ఉదయ్ వివరించారు.
లివర్‌పూల్‌లోని తన యూనివర్సిటీ హాస్టల్లో అమాకా వంట చేస్తుండగా ఆమెకు ఒక్కసారిగా వణుకు మొదలైంది.
"నా కళ్ల ముందు ఏముందో కూడా సరిగ్గా కనిపించలేదు" అని ఆమె చెప్పారు.
దీంతో తన రూమ్మేట్ అమాకాను అత్యవసర చికిత్స విభాగానికి (ఏ అండ్ ఈ) తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెకు కూడా విటమిన్ డి లోపం ఉన్నట్లు నిర్ధరణ అయింది.
అలసట తప్ప తనకు అంతకుముందు ఎలాంటి లక్షణాలు లేవని అమాకా చెప్పారు.
"నాకు 21 ఏళ్లు. చదువుతో పాటు యూనివర్సిటీ పనులు కూడా ఉంటాయి. ఎప్పుడూ అలసటగా అనిపిస్తూనే ఉంటుంది" అని ఆమె తెలిపారు.
తన తల్లికి గతంలో విటమిన్ డి లోపం ఉన్నట్లు గుర్తించారని, అయితే తనకు కూడా ఈ సమస్య వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని అమాకా అన్నారు. సప్లిమెంట్లు తీసుకున్న తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. అయినప్పటికీ, మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
"ఆ అనుభవం చాలా భయంకరంగా అనిపించింది. మళ్లీ అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలని లేదు" అని అమాకా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బాలికల్లో జీవితాంతం కొనసాగే విటమిన్ డి లోపం
విటమిన్ డి లోపంగా పరిగణించేందుకు ప్రస్తుతం ఉన్న స్థాయుల పరిమితిని పెంచాలని కోరుతున్న వైద్యులు, పరిశోధకుల బృందంలో సుమా ఉదయ్ కూడా ఉన్నారు. ఈ బృందం 'యాక్ట్ నౌ విటమిన్ డి' పేరుతో ప్రచారం నిర్వహిస్తోంది.
ప్రస్తుతం ఉన్న పరిమితిని పెంచితే విటమిన్ డి తక్కువగా ఉన్న మరింత మంది గుర్తించే అవకాశం ఉంటుందని ఆమె చెబుతున్నారు. తద్వారా ఈ సమస్య ఎంత విస్తృతంగా ఉందో మరింత కచ్చితంగా అంచనా వేయవచ్చని, లోపాన్ని ముందుగానే గుర్తించి చికిత్స అందించవచ్చని వివరిస్తున్నారు.
మహిళల్లో ఈ లోపం జీవితాంతం కొనసాగే ప్రమాదం ఉందని సుమా ఉదయ్ హెచ్చరిస్తున్నారు. కౌమార దశలో మొదలైన ఈ సమస్య గర్భధారణ సమయంలోనూ కొనసాగి, పుట్టబోయే బిడ్డపై కూడా ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు.
"మొదటి నుంచే ఈ లోపాన్ని సరిచేయకపోతే, దాని ప్రభావం అనేక తరాల వరకు కొనసాగుతుంది" అని ఆమె అన్నారు.
"ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది" అని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మార్టిన్ హ్యూవిసన్ చెప్పారు.
విటమిన్ డిని కనుగొని వందేళ్లు దాటినా రికెట్స్ వ్యాధి ఇంకా సమాజంలో కొనసాగుతోందని ఆయన అన్నారు.
"సమాజంలో రికెట్స్ కేసులు ఉన్నాయంటే, విటమిన్ డి లోపంతో బాధపడుతున్నవారు ఇంకా ఎంతో మంది ఉన్నట్లే" అని ఆయన వివరించారు.
ఆహార పదార్థాల తయారీ సమయంలోనే వాటిలో విటమిన్లను కలిపే ప్రక్రియను ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటారు. ఈ విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని హ్యూవిసన్ సూచిస్తున్నారు.
కెనడా, స్వీడన్ వంటి దేశాల్లో ఈ విధానం తప్పనిసరిగా అమలవుతోంది.
యూకేలో ఇప్పటికే కొన్ని బ్రేక్‌ఫాస్ట్ తృణధాన్యాలు, స్ప్రెడ్‌లలో విటమిన్ డిని కలుపుతున్నారు. అయితే, ఇది తప్పనిసరి కాదు. ఆయా సంస్థలు తమ ఇష్టానుసారం ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి.
చలికాలంలో ప్రజల శరీరాల్లో విటమిన్ డి స్థాయులు తగ్గడం మొదలవుతుంది.
"కొన్ని వర్గాల ప్రజలకు విటమిన్ డి సప్లిమెంట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం తప్పనిసరి కావాల్సి రావచ్చు" అని హ్యూవిసన్ అభిప్రాయపడ్డారు.
ఇక సాస్కియా ప్రస్తుతం క్రమం తప్పకుండా విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారు. తిరిగి గోల్‌కీపర్‌గా ఫుట్‌బాల్ మైదానంలోకి అడుగుపెట్టారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























