ఎలాన్ మస్క్: లక్ష కోట్ల డాలర్ల ఆస్తిపరుడు ప్రపంచంలో ఈయన ఒక్కరే

స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఎలాన్ మస్క్
    • రచయిత, ఆర్చీ మిషెల్,
    • హోదా, బిజినెస్ రిపోర్టర్
    • రచయిత, కాలీ హేస్,
    • హోదా, టెక్నాలజీ రిపోర్టర్
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఎలాన్ మస్క్ శుక్రవారం ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్ల ఆస్తిపరుడు)గా అవతరించారు.

లక్ష కోట్ల డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 84 లక్షల కోట్లు. మస్క్‌కు చెందిన రాకెట్ తయారీ సంస్థ 'స్పేస్ఎక్స్' షేర్లు, స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో లిస్ట్ కావడంతో ఆయన తొలి ట్రిలియనీర్‌గా అవతరించారు.

టెస్లా, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడైన మస్క్ నికర ఆస్తి విలువ 1.11 ట్రిలియన్ డాలర్లకు (సుమారు 93 లక్షల కోట్ల రూపాయిలు) పెరగడంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారని బ్లూమ్‌బర్గ్ రిచ్ లిస్ట్ పేర్కొంది.

నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజీలో స్పేస్ ఎక్స్ సంస్థ ఏకంగా 2.2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో అరంగేట్రం చేయడంతో ఈ రికార్డు నమోదైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఐపీఓకు రాకముందే ఇన్వెస్టర్ల నుంచి నిధుల సేకరణ..

ఒక్కో షేరు ధరను 135 డాలర్లుగా నిర్ణయించినప్పటికీ, మార్కెట్ ఓపెన్ అవ్వడమే 150 డాలర్ల వద్ద ఓపెన్ అయిందని స్పేస్ ఎక్స్ సంస్థ తెలిపింది. మస్క్‌కు చెందిన స్పేస్ బిజినెస్‌పై ఇన్వెస్టర్లకు ఉన్న ఉత్సాహం కారణంగా ఈ షేరు ధర ఒక దశలో 176.50 డాలర్లకు చేరిందని వెల్లడించింది.

చివరకు శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి స్పేస్ఎక్స్ షేర్లు దాదాపు 161 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి.

ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా స్పేస్ఎక్స్ కంపెనీ శుక్రవారం ఓపెన్ మార్కెట్లోకి రావడానికి ముందే ఇన్వెస్టర్లు, అండర్ రైటర్ల నుంచి 75 బిలియన్ డాలర్ల నిధులను సేకరించింది.

స్పేస్ఎక్స్‌ కంపెనీలో ఎలాన్ మస్క్‌ వాటా 42 శాతం. ఈ యాజమాన్య వాటా కారణంగా, కంపెనీ తీసుకునే ప్రతి నిర్ణయంపై ఆయనకు పూర్తి ఏకపక్ష నియంత్రణ ఉంటుంది. ఈ పెట్టుబడి డబ్బును ఆయనకు నచ్చినట్లు ఖర్చు చేయొచ్చు.

బ్లూమ్‌బర్గ్ ప్రకారం.. మార్కెట్ ముగిసే సమయానికి స్పేస్ఎక్స్‌లో ఆయన షేర్ల విలువ 767.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇవి కాకుండా స్పేస్ఎక్స్‌లో మరో 53.8 బిలియన్ డాలర్ల విలువైన ఆప్షన్లు ఉన్నాయి. అలాగే టెస్లాలో 168 బిలియన్ డాలర్ల విలువైన షేర్లు, 116.4 బిలియన్ డాలర్ల విలువైన ఆప్షన్లు ఆయన వద్ద ఉన్నాయి.

ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Reuters

సంపద పెరుగుదలపై చెలరేగిన వివాదం

మస్క్ ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ కావడం ఆర్థిక అసమానతలపై సరికొత్త చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఆయన సంపద పోలాండ్ లేదా స్విట్జర్లాండ్ దేశాల మొత్తం జీడీపీతో సమానంగా ఉంది.

ఇంతటి అపారమైన సంపద మస్క్‌ను ప్రపంచ రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన, వివాదాస్పద వ్యక్తిగా మార్చింది.

గతంలో అమెరికా నాయకత్వాన్ని విమర్శించిన ఆయన, ఆ తర్వాత దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం వందల మిలియన్ల డాలర్లను విరాళంగా ఇచ్చారు. మస్క్ నిరుడు కొన్ని నెలల పాటు అమెరికా ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషీయన్సీ అనే ప్రత్యేక విభాగానికి నాయకత్వం వహించారు.

ప్రభుత్వ వ్యయాన్ని భారీగా తగ్గించే ప్రక్రియలో భాగంగా బడ్జెట్‌లో భారీ కోతలు విధించి 'యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్' మూసివేతకు మస్క్ కారణమయ్యారు. ఈ కోతల వల్ల 2030 నాటికి అదనంగా 1.4 కోట్ల కంటే ఎక్కువ మంది మరణించే అవకాశం ఉందని 'ది లాన్సెట్' మెడికల్ జర్నల్ పరిశోధకులు హెచ్చరించారు.

రాజకీయ నాయకులతో మస్క్‌కు విభేదాలు

అలాగే ఆయన బ్రిటన్, ఇతర దేశాల నాయకత్వాలను కూడా తరచుగా వలసలు, జాతి వివక్ష వంటి అంశాలపై విమర్శిస్తూ వచ్చారు. 18 ఏళ్ల బ్రిటిష్ విద్యార్థి హెన్రీ నోవాక్ హత్య ఉదంతంతో సహా పలు విషయాల్లో యూకే ప్రధాని సర్ కీర్ స్టార్మర్‌తో మస్క్ పదేపదే విభేదించారు.

మస్క్ ట్రిలియనీర్ కావడాన్ని అమెరికా డెమొక్రటిక్ పార్టీ సెనేటర్లు బెర్నీ సాండర్స్, ఎలిజబెత్ వారెన్‌లతో పాటు పలువురు రాజకీయ నాయకులు ఖండించారు.

అయితే, మస్క్ కేవలం కాగితంపై (ఆన్ పేపర్) మాత్రమే ట్రిలియనీర్. ఎందుకంటే ఆయన సంపద మొత్తం టెస్లా, స్పేస్ఎక్స్ షేర్ల విలువలపైనే ఆధారపడి ఉంది. కనీసం ఏడాది పాటు ఆయన తన స్పేస్ఎక్స్ స్టాక్‌ను అమ్మడానికి వీల్లేదు.

స్పేస్ఎక్స్ పబ్లిక్ లిస్టింగ్ వల్ల ఆ కంపెనీలో పనిచేస్తున్న, గతంలో పనిచేసిన 4,400 మందికి పైగా ఉద్యోగులు మిలియనీర్లు కానున్నారు. ఎందుకంటే జీతంలో భాగంగా కంపెనీ షేర్లను వారికి కేటాయించారు.

ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Harun Ozalp/Anadolu via Getty Images

భవిష్యత్ ఆశలపైనే స్పేస్ఎక్స్ వాల్యుయేషన్

స్పేస్ఎక్స్ కంపెనీకి ఇంత వాల్యూ రావడం అనేది కంపెనీ ప్రస్తుత ఆర్థిక ఫలితాల కంటే, భవిష్యత్తులో రాబోయే లాభాలపై ఉన్న నమ్మకం వల్లే సాధ్యమైంది.

ప్రస్తుతానికి స్పేస్ ఎక్స్ కంపెనీ లాభాల్లో లేదు. అంటే దీని ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయి.

కంపెనీ ఫైనాన్షియల్ ఫైలింగ్స్ ప్రకారం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల 2025, 2026 లలో కంపెనీ 9 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయింది.

ఎలాన్ మస్క్ బొమ్మ

ఫొటో సోర్స్, Getty Images

ఏఐ రంగంలోకి స్పేస్ ఎక్స్

రీయూజబుల్ భాగాలతో రాకెట్లను తయారు చేయడం, ప్రయోగించడం ఈ సంస్థ ప్రధాన వ్యాపారం. దీనితో పాటు స్టార్‌లింక్ ఇంటర్నెట్ శాటిలైట్లను కూడా తయారు చేసి లాంచ్ చేస్తోంది.

ఈ ఏడాది మస్క్ సొంత సంస్థ అయిన 'xAI' ని కొనుగోలు చేయడం ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి కూడా స్పేస్ ఎక్స్ అడుగుపెట్టింది.

రాకెట్లు, స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు, అంతరిక్షంలో డేటా సెంటర్లను నిర్మించే ప్రణాళికలతో సహా ఏఐ రంగంలో తమ గ్రోత్ స్ట్రాటజీ కోసం ఈ ఐపీఓ డబ్బును ఉపయోగించనున్నట్లు స్పేస్ఎక్స్ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)