ఐపీఓకు రిలయన్స్ జియో, అతి పెద్ద షేర్ల అమ్మకం కావచ్చంటున్న మార్కెట్ నిపుణులు

అంబానీ, రిలయన్స్, జియో, తెలికాం, స్చాక్ మార్కెట్, షేర్లు

ఫొటో సోర్స్, Reliance updates/Youtube

    • రచయిత, నికితా యాదవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం విభాగం జియో ప్లాట్‌ఫార్మ్స్ షేర్ల అమ్మకాన్ని ప్రకటించింది.

ఇది దేశ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద షేర్ విక్రయాల్లో ఒకటిగా కానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

శుక్రవారం జరిగిన రిలయన్స్ వార్షిక సమావేశంలో కంపెనీ బోర్డు జియో ఐపీఓ కోసం డ్రాఫ్ట్‌‌ ప్రాస్పెక్టస్‌ను ఆమోదించిందని ముకేశ్ అంబానీ వెల్లడించారు.

50 కోట్లకు పైగా వినియోగదారులతో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ అయిన జియో, ఈ ఐపీఓ ద్వారా సుమారు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.38,000 కోట్లు) సమీకరించే అవకాశముందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గత కొన్ని నెలలుగా భారత స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ఒడిదొడుకుల తర్వాత కొత్త ఐపీఓల పట్ల పెట్టుబడిదారుల ఆసక్తి ఎంత మేర ఉందో అంచనా వేయడానికి జియో లిస్టింగ్ కీలకంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

"జియో లిస్టింగ్ ద్వారా ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థలను భారత్ నిర్మించగలదని, ప్రపంచ స్థాయి సామర్థ్యం, విలువ కలిగిన కంపెనీలను సృష్టించగలదని మరోసారి రుజువవుతుంది" అని అంబానీ చెప్పారు.

అంబానీ, రిలయన్స్, జియో, తెలికాం, స్చాక్ మార్కెట్, షేర్లు

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images

2016లో ప్రారంభమైన జియో, తక్కువ ధరలో మొబైల్ డేటా సేవలతో భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. అతి తక్కువ కాలంలోనే కోట్లమంది వినియోగదారులను సంపాదించింది. అనంతరం క్లౌడ్ కంప్యూటింగ్, కార్పొరేట్ సేవలు, కృత్రిమ మేధ వంటి రంగాల్లోకి విస్తరించింది.

నిరుడు, జియో, దాని ప్రత్యర్థి సంస్థ భారతి ఎయిర్‌టెల్‌‌లు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో వేర్వేరుగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను భారత్‌లో అందుబాటులోకి తీసుకురావడమే వాటి లక్ష్యం.

జియో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడుతుందని ఏడాదికి పైగా ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. 2026 ప్రారంభంలో కంపెనీ లిస్టింగ్ జరుగుతుందని అంబానీ గత ఏడాదే ప్రకటించారు.

సెకండరీ మార్కెట్లో ఇప్పటికే లిస్టైన కంపెనీల షేర్లు కొనుగోలు, విక్రయాలు జరుగుతాయి. అయితే ఐపీఓ ద్వారా ప్రైవేటు కంపెనీలు తొలిసారిగా తమ షేర్లను ప్రజలకు విక్రయించి స్టాక్ మార్కెట్లో ప్రవేశిస్తాయి.

జియో ఐపీఓ ప్రకటన వెలువడిన ఒక రోజు తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) కూడా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న లిస్టింగ్ కోసం అవసరమైన పత్రాలను దాఖలు చేసింది. దీంతో భారత క్యాపిటల్ మార్కెట్లలో కొత్త ఉత్సాహం నెలకొంది.

ఇష్యూ ధర, కంపెనీ విలువ వంటి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఐపీఓ ద్వారా 3 బిలియన్ డాలర్లకు పైగా నిధులు సమీకరించే అవకాశం ఉందని మీడియా నివేదికలు చెబుతున్నాయి.

జియో, ఎన్‌ఎస్‌ఈ లిస్టింగ్‌లు కలిసి ఇటీవలి కాలంలో భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. రెండేళ్ల క్రితం హ్యుండయ్ మోటార్ ఇండియా చేపట్టిన 3.3 బిలియన్ డాలర్ల భారీ షేర్ విక్రయానికి ఇవి సమానంగా నిలబడొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

జియో లిస్టింగ్‌పై పెట్టుబడిదారులు, విశ్లేషకులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల కొత్త ఐపీఓల సంఖ్య తగ్గిన నేపథ్యంలో జియో ఇష్యూ విజయవంతమైతే భారత ఐపీఓ మార్కెట్‌కు కొత్త ఊపు లభించవచ్చని వారు భావిస్తున్నారు.

ఈ నెల ప్రారంభంలో గుజరాత్‌లో రిలయన్స్ నిర్మిస్తున్న ఏఐ ఆధారిత డేటా సెంటర్‌లో కంప్యూటింగ్ కెపాసిటీని అద్దెకు తీసుకోనున్నట్లు మెటా ప్రకటించింది. 168 మెగావాట్ల సామర్థ్యంతో ఈ కేంద్రం నిర్మితమవుతుందని అంచనా.

మెటా 2020లో జియోలో 5.7 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టినప్పుడే వీరి భాగస్వామ్యం ప్రారంభమైంది

ఆ తర్వాత రెండు సంస్థలు తమ సహకారాన్ని మరింత విస్తరించాయి. ముఖ్యంగా మెటా ఓపెన్ సోర్స్ కృత్రిమ మేధ నమూనాలను భారతీయ వ్యాపార సంస్థలు, డెవలపర్లకు మరింత చేరువ చేసే కార్యక్రమాల్లో కలిసి పనిచేస్తున్నాయి.

గత నవంబర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జెఫరీస్ విడుదల చేసిన అంచనా ప్రకారం జియో విలువ సుమారు 180 బిలియన్ డాలర్లు( సుమారు రూ. 17.11 లక్షల కోట్లు ). ఈ లెక్కన ప్రపంచంలోనే అత్యంత విలువైన టెలికాం సంస్థల్లో జియో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

రిలయన్స్ గ్రూప్‌కు కూడా ఈ లిస్టింగ్ ఒక కీలక ఘట్టంగా నిలవనుంది. 2006లో రిలయన్స్ పెట్రోలియం స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత గ్రూప్‌కు చెందిన ప్రధాన సంస్థల్లో ఒకటి మళ్లీ పబ్లిక్ మార్కెట్లోకి వస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)