ఇండోనేషియా ఫెర్రీ యాక్సిడెంట్: 243 మందితో వెళ్తుండగా ప్రమాదం, 97 మంది సురక్షితం..

ఫొటో సోర్స్, Getty Images
జావా సముద్రంలో ఇండోనేషియా ప్రయాణికుల నౌక ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, 97 మందిని రక్షించినట్లు ఇండోనేషియా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ తెలిపింది.
243 మంది ప్రయాణికులతో ఉన్న విర్గో ట్రాన్స్‌పోర్ట్ 8 నౌకతో సంబంధాలు తెగిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ మొదలయింది.
ఈ నౌక ప్రతికూల వాతావరణంలో చిక్కుకుపోయిందని రెస్క్యూ ఏజెన్సీ తెలిపింది.
గల్లంతయిన ప్రయాణికుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
గల్లంతయిన వారి కోసం గాలింపు కొనసాగుతోందని రాయిటర్స్ తెలిపింది.

సురబయా నుంచి బంజర్‌మసిన్‌కు వెళ్తున్న నౌక
సురబయా నుంచి దక్షిణ కాలిమంతన్‌లోని బంజర్‌మసిన్ నగరానికి ఫెర్రీ ప్రయాణిస్తోంది. ఆదివారం అర్ధరాత్రి దాదాపు రెండుగంటల సమయంలో దక్షిణ బంజర్‌మిసన్‌కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు నౌకతో సంబంధాలు తెగిపోయాయి.
గాలింపు, సహాయక నౌకలను హెలికాప్టర్లను సెర్చ్ ఆపరేషన్ కోసం రంగంలోకిదించారు. జావా సముద్రంలో ఆ ప్రాంతంలో ఉన్న నౌకలన్నింటినీ అప్రమత్తం చేశారు. ప్రయాణికుల ఆచూకీ లభిస్తే సమాచారమందించాలని కోరారు.
గత నెలలో ఇండోనేషియాలోని మదుర ద్వీపం సమీపంలోని ఓ ఫెర్రీలో మంటలు చెలరేగి ఐదుగురు చనిపోయారు.
ఇండోనేషియాలో 17 వేలకుపైగా ద్వీపాలున్నాయి. అక్కడ ప్రయాణికుల రాకపోకలకు ఫెర్రీలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























