డిజిటల్ మోసాల్లో రూ. 23,750 కోట్లు కోల్పోయిన భారతీయులు.. రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి చర్యలు తీసుకోనుంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిఖిల్ ఇనామ్‌దార్
- చదివే సమయం: 5 నిమిషాలు
పుణేలో బిజినెస్ అనలిస్టుగా పనిచేసే అలోక్‌కు (పేరు మార్చాం) రూ. 1000 చెల్లించాలంటూ ఫిబ్రవరిలో ఒక టెక్ట్స్ మెసేజ్ వచ్చింది.
ఆయన డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కాకుండా ఉండాలంటే ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఆ మెసేజ్‌లో ఉంది. దీంతో, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు అలోక్ వెంటనే ఆ లింక్‌పై క్లిక్ చేశాడు. పేమెంట్ పూర్తి చేసేందుకు ఓటీపీని షేర్ చేయాలని కోరారు.
ఓటీపీ షేర్ చేసిన నిమిషాల వ్యవధిలోనే అలోక్ క్రెడిట్ కార్డు నుంచి రూ. 3 లక్షలు వసూలు చెల్లించినట్లు వచ్చింది.
అధికారిక వెబ్‌సైట్లలా కనిపించే సైట్ల నుంచి నకిలీ సందేశాలను పంపి, ఫిషింగ్ లింక్‌లతో అమాయక ప్రజలను మోసం చేసి, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే స్కామ్ బారిన అలోక్ కూడా పడ్డారు. భారత్‌లో ఈ స్కామ్‌లు సర్వసాధారణమయ్యాయి.

ఈ రకమైన మోసాన్ని నిపుణులు ''సోషల్ ఇంజనీరింగ్'' స్కామ్ అని పిలుస్తున్నారు. బాధితుల మానసిక స్థితిని మానిపులేట్ చేసి, వారిలో భయాన్ని, ఆత్రుతను పెంచి స్కామర్లు వారిని దోచుకుంటున్నారు.
గత ఐదేళ్లుగా దేశంలో డిజిటల్ చెల్లింపులు అనూహ్యమైన రీతిలో పెరగడంతో ఈ రకమైన మోసాలు ఆందోళనకరమైన రీతిలో పెరుగుతున్నాయి.
2025లో సుమారు 25 లక్షల మంది ప్రజలు సుమారు 2.5 బిలియన్ డాలర్లను అంటే సుమారు రూ. 23,750 కోట్లను కోల్పోయారు. 2021తో పోల్చితే 4,300 శాతానికి పైగా పెరుగుదల ఇది. కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో.. చివరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రంగంలోకి దిగింది.
ఏప్రిల్ ప్రారంభంలో విడుదల చేసిన డిస్కషన్ పేపర్‌లో.. ఈ సమస్యను పరిష్కరించేందుకు అనేక చర్యలను పరిశీలిస్తున్నట్లు సెంట్రల్ బ్యాంకు తెలిపింది.
అకౌంట్ నుంచి అకౌంట్‌కు జరిగే లావాదేవీల్లో చెల్లింపుదారు వైపు నుంచి ఒక గంట సేపు జాప్యం చేయడం, వృద్ధులు చేసే అధిక విలువ కలిగిన డిజిటల్ చెల్లింపులకు నమ్మకమైన వ్యక్తి నుంచి అదనపు అథెంటికేషన్ కల్పించడం వంటివి ఉన్నాయి.
కస్టమర్ అకౌంట్లకు బదిలీ అయ్యే పెద్ద మొత్తంలో నగదుపై లిమిట్‌లు, రివ్యూలు చేపట్టడం, దీనిద్వారా ఈ ఖాతాలు డబ్బులను చట్టవిరుద్ధంగా బదిలీ చేసేందుకు ఉపయోగించే మ్యూల్ ఖాతాలు కావని నిర్ధరించడం వంటివి ఈ డిస్కషన్ పేపర్‌లో చర్చించింది.
అలాగే, డిజిటల్ చెల్లింపులను స్విచ్ఛాన్, స్విచ్ఛాప్ చేసుకునేందుకు ప్రజలకు మరింత నియంత్రణ ఇవ్వడం, కార్డులలో లిమిట్‌లను సెట్ చేసుకునే అవకాశం కల్పించడం వంటివి కూడా ప్రస్తావించింది.
ఆర్‌బీఐ తీసుకుంటున్న ఈ చర్యలు స్వాగతించదగినవే అయినప్పటికీ, ఈ ప్రతిపాదనలు కొంతమాత్రమే ప్రభావం చూపగలవని బీబీసీతో మాట్లాడిన పలువురు నిపుణులు అంటున్నారు. ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తర్వాత ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకుంటారు.
ఉదాహరణకు తొలి ప్రతిపాదనను తీసుకుంటే.. అలోక్ మోసానికి గురైన మాదిరి ఓటీపీ మోసాన్ని నిరోధించాలంటే.. చెల్లింపులను ఆలస్యం చేయడం ప్రభావవంతంగా పనిచేస్తుండొచ్చు. కానీ, విలువ పరంగా చూసుకుంటే ఇలాంటి స్కామ్‌లు మొత్తం ఆన్‌లైన్ మోసాల్లో చాలా తక్కువ నిష్పత్తిలో ఉన్నాయని ఆర్‌బీఐ ఇన్నొవేషన్ హబ్‌కు చెందిన మాజీ సీఈవో రాజేష్ బన్సల్ బీబీసీతో అన్నారు.
''ఈ స్కామ్‌లు మూడు నుంచి నాలుగేళ్ల కిందట చాలా ఎక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు ఈ మోసాలు మరో లెవల్‌కు చేరాయి'' అని తెలిపారు.
''చెల్లింపులను జాప్యం చేయడం అంత తేలికైన పని కాదు. ఎందుకంటే, చెల్లింపుల వ్యవస్థలో చాలా పార్టీలు భాగమై ఉంటాయి. ప్రస్తుత నిర్మాణ వ్యవస్థను మార్చకుండా దీన్ని అమలు చేయడం అంత తేలికైన విషయం కాదు'' అని ప్రముఖ రెగ్యులేటరీ టెక్నాలజీ కంపెనీ ఐడీఫై (IDfy)కి చెందిన వ్రిజు రే చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్‌బీఐ కూడా ఈ విషయాన్ని డిస్కషన్ పేపర్‌లో అంగీకరించింది. చెల్లింపులు జాప్యం కావడాన్ని (లాగ్స్‌ను) అమల్లోకి తీసుకురావాలంటే లావాదేవీల క్యూ నుంచి క్యాన్సిలేషన్ మెకానిజం వరకు వ్యవస్థంతా మార్పులు తీసుకురావాల్సి ఉంటుందని ఆర్‌బీఐ తన డిస్కషన్ పేపర్‌లో చెప్పింది. దీనికోసం పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని పేర్కొంది.
డిజిటల్ చెల్లింపులకు చెందిన ప్రధాన సిద్ధాంతమైన తక్షణ చెల్లింపుల వ్యవస్థకు ఇది విరుద్ధంగా ఉండనుందని సెంట్రల్ బ్యాంకు కూడా అంగీకరించింది.
''ఇది ఎక్స్‌ప్రెస్‌వే మాదిరి అభివృద్ధి చేసి ప్రతి కొన్ని కిలోమీటర్లకు స్పీడ్ బ్రేకర్లను యాడ్ చేయడం లాంటిది'' అని బన్సల్ అన్నారు. మోసాలు అరికట్టడానికి ఇది అంతగా ఉపయోగపడకపోవచ్చన్నారు.
''ఈ జాప్యాన్ని ఎలా అధిగమించాలో కూడా స్కామర్లు తెలుసుకోనున్నారు. ఉదాహరణకు, వారు కస్టమర్‌ను చెల్లింపు చేయమని అడిగి, వారి అంగీకారం కోసం ఒక గంటపాటు వేచి ఉండేలా చేయవచ్చు. దీనిద్వారా కస్టమర్‌కు ఎటువంటి అనుమానం రాదు" అని వ్రిజు రే చెప్పారు.
వ్రిజు రే చెబుతున్న ప్రకారం.. ఇతర కొన్ని రకాల చర్యలు పారదర్శకంగా ఉన్నట్లు పరిగణిస్తున్నప్పటికీ.. వాటిపైనా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
''సీనియర్ సిటిజన్లకు అదనపు తనిఖీలు బహుశా ఎక్కువగా సిఫార్సు చేయదగినవే. కానీ,ఎలా పాటించాలి? 'మీరు బాగా నమ్మే అడ్వైజర్' విదేశాల్లో ఉంటే పరిస్థితి ఏంటి? ఆ లావాదేవీ విషయంలో ముందుకెళ్లమని వారు సూచించినప్పటికీ, అది చివరికి మోసపూరితమైనదిగా మారితే ఎలా? అప్పుడు జవాబుదారీ ఎవరు?'' అని వ్రిజు రే ప్రశ్నిస్తున్నారు.
క్రెడిట్‌లను పరిమితం చేయడం, తనిఖీలను మెరుగుపర్చడం ద్వారా మ్యూల్ ఖాతాలను గుర్తింపును మరింత బలోపేతం చేయాలనే ప్రతిపాదన కూడా మరింత ప్రభావవంతంగా ఉండవచ్చు. కానీ, పెద్ద మొత్తంలో వనరులు, ఖర్చు అవసరం. చివరికి ఈ ఖర్చులను వినియోగదారులకే బదలాయిస్తారని వ్రిజు రే చెప్పారు. మ్యూల్‌హంటర్.ఏఐ అని పిలిచే మ్యూల్ డిటెక్షన్ ప్లాట్‌ఫామ్‌తో ఆర్‌బీఐ సిద్ధంగా ఉందని బన్సల్ తెలిపారు. ఇది లబ్దిదారుల ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుందని అన్నారు.
''నేను సీఈవోగా ఉన్నప్పుడు దీనికి రూపకల్పన జరిగింది. బ్యాంకింగ్ రంగంలో రియల్ టైమ్‌లో దీన్ని అమలు చేయాల్సి ఉంది. కానీ, దురదృష్టవశాత్తు ఇది జరగలేదు'' అని ఆయన చెప్పారు.
కానీ, మరింత రెగ్యులేషన్ కూడా పరిష్కారాల్లో ఒక భాగమని నిపుణులు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ చర్యలతో పాటు వీటిపై అవగాహనను రెట్టింపు చేయడం కూడా కీలకమని అన్నారు.
భారత జనాభా డిజిటల్‌లోకి మారడం దానికి అవసరమైన రక్షణ చర్యలు కల్పించడం లేదా అవగాహనను కల్పించడం కంటే చాలా వేగంగా జరుగుతోంది.
రిజర్వ్ బ్యాంక్ అవగాహన కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్లను దీనిలో భాగస్వామ్యం చేస్తుంది. తమ ప్రచారాలను ముందుకు తీసుకెళ్లడానికి అత్యంత ఎక్కువ మంది వీక్షించే ఐపీఎల్ గేమ్స్‌ను వాడుకుంటోంది. కానీ, డిజిటల్ అక్షరాస్యతను పెంచేందుకు మరింత పెట్టుబడులు అవసరమని వ్రిజు రే చెప్పారు.
ఈ సమస్యను దాని మూలంలోనే పరిష్కరించేందుకు పోలీసులు, మంత్రిత్వ శాఖలు, మార్కెట్ నియంత్రణ సంస్థ వంటి ఇతర ఏజెన్సీలతో ఆర్‌బీఐ మరింత సన్నిహితంగా సహకరించుకోవాల్సి ఉందని బన్సాల్ అన్నారు.
''అయితే, సవాలేంటంటే.. దీన్ని సృష్టిస్తున్నది ఎవరు?''
అయితే, సంప్రదింపుల ప్రక్రియ ద్వారా నియంత్రణ సంస్థ ఈ పెరుగుతున్న సమస్యను పునఃపరిశీలించడం స్వాగతించదగిన చర్య అని వ్రిజు రే అన్నారు.
"ఈ చర్చలు చివరికి నియంత్రణ చర్యలకు దారితీస్తాయి. గతంలో ఆర్‌బీఐ కేవలం ఒక ఆదేశాన్ని జారీ చేయడంతో పోలిస్తే ఇదొక పెద్ద మార్పు" అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































