పాకిస్తాన్ జైలులో తండ్రి మృతి, శిక్ష పూర్తయినా అదే జైలులో కొడుకు

గుజరాత్, పాకిస్తాన్, సముద్రజలాలు, జాలర్లు
ఫొటో క్యాప్షన్, బీజల్‌భాయ్
    • రచయిత, గోపాల్ కటేషియా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

కోబ్ గ్రామం గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లా ఉనా తాలూకాలో ఉంది. ఈ గ్రామానికి చెందిన బీజల్‌భాయ్ భాలియా చేపలు పట్టే పనిచేసేవారు.

తన కుమారుడు అశ్విన్‌తో కలిసి ఆయన 2022 ఫిబ్రవరి 7న సముద్రంలో చేపలు పడుతుండగా పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించారనే ఆరోపణలపై పాకిస్థాన్ మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్లను అరెస్టు చేసింది.

ఆ తర్వాత బీజల్‌భాయ్, అశ్విన్‌తో పాటు మరో నలుగురు మత్స్యకారులను పాకిస్తానీ జైలులో నిర్బంధించారు.

బీజల్‌భాయ్ పాకిస్తాన్ జైలులో అనారోగ్యానికి గురయ్యారు. సుమారు 50 ఏళ్ల వయసున్న బీజల్‌భాయ్ జైలులోనే మరణించారు.

ఆయన 26 ఏళ్ల కుమారుడు అశ్విన్ కూడా అదే జైలులో ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గుజరాత్, పాకిస్తాన్, సముద్రజలాలు, జాలర్లు

శిక్ష పూర్తయినా విడుదల కాని అశ్విన్

అరేబియా సముద్రంలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య కొనసాగుతున్న సముద్ర సరిహద్దు వివాదం కారణంగా మత్స్యకారుల కుటుంబాలు అనేక విషాద సంఘటనలను ఎదుర్కోవలసి వస్తోందని మత్స్యకారుల కోసం పనిచేసే హక్కుల కార్యకర్తలు అంటున్నారు.

బీజల్‌భాయ్ కుమారుడు అశ్విన్‌కు విధించిన శిక్ష నాలుగేళ్ల క్రితమే పూర్తయింది. కానీ ఆయన ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. బీజల్‌భాయ్ మరణించిన మూడు వారాల తర్వాత పాకిస్తాన్ ఆయన మృతదేహాన్ని భారత్‌కు పంపించింది.

పాకిస్తాన్ జైలు నుంచి అశ్విన్‌ను విడిపించాలని కోరుతూ బీజల్‌భాయ్ కుటుంబం గిర్ సోమనాథ్‌లోని స్థానిక నాయకులను కలుస్తోంది.

పాకిస్థాన్‌లోని లాంధీ జైలు అధికారులను దీనిపై బీబీసీ ప్రశ్నించింది. వారినుంచి ఇప్పటివరకూ ఎలాంటి సమాధానం రాలేదు. మాకు సమాధానం అందిన వెంటనే దాన్ని ఈ కథనంలో చేర్చుతాం.

తండ్రీకొడుకులిద్దరూ పాకిస్తాన్ కస్టడీలోకి ఎలా వెళ్లారు?

బీజల్‌భాయ్‌కి నలుగురు కుమారులున్నారు. అశ్విన్ మూడో కొడుకు.

పోర్‌బందర్‌కు చెందిన విజయాబెన్ సోలంకీ యాజమాన్యంలోని 'నదితా సాగర్' అనే ఫిషింగ్ ట్రాలర్‌లో తన తండ్రి తండేల్ లేదా కెప్టెన్‌గా పనిచేసేవారని బీజల్‌భాయ్ చిన్న కొడుకు మాన్‌సింగ్ బీబీసీకి చెప్పారు.

అశ్విన్ కూడా తన తండ్రితో కలిసి పడవలో చేపలు పట్టడానికి వెళ్లేవారని మాన్‌సింగ్ చెప్పారు. తన తండ్రి, సోదరుడు చేపలు పట్టడానికి 2022 ఫిబ్రవరి 4న పోర్‌బందర్ నుంచి బయలుదేరారని ఆయన తెలిపారు.

"ఐదుగురు అన్నదమ్ముల్లో మా నాన్నగారు పెద్దవారు. ఆయన చిన్నప్పటి నుంచే చేపల పడవల్లో పనిచేశారు. ఆయన్ని చూసి మేం నలుగురు అన్నదమ్ములం కూడా జాలర్లమయ్యాం. అశ్విన్‌ను అరెస్టు చేసినప్పుడు ఆయన భార్య దక్షాబెన్ గర్భవతిగా ఉన్నారు"

"సుమారు నాలుగు నెలల తర్వాత దక్షాబెన్‌కు హర్పాల్‌కు అనే కొడుకు పుట్టాడు. వాడికిప్పుడు నాలుగేళ్లు. కానీ అతను ఇప్పటి వరకు తన తండ్రిని చూడలేదు"

"మా నాన్నకు ఇంతకుముందు ఎలాంటి అనారోగ్యం లేదు. కానీ జైలులో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయం మాకు ఒక లేఖ ద్వారా తెలిసింది" అని మాన్‌సింగ్ చెప్పారు.

గుజరాత్, పాకిస్తాన్, సముద్రజలాలు, జాలర్లు

బీజల్‌భాయ్‌కి సరైన వైద్యం అందలేదా?

ముంబైకి చెందిన జర్నలిస్ట్ జతిన్ దేశాయ్ భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేసే ప్రభుత్వేతర సంస్థ అయిన 'పాకిస్తాన్-ఇండియా పీపుల్స్ ఫోరమ్ ఫర్ పీస్ అండ్ డెమోక్రసీ' భారత విభాగానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

ఆయన మత్స్యకారుల కోసం కూడా పనిచేస్తున్నారు. కరాచీ సమీపంలోని లాంధీ జైలులో బీజల్‌భాయ్‌ను నిర్బంధించారని జతిన్ దేశాయ్ బీబీసీతో చెప్పారు.

"బీజల్‌భాయ్ అనారోగ్యానికి గురైన తర్వాత ఆయనను కరాచీలోని జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్ (జేఎంపీసీ)లో చేర్పించారు. ఆయన ఆగస్టు 27న ఆస్పత్రిలో మరణించారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఆయన మృతదేహాన్ని భారత్‌కు అప్పగించింది.

బీజల్‌భాయ్ మృతదేహం సెప్టెంబర్ 18, 19 తేదీల రాత్రి ఆయన స్వగ్రామానికి చేరుకుంది" అని జతిన్ దేశాయ్ తెలిపారు.

తన తండ్రి మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని మాన్‌సింగ్ చెప్పారు.

"మా నాన్నను పాకిస్తాన్ పట్టుకున్నప్పుడు ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదు. జైలులో పెట్టిన తర్వాత ఆయనకు మధుమేహం,రక్తపోటు సమస్యలు వచ్చాయి. ఈ విషయం మాకు ఇతరుల ద్వారా తెలిసింది. నాన్నను జైలులో అశ్విన్ జాగ్రత్తగా చూసుకున్నారు" అని మాన్‌సింగ్ చెప్పారు.

తన తండ్రికి సరైన చికిత్స అందలేదని, ఒకవేళ అందితే ఆయన ఇలా చనిపోయేవారుకాదని మాన్‌సింగ్ ఆరోపిస్తున్నారు.

"చేపలు పడుతుండగా బీజల్‌భాయ్ పడవ వాళ్లకు తెలియకుండా పాకిస్తాన్ సముద్ర సరిహద్దు వైపు వెళ్లింది. ఆ తర్వాత పాకిస్తాన్ మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్లను అరెస్టు చేసింది" అని జతిన్ దేశాయ్ అన్నారు.

బీజల్‌భాయ్‌ పాకిస్తాన్ సముద్ర సరిహద్దులోకి అక్రమంగా ప్రవేశించినట్టు పాకిస్తాన్‌లోని ఓ కోర్టు నిర్ధరించింది. ఆయనకు కొన్ని వారాల జైలు శిక్ష విధించింది. ఆయన శిక్షాకాలం 2022 మార్చి16న పూర్తయింది.

" శిక్షాకాలం పూర్తయిన వెంటనే బీజల్‌భాయ్‌ను పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేసి భారత్‌కు పంపించి ఉండాల్సింది. ఆయన్ను స్వదేశానికి పంపించి ఉంటే బహుశా ఈ రోజు బతికే ఉండేవారు" అని జతిన్ దేశాయ్ అన్నారు.

ఈ ఏడాది పాకిస్తానీ జైలులో మరణించిన రెండో భారతీయ మత్స్యకారుడు బీజల్‌భాయ్. అంతకుముందు భగాభాయ్ బాంభణియా అనే మత్య్సకారుడు జనవరి 16న పాకిస్తాన జైలులో మరణించారు.

37 ఏళ్ల భగాభాయ్ ఉనా తాలూకాలోని చిఖ్లీ గ్రామానికి చెందినవారు.

గుజరాత్, పాకిస్తాన్, సముద్రజలాలు, జాలర్లు

కుటుంబం డిమాండ్ ఏంటి?

బీజల్‌భాయ్ మరణం తర్వాత పాకిస్థాన్ మానవత్వంతో స్పందించిఉండొచ్చని జతిన్ దేశాయ్ అన్నారు.

"అశ్విన్ జైలు శిక్ష కూడా చాలా కాలం క్రితమే పూర్తయింది. అయినప్పటికీ పాకిస్తాన్ ఆయన్ను జైలులోనే ఉంచింది. బీజల్‌భాయ్‌ను, ఆయన కుమారుడు అశ్విన్‌ను ఒకే జైలులో ఉంచారు. కాబట్టి అశ్విన్‌కు తన తండ్రి మరణం గురించి తెలిసి ఉండటం సహజమే"

"బీజల్‌భాయ్ మరణంతో ఆ కుటుంబం ఇప్పటికే తీవ్ర విషాదంలో ఉంది. అశ్విన్‌ను విడుదల చేసి బీజల్‌భాయ్ మృతదేహంతో పాటు భారత్ పంపుతారని కుటుంబం ఆశించింది. పాకిస్తాన్ మానవత్వంతో వ్యవహరించి అశ్విన్‌ను విడుదల చేసి ఉండాల్సింది. అప్పుడు ఆయన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం ఉండేది'' అని చెప్పారు.

తండ్రి అంత్యక్రియల సమయంలో అశ్విన్ లేకపోవడం కుటుంబం బాధను రెట్టింపు చేసిందని మాన్‌సింగ్ అన్నారు.

"మేం స్థానిక నాయకులను కలిసి సాయం కోరాం. అశ్విన్‌ను పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేయించాలని వారికి విజ్ఞప్తి చేశాం" అని ఆయన అన్నారు.

ప్రస్తుతం 197 మంది భారతీయ మత్స్యకారులు పాకిస్తానీ జైళ్లలో ఉన్నారని జతిన్ దేశాయ్ చెప్పారు.

"వారిలో 177 మంది మత్స్యకారులు తమ జైలు శిక్షను పూర్తి చేసుకున్నారు. వారి భారత పౌరసత్వ ధృవీకరణ కూడా పూర్తయింది. ఈ రెండు ప్రక్రియలు పూర్తయిన తర్వాత మత్స్యకారులను ఒక్క రోజు కూడా జైలులో ఉంచకూడదు. అలా చేయడం చట్టవిరుద్ధం" అని ఆయన అన్నారు.

"భారత మత్స్యకారులందరినీ జైలు నుంచి తక్షణమే విడుదల చేసి వారిని భారత్‌కు తిరిగి పంపాలని మేం పాకిస్తాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం" అని జతిన్ దేశాయ్ కోరారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)