బ్రెయిన్ స్ట్రోక్: ఉన్నట్టుండి మాట తడబడినా, ముఖం వాలిపోయినా, చూపు తగ్గినా అనుమానించాల్సిందేనా..

బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు, కారణాలు
ఫొటో క్యాప్షన్, స్ట్రోక్ అనేది కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చేది కాదు. యువతలో కూడా ఇటీవల స్ట్రోక్ కేసులు కనిపిస్తున్నాయి.
    • రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

మాట తడబడటం.. ఒక చేయి బలహీనపడటం.. ముఖం ఒకవైపు వాలిపోవడం.. ఉన్నట్లుండి చూపు తగ్గడం.. తీవ్రమైన తలనొప్పి.. ఇలాంటి లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తే చాలామంది వాటిని అలసట, బీపీ పెరగడం, గ్యాస్, మైగ్రేన్ లేదా తాత్కాలిక సమస్యగా భావిస్తారు.

కానీ ఇవి బ్రెయిన్ స్ట్రోక్‌కు హెచ్చరికలు కావచ్చు.

స్ట్రోక్ అనేది కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చేది కాదు. యువతలో కూడా ఇటీవల స్ట్రోక్ కేసులు కనిపిస్తున్నాయి.

యువతలో స్ట్రోక్ ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా ఉందని అందుబాటులో ఉన్న అధ్యయనాలు చూపిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి?

మెదడులోని ఒక భాగానికి రక్త ప్రసరణ అకస్మాత్తుగా తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం, లేదా మెదడులోని రక్తనాళం చిట్లి రక్తస్రావం జరగడం వల్ల మెదడు కణాలు దెబ్బతినే పరిస్థితినే స్ట్రోక్ అంటారు.

మెదడు కణాలకు నిరంతరం ఆక్సిజన్, గ్లూకోజ్ అవసరం. రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు ఆ ప్రాంతంలోని మెదడు కణాలు దెబ్బతినడం ప్రారంభిస్తాయి. అందుకే స్ట్రోక్‌ను మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణిస్తారు.

స్ట్రోక్‌లో ప్రధానంగా రెండు రకాలుంటాయి.

1. ఇష్కీమిక్ స్ట్రోక్

మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం రక్తపు గడ్డతో మూసుకుపోవడం వల్ల వచ్చే స్ట్రోక్‌ను ఇష్కీమిక్ స్ట్రోక్ అంటారు. దీనికి రక్తనాళాల్లో కొవ్వు పొరలు పేరుకుపోవడం, రక్తం గడ్డ కట్టడం, గుండెలో ఏర్పడిన బ్లడ్ క్లాట్ మెదడుకు వెళ్లడం వంటి కారణాలు ఉండొచ్చు.

ప్రపంచవ్యాప్తంగా కొత్తగా వచ్చే స్ట్రోక్‌లలో సుమారు 62.4% ఇష్కీమిక్ స్ట్రోక్‌లు అని జీబీడీ 2019 విశ్లేషణ పేర్కొంది.

2. హెమరేజిక్ స్ట్రోక్

మెదడులోని రక్తనాళం చిట్లి రక్తస్రావం జరిగితే దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు.

దీనిలో ప్రధానంగా ఇంట్రా సెరిబ్రల్ హెమరేజ్, సబ్ అరక్నాయిడ్ హెమరేజ్ వంటి రకాలు ఉంటాయి.

ప్రపంచవ్యాప్తంగా 2019లో కొత్త స్ట్రోక్‌లలో సుమారు 27.9% ఇంట్రా సెరిబ్రల్ హెమరేజ్, 9.7% సబ్ అరక్నాయిడ్ హెమరేజ్ స్ట్రోక్‌లు అని జీబీడీ అంచనా.

బ్రెయిన్ స్ట్రోక్

ఇదో హెచ్చరిక..

కొంతమందిలో స్ట్రోక్‌లాంటి లక్షణాలు కొన్ని నిమిషాలు లేదా గంటలు కనిపించిన తర్వాత పూర్తిగా తగ్గిపోవచ్చు. దీనిని ట్రాన్సియెంట్ ఇష్కీమిక్ ఎటాక్ (టీఐఏ) అంటారు.

లక్షణాలు తగ్గిపోయాయి కాబట్టి ప్రమాదం లేదు అనుకోవడం పొరపాటు. భవిష్యత్తులో స్ట్రోక్ వచ్చే ప్రమాదానికి ఈ టీఐఏ ఒక ముఖ్యమైన హెచ్చరిక కావచ్చు. అందువల్ల లక్షణాలు తగ్గిపోయినా వైద్య పరీక్షలు అవసరం.

భారత్‌లో స్ట్రోక్ సమస్య ఎంత పెద్దదో గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి.

గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) 2019 అంచనాల ప్రకారం, 2019లో భారత్‌లో సుమారు 12.9 లక్షల కొత్త స్ట్రోక్ కేసులు నమోదైనట్లు అంచనా. అదే సంవత్సరంలో సుమారు 6.99 లక్షల మరణాలకు స్ట్రోక్‌ కారణమైందని అంచనా.

స్ట్రోక్‌కు ప్రధాన కారణాలు ఏమిటి?

స్ట్రోక్‌కు ఒకే ఒక్క కారణం ఉండదు. అనేక ప్రమాద కారకాలు కలిసి ముప్పును పెంచుతాయి.

1. అధిక రక్తపోటు

స్ట్రోక్‌కు అత్యంత ముఖ్యమైన ప్రమాద కారకాల్లో హైపర్‌టెన్షన్ ఒకటి.

జీబీడీ 2019 విశ్లేషణ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్‌కు సంబంధించిన DALYs ( Disability Adjusted life years) లో అధిక సిస్టోలిక్ బీపీ సుమారు 55.5%కి కారణమయ్యే ప్రమాద కారకంగా అంచనా.

అందుకే "నాకు బీపీ లక్షణాలు లేవు" అనడం సురక్షితం కాదు. బీపీని కొలవాలి.

2. మధుమేహం

దీర్ఘకాలం నియంత్రణలో లేని రక్తంలో చక్కెర రక్తనాళాలను దెబ్బతీస్తుంది.

3. అధిక కొలెస్ట్రాల్

ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల రక్తనాళాల్లో ఫలకాలు (plaque) పేరుకుపోయి రక్త ప్రసరణకు ఆటంకం కలగవచ్చు.

4. పొగతాగడం

సిగరెట్, బీడీ, ఇతర పొగాకు ఉత్పత్తులు రక్తనాళాలను దెబ్బ తీస్తాయి. రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతాయి.

5. ఊబకాయం

అధిక బీఎంఐ, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు, బీపీ, మధుమేహం, కొవ్వులలో అసమతుల్యత (Dyslipidemia) వంటి అనేక ప్రమాద కారకాలకు దారితీస్తుంది.

6. శారీరక శ్రమ లేకపోవడం

వ్యాయామం లేకపోవడం, ఎక్కువసేపు కూర్చునే జీవనశైలి వంటివి బరువు, బీపీ, జీవక్రియ సంబంధిత ప్రమాదాలు పెరగడానికి దారితీయవచ్చు.

7. గుండె జబ్బులు

ప్రత్యేకంగా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వంటి అసాధారణ గుండె లయ గల వ్యాధుల్లో గుండెలో రక్తం గడ్డకట్టి అది మెదడుకు వెళ్లి రక్తనాళాన్ని మూసివేయవచ్చు.

8. అధిక మద్యపానం

అధికంగా మద్యం తీసుకోవడం బీపీ పెరగడానికి, స్ట్రోక్ ప్రమాదం పెరగడానికి కారణమవుతుంది.

9. వాయు కాలుష్యం

పరిసరాల్లోని సూక్ష్మ కణ పదార్థాల కాలుష్యం కూడా స్ట్రోక్‌కు సంబంధించిన ముఖ్యమైన ప్రమాద కారకాల్లో ఒకటి అని జీబీడీ 2019లో గుర్తించింది.

యువతలో స్ట్రోక్ ఎందుకు కనిపిస్తోంది?

ప్రస్తుతం దీనిపైనే ఎక్కువ చర్చ నడుస్తోంది.

ప్రపంచ జీబీడీ విశ్లేషణలో 1990-2019 మధ్య మొత్తం జనాభాలో వయసు-సర్దుబాటు చేసిన (stroke incidence) పక్షవాత కేసుల సంఖ్య తగ్గినప్పటికీ, 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో పక్షవాత కేసులు 15% పెరిగినట్లు అంచనా వేశారు.

ఇది యువతలో స్ట్రోక్ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తోంది. అయితే ప్రతి యువ స్ట్రోక్‌కు కారణం "ఆధునిక జీవన శైలి" అని చెప్పడం సరికాదు.

ఇటీవల ఓ భారతీయ అధ్యయనంలో 18–50 సంవత్సరాల వయసున్న 569 మందిలో ఇష్కీమిక్ స్ట్రోక్ /టీఐఏ రోగుల్లో హైబీపీ 40.3%, డయాబెటిస్ 34.3%, పొగ తాగడం 28.6%, ఆల్కహాల్ తాగడం 28.8%, కొవ్వుల అసమతుల్యత 24.6%గా నమోదయ్యాయి.

యువకుల్లో స్ట్రోక్ వచ్చినప్పుడు బీపీ వల్లే అని వెంటనే నిర్ణయించకూడదు. వీటికి ఇంకా ఇతరత్రా కారణాలు కూడా ఉండవచ్చు.

ఉదాహరణకు కెరోటిడ్, వెర్టిబ్రల్ ఆర్టరీ డైసెక్షన్, కార్డియాక్ ఎంబోలిజం, అసాధారణ గుండె లయ, పుట్టుకతో వచ్చే లేదా ఇతరత్రా గుండె జబ్బులు, రక్తం గడ్డ కట్టే జబ్బులు, కొన్ని రకాల ఆటోఇమ్యూన్ డిసీజెస్, జన్యు పరమైన వ్యాధులు, గర్భధారణ-ప్రసవానంతర కాలానికి సంబంధించిన ప్రత్యేక పరిస్థితులు, కొన్ని మాదకద్రవ్యాల వినియోగం వంటివి కూడా పరిశీలించాలి.

ప్రత్యేకంగా యువతలో స్ట్రోక్‌కు గల కారణాన్ని గుర్తించడం భవిష్యత్తులో మరో స్ట్రోక్‌ను నివారించడానికి చాలా కీలకం.

బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు

స్ట్రోక్ లక్షణాలు సాధారణంగా అకస్మాత్తుగా ప్రారంభమవుతాయి.

ముఖం వాలిపోవడం: నవ్వినప్పుడు ముఖం ఒకవైపు వాలిపోవడం

చేయి లేదా కాలు బలహీనపడటం: ఒక వైపు చేయి లేదా కాలు అకస్మాత్తుగా బలహీనపడటం లేదా మొద్దుబారడం

మాటలో మార్పు: మాట తడబడటం, స్పష్టంగా మాట్లాడలేకపోవడం లేదా ఇతరులు మాట్లాడేది అర్థం చేసుకోలేకపోవడం

చూపులో మార్పు: అకస్మాత్తుగా ఒకటి లేదా రెండు కళ్లలో చూపు తగ్గడం, ద్వంద్వ దృష్టి రావడం

నడకలో మార్పు: అకస్మాత్తుగా తల తిరగడం, సమతుల్యత కోల్పోవడం, నడవలేకపోవడం

తీవ్రమైన తలనొప్పి: ప్రత్యేకంగా హేమరేజిక్ స్ట్రోక్‌లో అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి, వాంతులు లేదా స్పృహలో మార్పులు రావచ్చు.

FAST: ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన నాలుగు అక్షరాలు

F – Face: ముఖం ఒకవైపు వాలిందా?

A – Arm: ఒక చేయి బలహీనంగా ఉందా?

S – Speech: మాట తడబడుతోందా?

T – Time: వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందే సమయం!

స్ట్రోక్ చికిత్సకు లక్షణాలు ప్రారంభమైన కచ్చితమైన సమయాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.

బ్రెయిన్

స్ట్రోక్ వచ్చినప్పుడు ఆసుపత్రిలో ఏం చేస్తారు?

మొదట రోగి పరిస్థితిని స్థిరీకరించి, నాడీ సంబంధిత పరీక్ష చేస్తారు.

తర్వాత సాధారణంగా బ్రెయిన్‌కు సీటీ స్కాన్ చేసి రక్తస్రావం ఉందా, ఇష్కీమిక్ స్ట్రోక్‌ వచ్చిందా అనే విషయాన్ని తెలుసుకుంటారు. అవసరాన్ని బట్టి సీటీ యాంజియోగ్రఫీ, ఈసీజీ, 2డీ ఎకో, రక్త పరీక్షలు చేస్తారు.

స్ట్రోక్ రకం, లక్షణాల తీవ్రత, లక్షణాలు ప్రారంభమైన సమయం, స్కాన్, ఇతర వైద్య పరిస్థితులపై ఆధారపడి చికిత్స ఉంటుంది.

ఇష్కీమిక్ స్ట్రోక్‌కు ఆధునిక చికిత్స

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ / అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ 2026 మార్గదర్శకాల ప్రకారం... అర్హత ఉన్న కొంతమంది రోగులకు ఇంట్రా వీనస్ త్రాంబోలైసిస్ ద్వారా రక్తపు గడ్డను కరిగించే చికిత్స అందించవచ్చు. ఇది సాధారణంగా స్ట్రోక్ లక్షణాలు ప్రారంభమైన నాలుగున్నర గంటలలోపు వీలైనంత త్వరగా ఇవ్వాలి.

పెద్ద రక్తనాళం మూసుకుపోయిన కొంత మందిలో మెకానికల్ త్రాంబేక్టమి ద్వారా రక్తపు గడ్డను కేతీటర్ సహాయంతో తొలగించవచ్చు. ఇది 6 గంటల వరకు, కొన్ని నిర్దిష్ట రోగుల్లో 6–24 గంటల విండోలో కూడా చేయవచ్చని ఆధునిక మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.

అందుకే ''స్ట్రోక్ అయితే ముందుగా ఇంట్లో చూసుకుందాం" అనేది ప్రమాదకరమైన ఆలోచన.

హెమరేజిక్ స్ట్రోక్‌కు చికిత్స

రక్తస్రావం ఉన్నప్పుడు చికిత్స పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

బీపీ నియంత్రణ, రక్తం పలుచబడే మందులు వాడుతున్నారా అనే పరిశీలించి, బ్రెయిన్‌లో ఒత్తిడి తగ్గించే చికిత్స, అవసరాన్ని బట్టి శస్త్ర చికిత్స కూడా చేస్తారు.

కోలుకున్న తర్వాత కూడా చికిత్స కొనసాగాలి.

స్ట్రోక్ తర్వాత కొందరికి చేయి/కాలు బలహీనత, మాటలో ఇబ్బంది, మింగడంలో సమస్య, జ్ఞాపకశక్తి లేదా ఇతర జ్ఞానపరమైన సమస్యలు, నడకలో సమస్య ఉండవచ్చు.

అందుకే ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, మింగే సామర్థ్య పునరుద్ధరణ వంటి పునరావాస చికిత్సలు అవసరాన్ని బట్టి ఇవ్వాలి.

అదే సమయంలో రెండోసారి స్ట్రోక్ రాకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, పొగ తాగడం తదితరాలను నియంత్రించడం అత్యంత ముఖ్యం.

స్ట్రోక్‌ను నివారించడానికి ఏం చేయాలి?

  • బీపీని క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి
  • మధుమేహాన్ని నియంత్రణలో ఉంచాలి
  • చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచాలి
  • పొగతాగడం పూర్తిగా మానేయాలి
  • అధిక మద్యపానాన్ని నివారించాలి
  • బరువును ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచాలి
  • క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయాలి
  • ఉప్పు, అధిక కేలరీల ఆహారం తగ్గించాలి
  • పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలతో సమతుల ఆహారం తీసుకోవాలి
  • గుండె సంబంధిత సమస్యలు ఉంటే వైద్యుల సూచనతో చికిత్స తీసుకోవాలి

(గమనిక: రచయిత ఓ డాక్టర్. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)