ఫ్లై దుబాయ్ ఘటన: భారతీయ పైలట్‌పై ప్రశంసల వర్షం, ‘హీరో’ అంటూ పొగిడిన మోదీ, నెతన్యాహు, ట్రంప్

ఇజ్రాయెల్, దుబాయ్, పైలట్, కో పైలట్, కాక్‌పిట్, భారత్
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న విమానంలో ఓ పైలట్ మరో పైలట్‌ను కత్తితో పొడిచి విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్టు కనిపిస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.

దాడికి పాల్పడిన పైలట్‌పై సౌదీ అరేబియాలో దర్యాప్తు జరుగుతోందని, ఆ తర్వాత పైలట్‌ను విమానం బయలుదేరిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు తీసుకెళ్లే అవకాశం ఉందని ఫ్యాక్స్ న్యూస్‌తో నెతన్యాహు చెప్పారు.

పైలట్ అసలు ఉద్దేశం తెలియదని, దర్యాప్తులో ఇజ్రాయెల్ కూడా పాల్గొనే అవకాశం ఉందని ఆయనన్నారు. కత్తిపోట్లకు గురైన భారత పైలట్‌ను నిజమైన హీరోగా నెతన్యాహు అభివర్ణించారు.

‘‘కత్తిపోట్లకు గురైనప్పటికీ ఆయన పోరాడారు. ప్రతిఘటించారు. కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులు, సిబ్బంది కలిసి దాడిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేలా చేశారు. ఘోరప్రమాదాన్ని నివారించారు. ఇజ్రాయెల్ పౌరులు, ఇతర దేశాల పౌరులు సహా 174మంది ప్రాణాలను ఆయన కాపాడారు’’ అని నెతన్యాహు ‘ఎక్స్’లో రాశారు.

కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హీరోగా అభివర్ణించారు. ''కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఓ హీరో. ఆయన ధైర్యం వందలాదిమంది ప్రాణాలను కాపాడింది. పెద్ద విషాదాన్ని నివారించింది. అత్యంత తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొని తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలు కాపాడడానికి ఆయన గొప్ప ధైర్యాన్ని బలమైన సంకల్పాన్ని చూపారు. ఆయన్ను చూసి భారత్ గర్వపడుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా'' అని ప్రధాని మోదీ 'ఎక్స్'లో రాశారు

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

విమానంలో ఎదుర్కొన్న అనుభవాలను ప్రయాణికులు వివరించారు.

బీబీసీ న్యూస్‌నైట్‌తో ఆ విమానంలో ప్రయాణించిన అల్మోగ్ ఇటాలీ మాట్లాడారు. గాల్లో ఉండగా విమానం ఒక్కసారిదుగా కిందకు దిగడాన్ని రోలర్‌కోస్టర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు బరువు కోల్పోయే అనుభూతితో పోల్చారు.

''అకస్మాత్తుగా విమానం రోలర్‌కోస్టర్‌లా అనిపించింది. భారీగా గురుత్వాకర్షణ శక్తి వల్ల ఒక్కసారిగా కిందకు దిగింది. అలా 20 నుంచి 30 సెకండ్లపాటు కిందకు వెళ్తూనే ఉంది. తర్వాత కాస్త స్థిరంగా ప్రయాణించిన విమానం మళ్లీ కిందకు దిగింది’’ అని అల్మోగ్ తెలిపారు.

ఇజ్రాయెల్, దుబాయ్, పైలట్, కో పైలట్, కాక్‌పిట్, భారత్
ఫొటో క్యాప్షన్, స్మిత్ మచ్చర్

‘కాక్‌పిట్ వైపు ప్రయాణికులు పరుగులుతీశారు’

రెండోసారి విమానం కిందకు పడిపోతున్నప్పుడు విమానంలోని ప్రయాణికులు కోపైలట్ వైపు పరుగెత్తడం తాను చూశానని ఇటాలీ అన్నారు.

''పైలట్లలో ఒకరు మరొకరిని ఆపినట్టు అనిపించింది. కొందరు ప్రయాణికులు, సిబ్బంది కలిసి ఆయన్ను అదుపులోకి తీసుకుని కిందపడేశారు. పైలట్‌ను అదుపులోకి తీసుకోడానికి ముందుకు వెళ్లిన ముగ్గురు లేదా నలుగురు ప్రయాణికులకు మాత్రమే గాయాలయ్యాయి. మీరు వాళ్లను చూసే ఉంటారు. మిగిలినవాళ్లకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆ ముగ్గురు, నలుగురు చాలా ధైర్యంగా వ్యవహరించారు. వాళ్లకు స్వల్పగాయాలయ్యాయి. వాళ్లు చాలా ధైర్యవంతులు. వాళ్లు మా ప్రాణాలను రక్షించారు'' అని ఇటాలీ చెప్పారు.

ఇజ్రాయెల్, దుబాయ్, పైలట్, కో పైలట్, కాక్‌పిట్, భారత్
ఫొటో క్యాప్షన్, టెల్ అవీవ్ ఎయిర్‌పోర్టులో తమవారి కోసం కుటుంబసభ్యులు, బంధువులు ఉత్కంఠగా ఎదురుచూశారు.

పైలట్, ప్రయాణికులపై ప్రశంసలు

దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు సాధారణంగా మొదలై ఘోరప్రమాదంగా ముగిసే స్థితికి ప్రయాణం సాగింది. ఇజ్రాయెల్ మంత్రులు, అధికారులు దీనిన్ని ఉగ్రదాడిగా అభివర్ణిస్తున్నారు.

ఎఫ్‌జెడ్ 1073 విమానంలో ప్రయాణం మొదలయిన దాదాపు రెండున్నర గంటల తర్వాత ఒక ఘటన జరిగిందని ఫ్లైదుబాయ్ తెలిపింది.

విమానాన్ని కూల్చివేసేప్రయత్నంలో పైలట్లలో ఒకరు మరో పైలట్‌ను కత్తితో పొడిచారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. విమానం రెండు నిమిషాల్లో 17వేల అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయినట్టు డేటా చూపిస్తోంది.

సిబ్బంది, ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి వచ్చి దాడి చేసిన వ్యక్తిని అడ్డుకున్నారు. విమానాన్ని సరైన స్థితిలోకి తెచ్చి సౌదీ అరేబియాలో సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు.

దాడికి గురైన వ్యక్తి పైలట్ పేరు స్మిత్ మచ్చర్ అని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. తబుక్‌ నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం నిలకడగా ఉందని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. విమానం ల్యాండయింది ఈ నగరంలోని ఎయిర్ పోర్టులోనే .

మరో పైలట్ వివరాలు తెలియరాలేదు.

ఇజ్రాయెల్, దుబాయ్, పైలట్, కో పైలట్, కాక్‌పిట్, భారత్
ఫొటో క్యాప్షన్, విమానం వెనకభాగంలోని రెక్క దెబ్బతిన్నట్టు ఫోటోల్లో కనిపిస్తోంది.

దెబ్బతిన్న విమానం వెనక రెక్క భాగం

విమానాన్ని సురక్షితంగా తబుక్‌లో అత్యవసర ల్యాండింగ్ చేసిన తర్వాత మరో విమానంలో ప్రయాణికులను తరలించారు. ఆ విమానం టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నతర్వాత భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. కుటుంబసభ్యులు ఉద్వేగంతో ఒకరినొకరు కలుసుకోవడం, ఆనందోత్సాహాలు వంటివి కనిపించాయి.

ఈ ఘటన నేపథ్యంలో దేశంలోకి వచ్చే విమానాల పైలట్లపై భద్రతా తనిఖీలను పెంచుతామని ఇజ్రాయెల్ తెలిపింది.

దాడిలో గాయపడ్డ ఇజ్రాయెల్ ప్రయాణికులకు సౌదీ వైద్య నిపుణులు చికిత్స చేశారు. దీనిపై సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

విమానం ఘటనపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో మాట్లాడినట్టు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

ఏం జరిగిందో, ప్రమాదం నుంచి విమానాన్ని కాపాడేందుకు అందులోని వ్యక్తులు ఎలా ప్రయత్నించారో నెతన్యాహు తనకు వివరించారని ట్రంప్ అన్నారు.

''ఇది నమ్మశక్యంకాని విషయం. కో పైలట్ బహుశా ఉగ్రవాదికావొచ్చు. లేదా మతిస్థిమితం లేకపోయుండొచ్చు'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

దాడికి గురైన పైలట్‌ను హీరోగా ట్రంప్ అభివర్ణించారు.

దాడి తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ మధ్య విమాన సర్వీసులన్నింటినీ ఫ్లైదుబాయ్ తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తు పూర్తయ్యేవరకు సర్వీసులు నిలిపివేశామని ఓ ప్రకటనలో వెల్లడించింది.

అత్యవసర ల్యాండింగ్ తర్వాత తీసిన ఫ్లైదుబాయ్ విమానం ఫోటోను పరిశీలించగా విమానం వెనక భాగంలోని తోక రెక్క దెబ్బతినట్టు కనిపిస్తోంది.

ఈ విమానం సౌదీ అరేబియాలోని తబుక్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయి ఉన్న బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్ లైనర్‌దేనని బీబీసీ వెరిఫై నిర్ధరించింది.

ప్రయాణికులు విమానం నుంచి దిగి రన్‌వేపైకి వస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)